ఎన్నో ప్రశ్నలు – కొన్ని జవాబులు-16

0
3

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి గంటి భానుమతి గారి కలం నుంచి జాలువారిన ‘ఎన్నో ప్రశ్నలు – కొన్ని జవాబులు’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]“హై[/dropcap]ద్రాబాదులో ఎంతోమంది ఆయిల్ పెయింటింగ్ వేసే వాళ్ళున్నారు. ఓ మంచి పెయింటర్‌ని కలుసుకుని కావేరికి పరిచయం చేసాను. ఆ పెయింటర్‌కి మీ పెళ్ళి ఫొటో ఇచ్చి ఆ ఫొటోని చూసి మంచి పెయింటింగ్ వేయాలని నా ముందే అడిగింది. మీ పెళ్ళి రోజుకి నీకు సర్‌ప్రైజ్ బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నానని అంది. అయితే అతను పెళ్ళి ఫొటో వద్దు, కావేరి చిత్రాన్ని గీస్తానన్నాడు. ఆమె కూడా సరే అని అంది. ఎందుకో నాకు తెలీదు. నీకు దీని గురించి చెప్పద్దని అంది. ఆమె నా ఇంటికి దీని గురించే వస్తూండేది. ఈ విషయం నీకు చెప్పడానికి సమయం కోసం ఎదురు చూస్తోంది. అయితే ఆ విషయాన్ని ఓ చక్కటి తన ఛాయా చిత్రాన్ని నీకు బహుకరిస్తూ చెప్పాలని అంది.

ఆమెని నువ్వు అనుమానిస్తున్నావని పెళ్ళైన కొన్నిరోజులకే నీ ప్రవర్తనని బట్టి నాకు అర్థం యింది. కాని కావేరి అర్థం చేసుకుందో లేదో నాకు తెలీదు.

ఆమె బాధని నాకు ఎప్పుడూ చెప్పుకోలేదు. చెప్పుకోవాలని కూడా అనుకోలేదు. ఆమె చాలా ధైర్యం గల మనిషి. నీ పెళ్ళికి ముందు నుంచే ఆమె కుటుంబం మాకు తెలుసు. ఆ పరిచయం తప్ప మా మధ్య ఏమీ లేదు.

రోజులు గడుస్తున్న కొద్దీ, మా ఇంట్లో ఈ పెయింటింగ్ కోసం ఎక్కువ సారులు కలుసుకోవడం వలన, ఆమె నాకు దగ్గరగా ఉన్నప్పుడు నా మనసు వశం తప్పేది. నా మనసు దారి తప్పకుండా ఉండాలని నేను వెళ్ళిపోయాను.

మీ ఇద్దరూ నాకు అత్యంత ఇష్టమైన వాళ్ళు. మీ ఇద్దరికీ ద్రోహం చెయ్యాలనుకోలేదు. అందుకే దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను. చెప్తే నన్ను మీరు అడ్డుకుంటారు. వెళ్ళనివ్వరు. అలా వెళ్ళిపోడానికి నేను నరక యాతన అనుభవించాను. నువ్వు నన్ను ఎన్నో విధాలుగా ఆదుకున్నావు. నా చదువుకి, మీ ఇంట్లో ఆశ్రయంకి. వీటిని నేను ఎప్పుడూ మర్చిపోలేదు. మర్చిపోను కూడా. అలాంటిది నేను నీకు ద్రోహం చేస్తానని ఎలా అనుకున్నావు. ఇవే నీ ప్రశ్నలకి జవాబులు.

కావేరి పవిత్రమైనది. ఆమె తన సంతోషాన్ని నీతో పంచుకోవాలని అనుకున్నది నెరవేరలేదు. ఆ సంతోషం తను గర్భవతి అనే విషయం కావచ్చు.

నీ అనుమానాలు తీరాయిని అనుకుంటాను, నీకు జవాబులు వచ్చాయి. నేను వెళ్తాను.” అంటూ కళ్ళు తుడుచుకున్నాడు.

“మరో ముఖ్యమైన విషయం చెప్పకుండా వెళ్ళిపోతానేమో, నీ మాటల్లో పడి అసలు విషయం మర్చిపోయాను. నేనెందుకు హైద్రాబాదు వచ్చానో నీకు చెప్పాలి..

