[box type=’note’ fontsize=’16’] జీవన గమనంలో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు. [/box]
77
[dropcap]అ[/dropcap]ప్పుడే ఆంధ్రా బ్యాంకు వారు తమ సిబ్బందికి శాంక్షన్ చేసే హౌసింగ్ లోన్ లిమిట్‌ను పెంచారు. నా మటుకు నేను, ఇంతకు ముందు తీసుకున్న లోను కాక, మరో లక్షన్నర రూపాయల వరకు అప్పు తీసుకోవచ్చు. ఆ అదనంగా వచ్చే లోనుతో, మా సొంత ఇంటి పైన మొదటి అంతస్తు నిర్మించవచ్చని అంచనా వేసుకున్నాను. వెంటనే లోను శాంక్షను కొరకు దరఖాస్తు పంపాను. అప్పు మంజూరైంది. మా బంధువు రవి గారు, ఓ సివిల్ ఇంజనీర్… ప్రస్తుతం గుంటూరులో పేరు మోసిన బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కాంట్రాక్టర్. వారికే మా ఇంటిపై మొదటి అంతస్తు నిర్మాణ బాధ్యతలను అప్పజెప్పాను.
మునిసిపాలిటీ వాళ్ళకు బిల్డింగు ప్లాను పంపాము. ఆ ప్లానుకు ఆమోదం లభించింది. వెంటనే పై అంతస్తు నిర్మాణం పనులు మొదలుపెట్టాము. కాంట్రాక్టర్ రవి గారు, ప్రతీ రోజూ ఉదయం, సాయంత్రం వచ్చి, రోజూ వారీ జరిగే పనులను పర్యవేక్షిస్తున్నారు. పనులు కొంచెం మందకోడి గానే సాగుతున్నాయి. అయితే, భారమంతా రవి గారి మీదనే పెట్టాము. అనుకున్న టైంకి పనులన్నీ పూర్తి చేయించి, మొదటి అంతస్తును నిర్మించి మాకివ్వగలరనే నమ్మకం మాకుంది.
78
వైద్య శాస్త్రం చదువుకుని డాక్టర్లుగా అవుతారు. ఇంజనీరింగ్ చదవుకుని ఇంజనీర్లుగా అవుతారు. లా చదువుకుని లాయర్లుగా అవుతారు. అక్కౌంట్స్ చదువుకుని ఆడిటర్లుగా అవుతారు… మరి ఏం చదువుకుని రైతులు వ్యవసాయదారులు అవుతున్నారు?? తాత, ముత్తాతల కాలం నుండి, వారు అవలంబిస్తున్న వ్యవసాయ పద్ధతులను చూస్తూ, వ్యవసాయం చేయడం తప్ప…!!
అంటే, ఒక శాస్త్రీయ దృక్పథం వ్యవసాయ రంగంలో కొరవడిందని మనకర్థమవుతుంది. అందుకే, వ్యవసాయదారులకు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కలిగించేందుకు, అటు ప్రభుత్వ అధికారులు, ఇటు బ్యాంకు అధికారులు… ఎంతో కొంత చేస్తున్నా… అది అరకొర మాత్రమే!
నా మటుకు నేను, ఏ ఊర్లో ఉద్యోగం చేస్తున్నా, ఏ హోదాలో ఉద్యోగం చేస్తున్నా, నా ప్రాథమిక విధుల నిర్వహణకు భంగం వాటిల్లకుండా, రైతాంగానికి, గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే ఏవో కొన్ని కార్యక్రమాలు చేపట్టడం ఒక ఆనవాయితీగా అలవర్చుకున్నాను.
ఆ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు లాం ఫారంలో, ఆధునిక వ్యవసాయ విధానాలపై నిరంతరం పరిశోధనలు జరిపే వ్యవసాయ శాస్త్రజ్ఞుల సహకారంతో, రైతులకు ఉపయోగపడే కొన్ని కార్యక్రమాలు అమలు చేశాము. ఒకప్పుడు వ్యవసాయ కళాశాల, బాపట్లలో నేను చదువుకునే రోజుల్లో నాకు పాఠాలు చెప్పిన కొందరు ప్రొఫెసర్లే, డాక్టర్ మొవ్వా రామారావు గారు, డాక్టర్ సత్యనారాయణ రెడ్డి గారు, డాక్టర్ అప్పారావు గారు…. ఇంకా చాలామంది… ఇప్పుడు లాం ఫారంలో వ్యవసాయ శాస్త్రవేత్తలుగా ఎనలేని సేవలు అందిస్తున్నారు. మా కార్యక్రమాలన్నింటికి వారు సహకరించారు. ఎంతైనా… శిష్యుడు కోరితే గురువులు కాదంటారా?!
