[dropcap]నే[/dropcap]నొక ‘స్త్రీ’ని
అందుకే నాకు తెల్సు
దేశంలో చాలామంది అమ్మాయిలు
అక్కర్లేకుండానే పుడుతుంటారు.
నేనొక ‘భార్య’ని
అందుకే నాకు తెల్సు
తండ్రి కావాలనుకునే కోరిక కన్నా
కొడుకే పుట్టాలనుకుంటుంటారు.
నేనొక ‘అమ్మ’ని
అందుకే నాకు తెల్సు
రెండో కూతుర్ని కన్నాక
సమాజపు జాలిచూపుల్ని భరించటం
ప్రసవవేదన కన్నా దుస్సహనీయం!
నేనొక కూతుర్ని
అందుకే నాకు తెల్సు
నాతోబాటు
నా అక్కచెల్లెళ్ళ పుట్టుక
అమ్మ మనసునెంత పిండేసిందో!
అయినా
నాకు చాలా బాగా తెల్సు
కూతుళ్ళు కూతుళ్ళే
అమ్మ, నాన్న, అన్నదమ్ములతో
అల్లుకున్న అంతస్సూత్రాలు వాళ్ళు!
అమ్మ వేదన
నాన్న నిస్సహాయతల్ని
చెప్పకపోయినా తెల్సుకుంటారు
కూతుళ్ళు కుటుంబాలకు బరువులు కారు
సమాజానికి దేశానికి.. వరదాయినులు
మానవతా సంస్కృతికి
తరతరాలకు వారసులు.