అలనాటి అపురూపాలు-78

0
3

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

మలుపులు తిరిగిన జీవితం – కమలా లక్ష్మణ్:

బాలనటిగా బేబీ కమల, నర్తకిగా కుమారి కమల నుంచి కమలా లక్ష్మణ్‌గా, ఇప్పుడు మనందరికి కమలా లక్ష్మీనారాయణన్‌గా చిరపరిచితులలైన విశిష్టనటి గురించి తెలుసుకుందాం.

ఆమె మద్రాస్ ప్రెసిడెన్సీలోని ‘మయూరం’లో 16 జూన్ 1934 నాడు జన్మించారు. కమల చిన్న వయసులోనే బొంబాయిలో లచ్చూ మహారాజ్ గారి శిష్యరికంలో కథక్ పాఠాలు నేర్చుకున్నారు. శంకర్ రావు వ్యాస్ గారి నుంచి హిందూస్థానీ శాస్త్రీయ సంగీతం పాఠాలు నేర్చుకున్నారు.  1939లో బొంబాయిలో ఒక సభ – వార్షిక శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఆ ఉత్సవంలో ఓ కార్యక్రమం పూర్తిగా ఐదేళ్ళు కూడా నిండని చినారి కథక్ నృత్యం. అందమైన ఆ చిన్నారి తన అద్భుతమైన ప్రదర్శనతో వీక్షకులని ఆకట్టుకున్నారు. ప్రోగ్రామ్ షీట్‌లో ఆ పాప పేరు ‘బేబీ కమల’ అని ఉంది.

ఆ కార్యక్రమానికి హాజరైన వారిలో ఎ. ఎన్. కళ్యాణసుందరం ఉన్నారు. ఆయన వృత్తిరీత్యా న్యాయవాది, తరువాత సినీ నిర్మాత అయ్యారు. సాగర్ మూవీ టోన్ ‌తో తమిళ సినిమాలు తీస్తున్నారు. ఈ చిన్నారి ప్రతిభ ఆయనను అబ్బురపరిచింది. అప్పట్లో ఆయన ‘వలిబర్ సంగం’ (1938) అనే సినిమా నిర్మాణంలో ఉన్నారు. బేబీ కమల ఆ సినిమాలో డాన్స్ చేయడమే కాకుండా, ఒక చిన్న పాత్ర పోషించారు. కళ్యాణసుందరం గారు తన తదుపరి చిత్రం ‘రామనామ మహిమై’ (1939)లో కమలకి చిన్న పాత్ర యిచ్చి నాట్యం చేయించారు. అయితే, దురదృష్టవశాత్తు రెండు సినిమాలు పరాజయం పాలయ్యాయి, ఇవాళ ఎవరికీ గుర్తు లేవు.

అయితే స్టూడియోలలో ఆమె నృత్యాలను చాలామంది చూశారు. తన ప్రతిభ హిందీ చిత్ర సీమ దాకా పాకింది. ఆ క్రమంలో ఆమె చాలా హిందీ సినిమాలలో నాట్యం చేశారు. 1940లో రెండు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. భారతీయ సినీ ప్రముఖులలో ఒకరైన నిర్మాత చందూలాల్ షా, ఆయన భార్య గోహర్ బాయి – బేబీ కమలను చక్కని జీతంతో బొంబాయిలో తమ స్టూడియోలో పర్మనెంట్ ఆర్టిస్టుగా నియమించారు. అయితే, 1942లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలయినప్పుడు, చాలా మంది దక్షిణ భారతీయుల వలె ఆమె కుటుంబం కూడా దక్షిణ భారతానికి తిరిగి వచ్చేసింది. అప్పుడు కమలకు ఏడేళ్ళు. మదనపల్లి వచ్చి గురువు కట్టుమన్నార్ కోవిల్ ముత్తుకుమరప్ప పిళ్ళయ్ గారి వద్ద అభ్యాసం కొనసాగించారు. అప్పటికే ఆయన వయసు దాదాపు 60 ఏళ్ళు ఉండేవి. ఆయన దగ్గర శిష్యరికం చేసి, కమల మయూరంలో ప్రదర్శన ఇచ్చారు. కమలతో పాటు ప్రయాణించడానికి కష్టం కావడంతో గురువు గారు, తన బంధువు వళువూరు రమేష్ పిళ్ళయ్‌ని ఆమె వెంట పంపేవారు. అప్పటికి రమేష్ పిళ్ళయ్ వయసు సుమారు 40 ఏళ్ళు.

