ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు – 34 – అనోఖా ప్యార్

0
3

[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

నర్గిస్, నళిని జయవంత్, దిలీప్ కుమార్‌లు కలిసి నటించిన ముక్కోణపు ప్రేమ కథ ‘అనోఖా ప్యార్’

[dropcap]1[/dropcap]948లో నర్గిస్, నళిని జయవంత్, దిలీప్ కుమార్‌లు కలిసి నటించిన సినిమా ‘అనోఖా ప్యార్’. ఇది ముక్కోణపు ప్రేమ కథ. దిలీప్ కుమార్ కలిసి నటించిన చాలా మంది నటీమణులలో ఆయనకు నళిని జయవంత్ అంటే ఇష్టమని చెప్పేవారట. ఒక సీన్ గురించి చెప్పినప్పుడు ఆమె ఎంత త్వరగా దాన్ని అర్థం చేసుకునేదో చూసి తాను ఎన్నో సందర్భాలలో ఆశ్చర్యపోయానని ఆయని చెప్పారు. దిలీప్ కుమార్‌తో నళిని నటించిన షికస్త్ ఆమె కెరియర్ లోనే గొప్ప సినిమా అంటారు. అలాగే దిలీప్ కుమార్‌కు తన సినిమాలలో బాగా నచ్చిన సినిమా కూడా అదే. నళిని జయవంత్ నూతన్ తనూజల తల్లి శోభనా సమర్థ్‌కి సోదరి వరస అవుతుంది. ఎన్నో హిట్ సినిమాలలో నటించి తన అందం ప్రతిభతో అప్పటి ప్రేక్షకులను మెప్పించిన నటి నళిని. అయితే ప్రస్తుత తరానికి ఆవిడ గురించి ఆసలు తెలియదు. 1950లలో ఫిల్మ్‌ఫేర్ మాగజీన్ ఆవిడని గొప్ప అందమైన నటిగా గుర్తించింది. 1941లోనే మెహబూబ్ ఖాన్ సినిమా “బెహెన్”తో సినీ రంగ ప్రవేశం చేసినా ‘అనోఖా ప్యార్’ తోనే ఆమెకు గుర్తింపు లభించింది. అనోఖా ప్యార్‌లో ఆమె రెండవ హీరోయిన్‌గా నటించారు. సినిమా అంత గొప్పగా ఆడలేదు కాని నళిని జయవంత్ చాలా మంది దర్శకుల దృష్టిలో పడ్డారు. ఆ తరువాత ఎన్నో హిట్ చిత్రాలని అందించారామె. 1958లో వచ్చిన “కాలా పాని” సినిమాకి ఉత్తమ సహాయ నటి అవార్డు గెలుచుకున్నారు. అంతటి ప్రతిభ ఉన్న నటి చనిపోయిన విషయం కూడా మూడు రోజుల దాకా ఎవరికీ తెలియదట. ఆవిడ 2010లో తన ఇంట్లో చనిపోయిన మూడవ రోజు ఆంబులెన్సు వచ్చి ఆమె శవాన్ని తీసుకెళ్ళేదాకా ఆమె మళ్ళీ ప్రపంచానికి గుర్తుకు రాలేదు.

“మేలా” సినిమాలో జంటగా నటించిన దిలీప్ కుమార్ నర్గిస్‌లు కలిసి చేసిన రెండవ సినిమా అనోఖా ప్యార్. ఫాతిమా రషీద్ నర్గిస్ అసలు పేరు. ఐదు సంవత్సరాల వయసులోనే తలాష్ –ఎ-హక్ అనే సినిమాలో 1935లో నటించారు ఆమె. హీరోయిన్‌గా 1942లో తమన్నా సినిమాతో కెరియర్ మొదలు పెట్టారు. 1944లో జ్వార్ బాటా అనే సినిమాతో పరిచయం అయిన దిలీప్ కుమార్ ఆమె కన్నా జూనియర్ గానే ఎంచబడతారు. అందుకే వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలన్నిటిలో కూడా మొదట నర్గిస్ పేరు తరువాత దిలీప్ కుమార్ పేరు క్రెడిట్స్‌లో వస్తుంది. అనోఖా ప్యార్ సినిమా సక్సెస్ కాలేదు. ఎమ్. ఐ ధరమ్సే దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంగీతం అనీల్ బిస్వాస్ అందించారు. ఈ సినిమాకు వీరందించిన సంగీతానికి అప్పట్లో మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో మొత్తం 13 పాటలున్నాయి. అప్పట్లో సినీ ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న లతా మంగేష్కర్‌కు అనిల్ బిస్వాస్ చాలా ప్రోత్సాహం ఇచ్చారు. ఈ సినిమాలో ఎక్కువ పాటలు ఆమె చేతే పాడించారు ఆయన. ఈ పాటలలో ఆరు పాటలు జియా సర్హాది రాసారు. 1953లో వచ్చిన దిలీప్ కుమార్ “ఫుట్పాత్” సినిమాకు దర్శకత్వం వహించింది కూడా వీరే. ఈ సినిమాలో వచ్చే “యాద్ రఖనా చాంద్ తారో” పాట చాలా పాపులర్ అయింది. ప్రముఖ ఉర్దూ కవి బెహ్జాద్ లక్నవి రాసిన “మేరె లియె వొ గమె ఇంతజార్ చోడ్ గయే” అనే గజల్ కూడా ఈ సినిమాలో ఉంది. తరువాత పాకిస్తాన్ వెళ్ళిపోయారాయన. తాను పాడిన పాటల్లో ఈ పాట తనకు అత్యంత ప్రియ మైనదని లతా ప్రత్యేకంగా పేర్కొనటం విశేషం.

