[dropcap]ను[/dropcap]వ్వు పుట్టగానే నీ నుంచి
కత్తిరించ బడ్డ పేగుకు అతుక్కుని
నేను ఊపిరి పోసుకున్నా అక్కా,
అందుకే మనది పేగుబంధం అయింది!
ఇంటిపేరు మార్చుకుని నీవు వెళ్లిపోతావనుకునే
నాన్న దిగులును తీరుస్తూ, ‘నేనున్నా’ అంటూ నీకు తమ్ముడినై పుట్టాను అక్కా,
అందుకే మనది సోదరబంధం అయింది!
నీవు అమ్మ ఒడిలో చేరి బొజ్జనింపుకొందుకు
అమ్మ చనుబాలు త్రాగి పెరిగినట్టే
నీ ఎంగిలి పాలను త్రాగి నీ ఆలనలోనే ఎదిగాను అక్కా,
అందుకే మనది అమ్మపాల అనుబంధం అయింది!
శ్రావణ మాస సుగంధాలను మనలో నింపుతూ వచ్చే
రాఖీ పూర్ణిమ నాడు నా చిట్టి చేతికి రాఖీ కట్టి
‘ఏదిరా నాకు బహుమతి?’ అని అడిగేదానివి అక్కా,
‘నేనే నీకు నాన్నని!’ అని చెప్పాను ఆనాడు,
అందుకే మనది రక్త సంబంధం అయింది!
నీ ఇల్లు వేరై మరో కుటుంబంలో నీవు కలిసిపోయావు,
ఇద్దరికీ దూరాలు భారాలైనా,
నీవు ఎప్పటికీ ఈ ఇంటి మహాలక్ష్మివే అక్కా!
నీవు కట్టే రాఖీయే సంవత్సరాంతం వరకూ నాకు రక్ష!
ఎక్కడ ఉన్నా ఈ తమ్ముడు నీకున్నాడనే ధైర్యమే నా అభయం అక్కా!
అందుకే మనది ఎవ్వరూ విడదీయలేని ఆత్మల అనుబంధం అయింది!!
రా అక్కా, రాఖీ కట్టు!!