[dropcap]ఆ[/dropcap]గష్టు 23 వ తేదీ శ్రీమతి ఆరతీ సాహా (గుప్తా) వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.
***
పుట్టిన రెండేళ్ళకే తల్లిని కోల్పోయిన ఆమె తండ్రి, మామల ప్రోత్సాహంతో ఈతలో ప్రవేశించారు. సచిన నాగ్, మిహిర్ సేన్, బ్రౌజెస్ వంటి యోధాను యోధులైన క్రీడాకారుల వద్ద శిక్షణ పొందారు. ఒలింపిక్స్‌లో పాల్గొని, తరువాత ‘ఇంగ్లీష్ ఛానల్’ను ఈదే స్థాయికి ఎదిగారు. ఇంగ్లీష్ ఛానల్‌ను ఈదిన తొలి భారతీయ, మరియు ఆసియా మహిళగా రికార్డును సృష్టించారు. ఆమే ఆరతీ గుప్తా లేదా ఆరతీ సాహా.
ఈమె 1940 సెప్టెంబర్ 24వ తేదీన ఆనాటి బెంగాల్ రాజధాని కలకత్తా (కోల్‌కతా)లో జన్మించారు. రెండేళ్ళ వయసులోనే తల్లిని కోల్పోయారు. తండ్రి పంచగోపాల్ సాహా సైన్యంలో పని చేసేవారు.
సిటీ కాలేజిలో ఇంటర్మీడియట్ వరకు చదివారు. అయితే చదువుకంటే ఈతలోనే ప్రాముఖ్యత పొందారు.
ఆ నగరంలోని హుగ్లీనదిలో ఈత నేర్చారు. కలకత్తాలోని దేశబంధు పార్క్ లోని ఈతకొలనులో ఈతను సాధన చేశారు. తండ్రితోను, మేనమామతోను కలిసి చంపటాల ఘాట్‌లో గంగా స్నానం చేసేవారు. కుమార్తెకు ఈతలో గల ఆసక్తి, ఆపేక్షని గమనించారు ఆమె తండ్రి. ఆమెను ‘హత్ఖోలా స్విమ్మింగ్ క్లబ్’లో చేర్చారు. ఈ క్లబ్ సభ్యురాలిగా చేసిన కృషే ఈమె ఈతలో ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందేందుకు దోహదపడింది.
ఆనాటికి మన దేశపు అత్యున్నత ఈతగాడు సచిన్ నాగ్ ఈమెకి ఈత పట్ల గల మక్కువని, అభిమానాన్ని, ఆకాంక్షని గమనించారు. ఈమెను అక్కున చేర్చుకుని ఈతలో ప్రవీణురాలిని చేశారు. గురువు ఇచ్చిన శిక్షణ తన ఆసక్తికి తోడయింది. అందువల్లే 5 ఏళ్ళ వయసులోనే 110 గజాల ఫ్రీస్టైల్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించారు. శైలేంద్ర మెమోరియల్ స్విమ్మింగ్ పోటీలో ఈ విజయం లభించింది.
ఆ తరువాత ఈత పోటీలలో ఈదులాట అప్రతిహతంగా కొనసాగింది. 1946 నుండి 1951 వరకు రకరకాల ఈవెంట్లలో పోటీ చేశారీమె. 100 మీ, 200 మీ బ్రెస్ట్ స్ట్రోక్ పోటీలలో గెలిచారు. సుమారు 22 పతకాలు రాష్ట్ర స్థాయి పోటీలలో లభించాయి. 100 మీ ఫ్రీస్టైల్, 100 మీ, 200 మీ బ్రెస్ట్ స్ట్రోక్ లో ప్రత్యేక స్థానాన్ని పొందారు.
1948 సంవత్సరంలో బొంబాయిలో జాతీయ స్థాయి ఈత పోటీలు జరిగాయి. ఈ పోటీలలో పాల్గొని 100 మీటర్ల ఫ్రీ స్టైల్ పోటీలో, 200 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్‌లో రజత పతకాలని, 200 మీటర్ల ఫ్రీ స్టైల్ పోటీలో కాంస్య పతకాన్ని గెలిచారు. అంతకుముందు బొంబాయి ఈత క్రీడాకారిణి డాలీ నాజర్ రికార్డును బద్దలుకొట్టారు.
1951లో 100 మీ బ్రెస్ట్ స్టోక్‌ను 1 నిమిషం 37.6 సెకన్లలో సాధించి జాతీయ రికార్డును నెలకొల్పిన ఉత్తమ ఈత క్రీడాకారిణి. ఇంకా 100 మీ ఫ్రీ స్టైల్ 200 మీ. ఫ్రీ స్టైల్, 100 మీ, బ్యాక్ స్ట్రోక్ ఈవెంట్లలో సరికొత్త రాష్ట్రస్థాయి రికార్డులను సాధించారు.
1952లో జరిగిన ఈత పోటీలలో కూడా జాతీయ స్థాయి పతకాలను సాధించి రికార్డులను నెలకొల్పారు. అప్రతిహతంగా రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలలో కొనసాగిన ఈ విజయ పరంపరే ఆమెను ఒలింపిక్ క్రీడల వైపు ఈదులాడించింది.
