నవతరానికి నవీన రూపంలో అవ్వల్ నంబర్ రచయిత కొవ్వలి పరిచయం – పుస్తక సమీక్ష

4
3

[dropcap]తె[/dropcap]లుగు సాహిత్యంలో మార్గదర్శకులను గుర్తుంచుకోవటం, వారిని గౌరవించుకోవటం, కొత్తగా రచనలు ఆరంభిస్తున్న వారితో మార్గదర్శకుల రచనలు చదివింప చేసి సాహిత్య స్పృహను కల్పించటం వంటి పద్ధతులు లేవు. ఎంతసేపూ ఎవరికి వారు సాహిత్య  పీఠాధిపతులై, సాహిత్య మఠాధిపతులై,  సాహిత్య మాఫియా ముఠాలేర్పర్చుకుని ‘తమతోనే ఆరంభం తెలుగు సాహిత్యం’ అన్నట్టు వందిమాగధగణ భజన బృందాలతో అరిగిపోయిన రికార్డుల్లా అనిపించుకుంటూ, ప్రామాణికత సాధించాలని తపన పడటం తప్ప ‘సాహిత్యం’ గురించిన ఆలోచనలు, తపనలు లేవు. అలాంటి వారి ప్రయత్నాల వల్ల పాఠకులు సాహిత్యానికి దూరమవటంతో పాటు, మార్గదర్శకులూ మరుగున పడుతున్నారు. ఏవో కొద్ది పేర్లు, కొద్ది రచనలూ చలామణిలో ఉంటాయి. అవి కూడా చదివి మాట్లాడేవారు తక్కువ. ఒకరు చెప్పారని మిగతావారు చిలకపలుకుల్లా వల్లె వేయటమే ఆనవాయితీ. ఇటీవలి కాలంలో ఇంకా చదవటమే సరిగ్గా రాని యువ రచయితలు (?) ‘రావిశాస్త్రి ఏం రాశాడు’, ‘కాళీపట్నం రామారావు గొప్ప ఏమిటి?’, ‘నా ఫ్రెండ్ ఫలాన సుధీర్ భాబు ఆకాశం పగిలిపోయే వాక్యం రాశాడు’ ” నా పోస్టులన్నిటికీ కామెంట్లువేసే కన్నంబను మించి గొప్ప వాక్యం రాసే రచయిత్రి లేనేలేదు”, అంటూ సర్వ అజ్ఞాన సంపన్నుల్లా సోషల్ మీడియాలో బాకాలూదేస్తూ, ముఠాల, మఠాల, పీఠాల ప్రచారాలు చేస్తూ విమర్శకోత్తములయిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు వారికి ‘చదవటం’ ఒక అలవాటుగా మార్చటంలో ప్రధాన పాత్ర పోషించిన ‘నవలా సాహిత్య సార్వభౌమ’, ‘సహస్ర సృజనాత్మకత రచనల సృష్టికర్త’ కొవ్వలి నరసింహారావు గారు  పాత తరం వారికే పరిమితమవడంలో ఆశ్చర్యం లేదు. కానీ సాహిత్య ప్రపంచంలో ఒక నియమం ఉంది. ప్రతిభావంతుడి ప్రతిభను తాత్కాలికంగా అణచిపెట్టగలరు కానీ అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అలాగే ఈనాడు ప్రతిభావంతుడిని పద్ధతి ప్రకారం ప్రక్కన పెట్టినా, ఏదో ఒక రోజు అతడి ప్రతిభ అన్ని అడ్డంకులను దాటుకుని శోభిస్తుంది. చివరికి నిలిచేది ప్రతిభావంతుల రచనలే. సమయం వచ్చినప్పుడు ఎవరో కార్యశూరులు పూనుకుని ముసురుకున్న మేఘాలను తొలగించి , పాలను, నీటిని వేరు చేసి చూపిస్తారు. ప్రతిభావంతుడి ప్రతిభకు పట్టం కడతారు. కొవ్వలి నరసింహారావు గారిని విస్మృతి నుంచి వెలుగులోకి తెచ్చి, ఆయన రచనలపై వెలుగు ప్రసరింప చేసి, నవతరానికి నవీన రూపంలో ఆయన రచనలను పరిచయం చేసే బృహత్తరమైన బాధ్యతను డాక్టర్ సుశీలమ్మ స్వీకరించారు. సమర్థవంతంగా నిర్వహించారు.

