[dropcap]నీ[/dropcap]ప్రేమయె నాకెపుడూ అవ్యాజము సహోదరా!
నీవుండగ లేదెపుడూ ఏలోపము సహోదరా!
అమ్మకడుపు పంచుకొనియు తోబుట్టువులైనాములె
నీవుచూపు మమతన్నది మాధుర్యము సహోదరా!
పుట్టింటికి దూరమైన లోటెపుడూ లేదులెమ్ము
నీమనసున జాలువారు వాత్సల్యము సహోదరా!
చిన్ననాట ఆడుకొనిన జ్ఞాపకాలు మృదుమధురము
పంచుకొనుటకానాడే ఆరంభము సహోదరా!
కంటనీరు రానీయక చేయిపట్టి నడిపినావు
ఆబలమే నాకునిచ్చె చైతన్యము సహోదరా!
ఏకీడూ చేరకుండ కట్టుచుంటి ఈ’రక్ష’ను
‘రాఖీ’యే మనబంధపు ప్రతిరూపము సహోదరా!
పొంగిపొరలునాత్మీయత కంటినుండి ఏకధార
‘మణి’గవెలుగు నీహృదయపు అనురాగము సహోదరా!!