నల్లయ్య ఉరఫ్ కిట్టయ్య

0
4

[dropcap]రా[/dropcap]ములమ్మా… ఓ రాములమ్మా….

ఒసేయ్ రాములమ్మా…..! ఓ… చింత పిక్కలమ్ముకొని బొక్కల్లెల్లినట్టున్న ఒసేయ్ రాములమ్మా…. అని ఇంత పొడుగుపిల్సేటాళ్ళకు ఎవలుళ్ళ? నన్ను చింతపిక్కలమ్ముకొని బొక్కలెల్లినదంటాళ్ళు? అని దిబ్బ దిబ్బ ఉరుకచ్చి తొవ్వల తిని పారేసిన అరటి తొక్క మీద కాలేసి సర్రున జారి కుడితి కుండల బొక్క బోర్లా వడ్డది రాములమ్మ.

రాములా! కుడితి బాగ పులిసినాదే? బర్రె తాగుతదంటవానే? అని లేపి అడుగుతున్న తిరుమలను జూసి అగ్గి మీద గుగ్గిలం అయింది.

ఏందే? తిరుమల! నీకు పరాశికం ఎక్కువైతాందే? రాములమ్మా.. అని ముద్దుగ పిల్శేది పోయి చింతపిక్కలమ్ముకొని బొక్కలేల్లినట్టున్న అని ఎక్కిరియ్య వడ్తివే? అన్నది. అంటిన కుడితిని కడుక్కుంట.

అది గాదే! ముందుగాల తేనె నాకిన నాలుక తోని తియ్యగ రాములమ్మా….రాములమ్మా… అని పావురంగా పిలిస్తే అచ్చినావే? అందుకే జగడమెట్లైతది? జంగమయ్య అంటే బిచ్చం పెట్టవే బొచ్చు….. అని అదేదో అన్న శాత్రం యాదికచ్చి నేను సుత అట్నే పిలిశిన. సుసినావ్! నువ్వు సుత మంచిగపిలిత్తే రాలేగని చింత పిక్కల….. అని మల్ల షురువు జెయ్యవొయిన తిరుమలను రాములమ్మ ఆపి ఇగ ఆ ముచ్చట ఇడ్సిపెట్టి ఏం పనికచ్చినవో సెప్పు. అన్నది.

మా పోరడు ఇటికెల్లి వచ్చిండాని? అడగటానికచ్చిన్నే అన్నది. తను సుత కుడితిని కడుక్కుంట.

మీ వోడేవడు? ఎర్రోడ, తెల్లోడ, నల్లోడ… అన్నది రాములమ్మ.

ఏందే? పోరగాండ్లకు ఎర్రయ్య, నల్లయ్య, తెల్లయ్య అని పేర్లు వెట్టుకుంటే…….

అరె నేనేమన్ననే?నీ పేర్లకే పెద్దోడా, సిన్నోడా, నడిపోడా? అని తెల్వటానికి పేర్లు పెట్టి అడిగిన.

అగొ మల్ల….

ఆ ఏందే… నువ్వే నా ముగ్గురు కొడుకులకు ఎరైటి గుండాలని పేర్లని కలర్ల పేర్లు పెట్టుకొని ఇప్పుడు మొగుడు గొడ్తె తప్పు లేదుగాని యారాలు సూసి నవ్వుడు తప్పని ఎన్కటికి నీ ఆసొంటిదే ఏడ్సినట్టు నువ్వు పెట్టంగ తప్పు లేదు గని నేను పిల్వంగ తప్పచ్చిందానే? ఇంతకు ముందు తిరుమల తన మెడ ఆడిన పరాశికానికి బదులుకు బదులన్నట్టుగ మాట్లాడేటాల్లకు తిరుమల ఏమనక పొయి నల్లన్నా.. అని పిల్సుకుంట కోళ్ళ గంప ఎత్తి సూసి ఆడ లేక పోయ్యసరికి, గడ్డివామెనుక ఉన్నడాని, నీళ్ళ గాబెనుక ఉన్నడాని, ఎతుకవట్టింది.