నేను ఉన్న ఇంటిని చాలా ఏళ్ళు ఎందుకో అమ్మలేదు. ఇప్పుడు నేను పెద్ద వాడిని అయిపోతున్నాను, అందుకని నా ప్రాపర్టీని అంతా డిస్పోజ్ చేసి, కూతురి దగ్గరకి వెళ్లి పోదామని అనుకున్నాను. అందుకని హైద్రాబాదు ఇంటి గురించి ఓ ఏజెంట్‌కి చెప్పాను. రెండేళ్ళ క్రితం దానిని చార్మినార్ దగ్గర ఉండే జైస్వాల్ అనే ఓ కాయస్థు కొన్నాడుట. దానికి రిపేర్లు చేస్తున్నప్పుడు రెండు వస్తువులు దొరికాయట.

అవేంటో తెలుసా, నీ ఊహకి కూడా అందదు. ఎంతో అపురూపమైనవి, అందులో ఒకటి నువ్వు, కావేరి ఉన్న చిత్రం, అది మీ పెళ్ళి ఫొటో. ఆమె ఓ పట్టు చీర, ఒంటినిండా నగలతో, ఓ ఖరీదైన సోఫాలో కూచుని ఉంది. నువ్వు సూటు వేసుకుని, ఆ కుర్చీ కోడు మీద ఓ కాలు మీద కూచున్నావు. అది నీకు ఓ వార్త చెప్తూ బహుకరించాలని అనుకుంది.

మరోటి, మన హైద్రాబాదు సంస్కృతి, చారిత్రక కట్టడాలు, ఈ ప్రాంతపు కవుల గురించి, ఇంగ్లీషులో రాసింది. ఈ వివరాలు సేకరించడానికి నేను ఆమెకి సహకరించాను. గుల్జార్ హౌజ్, నుంచి, చార్మినార్ చార్ కమాన్, వరకూ వెళ్ళి, వెతికి, అఫ్జల్‌గంజ్ లైబ్రెరీకి వెళ్ళి, వీలైనన్ని సేకరించి ఇచ్చాను. ఆమె ఓ థీసిస్‌లా రాస్తున్న రఫ్ కాగితాలు. దానిని ఓ పుస్తకంగా చేయించాలని ఓరియంటల్, పెంగ్విన్, మరో రెండు పబ్లిషింగ్ కంపెనీలతో నన్ను మాట్లాడమని అంది. ఇది కూడా మరో వార్త చెప్తూ ఇవ్వాలని అంది.

ఇంతే నాకు తెలిసినది. ఆ తరవాత సంగతి నాకు తెలీదు. ఆమె అన్నీ తీసుకెళ్ళి ఉంటుందని అనుకున్నాను. కాని తీసుకెళ్ళ లేదు అని జైస్వాల్ చెప్పే వరకూ నాకు తెలీలేదు. కారణం ఇప్పుడు నీ మూలంగా తెలిసింది. తరవాత ఆమె అక్కడికి వెళ్ళలేదు. తన వస్తువులని తీసుకోలేదని తెలిసింది. ఆ రఫ్ కాపీ అక్కడే ఉందిట. ఆ రెండు తీసుకెళ్ళమని నాకు ఫోన్ చేసాడు. ఇది ఇవ్వడానికి నీ దగ్గరికి వస్తున్నానని ఉత్తరం రాసాను. కాని ఆ వస్తువులు తీసుకోడానికి హైద్రాబాదు రావాలి కదా, వచ్చాను. ఈ రోజు ఉదయం వెళ్ళి వాటిని తీసుకొచ్చాను.”

బ్రహ్మాజీ నోరు తెరుచుకుని ఉండి పోయాడు. ఇద్దరూ చేతులు కలుపు కున్నారు.

“మరో ప్రశ్న నువ్వు అడగక పోయినా నేను ఊహించ గలను, ఆమె నా ఇంటికి వచ్చిన విషయం.

