కశ్మీర రాజతరంగిణి-46

6
3

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

నమస్తస్మై తతః కోన్యోగణ్యతే వశినాం ధురి।
జేర్యంతే యేన పర్యాప్తా ఈర్ష్యావిష విషూచివాః॥
(కల్హణ రాజతరంగిణి III, 512)

[dropcap]దు[/dropcap]ర్లభ వర్ధనుడికి తన భార్య అనంగలేఖ ప్రవర్తన పట్ల అనుమానం కలిగింది. ఆమె తన పట్ల తగిన అనురాగం ప్రదర్శించటం లేదని గ్రహించిన దుర్లభ వర్ధనుడు ఆమె గురించిన ఆలోచనలలో ఉద్విగ్నుడయ్యాడు. ఆమె తనని మోసం చేస్తున్నదన్న ఆలోచనతో చింత్రాక్రాంతుడయ్యాడు. అనారోగ్యం పాలయ్యాడు. ఇక్కడ కల్హణుడు – భర్త  కన్నుగప్పి మరొకరితో సంబంధం పెట్టుకున్న యువతి ప్రవర్తనను అత్యద్భుతంగా,  ఆధునిక మానసిక శాస్త్రంలో నిష్ణాతుడయిన వాడిలా వివరిస్తాడు. ఆమె శరీర కదలికలలో మార్పును, ఆమె కళ్ళు, కనుబొమలు, చుబుకం వంటి అంగాలలో మార్పులను వర్ణిస్తాడు కల్హణుడు. భర్త ఏ విషయంలో నయినా కోపం ప్రదర్శిస్తే ఆమె ప్రదర్శించే నిరసనను వివరిస్తాడు. భర్త స్పర్శకు స్పందంచలేనితనాన్ని, భరించలేకపోవటాన్ని వివరిస్తాడు. ఆధునిక మానసిక శాస్త్రం ఏ రకంగా భర్త కాక మరొకరితో సంబంధం  ఉంటే ఎలాంటి ప్రవర్తన ఉంటుందని చెప్తుందో, అవన్నీ కల్హణుడు రాజతరంగిణిలో వివరిస్తాడు. ఆమె శరీరం అతని స్పర్శకు వైముఖ్యం ప్రదర్శిస్తుంది. అతని సంగమంలో ఎలాంటి ఆనందం కలగదు ఆమెకు. అతడి సరసన ఆమె నిద్రించటం అన్నది నటన మాత్రమే.

ఇదంతా దుర్లభ వర్ధనుడు గ్రహించాడు. బెంగతో సన్నబడ్డాడు. చివరికి ఒక రోజు రహస్యంగా ఆమె ఆంతరంగిక మందిరంలోకి ప్రవేశించాడు. ఇక్కడ మళ్ళీ కల్హణుడు శృంగార కావ్యాలలో(Sec Education, Sex Psychology)  మాదిరి రతితో సంతృప్తి చెంది ఆదమరచి నిద్రిస్తున్న స్త్రీ లక్షణాలను వర్ణిస్తాడు. అలాంటి లక్షణాలతో దీర్ఘ నిశ్వాసం తీస్తూ నిద్రిస్తున్న అనంగలేఖను రాజు దుర్లభ వర్ధనుడు చూస్తాడు. అతడి కోపం ఎగిసిపడుతుంది. కత్తివేటుతో ఆమెని చంపాలని చెయ్యి ఎత్తుతాడు. ఆమె పై కత్తి వేటు పడే సమయానికి అతడికి ఆలోచన వస్తుంది. ఆమెని చంపెయ్యాలన్న భావనతో ఆమెని చంపేసినట్టు భావించుకుంటాడు. అతడిలో ఆగ్రహం అదృశ్యమై, ఆ స్థానాన్ని ఆలోచన ఆక్రమిస్తుంది.  ఆ ఆలోచన అతడిలో శాంతిని కలిగిస్తుంది. ఈ సందర్భంలో అద్భుతమైన శ్లోకం వ్రాశాడు కల్హణుడు.