తరువాత వారు మద్రాసుకు వచ్చి మైలై సమాజంలో ప్రదర్శన ఇచ్చారు. శ్రీరాములు నాయుడు ఆమె ప్రదర్శన చూసి ‘జగతల ప్రతాపన్’కు తీసుకున్నారు. ఎవిఎం స్టూడియోతో ఒప్పందం కుదిరి బాలనటిగా ఆ సంస్థకు 15 సినిమాలు చేశారు. సినిమాలు కాకుండా, ప్రతీ నెలా ఆమె నాలుగు లేదా ఐదు నృత్య ప్రదర్శనలిచ్చేవారు. సినిమాల్లో పాపులర్ కావడం వల్ల తన నృత్యాలు చూడ్డానికి జనాలు విశేషంగా వచ్చేవారు… ఈవిడ తరువాతే లలిత, పద్మిని, రాగిణి… ఒక్కో భంగిమని కనీసం అర నిమిషం వేసి ఉంచేవారు. అది దైవదత్తమైన ప్రతిభ. ఇందుకోసం ఏమైనా ప్రత్యేకాహారం తీసుకుంటారా అని జనాలు అడిగేవారు. ఆమె పూర్తి శాకాహారి. ఆమె వ్యాయామాలలో – సాగడం, వంగడం అధికంగా చేసేవారు. అందుకని తనకి, ఇంకా ప్రేక్షకులకి ఇష్టమైన నాట్య భంగిమని అతి సులువుగా చేయగలిగేవారు. ప్రతీ రోజు ఉదయం మేకప్‍కి ముందు లేదా షూటింగ్‍కి వెళ్ళే ముందు తప్పనిసరిగా వ్యాయామం చేసేవారు. ఒకవేళ షూటింగ్ తొందరగా ముగిసి, ఇంటికి త్వరగా వచ్చేస్తే సాయంత్రం కూడా వ్యాయామం చేసేవారు. అలాగే సమయం దొరికినప్పుడలా గంటా రెండు గంటలు ఏకధాటిగా వ్యాయామంలో గడిపేవారు. అందుకే ఆమెకి అంత ధార్డ్యం కలిగింది.

హిందీలో ఆమెకి మొదటి హిట్ చిత్రం “కిస్మత్” (1943). అశోక్ కుమార్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం హిందీ సినిమా చరిత్రలోనే గొప్ప హిట్ చిత్రమైంది. కలకత్తా ఒకే థియేటర్‌లో మూడేళ్ళ పాటు నడిచిందీ సినిమా! ఈ చారిత్రాత్మక సినిమాలో నాట్యం చేయడమే కాకుండా చిన్న పాత్ర పోషించారు కమల. తదుపరి హిట్ చిత్రం “రామరాజ్య” (1943). భారతీయ గొప్ప పౌరాణిక చిత్రాలలో అత్యుత్తమమైనది. ‘మైథలాజికల్ మాస్టర్’గా పేరు పొందిన విజయ్ భట్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు (ఎ.వి. మెయ్యప్పన్ తరువాత 1947లో “రామరాజ్య” ని తమిళ్‌లో డబ్ చేశారు).

“కిస్మత్”, “రామరాజ్య” చిత్రాలు ఘన విజయం సాధించడంతో బేబీ కమల దక్షిణాదిలోనూ పాపులర్ అయ్యారు. తమిళ నిర్మాతల దృష్టిలో పడ్డారు. అందుకని తన కూతురికి భరతనాట్యంలో శిక్షణ ఇప్పించే నిమిత్తం బేబీ కమలతో కలిసి మద్రాసులో నివాసం ఏర్పరుచుకున్నారు ఆమె తల్లి.

