[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]
తెలుగు చిత్రం ‘బొబ్బిలి బ్రహ్మన్న’కు హిందీ రూపాంతరం ‘ధరమ్ అధికారి’
[dropcap]1[/dropcap]984లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు అంటే నేటి తరం హీరో ప్రభాస్ తండ్రి గారు నిర్మాతగా వ్యవహరించిన సినిమా, గోపీ కృష్ట మూవీస్ బానర్ క్రింద కృష్ణంరాజు నటించిన చిత్రం, “బొబ్బిలి బ్రహ్మన్న”. దీనికి పరుచూరి బ్రదర్స్ కథ అందించారు. ఈ సినిమా కృష్ణంరాజు కెరియర్ లోనే పెద్ద హిట్ సినిమాగా నిలిచిపోయింది. ఈ సినిమాకు ఆయన ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డు, నంది అవార్డు కూడా గెలుచుకున్నారు. దీన్నే హిందీలో ‘ధరమ్ అధికారి’ పేరుతో 1986లో రీమేక్ చేసారు. తెలుగు సినిమాలో అన్నగా తమ్ముడిగా కూడా కృష్ణంరాజు ద్విపాత్రాభినయం చేస్తే, హిందీలో దిలీప్ కుమార్ అన్నగా, జితేంద్ర తమ్ముడిగా నటించారు. దిలీప్ కుమార్ సినిమాలలో దీన్ని పెద్దగా ఎవరూ తలచరు. తెలుగు సినిమాను హిందీలో చూస్తున్న ఫీల్ వస్తుంది ఇది చూస్తున్నంత సేపు. తెలుగింటి వాతావరణంలో హిందీ భాష కలిసినట్లు అనిపిస్తుంది. భరించలేని మెలోడ్రామాతో సినిమా విసుగనిపిస్తుంది. కాని దిలీప్ కుమార్ ఈ పాత్రను ఒప్పుకోవడంలో ఒక కారణం ఉండి ఉండవచ్చు. ఇది ఆయన ఎప్పుడూ వేయని పాత్ర. హిందీ కమర్షియల్ సినిమాలలో ఇటువంటి పాత్రలు ఉండే అవకాశం చాలా తక్కువ. అప్పటి దాకా దిలీప్ కుమార్ సినిమాలన్నిటిలో ఉత్తర ప్రాంతపు హిందీ లేదా ఉర్దూ వాడుక భాషగా ఉండేవి. ఈ సినిమా ఒక్కటే దిలీప్ కెరియర్‌లో పూర్తి హిందుస్తానీ సంస్కృత పదాల డైలాగులతో ఉంటుంది. ఒక్క ఉర్దూ పదం కాని ఉత్తర ప్రాంతపు ప్రాంతీయ హిందీ యాస గానీ లేకుండా పుస్తకంలోని శుద్ధ హిందీ, అందులో సంస్కృత పదాలతో భ్రాహ్మణ వేషధారణతో శైవ భక్తుడిగా దిలీప్ కుమార్ కనిపిస్తారు.
సినిమాలో ఆయన ఎక్కడా తడబాటు లేకుండా అ భాషను అవలీలగా మాట్లాడడం చూసినప్పుడు ఆయన చేసిన హోమ్ వర్క్ అర్థం అవుతుంది. ఆయన తన కెరీయర్ మొత్తంలో ఇలాంటి పాత్ర చేయడం ఇదే మొదలు, చివర కూడా. దిలీప్ కుమార్‌కు జోడిగా రోహిణీ హట్టంగడి నటించారు. జితేంద్రకు జోడిగా శ్రీదేవి కనిపిస్తారు. విలన్‌గా ప్రాణ్ నటించారు. ప్రాణ్ దిలీప్ కుమార్‌లు, హీరో మరియు విలన్‌గా మంచి సినిమాలు చేసారు. ఆజాద్, దిల్ దియా దర్ద్ లియా, రామ్ ఔర్ శ్యాం, మధుమతి, ఆద్మీ. వారిది హిట్ కాంబినేషన్. కెరియర్‌లో విలన్‌గా పేరు తెచ్చుకుని దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న నటుడు ప్రాణ్.