“ఎవరయితే అసూయాగ్నిలో దగ్ధమవుతూ కూడా శాంతంగా ఉండగలడో అతడే అసలైన నాయకుడు” అంటాడు కల్హణుడు. ఒక వ్యక్తి ఆవేశానికి లోనయితే, అతను, అతని కుటుంబం మాత్రమే నష్టపోతారు. ఒక నాయకుడు ఆవేశానికి లోనయితే దేశమంతా నష్టపోతుంది.  ఆవేశం అందరికీ వస్తుంది. ఆవేశంలో వ్యక్తి అనుచితమైన పనులు చేస్తాడు. కానీ అత్యంత ఆవేశాన్ని కూడా అణచుకుని, ఆలోచించి, ఆవేశాన్ని అధిగమించడమే అసలైన వ్యక్తిత్వం. ‘తన కోపమే తన శత్రువు’ అన్నది అందరికీ తెలుసు. కానీ ఆచరించే వారు అరుదు. అలాంటి అరుదైనవాడు దుర్భభ వర్ధనుడు. ఆవేశం తగ్గిన దుర్భభ వర్ధనుడి ఆలోచనల ద్వారా కల్హణుడు భారతీయ తత్త్వాన్ని, ఆ తత్త్వాన్ని అర్థం చేసుకున్నవాడు ఆవేశాన్ని అణచుకుని, శాంతంగా ప్రవర్తించటాన్ని, ఆవేశాన్ని అణచుకోవటం అసలైన వైరాగ్యం అని ప్రదర్శిస్తాడు. ఇలాంటి ఆలోచనలు ఒక్క భారతీయ ధర్మంలోనే సాధ్యం. ప్రపంచంలో కామాన్ని అణుచుకోవాలని ప్రయత్నించినవారున్నారు. లోభాన్ని అణచుకోవాలని ప్రయత్నించినవారున్నారు. కానీ కామం, లోభం కన్నా తీవ్రమైన నష్టం జరిపే క్రోధాన్ని అణచాలని, శాంతి సాధించాలని ప్రయత్నించింది ఒక్క భారతీయ ధర్మమే!

దుర్లభ వర్ధనుడు తన ఆవేశాన్ని, ఆవేశం రావటానికి కారణాన్ని, ఆవేశ స్వరూపాన్ని, ఫలితాన్ని విశ్లేషించిన తీరు, తర్కం, ఒక్క భారతీయ ధర్మంలోనే సాధ్యం! ఈ రకమైన తర్కబద్ధమైన ఆలోచనా విధానాన్ని బాల్యం నుంచీ నేర్పితే సగం ప్రజలలోనైనా ఆవేశాన్ని అణచుకునే పద్ధతి గురించి పరిజ్ఞానం వస్తుంది. హింస తగ్గుతుంది. ఆత్మహత్యలు తగ్గుతాయి. నేరాలు ఘోరాలు తగ్గుతాయి. ఎందుకంటే అనేక అనర్థాలు జరిగేది క్షణికావేశం వల్లనే. ‘ఇలాంటి ఆలోచన రహితులై, భౌతిక సుఖలాలస పరులైన వివేక శూన్యులు, మనుషులను అధోగతికి తీసుకువెళ్తారు’.