ముంబైకి చెందిన డాలీ నాజర్‌తో కలిసి ‘హెల్సింకీ’ నగరంలో జరిగిన ఒలింపిక్ క్రీడలలో ఈత పోటీలలో పాల్గొన్నారు. పతకం సాధించలేదు కాని అంతర్జాతీయ పోటీలలో పాల్గొనేటందుకు కావలసిన ప్రావీణ్యాన్ని సంపాదించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ అత్యద్భుత సాహసానికి శ్రీకారం చుట్టారు. అదే ‘ఇంగ్లీష్ ఛానల్’ను ఈదాలనే కోరిక. కలకనడమే కాదు కష్టపడి శ్రమించి కలను సాకారం చేసుకున్నారు.
ఇంగ్లీష్ ఛానలను ఈది రికార్డు సృష్టించిన మిహిర్ సేన్‌ను ఆదర్శంగా తీసుకున్నారు.
ఒక్కొక్కసారి మనము ఇతరులకి అందించిన ప్రశంసలే మనకి ఆశీస్సులను అందిస్తాయి. అంతేకాదు. వారు సహృదయులైతే మనకి వారి సహాయ సహకారాలు కూడా లభిస్తాయి అని చెప్పడానికి ఈమె జీవితమే ఒక ఉదాహరణ.
1958లో బెంగాల్ లోని బిక్రాంపూర్‌కు చెందిన బ్రోజెన్ దాస్ ఇంగ్లీష్ ఛానల్‌ను ఈదారు. ఆ సమయంలో ఆయనకు ఆరతీ ఆత్మీయ శుభాకాంక్షలను పంపించారు. దాస్ దీనికి సంతోషించారు. ఈ ఘనకార్యాన్ని సాధించే నైపుణ్యం ఆరతికి కూడా ఉందని, ఆ దిశగా కృషిని కొనసాగించమని సమాధానమిచ్చారు. అంతేకాకుండా మరుసటి సంవత్సరం ఇంగ్లీష్ ఛానల్‌ను ఈదేటందుకు గాను ఆరతీ పేరును బట్లిన్ ఇంటర్నేషనల్ క్రాస్ ఛానల్ స్విమ్మింగ్ రేస్ నిర్వాహకులకు సిఫార్సు చేశారు.
అరుణ్ గుప్తా, జామినినాథ్ దాస్, గౌముఖర్జీ, శంభునాథ ముఖర్జీ మొదలయిన వారు అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శ్రీ బిధన్ చంద్రరాయ్‌తో సంప్రదింపులు జరిపి నిధులను మంజూరు చేయించారు.
ఈమె 1959 ఆగష్టు 27న చేసిన మొదటి ప్రయత్నం పైలట్ బోట్ సమయానికి రాకపోవడం, ఇంగ్లీష్ ఛానల్ లోని వ్యతిరేక ప్రవాహం, సుమారు 6 గంటలు కష్టపడినా ఫలితం దక్కకపోవడం వల్ల విఫలమయింది.
1959 సెప్టెంబర్ 29వ తేదీన ఈమె చేసిన రెండవ ప్రయత్నం ఫలించి రికార్డు సృష్టించారు. ఆ రోజున ఫ్రాన్స్ లోని ‘గ్రీస్‌నెజ్’ అగ్రం నుండి బయలుదేరారు. ఇంగ్లండ్ లోని ‘శాండ్ గేట్’ను చేరారు. 42కి.మీ దూరమున్న ఈ ఛానల్లో 16 గంటల 20 నిముషాల పాటు ఈత ప్రయాణం అంతర్జాతీయ ఈత క్రీడా రంగంలో భారత్ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ‘ఇంగ్లీష్ ఛానల్’ను ఈదిన ‘తొలి ఆసియా మహిళ’గాను రికార్డును సృష్టించారీమె. అత్యంత వేగవంతంగా ఈదే ఈత క్రీడాకారిణి ఈమె.
ఈ ఘనత సాధించడానికి అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తన సహాయ సహకారాల్ని పూర్తిగా అందించారు. ఈమె భారత ప్రభుత్వపు అత్యున్నత పురస్కారాలలో నాల్గవదయిన ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని 1960లో అందుకున్నారు. 1986లో ‘అర్జున అవార్డు’ను అందుకున్నారు. ‘అర్జున అవార్డు’ను అందుకున్న తొలి భారతీయ ఈత క్రీడాకారిణి ఆరతీ గుప్తానే.
1959లో తన మేనేజర్ డాక్టర్ అరుణ్ గుప్తాతో ఈమె వివాహం జరిగింది. అర్చనా గుప్తా ఈమె కుమార్తె. ఈమెకు నాగపూర్ రైల్వేలో ఉద్యోగం లభించింది.
1994 ఆగస్టులో కామెర్ల వ్యాధికి గురయ్యారు. చివరకు వ్యాధి ముదిరింది. 1994 ఆగస్టు 23వ తేదీన వ్యాధితో పోరాడి ఓడి మరణించారు.
1999 సెప్టెంబర్ 29 వ తేదీన భారత తపాలాశాఖ 3-00 రూపాయల విలువతో ఒక స్టాంపును విడుదల చేసింది. ఈ స్టాంపు మీద ఎడమవైపున దీర్ఘవృత్తంలో ఆరతీ సాహా (గుప్తా) ముఖాన్ని ముద్రించారు. కుడివైపున ‘ఇంగ్లీష్ ఛానెల్ ను ఈదుతున్న ఈత క్రీడాకారిణి ఆరతీ సాహా దర్శనమిస్తుంది. నీలిరంగులోని ఈ స్టాంపు కనువిందు చేస్తుంది.
ఆగష్టు 23 వ తేదీ ఆరతీ సాహా (గుప్తా) వర్థంతి సందర్భంగా ఈ నివాళి.
***
Image Courtesy: Internet