మా బాల కథలు-11

0
4

[dropcap]బా[/dropcap]ల అందమైన ఏడేళ్ళ పాప. అందమైనదే కాదు, తెలివైనది కూడా. వయస్సు రీత్యా కొంత అమాయకత్వమూ ఉంది. అన్నీ తనకు తెలుసుననుకుంటుంది. అంతే కాదు, అన్నిటి లోనూ తల దూర్చి అందరికీ సలహాలు కూడా ఇస్తుంది. ఆ బాల చేసిన పనుల్లో కొన్ని కథల్లాగా చెప్పచ్చు. అందులో ఇది ఒకటి.

బాల – తోడు పెళ్ళికూతురు

బాల చిన్న నాయనమ్మ కూతురు పెళ్ళి. వాళ్ళింటిలో చిన్నపిల్లలు లేక బాలనే తోడు పెళ్ళికూతురిని చేస్తామని ఆ రోజు స్కూల్‌కి పంపద్దని, ముందు రోజు రాత్రే రావాలని చెప్పారు.

బాలని మీరు తట్టుకోవటం కష్టమని, పెళ్ళి సమయానికి వస్తామని, వేరే ఎవరినైనా కూర్చో పెట్టమని అంది అమ్మ. “అది ఇoట్లోనే ఎవరి పుట్టిన రోజైనా వస్తేనే వాళ్ళతో పాటు నాకూ కొనాలని అడుగుతుంది” అంది.

“అదేమడుగుతుందే సోద్యం కాబోతే. చిన్నపిల్లలు బట్టలంటే సరదా పడతారు కాబట్టి వేరేవాళ్ళ పుట్టిన రోజుకు కూడా కావాలంటారు. ఇప్పుడా సమస్య ఏముంది? బట్టలెలాగూ కొన్నాను అదీ పట్టు లంగానే. ఇంకెందుకు గొడవ చేస్తుంది. ఊరికే వంకలు చెప్పక తీసుకురా. ఇంటిలో పిల్ల నొదిలేసి ఎవరినో ఎలా కూర్చోబెడతాం” అంది మ౦దలిస్తూ చిన్ననాన్నమ్మ.

బాలతో భయమే అయినా చిన్నత్తగారు కోపగించుకు౦టారని కొంత, బాల మొహములో పట్టు లంగా అనగానే కనబడిన ఆనందం కొంత, తన పిల్లను తనే అల్లరిది అనుకుంటే ఎలా అని కొంత – అమ్మ సరేనంది.

పొద్దున్నే పెళ్ళికూతురిని చేస్తారు కాబట్టి రాత్రే రమ్మని చెప్పారు ఆడవాళ్ళను.

“నాన్నమ్మ తోడు పెళ్ళికూతురు అ౦టే ఏమిటి?” అడిగింది

“పెళ్ళికూతురుకు తోడుగా కూర్చోబెడతారు. పెళ్లి కూతురుతో పాటు నీకూ అన్నీ  చేస్తారు పారాణి పెట్టటం, గోరింటాకు పెట్టటం కొత్త బట్టలు పెట్టటం” అంది నాయనమ్మ.

బాల, అమ్మ,నాయనమ్మ బయలుదేరి రాతే వెళ్ళారు. బాల ఆనందం చెప్పనలవి కాదు.

పెట్టబోయే లంగా ఏ రంగో తెలియదు కాబట్టి ఇంటిలో గాజులకి జతగా మరో మూడు లేని రంగులు కొనిపించుకుంది.

అలాగే సైడ్ క్లిప్పులు రాళ్ళవి కొనిపించుకంది.

రాత్రి నాయనమ్మ, బాల, అమ్మ బయలుదేరి వెళ్ళారు. పిన్ని, వాళ్ళూ ఊరు వెళ్లారు. రేపు రాత్రి పెళ్ళి సమయానికి వస్తామన్నారు.