ఒక్క వాక్యంలో సర్వం విశదం చేశాడు కల్హణుడు. భౌతికమైన దేదైనా క్షణికమే. ప్రతి భౌతిక చర్యకూ ఫలితం ఉంటుంది. మంచిదయితే మంచి ఫలితం, చెడుదయితే చెడ్డ ఫలితం. ‘లైంగిక చర్య’ భౌతిక చర్య. లైంగిక ప్రచోదన అత్యంత శక్తివంతమైనది. అది భగవంతుడి ‘సిసృక్ష’, సృష్టించాలన్న కోరికకు జీవి మనస్సులో ప్రతిధ్వని వంటింది. అందుకే లైంగిక కోరిక భౌతికమైనదైనా అత్యంత శక్తివంతమైనది. జీవి స్వభావాన్ని తిరుగులేని రీతిలో ప్రభావితం చేయగలిగినది. అందుకే లైంగిక చర్యను అత్యంత పవిత్రమైన చర్యగా భావించటం. సృష్టిని కొనసాగించటమనే పవిత్ర జీవి కర్తవ్య నిర్వహణకు దోహదపడుతుందీ చర్య. అయితే సృష్టిలో ధర్మం అనేది ఒకటుంది. ధర్మాన్ని వెన్నంటే అధర్మం ఉంది. ధర్మబధ్దమైనది ఏదైనా మంచికి దారి తీస్తుంది. అధర్మమైనది ఏదైనా నష్టం కలుగజేస్తుంది. కాబట్టి లైంగికంలో కూడా ధర్మం, అధర్మం అన్నవి ఉంటాయి. ధర్మబద్ధమైన లైంగిక చర్య ఆమోదయోగ్యం. అధర్మమైంది అనర్థదాయకం. జీవికి కర్తవ్యం లాంటిదాన్ని ధర్మం, అధర్మంగా నిర్ణయించటం ఎలాగ? పూర్వీకులు, విజ్ఞులు, శాస్త్రాల ఆధారంగా ధర్మబద్ధమైన చర్యను నిర్ణయించవచ్చు. భారతీయ ధర్మంలో వివాహ వ్యవస్థ అందుకే అంత ప్రాధాన్యం వహిస్తుంది. సమాజానికి వెన్నెముక లాంటిది. ఆరోగ్యకరమైన వివాహ వ్యవస్థ ఆరోగ్యకరమైన సమాజానికి నిదర్శనం. వివాహ వ్యవస్థ పరిధిలోని ‘లైంగికం’ ధర్మబద్ధమైనది. అందుకే శివుడు తనలో అధర్మమైన కామవికారం కలిగించిన మన్మథుడిని భస్మం చేశాడు. ఎందుకంటే, కామాన్ని ఎవరూ జయించలేదు.   ధర్మం అన్న ఆలోచన ఉన్నవారు తమలో చెలరేగే అధర్మకారకమయిన కోరికలను అణచుకుంటారు. ఆ శక్తిని ధర్మబద్ధమైన కార్యాల వైపు మళ్ళిస్తారు. ఈ ఆలోచన లేక క్షణికావేశాలకు లొంగేవారు వివేకశూన్యులు. భౌతిక సుఖ లాలసకు లొంగేవారు. అందుకే కల్హణుడు ఈ పదాలు వాడేడు. దుర్లభ వర్ధనుడిలో ఇలాంటి ఆలోచనలు కలిగేయని సూచించాడు. అధర్మం పతనానికి దారి తీస్తుంది. ఇకపై దుర్లభ వర్ధనుడి ఆలోచనలు అద్భుతమైన తర్కంతో సాగుతాయి.

భౌతిక సుఖ లాలస అంటే ఇంద్రియాల ప్రలోభాలకు లొంగిపోవటం. ఇంద్రియాలు మనిషిని తప్పు దారి పట్టిస్తాయి. మనిషికి ప్రపంచ జ్ఞానాన్ని ఇంద్రియాలే ఇస్తాయి. కానీ ఇంద్రియ జ్ఞానం అసంపూర్ణం. అసత్యం. కాబట్టి ఇంద్రియాల ద్వారా అందే జ్ఞానాన్ని దాటి తెలుసుకునేదే అసలైన జ్ఞానం. ఇంద్రియాల ప్రలోభానికి లొంగినవాడు కూడా అసత్య జ్ఞానాన్ని అందించే ఇంద్రియం లాంటి వాడే. ‘నామేంద్రియార్థో యమింద్రియార్థా’. అలాంటి ‘అసత్యం’ అయిన వాడి మీద కోపం తెచ్చుకుని లాభం ఏమిటి? పాపం, అజ్ఞానంలో, అసత్యంలో ఉన్నవాడిని చూసి జాలిపడాలి కానీ కోపగించుకుంటామా? తనపై తనకు నియంత్రణ ఉన్న జ్ఞాని,  అజ్ఞానులను చూసి జాలిపడతాడు. కోపగించుకోడు. కోపగించుకుంటే వాడు సంపూర్ణ జ్ఞాని కాడు. అజ్ఞాని అవుతాడు. కాబట్టి ఇంద్రియ ప్రలోభానికి లొంగిన వాడిని చూసి, ఇంద్రియాలపై నియంత్రణ ఉన్నవాడు జాలి పడాలి. ఇంద్రియాలకు లొంగేవారు సామాన్యులు. నియంత్రణ కలవారు అసామాన్యులు. అలాంటి అసామాన్యులు సామాన్యులపై కోపం తెచ్చుకుంటే వారూ సామాన్యులయిపోతారు. కాబట్టి క్షణిక ఆవేశానికి లొంగిపోకూడదు. ‘సర్వసామాన్యా విశినామత్ర కామ్రేధః’. ఇలాంటి నియంత్రణ లేని వారిని నియంత్రించాలని ప్రయత్నించి కూడా లాభం లేదు. ‘నియంత్రణేన కింవా సాధ్యస్తతాం స్మరణోచితమ్’.