‘రీటెల్లింగ్’ అంటే అందరికీ అర్థమయ్యే కథలకే తమ పైత్యాన్ని జోడించి, అసలు రచనని హత్య చేసి కూడా గుడ్డి వందిమాగధ భజన బృందాలతో అపరబ్రహ్మ అని పొగిడించుకోవడమే అనుకొంటున్న కాలంలో ‘రీటెల్లింగ్’ అంటే ఎలా ఉంటుందో కొవ్వలి గారి ‘జగజ్జాణ’ నవలను నవతరానికి అర్థమయ్యే రీతిలో సరళంగా, సంక్షిప్తంగా రచించి అందించారు సుశీలమ్మ గారు. అంతటితో ఆగలేదు, సహస్ర నవలా రచయిత జీవిత విశేషాలను శోధించి సాధించి తెలుగు పాఠకులకు అదనపు కానుకగా అందించారు. ఆ విశేషాలు ‘నవలా సాహిత్య సార్వభౌమ శ్రీ కొవ్వలి నరసింహారావు’ అన్న చిన్న పుస్తకం రూపంలో పొందుపరిచి అందించారు. పుస్తకంలో కొవ్వలి గారి సంతానం కొవ్వలి నాగేశ్వరరావు, కొవ్వలి లక్ష్మీనారాయణ గార్లతో ఇంటర్వ్యూలను కూడా చేర్చారు. ఎలాంటి రూమర్లకు, అస్పష్టపు సమాచారానికీ తావివ్వకుండా, కేవలం ధృవీకరించిన సత్యాల అధారంగా కొవ్వలి జీవిత విశేషాలను, వ్యక్తిత్వాన్ని తెలుగు పాఠకులకు అందించి తెలుగు సాహిత్య ప్రపంచం సర్వదా తనకు ఋణపడి ఉండేలా చేసుకున్నారు సుశీలమ్మ గారు.

ఇటీవల సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోవటం వల్ల లాభాలు ఎన్ని ఉన్నా, కొన్ని వికృత ధోరణులు ప్రబలమయ్యాయి. ఒకరు కష్టపడి పరిశోధించి రాసిన రాతలను కొట్టేసి తమ పేరు మీద చలామణీ చేసుకోవటం ఆనవాయితీగా మారింది. సుశీలమ్మ గారు కొవ్వలి గారి గురించి రాసి, జగజ్జాణను నవతరానికి నూతనంగా పరిచయం చేస్తున్న కాలంలో కొవ్వలి గారి పట్ల సాహిత్య ప్రపంచంలో పెరిగిన ఆసక్తి సుశీలమ్మ గారి రచన విజయవంతమయిందని నిరూపించటంతో పాటు, ఆవిడ కష్టపడి పరిశోధించి వెలువరించిన సత్యాలను తమ పేరు మీద చలామణీ చేసుకునే చోరాగ్రేసరులకూ నూతన ఉత్సాహాన్నిచ్చింది.  హఠాత్తుగా అందరి దృష్టీ కొవ్వలిపై ప్రసరించింది.  ఇది  ఈ పుస్తకం ప్రాధాన్యాన్ని, విలువను మరింత పెంచుతుంది. ఈ కాలంలో రచన చేయటమే కాదు, ఆ రచనను తమదిగా నిరూపించుకుని, నిర్ధారించి, చోరాగ్రేసరుల నుంచి కాపాడుకోవల్సిన బాధ్యత కూడా రచయితలకే ఉంది అన్న నిజానికి నిరూపణగా ఈ పుస్తకం నిలుస్తుంది.

ఈ పుస్తకంలో కొవ్వలి ‘సినీ ప్రస్థానం’ అన్న అధ్యాయం అపురూపమైనది. ఆ కాలం నాటి సినీ విశేషాలు తెలపటమే కాకుండా, ప్రచారంలో ఉన్న అపోహలను తొలగిస్తూ, సరైన సమాచారాన్ని అందిస్తుంది. ‘తెలుగులో పఠనాసక్తిని పెంపొంచిందిన వారు కొవ్వలి’ అని ప్రముఖుల ప్రశంసలు అందుకున్న కొవ్వలి వారికి ఇంత కాలానికయినా సముచిత గౌరవం లభించటం, వారి రచనలు వెలుగులోకి రావటం ఆహ్వానించదగ్గ పరిణామం. అందుకు కారణమయిన సుశీలమ్మ గారు అభినందనీయులు. సుశీలమ్మ తన కర్తవ్యం సమర్థవంతంగా నిర్వహించారు. ఈ పుస్తకాన్ని ఆదరించి, కొవ్వలి గారిని తెలుగు సాహిత్యంలో అగ్రరచయితల జాబితాలో చేర్చి, చిరస్మరణీయులుగా నిలపటం తెలుగు సాహిత్య ప్రేమికుల బాధ్యత. సాహిత్యాభిమానులంతా కొని చదివి దాచుకోవటమే కాకుండా ఇతరులకు బహుమతిగా ఇవ్వవలసిన పుస్తకం ఇది.

***

నవలా సాహిత్య సార్వభౌమ శ్రీ కొవ్వలి నరసింహారావు

రచన: డా. సిహెచ్. సుశీలమ్మ

పేజీలు: 80

వెల: ₹ 100

ప్రతులకు:

214, నారాయణాద్రి

SVRS బృందావన్,

సరూర్ నగర్

హైదరాబాద్ 500035

ఫోన్: +91 98491 17879

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here