నా ఇంట్లో ఆమె పెయింటింగ్ ఉండిపోయింది. నేను వెళ్లి పోయాక కావేరి నీకు ఇచ్చిందో లేదో నాకు తెలీదు. ఆ రోజున బహుశా ఆ పెయింటింగ్ కోసం వచ్చి ఉంటుంది. నేను లేకపోయే సరికి వెళ్ళి పోయింది. ఆ పెయింటింగ్ ఎక్కడుందో తెలీదు. నిన్ను చూసి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ పెయింటింగ్ నీకు ఇస్తూ ఏదో చెప్పాలని అనుకుంటున్నదని నాతో అంది. ఆ పెయింటింగ్ ఆమెకి కనిపించ లేదు. ఆ ఏదో నీకు చెప్పలేక పోయింది. ఇప్పుడు ఆ ఇల్లు కొన్న జైస్వాల్ ఇంట్లో ఉన్న దాన్ని తీసుకొచ్చాను.”

తలుపు పక్కన ఉన్న దానిని బ్రహ్మాజీకి అందించాడు.

మరో పాకెట్ చక్కగా ఓ చక్కటి ఫైల్‌ని కూడా అందించాడు.

“ఇది ఆమె ఓ రీసెర్చ్ లాగా రాసిన చరిత్ర. వీటిని ఇవ్వడం కోసమే నిన్ను కలుసుకోడం కోసమే నేను వచ్చాను. కనీసం దీనినైనా జాగ్రత్తగా ఉంచు. ఓ మంచి పబ్లిషర్‌కి ఇచ్చి, పుస్తకంగా వేయించు. ఈ అక్షరాల సంపదని, ఆ నిధిని ప్రపంచానికి అందించు. ప్రజల్లోకి తీసుకెళ్ళు.”  అని కదిలాడు శివరామ్.

“శివరామ్ ఆగు, నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోకు. నీ సాయం కావాలి. ఈ బాధ భరించలేను. నిన్ను, కావేరిని తప్పుగా అర్థం చేసుకున్నాను. చాలా పాపం చేసాను. నిష్కృతి లేదు.” అంటూ గట్టిగా ఏడ్చేసాడు.

“ఇంకా ఏడ్చెయ్యి. బాగా ఏడు. ఇదే నీకు శిక్ష. ఇదే నీకు కావాలి. నీ బాధ నీదే. నీ కన్నీళ్ళు నీవే. నువ్వే తుడుచుకోవాలి. రోజూ కడుపుకి అన్నం తింటున్నట్టు, శరీరానికి వ్యాయామం ఇస్తున్నట్టు, మనసుకి కూడా వ్యాయామం ఇవ్వాలని నువ్వనుకోలేదు, ఆ వ్యాయామం నీకు ప్రశాంతతనిస్తుంది. అది బజార్లో దొరికే వస్తువు కాదు, మనలోనే అంతర్లీనంగా ఉన్న జల. దాన్ని పైకి తోడడమే శరీరంతో మనం చేయగలిగిన శ్రమ. నిజానికి శరీరం మనసు వేరు కాదు. ఆ రెంటిని ఒక్క తాటిమీదకి తెచ్చే ప్రయత్నం చేయకపోతేనే నీలా తయారవుతారు. నువ్వు ఇన్నాళ్ళూ జీవించడానికి సిద్ధపడ్డావే కాని, నిజంగా జీవించలేదు, కనీసం ఈ కొన్నిరోజులైనా జీవితం అనే తాత్కాలిక ప్రయాణంలో ప్రశాంతమైన మనసుతో మజిలి చేరుకోడానికి ప్రయత్నించు.”

వెనక్కి తిరిగి చూడకుండా, శివరామ్ గబగబా నడిచి వెళ్ళి పోయాడు.

ఒక్కసారి కూలబడి పోయాడు. పని వాళ్ళు వచ్చారు, కాని, ఏం చేయాలో తెలీలేదు.

సీతమ్మని పిలిచారు.

సీతమ్మని చూసి, ఆమె చేతుల్లో తన మొహాన్ని దాచుకున్నాడు.

“సీతమ్మా నేను పాపం చేసాను. కావేరిని హింసించాను. కడుపుతో ఉన్న ఆమెని ఏడిపించాను, ఇంతకన్నా ఘోరం ఎక్కడైనా ఉంటుందా? నేను రాక్షసుడిని” అంటూ మండుతున్న ఫైర్ ప్లేస్ కేసి చూసాడు.