ఒకే వస్తువు కోసం రెండు కుక్కలు పోరాడుకున్నట్టు, ఒకే గౌరవం కోసం ఇద్దరు మానధనులు పోరాడుకుంటే, ఇక వారి గౌరవం ఏముంది? తన స్త్రీ పరాయివాడితో సుఖించటం అన్న ఆలోచన  అసూయాగ్నిని రగిలిస్తుంది. అనుమానం పెనుభూతం. అది అనర్థానికి దారితీస్తుంది. ఇక్కడ కల్హణుడు తెచ్చిన పోలిక అద్భుతం. ఒకే వస్తువు కోసం రెండు కుక్కలు పోరాడుకున్నట్టు…. ఇంద్రియ ప్రలోభానికి లొంగిన మరుక్షణం మనిషి పశువు అవుతాడు. మంచి చెడు మరుస్తాడు. వావి వరుస విస్మరిస్తాడు. ఉచితానుచితాలు విస్మరిస్తాడు. వెరసి పశుప్రాయమవుతాడు. అలాంటి వాడి కోసం పోరాడేవారు పశువు కన్నా హీనులు అవుతారు. పశువులకు విచక్షణ ఉండదు. విచక్షణా రహితమైన దాని కోసం విచక్షణ వదిలి పోరాడేవారు విజ్ఞులవుతారా? ఇంద్రుడితో సంభోగించిన అహల్యను గౌతముడు వదిలిపెట్టలేదు. భౌతిక సుఖలాలసలోని వ్యర్ధత్వాన్ని  గ్రహించిన తరువాత ఆమెను స్వీకరించాడు [కస్తూరి మురళీకృష్ణ రచించిన కథ  ప్రేమ పరమార్థం (పేజీ 11-18), ప్రేమ కథామాలిక]. ఇది భారతీయ ధర్మం. మిగతాదంతా వికృతి. అసూయ హత్యలు, ఆత్మహత్యలు, యాసిడ్‌లు పోయటాలూ, నిప్పుల్లో కాల్చటాలు… కాలక్రమేణా భారతీయ మనస్తత్వంలో వచ్చి కలిసిన దుర్గంధ భూయిష్టమైన మలినాల ఫలితాలు.

కాబట్టి తాను విచక్షణ కోల్పోకూడదని నిశ్చయించుకున్నాడు దుర్లభ వర్ధనుడు. తాను వారి స్థాయికి దిగజారకూడదనుకున్నాడు. అంతే కాదు, ఆధునిక ఫెమినిస్టులు, విచ్చలవిడి వికృతవాదులు దేన్నయితే అంటూ భారతీయ ధర్మాన్ని దూషిస్తున్నారో, అదే విషయాన్ని అత్యంత నాగరికంగా, ధార్మికంగా, సున్నితంగా వ్యక్తపరిచాడు కల్హణుడు. భారతీయ ధర్మంపై ఆధునికులు బురద చల్లటం వారి అజ్ఞానం తప్ప గొప్పతనం కాదని స్పష్టం చేశాడు. ‘మమకారో మృగాక్షీషు క్వ ఇవాయం సచేతసామ్’. విచక్షణ కలవారు మహిళ శరీరాన్ని స్వంత ఆస్తిలా భావించరు. అంటే మహిళను స్వంత ఆస్తిలా భావించకూడదన్న మాట. ఎందుకని? దానికి సమాధానం ఇచ్చాడు కల్హణుడు.

‘స్వదేహోనుపపన్నోపి యః సోన్యత్ర కథం మథః’.

తన స్వదేహం పైనే యజమాని కాలేనివాడు ఇతరుల శరీరం తన స్వంత ఆస్తిలా భావించటం భావ్యం కాదు. ఈ తర్కానికి తిరుగు లేదు. వ్యక్తికి తన శరీరంపైనే నియంత్రణ లేదు. తన శరీరం బాహ్యంగా,  చెందే    మార్పులపై వ్యక్తికి ఎలాంటి నియంత్రణ లేదు. ఊపిరి కదలడంపై నియంత్రణ లేదు. గుండె కొట్టుకోవడంపై పట్టు లేదు. అలోచనలు ఆపలేడు. వయసును అనుసరించి శరెరంలో వ్చ్చే మార్పులను నియంత్రించలేడు.  అలాంటిది మరొకరిని నియంత్రించాలని అనుకోవటం, వారు తన ఆస్తిగా భావించటంలో అర్థం ఉందా? ఇలాంటి ఆలోచన ఒక్క భారతీయ ధర్మంలోనే సాధ్యం. కాబట్టి వ్యక్తిని తనవారని, తన హక్కు అనీ అనుకోవటం మూర్ఖత్వం. వ్యక్తిని మాత్రమే కాదు,   ఏదయినా, ‘నాది’ అనుకోవటం మూర్ఖత్వం.