సినిమా కథకు వస్తే నందగావ్ అనే ఊరుకి ధర్మాధికారి ధర్మరాజ్. అతని పూర్వీకుల నుండి ఆ ఊరి న్యాయపీఠంపై న్యాయం ఆ కుటుంబీకులే చెప్పడం రివాజు. ఆ ఊరులోకి పోలీసులు రావడం, లేదా ఊరు తగాదాల పరిష్కారానికి ఊరి ప్రజలు ఊరు దాటి వెళ్ళడం అన్నది ఎప్పుడూ జరగలేదు. ఆ ఊరిలో చౌదరి ఒక డబ్బున్నవాడు. అతనికి ధర్మరాజ్ అంటే అసూయ, ఏదో చేసి ఆ ఊరికి తానే ధర్మాధికారి అవ్వాలని ఎన్నో కుట్రలు పన్నుతూ ఉంటాడు. ధర్మరాజ్ తమ్ముడు ప్రకాష్ అదే ఊరు అమ్మాయి ప్రియను ప్రేమిస్తాడు. ధర్మరాజ్‌కు ఒకే కూతురు ఆర్తి. ఒకసారి ధర్మరాజ్ ఊరికి సంబంధించి న్యాయ విచారణ చేసేటప్పుడు ఒక నిర్దోషిని దోషిగా నిర్ణయిస్తాడు. అది తట్టుకోలేక అతను మరణించినప్పుడు ఆ కుటుంబాన్ని ధర్మరాజ్ ఆదరిస్తాడు. ఆ ఇంటి ఇల్లాలిని తోబుట్టువుగా అనుకుని ఆమె పిల్లల బాగోగులు కూడా తనే చూస్తూ ఉంటాడు. అతను ఆ వితంతువు ఇంటికి తరచుగా వెళ్ళడం చూసి చౌదరి అతనికి అక్రమ సంబంధం అంటగట్టి అతను పరువు తీయాలనుకుంటాడు. కాని నిజం తెలిసుకున్న తరువాత ఊరి వారంతా చౌదరినే తిడతారు. ఆర్తి ఆ వితంతువు కొడుకును ప్రేమిస్తుంది. తండ్రికి చెప్పడానికి ఆమె భయపడుతున్నప్పుడు వారికి లేచిపొమ్మని ఆ ఊరి పూజారి సలహా ఇస్తాడు. అతను కూడా ధర్మరాజ్‌కు శత్రువే. కూతురు ఎవరితోనే వెళ్ళిపోతే ఆ నెపం మీద ధర్మరాజ్ పరువు తీయవచ్చని ఆ పూజారి అనుకుంటాడు. అయితే ఆ జంట తప్పు చేయకుండా ప్రకాష్ వారిని అడ్డగించి వారి ప్రేమ సంగతి అన్నకు చెప్పి వారి పెళ్ళి నిశ్చయిస్తాడు.
ఆర్తి ఒక రోజు చెట్టుకు కట్టిన ఊయల ఊగుతున్నప్పుడు ఆ ఊయల తాడు కోయిస్తాడు చౌదరి. ఆమె క్రింద ఉన్న ఒక వ్యక్తిపై పడిపోతుంది. అతని తలకి దెబ్బ తగిలి గుడ్డివాడవుతాడు. అయితే ఊరి వారంతా అర్తిది తప్పని అనడంతో ఆ గుడ్డి వ్యక్తిని ఆర్తి పెళ్ళి చేసుకోవాలని తీర్పు ఇస్తాడు ధర్మరాజ్. ప్రకాష్ అన్నకు ఎదురు తిరిగి ఆర్తి పెళ్ళి ఆమె ప్రేమించిన వ్యక్తితో జరిపిస్తాడు. అందుకు శిక్షగా ప్రకాశ్‌ను ఊరి నుండి బహిష్కరిస్తాడు ధర్మరాజ్. ఆర్తితో కూడా తన సంబంధాన్ని వదులుకుంటాడు. ఆర్తి సీమంతానికి భార్య వెళ్ళిందని ఆమెను కూడా ఇంటిలోనికి రానివ్వడు. కాని చివరకు ధర్మరాజ్ భార్య సావిత్రి, ప్రకాష్ ఇద్దరు కలిసి చౌదరి పాపాలన్ని బయటపెట్టి ఆర్తి వల్ల గాయపడిన వ్యక్తి గుడ్డివాడు కాలేదని అతను ధర్మరాజ్‌ని దెబ్బతీయడానికి చౌదరి నియమించిన వ్యక్తి అని, అతను ఆరోగ్యంగా ఉన్నాడని పదిమంది ముందు నిరూపిస్తారు. చౌదరి చేసిన పాపాలన్ని విని చివర్లో ధర్మరాజ్ అతన్ని చంపి ఆ ఊరికి న్యాయం చేయడం, చివరకు అతను చట్టానికి లొంగిపోవడం కథకు ముగింపు.
