[box type=’note’ fontsize=’16’] శ్రీ సన్నిహిత్ వ్రాసిన ‘కలగంటినే చెలీ’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[dropcap]కా[/dropcap]లం పరుగెడుతోంది. మండు వేసవి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఎంసెట్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న సూర్యం మనసులోని వేడి బయటి ఎండతో పోటీ పడుతోంది. అనుకున్నట్టు గానే విద్యాశాఖామాత్యులు రిజల్ట్స్ విడుదల చేసారు. సూర్యానికి చాలా మంచి రేంక్ వచ్చింది. సంతోషం పట్టలేక ఏడ్చేసాడు. తల్లి పార్వతమ్మ ఆనందానికి అయితే అవధులు లేవు. కొడుకు గురించి అందరికీ గొప్పగా చెప్పసాగింది. తండ్రి శంకరం మాత్రం మౌనంగా ఉన్నాడు. ఊరంతా సూర్యాన్ని పొగడసాగారు. ‘సూరీడూ.. నువ్వు సాధిస్తావన్న నమ్మకం మాకుంది రా’ అని మెచ్చుకున్నారు. ఏనుగెక్కినంత గర్వంగా ఫీల్ అయ్యాడు సూర్యం. వెంటనే శివుని గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నాడు. చెట్టు తోనూ.. పుట్ట తోనూ.. చెరువు లోని కలువ తోనూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. గట్టు మీది గోమాత గంగడోలు నిమిరి ముద్దుపెట్టుకున్నాడు. పెరటి లోన పూల చెట్టు పైన వాలిన పిట్టని పట్టజూసాడు. అది తుర్రుమంది. వేడెక్కిన ఆకాశం సూర్యం ఉత్సాహాన్ని చూసి చల్లబడింది. మేఘం కరిగి… సన్నటి జల్లు కురవసాగింది.. సూర్యం మనసు చిత్తడి అయ్యింది.
ఆ రాత్రి …
పడక్కుర్చీలో వాలి కళ్ళు మూసుకున్న తండ్రి ముందుకు వెళ్ళి కాళ్ళకు నమస్కరించాడు సూర్యం.
“నన్ను దీవించు నాన్నా.. నీ వల్లనే ఈ విజయం నేను పొందగలిగాను… నాలో అగ్నిని రగిలించింది నువ్వే.. నువ్వు ఒప్పుకోకబట్టే కదా నాలో పట్టుదల పెరిగింది.” అన్నాడు.
శంకరం మనసులో అప్పటికే పశ్చాత్తాపం నిండి ఉంది. పైకి లేచి కొడుకుని ప్రేమగా హత్తుకుని
“నీ మీద నాకెప్పుడూ చులకన భావం లేదురా.. కాకపోతే నీ వెనక ఉన్న ఇద్దరు చెల్లెళ్ళకి ఎలా పెళ్ళి చెయ్యాలా అన్న భయం. ఉన్న డబ్బులన్నీ నీ చదువుకే వాడేస్తే వాళ్ళ భవిష్యత్తు ఏంటన్నది నా బాధ. అందుకే నిన్ను నిరుత్సాహపరిచాను. కానీ నీ పట్టుదల నా కళ్ళు తెరిపించింది. నా అపోహలను తొలగించింది. ఎవరో చెప్పడమేంటి.. నేనే చెబుతున్నాను. నువ్వు జీవితంలో తప్పకుండా పైకి వస్తావు. ఉన్నత శిఖరాలని అధిరోహిస్తావు. ఇదే సత్యం. దీర్ఘాయుష్మాన్భవ!” అని దీవించాడు.
సంతోషంతో సూర్యం మనసు ఉప్పొంగి సంద్రమైంది… తండ్రి ముందు మరింత ఒంగిపోయాడు. భర్త లోని కొత్త కోణాన్ని చూస్తున్న పార్వతమ్మ చీర కొంగుతో ఆనందభాష్పాలు తుడుచుకోసాగింది.
***
సూర్యానికి ఒక ప్రముఖ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చింది. అదీ తాను కోరుకున్న ఎలెక్ట్రానిక్స్ బ్రాంచ్‌లో.. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు.
