[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]
దిలీప్ కుమార్, కామినీ కౌషల్ నటించిన విషాద ప్రేమ కథ ‘నదియా కె పార్’
[dropcap]1[/dropcap]948లో దిలీప్ కుమార్ కామినీ కౌషల్ నటించిన సినిమా ‘నదియా కె పార్’. దీనికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో పాటు నిర్మాతగా వ్యవహరించింది కిషోర్ సాహు. కిషోర్ సాహు నలభైవ దశకంలో హిందీలో పాపులర్ హీరో కూడా. నటిస్తూనే సినిమాలకు కథలు రాస్తూ, దర్శకత్వం వహిస్తూ కొన్ని సినిమాలను నిర్మీంచిన కిషోర్ సాహు హిందీ చిత్రరంగంలో ఒక ముఖ్య పాత్ర వహించారు. 1954లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఈయన సినిమా ‘మయూర్ పంఖ్’ ఎంపికయ్యింది. మీనా కుమారి నటించిన ‘దిల్ అప్నా ఔర్ ప్రీత్ పరాయి’ సినిమా వీరికి గొప్ప పేరు తీసుకొచ్చింది. దిలీప్ కుమార్‌తో ‘నదియా కె పార్’ వీరు తీసిన ఏకైక సినిమా. ఈ సినిమా తీసేటప్పటికి కిషోర్ సాహుకి చాలా పేరు ఉంది. దిలీప్ కుమార్ కేవలం నటించడంలో తన ప్రతిభకు పదును పెట్టుకుంటున్నారు. కాని కిషోర్ సాహు సినిమాకి సంబంధించిన అన్ని రంగాలలో అప్పటికే ప్రవేశించారు. సాహు తండ్రి అప్పట్లో రాజవంశీయుల వద్ద ప్రధాన మంత్రిగా ఉండేవారు. సాహు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వ్యక్తి కూడా. అప్పట్లోనే నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి సాహిత్యంలో పట్టభద్రులు కీషోర్ సాహు. సినిమాలలోకి రాక ముందు హిందీ సాహిత్యంలో కొన్ని మంచి కథలు కూడా రాసారు. దేవానంద్ సినిమాలలో విలన్‌గా నటించి మంచి గుర్తింపు పొందారు సాహు. వీరిపై షేక్స్పియర్ ప్రభావం చాలా ఉండేది. ఆయన సినిమాలలో షేక్స్పియర్ పాత్రలు కనిపిస్తాయి. ‘నదియా కె పార్’ కూడా రొమియో జూలియట్ ప్రభావంతో కిషోర్ సాహు తయారు చేసుకున్న కథ.
సినిమా కథకు వస్తే కుమార్ ఒక జమిందారు. అతని అన్నా వదినలు ఒక మారుమూల ప్రాంతంలో జమీందారీగిరిని చూసుకుంటూ ఉంటారు. చదువు ముగించుకుని కుమార్ తన స్నేహితుడు బాలతో ఇంటికి వస్తాడు. వారుండే ఊరికి అడవి మార్గం గుండా ప్రయాణించి నది దాటి చేరుకోవాలి. రైలు దిగిన చోటే కుమార్‌ని కలవడానికి మరో ధనికుడు తన కూతురితో వస్తాడు. తన కూతురిని కుమార్ కిచ్చి వివాహం చేయాలని అతని కోరిక. కుమార్ ఒక జింక కనిపిస్తే వేటాడడానికి దాని వెంట పడతాడు. బాలని కుమార్ అనుకుని తన ఇంటికి తీసుకుని వెళతాడు ఆ ధనికుడు. అతని కూతురు చంచల్ కూడా బాలని కుమార్ అనే అనుకుంటుంది, అతన్ని ఇష్టపడుతుంది. జింక వెంట వెళ్ళిన కుమార్ ఒక బెస్త యువతిని చూస్తాడు. ఆమె ఫూల్వా. ఆమె అమాయకత్వానికి, అందానికి ఆకర్షితుడవుతాడు. ఇంటికి వెళ్ళిన తరువాత కూడా అతను ఫుల్వాను మర్చిపోలేకపోతాడు. వీరిద్దరూ ఎవరికీ తెలియకుండా కలుసుకుంటూ ఉంటారు. కొన్ని రోజుల తరువాత బాల, కుమార్ కాదని చంచల్‌కి ఆమె తండ్రికి తెలుస్తుంది. చంచల్, బాలని మోసగాడని అంటుంది. బాల మాత్రం తాను నిజంగానే చంచల్‌ని ప్రేమించానని చెప్పి నిర్ణయాన్ని ఆమెకే వదిలేస్తాడు.