అయితే భరతనాట్యానికి కొంత కాలం వేచి ఉండాల్సి వచ్చింది. గురువు కట్టుమన్నార్ కోవిల్ ముత్తుకుమరప్ప పిళ్ళయ్ గారి వద్ద కొంత కాలం అభ్యాసం కొనసాగింది. ఆ తరువాత వళువూరు బి. రామయ్య పిళ్ళయ్‌ గారి శిష్యురాలయ్యారు. కోయంబత్తూరుకి చెందిన విజయవంతమైన నిర్మాత, దర్శకులు, పక్షిరాజా ఫిల్మ్స్ అధినేత అయిన ఎస్.ఎం. శ్రీరాములు నాయుడు గారు కమలను తమిళ చిత్రసీమకు పరిచయం చేశారు. అ చిత్రం ‘జగతల ప్రతాపన్’ (1944).  జానపద కథ కావడంతో సినిమా అందరినీ అలరించింది. కమల నాగలోకం సీక్వెన్స్‌లో నాగిని నృత్యం చేశారు. ఈ సినిమా విజయవంతం కావడం, గురువు రామయ్య పిళ్ళయ్ నృత్యదర్శకత్వంలో ఆమె చేసిన నృత్యం – ఆమెను తమిళ సినీ రంగంలో ప్రముఖ తారని చేశాయి. అప్పటికి ఆమె వయసు పదేళ్ళే!

ఎ.వి. మెయ్యప్పన్ ఆమెకు వరుసగా రెండు చిత్రాలలో అవకాశం ఇవ్వడంతో బేబీ కమల కెరీర్ మలుపు తిరిగింది. అందులో మొదటి చిత్రం 1945లో విడుదలైన ‘శ్రీవల్లి’. ఈ చిత్రానికి రచయితా దర్శకుడు, ఎవిఎం సంస్థకు సన్నిహితుడు అయిన ఎ.టి. కృష్ణస్వామి దర్శకత్వం వహించారు (సినిమా క్రెడిట్స్‌లో ఉమ్మడి దర్శకత్వం అని ఎ.వి. మెయ్యప్పన్ తన పేరు కూడా వేసుకోవడం విశేషం). కమల ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయడం ప్రేక్షకులని అలరించింది. బాల శ్రీవల్లిగా, బాల మురుగన్‍గా రెండు పాత్రలు పోషించి, రెండు భరతనాట్యాలు చేశారు. మొదటిది ‘యార్ ఉన్నైపోల్ ఆథరిపవర్’ పాటకి, రెండోది ‘సింథయ్ అరింతువాది సెల్వకుమరన్’ అనే పాటకి. ఈ రెండు పాటలను పి.ఎ. పెరియనాయకి పాడారు. ప్రముఖ కర్నాటక సంగీత విద్యాంసుడు తురయుర్ రాజగోపాల శర్మ, ఎవిఎం ఆస్థాన సంగీత దర్శకుడు ఆర్. సుదర్శనం బాణీలు కట్టారు. 1945లో వచ్చిన మరో హిట్ చిత్రం – శాస్త్రీయ సంగీతం ప్రధానంగా సాగే ‘మీరా’. ఈ చిత్రంలో ఎం.ఎస్. సుబ్బులక్ష్మి నటించారు. అమెరికాలో స్థిరపడిన తమిళ నిర్మాత ఎల్లిస్ ఆర్ దుంగన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘మీరా’లో కమల కృష్ణుడి పాత్రను ధరించారు. టి సదాశివం గారి కుమార్తె రాధ బాల రాధగా నటించారు. ఒక స్వప్న సన్నివేశంలో బాల రాధ, బాల కృష్ణుల మధ్య నృత్యం ఉంటుంది. ఎం.ఎస్. పాడిన ‘కాట్రినిలే వరుం గీతం’ పాటలో అక్కడక్కడా కమల కృష్ణుడిగా కనిపిస్తారు. పాట రచన కల్కి చేయగా, రామయ్య పిళ్ళయ్ నృత్య దర్శకత్వం వహించారు.

కమల – “ఎన్ మగన్” (1945), “ఏకంబావననన్ ” (1947), “కటగం” (1947), “మహత్మా ఉదంగర్” (1947, నాగిని నృత్యం) వంటి సినిమాల్లో నర్తించారు. అయితే ఇవి పరాజయం పాలవడంతో, ఇప్పడు వీటిని తలచుకునేవారు లేరు. 1946లో మద్రాసులో ఒక నాటకం సంచనలం సృష్టించింది. ప్రముఖ జర్నలిస్ట్ పా.నీలకంఠన్ రచించిన ‘త్యాగ ఉల్లమ్’ అనే నాటకం అది. తరువాత దాని పేరు “నమ్‌ ఇరువర్”గా మారింది.