కాలేజీలో జాయిన్ అవడానికి తన తండ్రితో పాటూ వెళ్ళాడు. ఊరి నుండి పొద్దున్నే బయలుదేరి, ఆ పట్టణానికి చేరుకుని కాలేజీ ముందు బస్ దిగారు తండ్రీ కొడుకులిద్దరూ. కాలేజీ గేటు లోకి ప్రవేశించగానే అదో రకమైన ఉద్విగ్నత కలిగింది సూర్యానికి. ఆనందంతో మనసు పరవశించింది.
ఎక్కడో ఒక పల్లెటూళ్ళో పుట్టి, కష్టపడి చదువుకుని ఇంత పెద్ద కాలేజీలో సీట్ తెచ్చుకోవడం అతనికి గర్వంగా అనిపించింది.
కాలేజీ వాతావరణం చాలా బాగుంది. విశాలమైన కేంపస్. చుట్టూ మామిడి చెట్లు. పెద్ద మామిడితోపు అది. ఆ తోపు మధ్యలో ఎత్తైన మెయిన్ బిల్డింగ్. దానికి కొంచెం దూరంలో వివిధ డిపార్ట్మెంట్స్.. ఇంకొంచెం దూరంలో విస్తరించి ఉన్న బోయ్స్ హాస్టల్స్ , గాళ్స్ హాస్టల్స్. ఒక పక్కగా పెద్ద ఆడిటోరియం. చిన్న చిన్న కేంటీన్‌లు, జెరాక్స్ సెంటర్స్, కాఫీ షాపులు, ప్రొఫెసర్స్ క్వార్టర్స్, ప్లే గ్రౌండ్, ఇండోర్ వాలీబాల్, టెన్నిస్, షటిల్ కోర్ట్స్. అన్ని హంగులూ ఉన్న బ్యూటిఫుల్ కేంపస్ అది. ఒకప్పుడు ఆ ప్రాంతం సిటీకి దూరంగా ఉండేది. ఇప్పుడు అది సిటీలో ఒక భాగమైంది. అయినప్పటికీ లోపల ఎటువంటి కాలుష్యం ఉండదు. ప్రశాంతత, స్వచ్చత ఆ కేంపస్ ప్రత్యేకత.
సూర్యం తన తండ్రితో పాటూ మెయిన్ బిల్డింగ్‌కి వెళ్ళాడు. అక్కడి ఆఫీసు స్టేఫ్ ఎడ్మిషన్ ప్రొసీజర్ చెప్పారు. అదంతా ఫాలో అయి, కట్టాల్సిన ఫీజు కట్టి, తమకు ఎలాట్ చేసిన హాస్టల్ వైపు వస్తున్నారు ఇద్దరూ.
ఒక విద్యార్థుల గుంపు వాళ్ళకి ఎదురైంది. అందులో రఫ్‌గా ఉన్న ఒకడు సూర్యాన్ని చూస్తూ “రేయ్… ఇలారా” అని పిలిచాడు.
వాళ్ళు సీనియర్స్ అని, రేగింగ్ చెయ్యబోతున్నారని అర్థమైంది.
“ఏ ఊరు రా నీది.. ఫస్టియరా..” అన్నాడు వాడు.
“అవును సార్..” అని భయం భయంగా చెప్పాడు.
“ఆహా.. ఏ హాస్టల్ ఇచ్చారు నీకు”
సూర్యం చెప్పాడు. వాడి మొహంలో రంగులు మారాయి. విద్యార్థులలో ఒక వర్గం వారికి ప్రాతినిథ్యం వహిస్తున్న లీడర్ వాడు. మిగతా వాళ్ళంతా వాడి చెంచాలు.
వాడు అడిగాడు “మన జాతిపిత ఎవర్రా…”
సూర్యం “గాంధీ..” అని సమాధానం చెప్పాడు. అంతే… వాడు సూర్యాన్ని లాగిపెట్టి కొట్టాడు. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి సూర్యానికి. ఇదంతా చూస్తున్న శంకరం గారికి కాళ్ళూ చేతులూ ఆడటం లేదు.