ఫుల్వా తండ్రి, ఆమె బంధువులకు జమీందారుతో ఎప్పటినుండో వైరం ఉంటుంది. కుమార్ తండ్రి మరణానికి ఫుల్వా తండ్రి కారణం అని కుమార్ అన్న నమ్ముతాడు. తమ్ముడు ఫుల్వా ప్రేమలో పడ్డాడని తెలిసిన తరువాత అతను తమ్ముడి వివాహం చంచల్‌తో నిర్ణయిస్తాడు. ఫుల్వాని వివాహం చేసుకోవాలని ఆమె బస్తీలో మరొకతను ప్రయత్నిస్తూ ఉంటాడు. ఫుల్వా తండ్రికి, జమీందారుకి మధ్య గొడవ పెరుగుతుంది. ఒకరినొకరు చంపుకోవాలనుకునేంతగా వారి మధ్య వైరం బలపడుతుంది. కాని ఫుల్వా కుమార్‌ల మధ్య ప్రేమ మాత్రం వారిని ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ముడివేస్తుంది. ఫుల్వా వివాహానికి ఒక పోటీ పెడతాడు ఆమె తండ్రి, ఆ నది మీద నావ నడిపి ముందుగా నిర్ణయించిన గమ్యం చేరిన వారికి తన కూతురినిచ్చి వివాహం చెస్తానంటాడు. చంచల్‌తో అన్న నిర్ణయించిన వివాహాన్ని అంగీకరించలేక పెళ్ళి రోజున పారిపోతాడు కుమార్. నావ పోటీలో మారువేషంలో పాల్గొంటాడు. గెలుస్తాడు కూడా కాని అతను కుమార్ అని తెలిసిన తరువాత ఫుల్వా తండ్రి ఈ వివాహానికి అంగీకరించడు. ఈ లోపు జమీందారి మనుషులు కూడా వారిని చుట్టుముడతారు. రెండు వర్గాల మధ్య పోరు మొదలవుతుంది. నదిలో పారిపోదామనుకున్న కుమార్ ఫుల్వాలు ఆ నదిలోని సుడిగుండంలో చిక్కి మరణిస్తారు.
ఈ కథ అంతా కుడా ఫ్లాష్‌బాక్‌గా నడుస్తుంది. ఒక డాక్టరు జమీందారింటిని వెళుతూ ఉంటాడు. రోగికి తన అవసరం ఉందని అందువలన తనను రాత్రి అయినా సరే నది దాటించమని అతను బెస్త పల్లెలోని వారిని అడుగుతారు. కాని వారు రాత్రి పూట నావ తీయమని ఇద్దరు ప్రేమికుల ఆత్మలు ఆ నీటిలో ఉంటాయని రాత్రి పూట ఎవరు వచ్చినా వారిని బ్రతకనివ్వవని ఊరి వాళ్ళు చెబుతారు. ఆ రాత్రి అతను ఒక పాడు పడిన గుడిసెలో విశ్రమిస్తాడు. అది నాలుగు సంవత్సరాల క్రితం ఫుల్వా ఉండిన ఇల్లు. ఆ ఇంట్లో అతనికి కొన్ని విచిత్రాలు కనిపిస్తాయి. బెదిరిపోయిన ఆ డాక్టరుకు ఆ పల్లె జనం ఈ ప్రేమ కథ చెపుతారు. ఇద్దరు ప్రేమికులను తమ అహం కోసం కలవనివ్వకుండా అన్యాయంగా ప్రవర్తించిన తమకు వారి భయం ఎప్పటికీ ఉంటుందని వారు చెబుతూ ఉండగా కథ ముగుస్తుంది.