రాములమ్మ కొంచెం సల్లవడి, తిరుమలను నిమ్మలంగ అడిగింది.

ఏందే? ఏమాయే? గాబరైతానవ్?

నలయ్య కనవడుతలేడక్కో… నా నల్లయ్య కనవడుతలేడక్కో…. నీ ఇంట్లున్నాడని ఇవార్దంక నిమ్మలంగ ఉంటిగాదక్కో…. అని శోకనమెత్తింది. తిరుమల.

ఎప్పటిసందే?

ఎగిలివారంగనే బడి యాలైతాందని లేరో లేరో అని పెద్దోన్ని, నడిపోన్ని, సిన్నోన్ని ముగ్గుర్ని బాయి కాడికి నీళ్ళు పోస్కోని రాపొండ్రని వాల్లయ్య తోడిచ్చి సాగాదోలిన్నే. ఇద్దరచ్చిండ్రు. నడిపాడు నల్లనయ్య గానరాలే.

వాళ్లనే అడుగపోయ్నావ్?

అడిగిన్నే, వాల్లెనుకనే సైకిల్ టయిరు తోలుకుంటచ్చిండట. వాడేడ పోతడు వత్తడని వీళ్ళచ్చిండ్రు. ఎర్రోడు, తెల్లోడు బల్లెకు పోయిన్డ్రు. వీడు మాత్రం రాలే. వాళ్లయ్యతోనంటే వాడేడ పోతడు పయ్య తోని ఆడుకుంట ఎడున్నడో, వత్తడు తీ అని నిమ్మకు నీరేత్తినట్టు మాట్లాడకుంట పొలం బోయిండు.

వాడొట్టి ఎడ్డోడే. ఎవరేత్తుక పోయిండ్రో సమజైతలేదు. ఓర్నాయనో…..

ఎహే..! ఆగు. అన్నన్నట్టు వాడేడ వోతడు? బల్లెకు వోయి సూసినవా? ఓసారి సూద్దాం పా..!

వాడు ఇస్కులుకు పోలేదక్కో! వాడేందో రాతపని కింద కోతి బొమ్మ గీయలేదటక్కో. భయంల వడి వాడేడ దాగిండో, ఇంకేమన్న అయిండో… నా గుండె దడదడలాడతందే. ఓలమ్మో… ఇంకా గట్టిగా ఏడ్వసాగింది.

ఏడ్తె పోయినోడు ఎగురుకుంటత్తాడే? సోసు.. సోసు [ఆగు] అని ఊకోవెట్టి నీళ్ళు దాగిచ్చి, పా…! నేన్గూడత్త. ఇస్కూలుకు ఎవలకన్న కండ్లవడ్డడో అడుగుదం పా..! బువ్వయాల్లా యే. బువ్వ కన్న ఇస్కూలుకు పొయ్యుంటాడు.పా..! వాడు ఆకలికి ఆగడని నువ్వే అంటివి గద.

ఆవక్క… నాకు తొయ్యలే.

పా…పా… అని ఏగిరం ఏగిరం ఇస్కూలుకు వోయిండ్రు.

పొలగండ్లు కెయి గట్టి బువ్వ తింటాన్డ్లు. ఎదురుగ అచ్చిన పెద్దసారచ్చి, ఏమమ్మ..?నల్లయ్య ఇయ్యాల బడికి రాలేదేందని? అడగనే అడిగిండు.

అక్కో… అక్కో… సారే.. అడుగుతాన్డంటే వాడు రాలేదక్కో. నా నల్లోడేడ వోయిండో.. దేవుడో.. ఎంకన్న సామీ.. ఎములాడరాజన్నా… తురకల పీరిల దేవుడో… మీకు కాయకొట్టుకుంట. ఉపాసంపంట. నాకిట్టమైన లడ్లు తినకుండ వుంట… అనుకుంట ఆపద మొక్కులన్ని మొదలుపెట్టింది.తిరుమల.