ఈ కథలో ధర్మరాజ్ భార్య సావిత్రి పాత్ర ద్వారా పాతివ్రత్య సంభాషణలు, జన్మ జన్మల బంధాల గురించి ప్రస్తావనలు కొంచెం అతి అనిపిస్తాయి. ఇక ఈ సినిమాకు దర్శకుడు రాఘవేంద్రరావు గారు. ఆయన ఈ సినిమాలో కూడా హీరో హీరోయిన్ల పాటలను రసవత్తరంగా తీసారు. అరటి పళ్ళు, కొబ్బరి బోండాల మధ్య హీరో హీరొయిన్ల దొర్లింతలు నాలాంటి రసహీనులకు చిరాకు తెప్పిస్తాయి. ఆ పళ్ళు ఎంతమంది నిరుపేదలకు ఒక్కపూటయినా ఆరోగ్యకరమయిన తిండినిచ్చేవికదా!!! ఈ హీరో హీరోయిన్ల క్రిందపడి నలిగి వ్యర్ధమవుతున్నాయని బాధ కలుగుతుంది. ఒక పాటలో షర్టు లేకుండా జితేంద్రను చూపడంలో ఏం అందం, అర్థం ఉందో దర్శకులకే తెలియాలి. అసలు తెలుగు సినిమాని రాఘవేంద్రరావు గారు ఎంతలా మార్చారంటే, ఒకప్పటి సినిమా పాటల ఔన్నత్యం, అందం గుబాళింపుల అర్థాలే మారిపోయాయి. రాఘవేంద్రరావు గారు చిత్రించిన పాటలు నచ్చేవారికి అదే స్థాయిలో పాటలు ఈ హిందీ సినిమాలోను కనిపించి అలరిస్తాయి. రాఘవేంద్రరావు గారు దిలీప్ కుమార్‌కి డ్యూయెట్ పెట్టలేదు. బ్రతికించారు. ఈ పాటలు ఇందీవర్ రాస్తే సంగీతం బప్పీలహరి అందించారు. శ్రీదేవి అప్పుడప్పుడే హిందీ సినిమాలో కాలు పెడుతున్న సమయం. అందుకే ఈ సినిమాలో తన పాత్రకు డబ్బింగ్ వేరేవాళ్ళు చెప్పారు. ధర్మరాజ్ కూతురు ఆర్తిగా అనురాధ పటేల్ చేసారు. సినీ నటుడు అశోక్ కుమార్ మనవరాలు ఈమె.
పూజారి పాత్రలో కాదర్ ఖాన్ నటించారు. నటుడిగా, రచయితగా కాదర్ ఖార్ హిందీ సినిమాలో చెరగని ముద్ర వేసారు. రోహిణి హట్టంగడి గొప్ప నటి. దిలీప్ కుమార్‌కు జోడీగా చాలా ఆత్మవిశ్వాసంతో నటించారు ఆవిడ. చౌదరి కొడుకు పాత్రలో శక్తి కపూర్ నటించారు. అతని భార్య సుధగా ప్రీతి సప్రు కనిపిస్తారు. ప్రీతి సప్రు ఒకప్పటి హిందీ నటుడు డి.కే సప్రు కుమార్తె. సప్రు ఎన్నో హిందీ సినిమాలలో విలన్‌గా చేసారు. సాహెబ్ బీవీ ఔర్ గులామ్, పాకేజా, హీర్ రాంజా లాంటి సినిమాలలో ఆయనకు మంచి పేరు వచ్చింది. జమీందారుగా, విలన్‌గా తనదైన గంభీరమైన కంఠంతో ఆయన ప్రేక్షకులకు దగ్గర అయ్యారు. సప్రు దిలీప్ కుమార్‌తో కొన్ని సినిమాలలో పని చేసారు కూడా. ఆయన చిన్న కూతురు ప్రీతి పంజాబీ భాషలో పేరున్న నటి. మొదటి పంజాబీ మహిళా దర్శకురాలు కూడా. ఆవిడ కెరీర్ మొదట్లో చేసిన సినిమా ‘ధరమ్ అధికారి’. ఇలా దిలీప్ కుమార్ తనతో నటించిన తోటి నటుల పిల్లలతో అంటే రెండో తరం, మూడో తరంతో కలిసి నటించారీ సినిమాలో.