కిషోర్ సాహు అద్భుతమైన టాలెంట్ ఉన్న వ్యక్తి. అతను మంచి కథకుడు. కవిత్వం రాసేవారు. అతని హిందీ కథల సంపుటి ‘తేశు ఖా ఫూల్’ ఎన్నో భారతీయ భాషలలోకి అనువదించబడింది. కథ చెప్పాలనే అతని కోరికే అతన్ని సినిమాల వైపు వచ్చేలా చేసింది. అతనో మంచి చిత్రకారుడు కూడా. మొదటి సినిమాలోనే దేవికా రాణితో నటించిన వ్యక్తి ఆయన. అతను తీసిన ‘కువారా బాప్’ చిత్రం అతన్ని దేశంలోపెద్ద డైరెక్టర్‌గా నిలిపింది. ఎన్నో కాంట్రోవర్సరీ సబ్జెక్ట్‌లతో సినిమాలు తీసిన వ్యక్తి ఆయన. ఆ రోజుల్లోనే వితంతు పునర్వివాహం మీద ‘సింధూర్’ అనే సినిమా చేసి మెప్పు పొందారు. అప్పట్లో ఎన్నో రివార్డులు అవార్డులు సొంతం చేసుకున్నారాయన. అప్పటికి దిలీప్ కుమార్, రాజ్ కపూర్, దేవానంద్‌లు సినిమాలో ఓనమాలు దిద్దుకుంటున్నారు. ఈ సినిమాలో కూడా జాలరి అమ్మాయికి జమీందారికి మధ్య ప్రేమను చూపించడం ఆ రోజుల్లో చాలా అభ్యుదయ భావం క్రింద లెక్క. అప్పటి దర్శకులకు సాహిత్యం పట్ల మక్కువ, కథ చెప్పే విధానం పై పట్టు, కళల పట్ల గౌరవం ఉండి తమను తాము మెరుగు పరుచుకుంటూ సినిమాలను బాధ్యతగా తీసే వారు. ఎంత సంపాదించాం అన్న దానికన్నా కొత్తగా ఏం చెప్పామన్నది వారు ముఖ్యంగా ఆలోచించే విషయం. కిషోర్ సాహు సినిమాలన్నిటిని గమనిస్తే సమాజంలో మార్పు ఆకాంక్షిస్తూ సామాజిక స్పృహతో తీసిన సినిమాలు అవి. తన కూతురు నైనా సాహుతో ‘హరీ కాంచ్ కీ చూడియా’ అనే సినిమా తీసారాయన. పెళ్ళి కాకుండానే తల్లి అయిన ఒక యువతి ధైర్యంగా సమాజంలో నిలదొక్కుకుని బ్రతకడం ఈ సినిమాలో చూస్తాం. ‘హరే రామ హరే కృష్ణ’లో దేవానంద్ తండ్రిగా నటించారు ఆయన. అంతే కాదు ‘గైడ్’లో రోజీ భర్త మార్కస్ గా నటించింది కిషోర్ సాహు. దేవానంద్ ఆ పాత్రకు ఇష్టపడి వీరిని తీసుకున్నారు. హిందీ సినిమా రంగంలో రాకుమారి పాత్రలకు పేరు పొందిన బీనా రాయ్‌ని, ఆశా మాథుర్‌ని సినిమాకు పరిచయం చేసింది వీరే. బీనా రాయ్ తాజ్ మహల్, అనార్కలి లాంటి కొన్ని మంచి సినిమాలలో నటించారు. ఆశా మాథుర్ 50 లలో అందాల తారగా పేరు తెచ్చుకున్నారు. సినీ రంగానికి అప్పట్లో ఎవరూ ధైర్యం చేయని విషయాలపై సినిమాలు తీసిన కిషోర్ సాహు ప్రస్తావన ఇప్పుడు ఎక్కడా రాకపోవడం విచారకరం.