అంతకు ముందు వేసిన పసుపు రంగు డైరీ కాలుతున్న ఆఖరి ముక్కలు నల్లటి పొగలు చిమ్ముతూ కనిపించాయి, కావేరి అందమైన ముఖం ఆ పొగల్లోంచి కదిలిపోతూ దీనంగా కనిపిస్తోంది. వినగలిగితే ఆమె బాధ వినిపించేది. మంత్రాల సాక్షిగా మన పెళ్ళి జరిగింది. ఆ మంత్రాల అర్థం నీకు తెలీదా, జీవితాంతం అండగా, తోడుగా ఉండి కాపాడాల్సిన నువ్వు బతికుండగానే చంపేసావు. ఇంకా ఏవో అంటున్నట్లుగా అనిపిస్తోంది.

బాగా తెల్లారింది.

ఎన్నో ఏళ్ళ తరవాత మొదటి సారిగా, ఒక్కడే కావేరి గదిలోకి వెల్ళాడు. ఆ గదిలోకి వెళ్ళి నలభై ఏళ్ళయింది. ఆ గదిలో ఎన్నో అనుభవాలు, అనుభూతులు, పొరలు పొరలుగా విచ్చుకుంటున్నాయి.

సీతమ్మని పిలిచాడు.

“ఈరోజు నుంచి, నేను ఈ గదిలో ఉంటాను. హాల్లో శివరామ్ తెచ్చిన పెయింటింగ్ ఉంటుంది. దాన్ని, గోడకి తగిలించమని ఎవరికైనా చెప్పు. ఇంట్లో ఉన్న గదులన్నీ శుభ్రం చేయించు. అబ్బాయిని రమ్మనమని ఫోన్ చేస్తాను, నా వ్యాపారాలు చూసుకోమని అంటాను. మనవలు ఇక్కడే చదువుకుంటారు.”

సీతమ్మ వెళ్ళి పోయింది.

బ్రహ్మాజీ తన గది లోకి వెళ్ళాడు. ఆ కారిడార్ చివర సీతమ్మ ఎదురు చూస్తోంది.

ఆమె కూడా అతని వెనకాలే నడిచింది.

ఇద్దరు పక్క పక్కగా నడుస్తూ ఫొటోలు ఉన్న గదిలోకి వెళ్ళారు. అక్కడ ఒక చోట ఆగారు. ఒకప్పుడు అక్కడ కావేరి పెద్ద ఫొటో ఉండేది. దానిని తీసేసారు. అందుకే అక్కడ ఖాళీగా ఉంది.

“అక్కడ ఫొటో పెట్టమని రామయ్యకి చెప్పు.”

అలాగే అన్నట్లు తల ఊపింది.

“మిగలిన ఫొటోల్లాగే ఇది మామూలు ఫొటో కాదు.”

“నాకు తెలుసు.”  అంది.

“నీకు న్యాయం చేసాననే అనుకుంటున్నాను. నన్ను క్షమించు కావేరీ, నేను పాపాత్ముడిని, నిన్ను నేను అర్థం చేసుకోలేదు, నేను ఎవర్నీ అర్థం చేసుకోలేదు.”

ఇన్నాళ్ళూ ఓ రకమైన క్షోభ. ఇప్పుడు మరో రకమైన క్షోభ.

చితుకులు మంటల్లో వేస్తున్న చితుకులు. జీవితాంతం నన్ను కాల్చేస్తాయి.

నలభై మూడేళ్ళ కొడుకుని, కోడలిని మనవలని తీసుకుని రావాలి. ఇన్నాళ్ళు వాళ్ళని దూరంగా అమెరికాలో ఉంచాడు. ఇప్పుడు రమ్మని చెప్పాలి. ఇప్పడు కొడుకు, కుటుంబం మీద ప్రేమ, మమకారం, అన్నీ ఒక్కసారిగా పొంగాయి.

ఇంత కాలం దూరం పెట్టినందుకు నన్ను క్షమించమని అడగాలి.

మనం చేయాల్సిన పెద్ద పని ఉంది. అది మీ అమ్మ రాసినది. దాన్ని ఓ పుస్తకంగా చేయాలి. అని కొడుకుతో చెప్పాలి,

ఇవి అన్నిచేస్తే కావేరి ఆత్మ శాంతిస్తుందో లేదో తెలీదు, ఇది మాత్రం తన ఆత్మ తృప్తికోసం చేస్తున్నది.

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here