మెయ్యప్పన్ ఆ నాటకం చూశారు. ఆయనకి బాగా నచ్చేసింది. సినిమా హక్కులు చేజిక్కించుకున్నారు. నాటకంలో కొన్ని మార్పులు చేసి, సినిమాని కారైకూడిలోని తమ స్టూడియోలోనే తీశారు. సుబ్రమణ్య భారతీయార్ రచించిన దేశభక్తి గీతాలను ఇందులో పెట్టారు. కమల కథానాయకుడి సోదరిగా నటించి, ‘ఆడువొమెయ్ పల్లు పాడువొమెయ్… ఆనంద సుధాంతిరమ్’, ‘వెట్రి ఎట్టు దిక్కుమెన కొట్టుమురిసెయ్’ అనే పాటలకు నర్తించారు. డి.కె. పట్టమ్మాళ్ ఈ పాటలను పాడారు. కమల నృత్యాలు ఈ చిత్రానికి హైలైట్‍గా నిలవడమే కాకుండా, సినీ చరిత్రలోను, సాంస్కృతిక చరిత్రలోనూ చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఇవే కాకుండా మహత్మా గాంధీ గురించిన రెండు పాటలు ‘కరుణామూర్తి గాంధీ మహాత్మా’, ‘మహాన్ గాంధీ మహాన్’ అనే పాటలకు కమల నర్తించారు. ప్రముఖ గాయని ఎం.ఆర్. రాజేశ్వరి ఈ పాటలను పిల్లల గొంతుతో పాడడం విశేషం.

“నమ్‌ ఇరువర్” ఘన విజయం సాధించడం, కమల నృత్యాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో, తమిళం మాట్లాడే పాత మద్రాసు ప్రెసిడెన్సీలో ఎన్నో డాన్స్ స్కూల్స్ పుట్టుకొచ్చాయి. భారతనాట్యానికి అపారమైన గౌరవం లభించింది. ఆ తరువాత కమల ఎన్నో తమిళ, హిందీ, తెలుగు, కన్నడ చిత్రాలలో నృత్యాలు చేశారు (కొన్ని నృత్యాలకు ఆమె దర్శకత్వం వహించారు). ఇవి కాక, ‘లావణ్య’, ‘కొంజుం సాలంగై’, ‘శివగంగ సీమై’ అనే తమిళ చిత్రాలలోనూ, ‘జల్వా’  అనే హిందీ సినిమాలోను ప్రధాన పాత్రలు పోషించారు.

ఆమె ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందారు. భరతనాట్యానికి మారుపేరు అయ్యారు. 2002 సంవత్సరం మార్గాళి మాసంలో ఆమెకు మ్యూజిక్ అకాడమీ వారి ప్లాటినమ్ జుబిలీ అవార్డు ప్రదానం చేశారు.

కమల కార్టూనిస్ట్ ఆర్.కె.లక్ష్మణ్‌ను వివాహం చేసుకున్నారు. అయితే వారి వైవాహిక జీవితం సాఫిగా సాగలేదు. 1960లో వీరు విడాకులు తీసుకున్నారు. తరువాత ఆమె టి.వి.లక్ష్మీనారాయణన్‌ను పెళ్ళి చేసుకున్నారు. ఆయన 1983లో చనిపోయారు. రెండవ భర్త ద్వారా ఆమెకు జయానంద్ నారాయణన్ అనే కొడుకు పుట్టాడు. అతడు అమెరికా సైన్యంలో అధికారిగా పనిచేశాడు.

ఎం.జి.ఆర్. ప్రభుత్వంలో తనకు తగినంత మద్దతు, ప్రోత్సాహం రాలేదని కమల భావించారు. ఢిల్లీకి చెందిన సాంస్కృతిక సంస్థల నుండి కూడా ప్రోత్సహం కరువైంది. వారు దక్షిణాదిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అధికారులతో ఎన్నిసార్లు మాట్లాడినా ఉపయోగం లేకపోయింది. శ్రమించే గుణం, కళ పట్ల నిబద్ధత కలిగిన కమలని ఈ సంఘటనలు బాధించాయి. 1979లో భారత్‌ని విడిచి అమెరికా వెళ్ళిపోయారు. అక్కడ నృత్య శిక్షకురాలిగా కొనసాగారు. అంతటి గొప్ప కళాకారిణి మన దేశాన్ని వీడడం ఖచ్చితంగా మనకు నష్టమే….