‘నదియా కె పార్’లో చంచల్ పాత్రలో మాయా బెనర్జీ కనిపిస్తారు. మెహబూబ్ ఖాన్ ‘వతన్’ సినిమాతో వీరిని సినీరంగానికి పరిచయం చేసారు. కొన్ని సినిమాలలో రెండవ నటిగా చేసి అప్పటి సినీజనాన్ని అలరించారామె. అలాగే దిలీప్ కుమార్ మిత్రుడు బాలా పాత్ర చేసిన సుషీల్ సాహు నటుడు దర్శకుడు కూడా. ‘హమారీ దునియా’ సినిమా దర్శకుడిగా ఆయని తరువాత పేరు సంపాదించుకున్నారు. కుమార్ అన్నగా నటించింది హరి శివదాసని. నటి బబిత తండ్రి ఈయన. ఈ బబిత రణధీర్ కపూర్ల సంతానమే కరీనా కరిష్మా కపూర్లు. తరువాత తరం నటి సాధన హరి శివదాసని మేనకోడలు.
ఈ సినిమాకు సంగీతం వహించింది సి. రామచంద్ర. ఇందులో మొత్తం ఎనిమిది పాటలున్నాయి. సంగీత దర్శకత్వంతో పాటు, సి. రామచంద్ర ఇందులో రెండు పాటలు పాడారు కూడా. మిగతా పాటలు శంషాద్ బేగం, రఫీ, లత, సురిందర్ కౌర్, లలిత పాడారు. “మోరే రాజా హో లే చల్ నదియా కె పార్” అన్న పాట చాలా పాపులర్ అయింది. చాలా పాటలు ఫోక్ బీట్‌తో ఉంటాయి. “కట్వా కె నయ్యా” అనే మరో పాటా అదే బాణిలో ఉంటుంది. ‘నదియా కె పార్’ సినిమా అప్పటికి దిలీప్ కుమార్ చాలా చిన్న వయసులో ఉన్నారు. ఒక గొప్పింటి యువకుడు పేద తక్కువజాతి స్త్రీ మధ్య నడిచిన ప్రేమ ఆ రోజుల్లో అందరూ మెచ్చే కథా వస్తువు కూడా కాదు. కామినీ కౌషల్ తన కెరియర్ మొత్తంలో పూర్తి పల్లెటూరి అమ్మాయిగా డీ గ్లామరైజ్డ్ రోల్‌లో ఇందులో కనిపిస్తుంది. దిలీప్ కుమార్ లోని రొమాంటిక్ కోణాన్ని చూపిస్తూ అప్పటి సినిమాల ట్రెండ్‌ని బట్టి దీన్ని ట్రాజెడి గానే ముగించారు దర్శకులు. భిన్న సామాజిక నేపథ్యాల మధ్య చిగురించిన ప్రేమను సమాజం కసిగా చూడడం ఆ ప్రేమికులను శిక్షించడం మామూలే. అయితే రోమియో జూలియట్ నాటకంలో లాగే ఇందులో కూడా కుమార్ ప్రేమికురాలిని కలిసి ఆమెతో గడపాలనుకుంటున్నప్పుడు అతను ఇరు వర్గాల పోరులో గాయపడతాడు. ప్రేమికురాలిని సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపొమ్మన్నా ఆమె అంగీకరించదు. అతనితో పాటే తన జీవితం అంటూ ఆ నావతో సుడిగుండాల దిశగా ప్రయాణిస్తుంది. ఇద్దరూ కలిసి మరణిస్తారు. తెలుగులో వచ్చిన ‘మూగ మనసులు’ సినిమా ఇలాగే ముగుస్తుంది. ఈ సినిమా రిలీజ్ అయిన సంవత్సరమే దిలీప్ కుమార్ కామినీ కౌషల్ నటించిన షహీద్, మేలా కూడా థియేటర్లలో ఆడుతున్నాయి. అయినా ఇది మంచి వసూళ్ళనే తెచ్చిపెట్టింది.