“బాబూ… మా అబ్బాయిని ఏమీ చెయ్యకండి బాబూ..” అని వాళ్ళని బ్రతిమాలుకున్నాడు.
“ఏయ్..ఇదంతా మామూలే…” అని చెప్పాడు వాడు. తర్వాత ఏవేవో పిచ్చి ప్రశ్నలు వేసి… బాగా ఏడిపించి వదిలారు.
తర్వాత నిశ్శబ్దంగా తమ హాస్టల్ వైపు వచ్చేసారు ఇద్దరూ.
హాస్టల్ చాలా బాగుంది. ఇద్దరేసి విద్యార్థులకు ఒక రూము ఇచ్చారు. అవన్నీ చూసుకున్నాక.. బయటకు వెళ్ళి కావాల్సిన చిన్న చిన్న సామానులు అంటే బకెట్, మగ్ లాంటివి కొనుక్కుని వచ్చారు.
ఇంతలో లంచ్ టైము అవడంతో మెస్‌కి వెళ్ళారు ఇద్దరూ. ఆ మెస్ ఫస్టియర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు కలిపి. ఇద్దరూ భోంచేసారు. తిరిగి హాస్టల్ రూముకి వచ్చాక శంకరం గారు ఊరికి వెళ్ళడానికి ఉద్యుక్తులయ్యారు.
“సరే.. ఇక నేను బయలుదేరుతానురా..” అన్నారు సూర్యంతో .
“అలాగే నాన్నా…” అని బలహీనంగా చెప్పాడు
“ఏం భయం లేదు… ఇలాంటి వన్నీ మొదట్లో మామూలే.. అన్నీ సర్దుకుపోతాయి… జాగ్రత్త” అని చెప్పి హేండ్ బేగ్ తీసుకుని హాస్టల్ బయటకు వచ్చేసారు శంకరం.
అక్కడి దాకా తోడు వచ్చాడు సూర్యం. “బై.. నాన్నా.. జాగ్రత్త..” అని చేతిని ఊపుతూ కాలేజీ బయటకు వెళిపోతున్న తండ్రిని దిగులుగా చూసాడు సూర్య. శంకరం గారు కూడా ఉబికి వస్తోన్న కన్నీటిని దాచుకోవడానికి అన్నట్టు గబ గబా నడుస్తూ వెళ్ళిపోయారు. ఇంతకాలం కూపస్థ మండూకంలా ఊరికే పరిమితమైన సూర్యం జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది.
***
ఫ్రెషర్స్ పార్టీ జరుగుతోంది. కొత్తగా వచ్చిన ఫస్టియర్ విద్యార్థులకు సీనియర్స్ పలికే ఆహ్వానం లాంటిది ఆ పార్టీ. డయాస్ మీదకు ఒక్కొక్క విద్యార్థి వచ్చి తన పేరు, ఊరు చెప్పి, తనలో ఉన్న టేలెంట్‌ని ప్రదర్శించాలి. ఫస్టియర్ అబ్బాయిలు, అమ్మాయిలు ఒక్కొక్కరు స్టేజ్ ఎక్కి తమ టేలెంట్‌ని ప్రదర్శిస్తున్నారు. సూర్యం వంతు వచ్చింది. నెమ్మదిగా స్టేజ్ ఎక్కాడు. ఎందుకో కాళ్ళు చిన్నగా వణుకుతున్నాయి అతనికి.
మైక్ తీసుకుని “నా పేరు సూర్యనారాయణ…” అని చెప్పి ఆగిపోయాడు. మాటలు పెగలడం లేదు. హాలంతా ఒకటే గోల. ఎవరో సీనియర్ “..రేయ్… సూర్య …నీ టేలెంట్ చూపించరా.. ” అని కింద నుండి అరిచాడు. ఆలోచనలో పడిన సూర్యం ఒక పాట పాడాలని నిర్ణయించుకున్నాడు. నెమ్మదిగా గొంతు సవరించుకుని తనకిష్టమైన “మావి చిగురు తినగానే కోయిల పలికేనా..” అన్న బాలూ గారి పాట ఆలపించాడు. హాలంతా పిన్ డ్రాప్ సైలెన్స్.