అద్భుతనటి వైజయంతిమాల అంతరంగం:

రెండు దశాబ్దాల పాటు సాగిన కెరీర్‌లో ఈ దిగ్గజం 65 సినిమాలలో నటించారు. తన కాలంలోని ప్రసిద్ధ కథానాయకులందరితోనూ నటించిన అద్భుత నటి, సొగసైన నర్తకి వైజయంతిమాల అంతరంగం తెలుసుకుందాం. 2012లో మీరా జోషీకి ఇచ్చిన ఇంటర్వ్యూ నుంచి ఈ సమాచారం…

***

తొలినాళ్ళు:

తన చిన్నప్పుడు వైజయంతిమాల గారి అమ్మమ్మ ఆమెను ‘నర్తించే పాదాలు’ అనేవారట. ఆమె అయిదేళ్ళప్పుడు అందరి ముందు నాట్య ప్రదర్శన చేశారు.

“అయితే నేను అప్పటికి శిక్షణ పొందిన నర్తకిని కాను” అన్నారు వైజయంతి మాల. ఆమె సినిమాల్లోకి రావడం పూర్తిగా యాదృచ్ఛికం. చిన్నప్పటి నుంచే నృత్యం నేర్చుకోవడంతో, సినీరంగంలో ప్రవేశించడానికి మార్గం సుగమం అయింది. అయితే వాళ్ళ అమ్మగారికి వైజయంతిమాల సినిమాల్లో ప్రవేశించడం పెద్దగా ఇష్టం లేదు. తన కూతురు చదువులో రాణించాలని ఆమె కోరుకున్నారు. కాని విధి మరోలా తలచింది. కుటుంబ మిత్రులైన దర్శకులు ఎం.వి.రామన్ సినీరంగంపై ఆ కుటుంబానికి ఉన్న అపోహలను తొలగించారు. తొలి  తమిళ చిత్రం ‘Vaazhkai’ (1949) కోసం కెమెరా ముందు నిలిచినప్పుడు వైజయంతిమాల వయసు 13 ఏళ్ళు. ఈ సినిమా తరువాత 1951లో ‘జీవితం’ పేరుతో తెలుగులోనూ, ‘బహార్’ పేరుతో హిందీలోనూ విడుదలయింది. రెండు చిత్రాలలోనూ ఆమె ప్రధానపాత్రలో నటించారు.

“బహార్ ఉత్తరభారతదేశాన్ని ఒక ఊపు ఊపింది. అప్పటి దాక వాళ్ళు సినిమాలలో నిజమైన నృత్యాలను చూడలేదు. నటీనటులంతా సంగీతానికి తగ్గట్టుగా అభినయించేవారు. పాదాల కదలిక, ముద్రలు, ముఖ కవళికలు ఉండేవి కావు. నా నృత్యాలు ఉత్తరాది ప్రేక్షకులను అలరించాయి. రాత్రికి రాత్రి నేనో స్టార్‌ని అయిపోయాను” గుర్తు చేసుకున్నారు వైజయంతిమాల. ఆ వయసులో లభించే కీర్తిప్రతిష్ఠలు ఎంతటివారికైనా తలకెక్కుతాయి. “అయితే, నేను కీర్తిప్రతిష్ఠలు నా తలకెక్కకుండా జాగ్రత్త పడ్డాను. ప్రారంభం నుంచి కూడా అతిగా సంతోషించకూడదనీ, మరీ ఎక్కువగా బాధపడకూడదని నాకు నేర్పారు. అన్నింటిని ఒకేలా చూడడం అలవర్చారు” చెప్పారామె.

‘బహార్’ విడుదలయ్యాక, వైజయంతిమాల మద్రాసుకి తిరిగొచ్చేసారు, ఎందుకంటే ఆమెకీ, ఎవిఎం వారి ఐదేళ్ళ ఒప్పందం ఉంది. అందుకని బొంబాయిలో హిందీ సినిమాలు చేయలేకపోయారు. “నాకు బొంబాయిలో అన్ని అవకాశాలు వస్తాయని వాళ్ళు ఊహించలేదు” అన్నారామె. అయితే దక్షిణాదిన నాట్య ప్రదర్శనలిస్తూ వచ్చారు. 1954లో ఎస్. ముఖర్జీ గారి ‘నాగిన్’ సినిమాలో అవకాశం దక్కింది. బొంబాయి చిత్ర పరిశ్రమ రీతి రివాజులకి అలవాటు పడడానికి కాస్త సమయం పట్టిందామెకు. “ఎవిఎంలో పని చేస్తున్నప్పుడు ఇంటి వాతావరణం ఉందేది. కానీ ఇక్కడ పరిస్థితులు వేరు. నేను బాగా చేస్తున్నానో లేదో నాకు తెలియదు. దర్శకుడి సూచనలు పాటించేదాన్నంతే. ఆ సినిమాలో నేనొక గిరిజన యువతి పాత్ర పోషించాను. ఈ సినిమా కూడా హిట్ అయింది” అన్నారామె. దీని తర్వాత అంజామ్, లడ్కీ, వంటి హిట్ చిత్రాలు వచ్చినా – బిమల్ రాయ్ గారి దేవ్‌దాస్ (1955) ఆమె కెరీర్‍ని మలుపు తిప్పింది.