79
ఆ కోవలో…
లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో, ఆంధ్రా బ్యాంకు వైకుంఠపురం శాఖ ద్వారా వైకుంఠపురంలో ఒక రైతు శిక్షణా శిబిరం నిర్వహించాము.
అలాగే, లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో, జంగమహేశ్వరపురంలోని, ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయ విత్తనోత్పత్తి కేంద్రంలో, రైతు దినోత్సవం నిర్వహించాము.
అలాగే, లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో, ఆంధ్రా బ్యాంకు, వినుకొండ శాఖ ద్వారా కొత్త జడ్డావారి పాలెం, కొత్త చెరువు కొమ్ముపాలెంలో రైతు శిక్షణా శిబిరాన్ని నిర్వహించాము.
ఆ కార్యక్రమాలల్లో, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రభుత్వ వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులతో, పంటలలో అధిక దిగుబడిని సాధించి, తద్వారా అధిక రాబడిని పొందే మార్గాలను విశదీకరించారు. రైతుల సందేహాలకు తగిన రీతిలో సమాధానాలను చెప్పి, వారి అవగాహనను పెంపొందించారు.
80
గ్రామీణ పేదల ఆర్థిక స్థితిగతులను అభివృద్ధి పరిచేందుకు, ప్రభుత్వం అమలుపరుస్తున్న ‘ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ – ఐ.ఆర్.డి.పి.’ అనే సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం చాలా ముఖ్యమైనది. ఆ పథకం క్రింద ప్రభుత్వ అధికారులు, బ్యాంకు అధికారులు కలిసి ఎంపిక చేసిన లబ్ధిదారులకు, బ్యాంకుల ద్వారా ఋణాలు సమకూరుస్తారు. ఆ ఋణాల్లో కొంత భాగాన్ని, ప్రభుత్వం సబ్సీడీగా ఇస్తుంది. ఆ పథకం క్రింద దారిద్ర్యరేఖకు దిగువన వుండే గ్రామీణ ప్రజలకు, షెడ్యూలు కులాల, షెడ్యూలు తెగల, వెనుకబడిన కులాల మరియు మైనారిటీ వర్గ లబ్ధిదారులకు, పాడి పరిశ్రమకు, కోళ్ళ పరిశ్రమకు, గొర్రెల పెంపకానికి, చేతి పనివృత్తులవారికి, చిరు వ్యాపారస్థులకు అప్పులు ఇవ్వబడతాయి. కాలక్రమేణా ఋణగ్రహీతలు వాయిదాలు సకాలంలో చెల్లించనందున బకాయిలు పేరుకుపోతున్నాయ్! వారిలో, సహేతుకమైన కారణాల వల్ల చెల్లించలేకపోయినవారు కొందరైతే, చెల్లించకపోతే ఏమవుతుందిలే… అనే సాచేతతో చెల్లించలేకపోయినవారు మరికొందరు.
లబ్ధిదారుల్లో, తీసుకున్న అప్పులు నిర్ణీత వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సిన అవసరం గురించి, అవగాహన పెంచేందుకు లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో, చైతన్య గ్రామీణ బ్యాంకు సహకారంతో, ఆ బ్యాంకు వట్టి చెరుకూరు శాఖలో, ఐ.ఆర్.డి.పి. వర్క్‌షాప్‌ను నిర్వహించాము. ఆ వర్క్‌షాప్‌లో, ఆ మండలంలోని గ్రామాలకు చెందిన లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున ఐ.ఆర్.డి.పి. పథకాన్ని అమలుపరుస్తున్న డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్‌మెంట్ ఏజన్సీ – డి.ఆర్.డి.ఎ. అధికారులు కూడా హాజరయ్యారు.