త్వరగా వచ్చి తయారు అయి వెళ్దామని నాన్న ఇంటి కొచ్చేసరికి బాల, అమ్మ ఇంటిలోనే కనబడటం చూసి ఆశ్చర్యపోయాడు.

“ఏమి వెళ్ళలేదా” అడిగాడు.

“వెళ్ళటం రావటం అన్నీ అయ్యాయి” అంది ఎప్పుడూ చిరాకు పడనీ శాంత చిరాకుగా.

“పెళ్ళి రాత్రి కద మరి” అన్నాడు.

“పెళ్ళి నా మొహానికి. అదీ మీ కూతురితో” అంది ఇంకా చికాగ్గా.

“ఏమయ్యింది?” అన్నాడు.

“ఏమవుతుంది? అక్కడ అన్నీ పెళ్ళికూతురుతో సమ౦గా కావాలని గొడవ”

“కొన్నామన్నారుగా పట్టు లంగా. నువ్వు కూడా ఇంకో కొత్త గౌన్ కొన్నావుగా?”

“అమ్మగారికి అలా సరిపోదుగా! ఆ అమ్మాయితో సమంగా తనకీ నగలు కావాలని గొడవ”

“నీవి వెయ్యలేక పోయావా పోనీ?”

“అదీ అయ్యింది. కానీ అవి వద్దట.. పెళ్ళికూతురులాగా పాపిడి సరాలు, పొడుగు హారం కావాలని పేచీ”

“మరి నాన్నమ్మ పెళ్ళికూతురుతో పాటు నాకూ అన్నీ చేస్తారని చెప్పిందిగా” అంది బాల.

భార్యతో, “అందుకని ఇంటికోచ్చేసారా? సరే వెళ్ళేటప్పుడు అవి ప్రస్తుతం ఇమిటేషన్‌వి కొని పెట్టి వెళదాములే” అన్నాడు ఇంగ్లీష్‌లో.

“అయ్యో. ఆ పని అత్తయ్య గారే చేసారు. ఇప్పుడు పేచీ అడిగాదు”

“మరి ఇ౦కేమి కావాలిరా చెప్పు. కొనుక్కుని పెళ్ళికెళదాం” అన్నాడు అప్పటికే చంక ఎక్కిన బాలతో.

“ఇదుగో ఈ గారం తోనే అది అలా తయారవుతోంది. ఇంతకీ సమస్య వేరే” అంది.

“ఇంతకీ ఏమదిగిందో చెప్పు” అన్నాడు చిరాగ్గా.

“పెళ్ళికూతురిని చేసేసాక, పెద్దావిడ కదా అని అత్తయ్యగారికి పెళ్ళి కూతురు నగలతో పాటు మెట్టెలు, మంగళ సూత్రాలూ కూడా చూపించారు. నాన్నమ్మ దగ్గర ఉన్న బాల కూడా అవి చూసింది. అప్పటినుంచి తనకి అలాటివి కావాలని గొడవ. అందరూ ఎంత చెప్పినా వినలేదు. ఆ గోల, ఏడుపు పెళ్ళింటిలో ఎందుకని బాలని తీసుకుని వచేసాను” అంది కోపముగా.

“మరి పెళ్ళికి రావా?” అడిగాడు నవ్వు బిగపట్టుకుని బాల చూడకుండా జాగ్రత్త పడుతూ నాన్న..

“శాంత కాదు. నువ్వు రావటం లేదు పెళ్ళికి.. దాన్ని పెట్టుకుని నువ్వు ఇంటిలో ఉండు. మేము పెళ్ళికెల్తాము. నీ కూతురిని సముదాయి౦చ గలను అనుకుంటే రా.. లేకుంటే ఇద్దరూ ఇంటిలో ఉండండి.” అంది శాంత ఇంకా రాలేదని అప్పుడే ఇంటికొచ్చిన నాయనమ్మ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here