“అది నాకు చాలా పెద్ద అవకాశం. బిమల్ దా నాకు అద్భుతమైన చంద్రముఖి పాత్ర ఇచ్చారు. నేను బాగా నాట్యం చేయడమే కాకు, చక్కగా నటించగలను అని నిరూపించుకున్నాను. ఒక నర్తకి నుంచి…  దేవదాసుని ఏ కోరికలు కోరని ఉత్తమ యువతిగా నాలోని మార్పుని ప్రేక్షకులు ఇష్టపడ్డారు. బిమల్ దా గొప్ప దర్శకుడు. అదే తొలిసారిగా నా సహనటుడు దిలీప్ కుమార్ గారితో చేయడం… వారితో పని చేయడం గొప్ప అనుభూతి. తరువాత మేమిద్దరం కలిసి నయా దౌర్, మధుమతి, గంగా జమున వంటి సినిమాలు చేశాం” చెప్పారామె.

దేవ్‌దాస్ చిత్రంలో చంద్రముఖి పాత్రకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి అవార్డు వస్తే ఎందుకు తిరస్కరించారన్న ప్రశ్నకు ఆమె నవ్వేశారు. “అదో పెద్ద కథ. దాని చుట్టూ చాలా వివాదాలున్నాయి. ఆ అవార్డు తిరస్కరించడానికి కారణం నా తలపొగరు కాదు; బడాయితనం అంతా కన్నా కాదు. బిమల్ దా నాకు కథ చెప్పినప్పుడు – ఆ రెండు పాత్రలు సమాంతరంగా ఉంటాయని చెప్పారు. పారో, చంద్రముఖి ఇద్దరూ హీరోయిన్‌లనే చెప్పారు. మరి సహాయనటి ఎక్కడ్నించి వచ్చింది? అది ఆత్మగౌరవ విషయం… కానీ ఏవేవో ప్రచారమయ్యాయి. ఈ ఉదంతంలో ఫిలింఫేర్‌కీ, నాకూ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కానీ కొంతకాలమే! మళ్ళీ మేం కలిసిపోయాం. సాధన (1958) సినిమాకి నాకు ఉత్తమనటిగా ఫిలింపేర్ అవార్డు లభించింది. నాకొచ్చిన ట్రోఫీలన్నీ మద్రాసులోని మా ఇంట్లో అందంగా అలంకరించబడి ఉన్నాయి…” చెప్పారు.

వైవాహిక జీవితం:

10 మార్చ్, 1968 నాడు ఈ నటి డా. చమన్‍లాల్ బాలిని వివాహం చేసుకుని, సినిమాల నుంచి విరమించుకుని మద్రాసులో స్థిరపడ్డారు. “సినిమాలు విరమించుకోవాలని నేనూ, మా వారు ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నాం. ఇంటిని, కుటుంబాన్ని చూసుకునే బాధ్యత కూడా ఒక వృత్తికి ఏ మాత్రం తక్కువ కాదు. చేసే పనిలో నిజాయితీగా ఉండాలని నేను నమ్ముతాను. సినిమాలకీ, కుటుంబానికి మధ్య సమయాన్ని సర్దుబాటు చేయలేనని అనిపించింది. పైగా తగినంత కాలం చిత్రరంగంలో గడిపానని అనిపించింది. పరిశ్రమ నాకు అమితమైమ ప్రేమ, కీర్తి, ప్రతిష్ఠలు, గౌరవం కల్పించింది. అప్పటికి నేను ఉన్నత స్థానంలో ఉన్నాను, విరమించుకోవడానికి సరైన సమయం అని అన్పించింది. ప్రజలు ఇప్పటికీ నన్ను ఆప్యాయంగా గుర్తుంచుకోవడం – నాకు సంతోషాన్నిస్తోంది. యువతరం నా సినిమాలను టీవీల్లో చూడడం ద్వారా నా గురించి తెలుసుకున్నారు” అన్నారామె.