ఆమెపై అసూయతో ఆమెను చంపాలనుకునే ముందు ఆమె తనకు అందించిన ప్రేమను విస్మరించకూడదు. ప్రేమ వృక్షం తన వేర్లను భూమి లోని ఏడు లోకాల వరకూ పంపుతుంది. అసూయను తొలగించకుండా ప్రేమ భావనను వేర్లతో పెకిలించి వేయటం కుదరదు. ఎవరయితే ద్వేషమనే భావనను క్షణంలో నశింపజేసుకుంటారో  ఇక వారిలోని ప్రేమ భావనలోని అనురాగం కూడా నశిస్తుంది. విచక్షణతో ద్వేషాన్ని నశింపచేయాలి. అసూయను అణచివేయాలి. అప్పుడు ప్రేమ భావన కూడా నశిస్తుంది. ‘నాది’ అనుకుంటే అనురాగం కలుగుతుంది. ‘నాది’ అనుకోకపోతే వైరాగ్యం కలుగుతుంది. విరాగి అవుతాడు మనిషి. మోహం నశిస్తుంది. క్రోధం నశిస్తుంది. విచక్షణ జాగృతమవుతుంది. ‘ఈర్ష్యా జేయా తతో రాగః స్వయమాశాః పలాయతే’. ఈ ఆలోచనతో దుర్లభ వర్ధనుడిలో అన్ని రాగ భావనలు నశించాయి.

అప్పుడు అతడు రాణి పక్కనే ఆదమరిచి నిద్రిస్తున్న మంత్రి ఖంఖుడి దుస్తులపై ‘చంపాల్సినవాడిని చంపకుండా వదులుతున్నాను’ అని రాసి పెట్టి వెళ్ళిపోయాడు దుర్లభ వర్ధనుడు. ఇక అతడు రాణి గురించి, రాజ్యం గురించి ఆలోచించలేదు. ఇంతలో రాజు బాలాదిత్యుడు మరణించాడు. బాలాదిత్యుడికి వారసుడు లేకపోవటంతో గోనంద వంశం అంతరించింది. దాంతో రాజ్యంపై పలువురు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఖంఖుడికి దుర్లభ వర్ధనుడు తనని క్షమించి వదలటంతో జ్ఞానోదయమయింది. దుర్లభ వర్ధనుడిపై విశ్వాసం కలిగింది. అతడు మళ్ళీ అనంగలేఖ వైపు కన్నెత్తి చూడలేదు. బాలాదిత్యుడు మరణించగానే రాజ్యం అల్లకల్లోలం కాకుండా, అనర్హుల దృష్టి కశ్మీర సింహాసనంపై పడకుండా ఖంఖుడు దుర్లభ వర్ధనుడిని రాజును చేశాడు. ఇలా కశ్మీరంపై గోనంద వంశం పాలన అంతరించి, కర్కోటనాగు వంశ పాలన ఆరంభమయింది.

దీనితో మూడవ తరంగం పూర్తవుతుంది.

అనంగలేఖ సైతం తన పొరపాటును గ్రహించి సత్ప్రవర్తనను అవలంబిస్తుంది. ధర్మబద్ధమైన నడవడితో ఆమె ఆధ్యాత్మికత వైపు తన మనస్సును మళ్ళించుకుంది. దుర్లభ వర్ధనుడు ధర్మబద్ధంగా రాజ్యం చేశాడు. 36 ఏళ్ళ పాలన తరువాత దుర్లభ వర్ధనుడు మరణించాడు. అతని తరువాత అతనికి అనంగలేఖకు జన్మించిన దుర్లభకుడు రాజ్యానికి వచ్చాడు.

ఇక్కడ ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తే, దుర్లభ వర్ధనుడు క్షణికావేశానికి లొంగిపోయి ఉంటే? అన్న ఆలోచన వస్తుంది. పశువులాంటి వాడిని మనిషిగా చేసే మానవ నిర్మాణం భారతీయ ధర్మ లక్ష్యం అన్నది దుర్లభ వర్ధనుడి జీవితం స్పష్టం చేస్తుంది [పిలకా గణపతి శాస్త్రి గారు ఈ ఉదంతం ఆధారంగా అనంగలేఖఅన్న అద్భుతమైన కథ రాశారు. ఈ కథ ప్రాచీన గాథాలహరిలో ఉంది.].

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here