అప్పటికి లతా గొంతును హిందీ సినీ సంగీత దర్శకులు అంతగా మెచ్చేవారుకారు. కానీ, అనోఖా ప్యార్ సినిమాలో దాదాపుగా 10 పాటలు లతా తో పాడించాడు అనిల్ బిస్వాస్. టాలెంట్ ను గుర్తించటం, ప్రోత్సహించటం అనిల్ బిస్వాస్ కు అలవాటు. ముకేష్, తలత్, జోహ్రా బాయ్   అంబాలెవాలి వంటి గాయనీ గాయకులను ప్రోత్సహించిన బిస్వాస్ లతా కు మైకువద్ద పాటపాడుతూ శ్రోతలు గమనించలేని రీతిలో ఊపిరి తీయటం నేర్పాడు. వాయిస్ మోడ్యులేషన్ నేర్పాడు. అయితే, మీనా కపూర్ ప్రేమలో పడి ఆయన లతా పాడిన పాటలను తరువాత మీనా కపూర్ తో డబ్ చేయించాడు. ఈ సినిమాలో యాద్ రఖ్న చాంద్ తారొ, మేరే లియే వో గం-ఎ-ఇంతెజార్, భోల అనాడి  మోరా  వంటి  పాటల  రికార్డుల్లో లతా పేరుంటుంది. సినిమాలో మీనా కపూర్ స్వరముంటుంది.  ఈ అవమానం లతా మరచిపోలేదు. ఆమె సినీ ప్రపంచాన్ని శాసించే స్థితికి వచ్చిన తరువాత అనిల్ బిస్వాస్ కు పాడటానికి విముఖత చూపించింది. దీనికి తోడు మారుతున్న ట్రెండ్ కు తగ్గట్టు మారలేకపోవటంతో అనిల్ బిస్వాస్ 1963లో హిందీ సినీ రంగాన్ని వదలివేశాడు.  అయితే, లతా ను రాజ్ కపూర్ కు పరిచయంచేసింది అనిల్ బిస్వాస్. ఫలితంగా బర్సాత్ సినిమాలో అన్ని పాటలూ లతానే పాడింది. విజయపథంలో దూసుకుపోయింది. వెనుతిరిగి చూడలేదు. ఆరంభ దినాల్లో ఆమె ఎదుర్కొన్న అవమానాలు, సంగీత దర్శకులు అవకాశాలిచ్చినా ఆమెను చిన్నచూపు చూడటం ఆమె మరచిపోలేదు. ఈ అనుభవాలు ఆమె వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దాయి. ఈ రకంగా ఈ సినిమా ఎంతో చరిత్ర కలది. దిలీప్, నళిని జయవంత్ ల ప్రేమకు బీజ పడిందీ సినిమాతోనే. లతా అగ్రశ్రేణి గాయని అయ్యేందుకు దారితీసిందీ సినిమానే. అనిల్ బిస్వాస్ తన భార్య ఆశలతకు విడాకులిచ్చి మీనాకపూర్ ను వివాహమాడేందుకు దారి తీసిందీ సినిమానే. వారిద్దరి మధ్య వున్న 15ఏళ్ళ ఎడం వారి ప్రేమకు అడ్డుకాలేదు.  మీనా కపూర్ తండ్రి బిక్రం కపూర్ కూడా నటుడు. ఈయన బారువా తీసిన బెంగాలి దేవదాసులోనూ, సైగల్ దేవదాసులో నటించాడు. రెండు  సినిమాల్లో ఈయన టాంగా డ్రైవర్ పాత్ర పోషించాడు.