పాట పూర్తవగానే విపరీతమైన చప్పట్లు. హాలంతా దద్దరిల్లిపోయింది. కింద కూర్చున్న ప్రొఫెసర్స్, లెక్చెరర్స్ అభినందనపూర్వకంగా చూసారు. ఏంకర్ వచ్చి “ఇంత బాగా పాడిన మన సూర్యకి కంగ్రాచ్యులేషన్స్” అని మైక్‌లో చెప్పింది. స్టేజ్ దిగి కిందికొచ్చేసాడు సూర్యం.. కాదు కాదు సూర్య. ఆ రోజు అతనికి ఆ విధంగా ‘సూర్య’ అన్న పేరు పెట్టబడింది. తొలిసారిగా తను తెచ్చుకున్న ఈ గుర్తింపు ఒక రకమైన సంతృప్తిని ఇచ్చిందతనికి. ఫంక్షన్ అయిపోగానే హాస్టల్‌కి వచ్చేసాడు.
ఆ రాత్రి నిద్రపోయే ముందు తల్లిదండ్రులు.. చెల్లెళ్ళు గుర్తొచ్చారు అతనికి. వాళ్ళ గురించి ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు. ఆ నిద్రలో ఎన్నో అందమైన కలలు. తానో గొప్ప గాయకుడిని అయిపోయినట్టు… అందరూ మెచ్చుకుంటున్నట్టు… ఓ అమ్మాయి అతన్ని ప్రేమిస్తున్నట్టూ… అలా… అలా..
***
సూర్య కాలేజీ వాతావరణానికి పూర్తిగా అలవాటు పడిపోయాడు. చదువుకోవడం, అప్పుడప్పుడు పాటలు పాడుకోవడం…ఇదే అతని దిన చర్య.
కొన్ని రోజుల తర్వాత… ఫస్టియర్ కుర్రాళ్ళు అందరూ ఒక టూర్ ప్లాన్ చేసారు. ఆ టూర్‌లో భాగంగా తలకోన అడవులు, శ్రీహరికోట రాకెట్ సెంటర్.. ఇలాంటివన్నీ చూడాలని అనుకున్నారు. సూర్య కూడా తన అంగీకారాన్ని తెలిపి డబ్బులు కట్టాడు. అనుకున్న రోజు రానే వచ్చింది. ఒక చిన్న బేగ్‌లో లగేజ్ పెట్టుకుని క్లాస్మేట్స్‌తో పాటూ టూరిస్ట్ బస్‌లో బయలు దేరాడు.
బస్‌లో దారిపొడుగునా కుర్రాళ్ళంతా ఒకటే అల్లరి. మ్యూజిక్ పెట్టుకుని గట్టిగా పాటలు పాడుతూ… అంత్యాక్షరి లాంటి గేమ్స్ ఆడుకుంటూ… డేన్స్‌లు చేస్తూ… అలా సాగిపోయారు. ముందు తలకోనకు వెళ్ళారు. చాలా చిక్కటి అడవి అది. లోపల కెళ్ళే కొద్దీ మరింత ప్రమాదకరంగా ఉంటుంది. అందరూ లోపలి దాకా వెళ్ళి సినిమా షూటింగ్‌లు జరిగే స్పాట్స్ చూసారు. కొండవీటి దొంగ సినిమా షూటింగ్ అక్కడ జరిగిందని ఎవరో చెబితే, అన్నీ శ్రద్ధగా గమనించసాగాడు సూర్య. అడవిలో బాగా లోపలికి వెళ్ళాక ఒక చిన్న వాటర్ ఫాల్స్ వచ్చింది. పై నుండి తెల్లగా ధారలా పడుతున్న స్వచ్ఛమైన నీరు. అందరూ వంతులుగా దాని కింద స్నానాలు చేసారు. అదో వింత అనుభూతి. బోలెడన్ని ఫోటోలని తీసుకుని అక్కడి నుండి తిరుగు ప్రయాణమయ్యారు.
(సశేషం)