దిలీప్ కుమార్‌ని సాంప్రదాయమైన ధర్మాధికారిగా సంస్కృత శ్లోకాలు వల్లె వేస్తూ చూడడం కొత్తగా ఉంటుంది. కాని ఈ పాత్రకు వారు చాలా హోం వర్క్ చేసారు. కెమెరా ముందు అప్పటి దాకా అతని డైలాగ్ డెలివరీకి విరుద్ధంగా ఉండేలా తన పాత్ర సంభాషణలను పలికారు. ఒక ప్రయోగంగా ఈ పాత్ర చేసారనిపిస్తుంది. సినిమాగా ‘ధరమ్ అధికారి’ అంతగా అలరించదు కాని దిలీప్ కుమార్ తన కెరియర్‌లో చేసిన పాత్రలలో పూర్తి భిన్నమైన పాత్ర ఇది. దీని కోసం ఆయన తన మాటను నడకను, బాడీ లాంగ్వేజీని పూర్తిగా మార్చుకున్నారు. ఆయన నటించిన సినిమాలు కొన్ని గొప్పగా ఉండవచ్చు, కొన్ని పేలవంగా ఉండవచ్చు, కాని ప్రతి పాత్రకు దిలీప్ కుమార్ చేసిన హోమ్ వర్క్ మాత్రం ఆయన పట్ల గౌరవాన్ని పెంచుతుంది. జితేంద్ర, దిలీప్ కుమార్ కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా ఇది. తన రెండవ ఇన్నింగ్స్‌లో కూడా చాలా చూసి, తరచి ఆయన పాత్రలను ఒప్పుకునేవారు. బైరాగ్‌తో దిలీప్ కుమార్ హీరో పాత్రలకు స్వస్తి చెప్పిన తరువాత గమనిస్తే ఫిల్మ్ ప్లాప్ సక్సెస్‌లు పక్కనపెట్టి చూస్తే ఆయన ఆ సెకెండ్ ఇన్నింగ్స్‌లో కూడా నటనా పరంగా ప్రయోగాలు చేసారు. సపోర్టింగ్ యాక్టర్‌గా “క్రాంతి” సినిమాతో మొదలు పెట్టి తన పాత్ర చుట్టూ నడిచే సినిమాల వైపే ఆయన మొగ్గు చూపారు. ప్రతి పాత్ర అంతకు ముందు చేసిన పాత్రతో బిన్నంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కొత్తదనానికి అవకాశం ఉన్న ప్రతి చోటా ఆయన ముందడుగు వేసారు. అలాగే పెద్ద రిస్క్‌లు కూడా తీసుకోకుండా జాగ్రత్తపడ్డారు. ‘ధరమ్ అధికారి’ సినిమా లాభాలనే తీసుకొచ్చింది కాని తెలుగు లోలా పెద్ద హిట్ కాలేదు. హిందీ ప్రజల వాతావరణానికి ఇది చాలా దూరం అనిపిస్తుంది. పాత్రల వేషభాషలు చాలా వరకు దక్షిణ ప్రాంతపువిగా కనిపించడం వలన కూడా హిందీ ప్రేక్షకులు ఈ సినిమాకు పెద్దగా కనెక్ట్ కాలేరు. తెలుగులో బొబ్బిలి బ్రహ్మన్న ఒక ట్రెండ్ సెటర్ అయింది. ఆ సినిమా తరువాత బ్రహ్మన్న పాత్రను పోలిన చాలా సినిమాలు తెలుగులోకి ఆ సినిమా స్ఫూర్తితో వచ్చాయి.
హిందీలో మాత్రం ఇది దిలీప్ కుమార్‌ని కొత్త కోణంలో చూపిన సినిమాగా మిగిలిపోయింది. దిలీప్ కుమార్‌కు సమకాలీకులు దేవ్ ఆనంద్, రాజ్ కపూర్‌లు. కాని వారిద్దరి కన్నా కూడా దక్షిణ భారత సినీ ప్రపంచంతో దిలీప్ కుమారే మంచి సంబంధ బాంధవ్యాలు పెట్టుకున్నారు. వీరి కెరియర్‌లో చేసిన సినిమాలలో ఒక పావు వంతు దక్షిణ భారత దేశపు చిత్ర సీమతో ముడిపడి ఉన్నవే. ఎక్కడో లాహోర్‌లో పుట్టిన యూసుఫ్ ఖాన్, ఒక పక్క ఉర్దూ, హిందీ భాషలలో గొప్ప సినిమాలలో నటిస్తూ, మరో పక్క దక్షిణ భారత దేశపు దర్శకులు వాసన్, బాపయ్య, రాఘవేంద్రరావు, శ్రీరాములు నాయుడు, తాపీ చాణక్య గార్లతో కూడా పని చేస్తూ, వారికి అందుబాటులో ఉంటూ భారతదేశం అంతా అభిమానులను సంపాదించుకున్నారు. దిలీప్ కుమార్ దక్షిణ భారతీయ సినిమాతో మమేకమైనట్లు ఆయన కాంటెంపరరీ నటులు కాలేదు. దిలీప్ కుమార్ సినిమాలు దక్షిణాదిన డబ్ అయ్యాయి. అలాగే దక్షిణ భారతీయ దర్శకులు హిందీలో సినిమా తీయాలనుకున్న ప్రతి సారి మొదట ప్రయత్నించింది కూడా దిలీప్ కుమార్ కోసమే. ఈ రెండు ప్రపంచాలకూ కావలసిన నటుడిగా అయన తనను తాను తీర్చిదిద్దుకున్న వైనాన్ని గమనించాలి. ఆ క్రమంలో పరిగణించవలసిన సినిమా ‘ధరమ్ అధికారి’.