‘అనోఖా ప్యార్’ సినిమాలో దిలీప్ కుమార్ ఒక రచయిత. అశోక్ రచయితగా ఇంకా స్థిరపడని రోజుల్లో అతనికి పూలు అమ్ముకునే బిందియాతో పరిచయం ఏర్పడుతుంది. ఆమెకు తనవద్ద ఉన్న ఆఖరి పైసలు ఇచ్చి ఒక పువ్వు కొనుక్కుంటాడు. బిందియా అతన్ని తన దగ్గర ఒక పూవు కొనమని బలవంతం చేస్తుంది. అయితే ఆమె సంపాదనను బలవంతంగా లాక్కునే ఒక వ్యక్తి నుండి తప్పించుకోనే ప్రయత్నంలో ఆమె అశోక్ సహాయం అడుగుతుంది. అశోక్ ఆమె ఆ దుండగుని నుండి రక్షించాలనుకుని అతనితో తలపడతాడు. కాని అతని బలం సరిపోదు. ఆ దెబ్బలాటలో అశోక్ కళ్ళకు గాయం అవుతుంది. చూపు పోతుంది. అతన్ని బిందియా పేదలకు ఉచితంగా వైద్యం చేసే ఒక డాక్టర్ వద్దకు తీసుకువెళుతుంది. అశోక్ కళ్ళను పరీక్షించి, అతను కొన్ని రోజులు వైద్యం చేయించుకుంటే చూపు మళ్ళీ వస్తుందని ఆ డాక్టర్ చెబుతాడు. అశోక్ వద్ద డబ్బు లేదని తెలుసుకుని తన ఇంట్లో చోటిచ్చి అతనికి వైద్యం చేస్తాడు.

ఆ డాక్టర్ కూతురు గీత. గీత పాడుతున్న పాట విని ఆమెను ప్రేమిస్తాడు అశోక్. అతని కళ్ళు నయమయిన తరువాత అతనికి కొంత డబ్బు ఇచ్చి సాగనంపుతాడు డాక్టర్. తన పరిస్థితి తెలుసుకుని ఆ డాక్టర్ చేసిన సహాయం, గీత చేసిన పరిచర్యలు అతనికి జీవితం పట్ల ఉత్సాహాన్ని ఇస్తాయి. గీత కూడా అతన్ని ప్రేమిస్తుంది. తన రచనలను పబ్లిష్ చేయించుకోవడానికి ఒక పబ్లిషర్ వద్దకు వెళతాడు అశోక్. కాని అతను అప్పుడే తుపాకితో కాల్చుకుని చనిపోతాడు. అశోక్ అతన్ని హత్య చేసాడని అరెస్టు చేస్తారు పోలీసులు. ఆ పబ్లిషర్ డాక్టర్ స్నేహితుడు. చనిపోయే ముందు డాక్టర్‌కు ఉత్తరం రాస్తాడు. గీత ఆ ఉత్తరం తీసుకుని ఆ పబ్లిషర్ కోసం వస్గ్తే అప్పటికే అతను మరణిస్తాడు. ఆ ఉత్తరం చూపించి అరెస్టయిన అశోక్‌ని విడిపిస్తుంది గీత. అయితే గుండె జబ్బున్న ఆమె తండ్రి మరణించడంతో ఆమె ఆస్తి అంతా అమ్ముకుని చుట్టాల వద్ద ఉండవలసి వస్తుంది.

బిందియా అశోక్‌ని ప్రేమిస్తుంది. అశోక్ గీతను ప్రేమిస్తున్నాడని ఆమెకు తెలుసు. గీతకు ఉత్తరం రాసి ఆమెతో పంపుతాడు అశోక్. కాని గీత దాన్ని చింపేస్తుంది. డాక్టర్ మరణించాడన్న సంగతి ఆమె అశోక్‌కు చెబుతుంది. గీత కోసం వెతికిన అశోక్‌కి ఆమె కనిపించదు. అప్పటికే అశోక్ రచన పబ్లిష్ అయి గొప్ప పేరు వస్తుంది. ఆ ఇల్లు కొన్న పబ్లిషర్ దగ్గరే అతని అద్దెకు ఉంటూ ఉంటాడు. గీత వివాహం ఆ పబ్లిషర్‌తో నిశ్చయిస్తారు ఆమె మేనత్తలు. పబ్లిషర్ అశోక్ ప్రేమించింది గీతనే అని తెలుసుకుని ఆమెతో పెళ్ళికి నిరాకరిస్తాడు. గీత ఆ విషయం అశోక్‌తో చెప్పి అతన్ని తన జీవితంలోకి ఆహ్వానించాలనుకునేంతలో బిందియా గీతకు తమ ప్రేమ విషయం చెప్పి తాను పేదరాలిని కాబట్టే ప్రేమికురాలిగా తన ఆశలకు కోరికలకు విలువ లేదని ఆమె దగ్గర బాధపడుతుంది. గీత బిందియా కోసం అశోక్‌ని మర్చిపోవడానికి ఒప్పుకుంటుంది. చివరకు బిందియా మరణించి గీత అశోక్‌లు కలవడం కథకు ముగింపు.