సారుండి, ఏడ్సుడుగాదమ్మ.. ఎతికి కనవడకుంటే స్టేషన్ల చెప్పుపొండ్రి, అని కోపం జేసేటాల్లకు దెబ్బకు నోరుమూసి ఇద్దరు బైటికచ్చిండ్రు.

తిరుమల గాబరయితనేవున్నది. మా నల్లయ్యకు ఆకలి ఐతాంది గావచ్చు. గా పొద్దు బల్లెకు పొయినంక ఆకలయితాందే అవ్వా..! అంటే ఒంటెలుబెల్ల తినురా కొడుకా..! అని అప్పలు, పల్లిపట్టిలు, బెల్లం ఇచ్చిన. పోరడు అట్నే జోబుల్లల్ల పోస్కుంటే చీమలు వట్టి కుట్టంగగుడ సప్పుడ్జేక ఓర్సుకుంట తిన్నడట. మల్ల ఏడ కిలాసుల సారు కండ్లవడితే తిడ్తడని చీమలు పట్టి పెయ్యంత కుట్టికుట్టి సంపినా సప్పుడ్జేక ఎర్రవడ్డ కుయ్యుమననోడు ఈయాలెట్లున్నడో? నాఎడ్డి నాగన్న… అంటూ శోకం బెడ్తంటే,

నాగన్న, అంటానవేందే? వాని పేరు నల్లన్న ఐతే అన్నది. రాములు చెట్టు కింద ఐస్ పుల్ల కొనుక్కొని శీక్కుంట.

నేనో శాత్రం జెప్తే నువ్వు…. అని ముక్కు చీద బోయింది,తిరుమల.

ఆగవ్వో….! ఏడ్చేటోళ్ళకు ఎడమపక్క కుట్టేటోళ్ళకు కుడి పక్క ఉండద్దంటరు, అనుకుంట ఎడమపక్క నుండి కుడిపక్కకచ్చింది. రాములమ్మ.

తిరుమలకు రాములమ్మతోని పనయితలేదని ఇడ్సిపెట్టి ఒక్కతే ఇంటిదారివట్టింది. నడుమిట్ల తిరుమలకు భర్త బొందయ్య, సంకల పిలగానితోని ఎదురయిండు.

ఏందయ్య..? గీపోరడేవడు? మనోడుగిన కాదుగదా..! అన్నది పరేశానుగ సూస్కుంట.

బొందయ్య, ఎవడా సూపిత్త పా..! అని జాలాట్ల నిలవెట్టి లోటతోటి నీళ్ళు పోసుడు సురువుచేసిండు. తెల్లరంగంతవొయ్యి నల్లయ్య బయిటవడ్డడు.

ఓర్నాకొడుకో..!నువ్వెట్ల గిట్లయితివి కొడుకో.. నా నల్లయ్య అని పొద్దటిలి బర్లను తోమిన కొబ్బరిపిడుస వట్టి తోమవట్టింది.

అవ్వో… అవ్వో… బర్రు బర్రుమని గీకకే అవ్వో మండుతాందే..! అని నల్లయ్య మొత్తుకోవట్టిండు.

వీళ్ళ లొల్లి జూసి రాములమ్మ అరె వీడు నడిపోడే. దొరికినాడు గదా..! అన్నది. జాలారుకాడికచ్చి సూసి యాడవోయిండే అన్న వీడు? అడిగింది బొందయ్యను.

ఏం సెప్పాలె సెల్లె? వీని ఎడ్డితనం? పొద్దుగాల బాయి కాడికి తానాలు చేసి వత్తంటే, కోడిపిల్లల కోటేశు కల్సిండు. కోడిపిల్లలన్ని తీరు తీరు రంగుళ్ళ అందంగావుండేటాల్లకు, ఏమి జేసినవే అని అడిగిన.