ప్రభుత్వ అధికారులు, బ్యాంకు అధికారులు, లబ్ధిదారులందరికీ బ్యాంకు అప్పు తిరిగి చెల్లించాల్సిన ఆవశ్యకతని వివరించారు. అలా తిరిగి చెల్లిస్తే, మరెంతోమందికి, వారి తోటి వారికి కూడా, బ్యాంకులు అప్పులు మరింతగా ఇవ్వడానికి ముందుకొస్తాయని చెప్పారు. లేకపోతే బ్యాంకులు ఇకపై అప్పులు ఇవ్వడానికి కూడా వెనుకంజ వేస్తాయని కూడా చెప్పారు. తద్వారా గ్రామీణ ప్రజానీకం చాలా నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు కూడా….
తరువాత రోజుల్లో ఆ వర్క్‌షాప్ సత్ఫలితాలను ఇచ్చిందని ఋజువైంది. అందుకే, మిగతా మండలాలలో కూడా ఇలాంటి వర్క్‌షాప్‌లు నిర్వహించాము.
81
ఐ.ఆర్.డి.పి. పథకం క్రింద అప్పులు ఇచ్చిన తరువాత అవి వసూలు కానప్పుడు, అప్పులు తిరిగి చెల్లించాల్సిన అవసరం గురించి వివరించేందుకు, ఐ.ఆర్.డి.పి. వర్క్‌షాప్‌లు నిర్వహించాము. ఇకపై అప్పులు ఇచ్చే రోజే ఓ సభ నిర్వహించి, ఆ సభ లోనే కొంతమందికి అప్పు మంజూరు పత్రాలు ఇవ్వడం, అప్పులతో కొనుగోలు చేసిన పాడి పశువులను, గొర్రెలను, కోళ్ళను, రిక్షాలు, సైకిళ్ళు, కుట్టుమిషన్లు, ఇతర సామాగ్రి, మొదలైనవాటిని, అందరి ముందు లబ్ధిదారులకు పంపిణీ చేయతలపెట్టాము.
ఆ కార్యక్రమం అమలు చేసే దిశగా, లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో, ఆంధ్రా బ్యాంకు, తాళ్ళూరు శాఖ ద్వారా బులుసుపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ఒక సభలో, ఆంధ్రా బ్యాంకు ద్వారా అప్పులు పొందిన లబ్ధిదారులకు, పైన తెలిపిన విధంగా ఋణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాము.
ఆ సభ లోనే డి.ఆర్.డి.ఎ. అధికారులు, బ్యాంకు అధికారులు ఋణాలను పంపిణీ చేస్తూ, తీసుకున్న అప్పులను నిర్దేశించిన వాయిదాల ప్రకారం తిరిగి చెల్లించాలని నొక్కి వక్కాణించారు.
అలా చెల్లించడం వలన కలిగే లాభాలు, చెల్లించక పోవడం వల్ల కలిగే నష్టాలు, వాటి గురించి లబ్ధిదారులకు అర్థమయే రీతిలో వివరించారు. ఇలా పదిమంది ముందు ఋణాలు పంపిణీ చేసి, లబ్ధిదారులలో జవాబుదారీతనాన్ని పెంచగలిగాము.
ఇకపై ఋణ పంపిణీ కార్యక్రమాలను, ఇలాంటి గ్రామ సభల్లోనే చేపట్టాలని నిర్ణయించుకున్నాము.
82
రైతులకు పశువులే అండా దండా… ఆ పశువులే, పాడి పంటలకు ఆయువుపట్టు… వాటిని సంరక్షించుకునేందుకు రైతులలో వున్న అవగాహనను, మరింత పెంపొందించేందుకు గాను, ఉచిత పశు వైద్య శిబిరాలను నిర్వహించాము.
లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో, ఆంధ్రా బ్యాంకు వైకుంఠపురం శాఖ ద్వారా… వైకుంఠపురంలో ఒక ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించాము.
అలాగే, ఆంధ్రా బ్యాంకు, వినుకొండ శాఖ ద్వారా కొత్త జడ్డావారి పాలెం, కొత్త చెరువు కొమ్ముపాలెం గ్రామాల్లో ఉచిత పశు వైద్య శిబిరాలను నిర్వహించాము.
ఆ శిబిరాల్లో జిల్లా పశు వైద్య శాఖ నుండి వచ్చిన వెటర్నరీ డాక్టర్లు, వారి సిబ్బంది, పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. చికిత్సకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశాము.
(మళ్ళీ కలుద్దాం)