బిందియాగా నళిని జయవంత్, గీతగా నర్గిస్‌లు నటించారు. సినిమా మొదలయిన చోటే కథ ముగుస్తుంది. ముందు అదే చోట అశోక్ బిందియాని చూస్తాడు. అదే నది ఒడ్డున కథలో చాలా ముఖ్యభాగాలు నడుస్తాయి, చివరకి ఆ నది ఒడ్డునే గీత అశోక్‌లు కలిస్తే, బిందియా మాత్రం ఆ నీళ్ళల్లో మునిగి చనిపోతుంది. ఆమె నదిలో దూకినట్లు మనకు కనిపించదు కాని నది నీళ్ళల్లో పడే నీడల ద్వారా దర్శకులు బిందియా మరణించినట్లు సంకేతం ఇస్తారు.

దిలీప్ కుమార్ సినిమాలలో హాస్య పాత్రలలో మనకు ఎక్కువగా కనిపించిన నటుడు ముఖ్రి. అతను అనోఖా ప్యార్‌లో కూడా బిందియా వద్ద డబ్బులు తీసుకునే ఆమె సంరక్షకుడిగా కనిపిస్తాడు. ఇతను దిలీప్ కుమార్ తోటే “ప్రతిమ” అనే సినిమాతో తన సినీ కెరియర్ ప్రారంభించాడు. “ప్రతిమ” దిలీప్ కుమార్ రెండవ చిత్రం అయితే ముఖ్రికి అది మొదటి చిత్రం. వీరిద్దరూ స్కూల్‌లో కలిసి చదువుకున్న స్నేహితులు. ముఖ్రి కూడా హస్య నాటుడిగా దాదాపు 600 సినిమాలలో పని చేసారు. దిలీప్ కుమార్‌తో ఇతనికి మంచి స్నేహం ఉండేది. అతను తన 78వ ఏట మరణించేటప్పుడు, అతని మరణ శయ్య వద్ద దిలీప్ కుమార్, సైరాబాను ఇద్దరూ ఉన్నారట. కోహినూర్, రాం ఓర్ శ్యాం, కర్మా, బైరాగ్, గోపి, అమర్, ఇలా చాలా సినిమాలలో వీరిద్దరూ కలిసి నటించారు. ముఖ్రి ఎన్నో సినిమాలలో విభిన్నమైన పాత్రలు పోషించారు.

అనోఖా ప్యార్ సినిమా వరకు ఇంకా దిలీప్ కుమార్‌కు ట్రాజెడి కింగ్ అన్న బిరుదు రాలేదు. కాని అప్పట్లో సినిమా కథలలో విషాదాన్ని ప్రేక్షకులు చాలా ప్రేమించేవారు అని అనిపిస్తుంది. “హల్ చల్” సినిమాలో దిలీప్ కుమార్ మరణం ఎంత అనవసరం అనిపిస్తుందో, అనోఖా ప్యార్‌లో నళిని జయవంత్ మరణం కూడా అంతే అనవసరం అనిపిస్తుంది. తరువాత తరంలో విషాదాన్ని స్వీకరించరనే భయం ఒకటి ఏర్పడి “దిల్ దియా దర్ద్ లియా” లాంటి సినిమాలను బలవంతంగా సుఖాంతాలుగా మార్చే ప్రయత్నాలు జరిగాయి. ప్రేక్షకుల స్పందన చాలా ముఖ్య పాత్ర వహించేది ఆ రోజుల్లో సినిమా కథా నిర్మాణంలో. కమర్షియల్ సినిమాలో ప్రేక్షకుల కోసం కథను మార్చిన సందర్భాలు అనేకం కనిపిస్తాయి. ‘అనోఖా ప్యార్’ ఆ కోవలోకే వస్తుంది. దిలీప్ కుమార్ సినీ జీవితంలో ఇది ఒక మామూలు సినిమానే. కాని హిందీ ప్రపంచంలోని గొప్ప నటులు, కళాకారులు కలిసి చేసిన చిత్రం ఇది.  ఈ సినిమాకు పని చేసినవారు చాలా మంది తరువాత పాకిస్తాన్ వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం చూస్తున్న అనోఖా ప్యార్ సినిమా పోస్టర్ ఆ సినిమాది కాదు. ఇందులో దిలీప్ కుమార్ బొమ్మ అందాజ్ సినిమాలోది. నళినీ జయవంత్ బొమ్మ మునింజీ సినిమాలోది. నర్గిస్ బొమ్మ కూడా ఈ సినిమాది కాదు.

ఎంతో చరిత్రను చూసిన ఈ సినిమా కథగా అలరించకపోయినా చాలా సమాచారాన్ని అప్పటి హిందీ సినిమా రంగం గురించి కనుక్కోవడానికి సహాయపడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here