ఆమెను తీరిక లేకుండా చేసినది నాట్యం. చిన్నతనంలో వారి అమ్మమ్మ మద్దతు తెలపగా, వివాహం తర్వాత డా. బాలి ఆమెకు ఆసరాగా నిలిచారు. వేదికలపై నాట్య ప్రదర్శనలు కొనసాగించారు, కొనసాగిస్తున్నారు కూడా (ఈ ఇంటర్వ్యూ నాటికి). 75 ఏళ్ళ వయసులో రంగస్థలంపై నృత్యప్రదర్శిస్తున్న భరతనాట్య కళాకారిణి ఆమే కావచ్చు. “నేను దేశవిదేశాలలో ప్రదర్శనలిచ్చాను. కాని చివరిసారిగా ఒక్కసారి ముంబయిలో ప్రదర్శన ఇవ్వాలని ఉంది” అన్నారు [అయితే ప్రస్తుతం ఆమె నాట్యం విరమించుకుని, గానానికి మళ్ళారు].

ఈ మాజీ నటి పరిశోధకురాలు కూడా. ప్రాచీన భారతీయ ఆలయాల నృత్య రీతులను ఆమె పరిశోధించారు. “వీటిల్లో కొన్నింటిని నేను మా గురువుగారు తంజావురు చిట్టప్ప పిళ్ళయ్ గారి వద్ద అభ్యసించాను. భావ్, అభినయ – గౌరి అమ్మ దగ్గర నేర్చుకున్నాను. నేను సాంప్రదాయవాదిని, భరతనాట్యాన్ని కలుషితం చేయకుండా స్వచ్ఛమైన రూపంలో ప్రదర్శించడం నా లక్ష్యం.” చెప్పారామె. బొంబాయిలో ఆమె నెలకొల్పిన రెండు నృత్య పాఠశాలలను, ఆమె మద్రాసుకి వచ్చేయడం వల్ల మూసేయాల్సి వచ్చింది. “నేను వెళ్ళిపోతున్నానని చెప్పినప్పుడు  నా విద్యార్థులు కళ్ల నీళ్ళు పెట్టుకున్నారు” కనులు చెమ్మగిల్లుతుండగా, గుర్తు చేసుకున్నారామె.

ప్రస్తుతం ఆమె నృత్య నాటికలు – సోలో పెర్‌ఫార్మెన్స్ – ఆధారంగా రూపొందాయి. పలు అంశాల మీద సాగుతాయి, తాజా అంశం వాల్మీకి రామాయణం. సీతా రాముల మధ్య సంభవించే మూడు వియోగాలను చూపుతుంది. “అన్ని పాత్రలు నేనో పోషించాను. ఢిల్లీలో, కొలకతాలో ప్రదర్శనలిచ్చాను. కానీ ముంబయిలో నాట్యం చేసి చాలా కాలమయింది. మా సంత్ సఖు డాన్స్ గ్రూప్‍ని పునరుద్ధరించాలని ఉంది. అది మరాఠీ బృందం. వసంత్ దేశాయ్ సంగీతం సమకూర్చారు. వాణీ జయరాం అభంగ్‍లను ఆలపించారు” చెప్పారామె.

రాజకీయాలు:

రాజకీయాలలో తన ప్రవేశం కూడా యాదృచ్ఛికంగానే జరిందని ఆమె తెలిపారు. మద్రాసులో జరిగిన ఓ ఉత్సవంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ వైజయంతిమాలను కలిసారు. ఆమెకున్న అభిమాన గణాన్ని చూసి, కాంగ్రెస్ పార్టీ టికెట్‍పై ఎన్నికలలో పోటీ చేస్తారా అని అడిగారట. అప్పుడామె ‘మీ ఇష్టం’ అనేసారట. ప్రజలకు సేవ చేయచ్చనే ఉద్దేశంతో డా. బాలీ ఆమె రాజకీయాలలో ప్రవేశించాలని కోరుకున్నారు. ‘కానీ కళ కూడా ప్రజాసేవే కదా’ అని అన్నారట ఆమె. ‘కానీ రాజకీయాల ద్వారా పేదలకు సేవ చేయవచ్చు’ అన్నారట డా. బాలి. తనకి అప్పట్లో రాజకీయాలలో ఓనమాలు రానప్పటికీ, భర్త మద్దతుతో, మార్గదర్శకత్వంలో ఎన్నికలలో నిలిచారు. ఒకప్పుడు ఆమె నెహ్రూ గారికి, ఇందిరాగాంధీకి సన్నిహితురాలు కావడంతో దక్షిణ మద్రాసు పార్లమెంటు నియోజకవర్గంలో ఆమె గెలుపు సులువయింది. తన నియోజక వర్గం కోసం అహర్నిశలు శ్రమించారు. 1984లో 48,000 ఓట్ల ఆధిక్యంతోనూ; 1989లో 1.25 ఓట్ల ఆధిక్యంతోనూ గెలుపొందారు.