అంతా మన చేతుల పనేనే? రంగులు తెచ్చి ముంచి తీత్తాన. ఎంట్లంటే అట్లా ఎత్తాన. రంగులు సూసి సంబురంగా కొనుక్కుంట్టాండ్రే, బస్తీల జనాలు అనుకుంటపోయిండు. నేను అప్పుడు పట్టించుకోలే. సక్కగ ఇంటికచ్చిన. అప్పుడు ఈడు ఎన్కనే సైకిల్ పయ్య తోటి ఆడుకుంటవచ్చెటోడు.

నాయనా..! పయ్య బురుదల వడ్డది తిస్కోనత్తనే అంటే ఎగిర్తం రా రా…! అని సెప్పుకుంటచ్చి మోటరువెట్ట బాయి కాడికి పోయిన. ఆడికి ఈ ఇద్దర్ని అడిగితే ఆడు కోతి బొమ్మ గియ్యలే. గీస్కోనివత్తడట. మాకు యాళ్ళైతాందని వీళ్ళు పోయిండ్రు. ఊల్లెకు పనికి పొయ్యచ్చేటాళ్ళకు తిరుమలకు వీడు తిన్నడో లేదో నని అదోటిదోటి కొనుక్కోనివోయి బల్లె సూత్తే వీడు మయమైండని ఏర్పాటాయే. అని ఇవరంగ సెప్పిండు.

సర్నే..! మల్ల నికిప్పుడు యాడ దొరికిండు.

యాడ దొరుకుడేంది? సెల్లె. తిరుమల సెప్పేటాళ్ళకు నేను బాగా యాది జేస్కుంటే అస్సలు ముచ్చట కోటేసు తోటి మాట్లాడింది వీడిన్నాడని సమజై ఇన్నోడు ఏదో ఇకమతు జేత్తడని, ఈ మధ్య ఎన్నోసార్లు టీవీల్లల్ల ఎంటికలు తెల్లగుంటే నల్ల రంగేసుడు, నల్లగుంటే తెల్లరంగేసుడు, ఇంకా హీరోలు ఎర్రరంగేసుడు.. ఇట్ల అన్ని సూసి నన్నోపారి,

నాయ్నా..! నన్ను సుత అట్ల తెల్లగ జేయించవానే? అందరూ నల్లోడా..! నల్లోడా..! అంటాండ్రని అడుగుడు మతికచ్చి ఇగ నాకు బండ గుర్తయి జప్ప జప్ప కోటేసు ఇంటికివొయి సూత్తే, ఇంటికి తాళం బుడ్డి ఉన్నది. వీడేమో..! తెల్లరంగు గాబుల ముక్కు మూసుకొని మునిగి ఎండల కూసోని ఆళ్ళ చెట్టుయే తినుకుంట ఇవర్దాక ఉన్నడు. నన్ను జూసి భయపడి ఉరుకుడుపట్టి పెట్టవోయిండుగని,

నల్లయ్యవు గాదుర.! నిన్నేమన కొడుకాని బుదరకిచ్చి మీయమ్మ నల్లయ్య కిట్టమూర్తని మురుత్తది గాదురా..! సంకకేసుకోని తిస్కచ్చిన. అని సెప్తుంటే, తిరుమల కొడుకును తెల్లగ జేసి… అంటే సుబ్బరంగ జేసి నల్లయ్య గాదురా..!నీ పేరు కిట్టయ్యని ముద్దుజేసింది.

తెల్లారే ఇస్కూల్ల తెల్లయ్య పేరు రామయ్యగా, ఎర్రయ్య పేరు శివయ్యగా. నల్లయ్య పేరు కిట్టయ్య గా ఉరఫ్ లని మార్చి హాజరు పట్టిల కెక్కించింది. అప్పుడు నల్లయ్య ఉరఫ్ కిట్టయ్య అయిండు. మల్ల కిట్టయ్య అల్లరంత సురుజేసి అల్లరి కిట్టయ్య అయిండు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here