1986లో డా. బాలి మరణించారు. అప్పుడామె రాజకీయాలలో కొనసాగాలో వద్దో నిర్ణయించుకోలేకపోయారు. కానీ సిట్టింగ్ మెంబరు కావడం వల్ల, మళ్ళీ పోటీ చేయాలని రాజీవ్ గాంధీ పట్టుబట్టారు. 1993లో ఆమెని రాజ్యసభకు నామినేట్ చేశారు. తదేక మనసుతో ప్రాజెక్టులపై పనిచేయడమే రాజకీయాలలో తన విజయానికి కారణమని ఆమె అంటారు. అయితే రాజీవ్ గాంధీ మరణంతో పరిస్థితులు మారాయి. 1999 లో రాజకీయాల నుంచి విరమించుకున్నారు.

తర్వాత మళ్ళీ నటించాలని ఎప్పుడూ అనిపించలేదా అన్న ప్రశ్నకు ఆమె తల అడ్డంగా ఊపారు. “నటించకూడదనే నిర్ణయం తీసుకున్నందుకు నాకు బాధ లేదు. నేను చేస్తున్న పనులతో నాకు సంతోషంగా ఉంది. నన్ను నేను తీరిక లేకుండా ఉంచుకుంటాను. నాట్యం కాకుండా, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. కొన్నింటికి నేను అధ్యక్షత వహించాలి… కొన్ని ప్రారంభోత్సవాలు చేయాలి. ఇంకా నా పరిశోధన ఉంది. ఇంటి పని ఉంటుంది.” అన్నారామె. కొడుకు సుచీంద్ర, కోడలు నందిని – ఆమెకు ఒక మనవడు ‘స్వర’ని కనివ్వడంతో ఎక్కువ దృష్టి ఇంటిమీదే ఉంటోంది.

క్రీడాకారిణిగా:

ఒకప్పుడు గోల్ఫ్ క్రీడలో ఆసక్తి కనబరిచారు వైజయంతిమాల. అయితే ఆ ఆటకి ఎక్కువ సమయం కేటాయించలేకపోయారు. “నేను గోల్ఫ్ ఆడి దాదాపు ఏడేళ్లు అవుతోంది. నాకు క్రీడలంటే ఆసక్తి ఉంది, ఆడలేకపోతున్నందుకు బాధగా ఉంటుంది, కానీ ఏం చేయను? నా చిన్నప్పుడు బాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ ఆడాను. కొన్ని టోర్నమెంట్లలో పాల్గొన్నాను కూడా. నాకు గుర్రపు స్వారీ అన్నా ఇష్టమే. గోల్ఫ్ నాకు మావారు పరిచయం చేశారు. మొదట ఔత్సాహికురాలిగా ప్రారభించి, ప్రావీణ్యం సాధించాను. ఢిల్లీ, చెన్నయ్‌లలో ట్రోఫీలు సాధించాను. ఆటలో మళ్ళీ రాణిస్తానని ఆశిస్తున్నాను” అన్నారు.

ఆవిడ ఆత్మకథ ‘బాండింగ్’ని కొన్నేళ్ళ క్రితం ఢిల్లీలో పి. చిదంబరం విడుదల చేశారు. “అది సాహిత్యపరంగా ఓ అద్భుతమైన పుస్తకం కాకపోవచ్చు, కానీ అది నిష్కపటమైన, నిరాడంబరమైన రచన” అన్నారామె. ఆత్మకథ రచనలో నిజాయితీగా ఉన్నారా అని ప్రశ్నిస్తే, “కొన్ని విషయాలలో అపోహలను తొలగించాలని ఈ రచన చేశాను. నా ఆలోచనలను, భావాలను వెల్లడించడానికి అదే సరైన మార్గం అనిపించింది” అన్నారు.

ఇదీ ఈ ఆగస్టు 13న జన్మదినం జరుపుకున్న అలనాటి అద్భుతనటి వైజయంతిమాల అంతరంగం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here