[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షికలో రచయితలు తమ రచనల వివరాలు, తామెందుకు రచనలు చేస్తున్నారు, తమ లక్ష్యం ఏమిటి వంటి విషయాలను వివరిస్తూ తమని తాము పరిచయం చేసుకుంటారు. [/box]
మహాలక్ష్మి కోట
[dropcap]న[/dropcap]మస్కారం.. నా పేరు మహాలక్ష్మి కోట.
సాహిత్య కృషి:
చిన్నప్పటి నుండి తెలుగు భాష అన్నా, పద్యాలు అన్నా చాలా ఇష్టం కారణం మా మేనత్త తెలుగు టీచర్. ఆవిడ వినసొంపుగా పాడే పద్యాలు, తెలుగు చెప్పే రీతి అంటే ఇష్టం వల్ల తెలుగుపై మక్కువ ఏర్పడింది. నాకు చిన్నప్పటి నుండి కథలు చదవడం, అవి ఇంకొకరికి చెప్పడం అంటే ఇంకా ఇష్టం. ఆ ఇష్టంతోనే 6వ తరగతిలోనే డైరీలో కథలు రాసుకుంటూ వచ్చాను.
ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా ఉండాలి అనేది ఎంత నిజమో ఒక రచయిత నిత్య పాఠకుడిగా ఉండాలి అనేది అంతే నిజం.
అందుకే బాషా భేదం లేకుండా, సరిగ్గా అర్థం కాకపోయినా ఇంగ్లీష్, హిందీ భాషా కథలు కూడా చదువుతూ నా అవగాహనను పెంచుకుంటున్నాను.
విజయాలు:
విజయాలు అంటే పెద్దగా ఏమీ లేవు.
- ప్రతిలిపి అనే ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లో ఒక కథల పోటీలో తృతీయ బహుమతి వచ్చింది. ప్రతిలిపిలో 5,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు.
- సహరి ఆన్లైన్ మాగజైన్‌లో హాస్య కథల పోటీకి ద్వితీయ బహుమతి వచ్చింది.
- సంక్రాంతి కథల పోటీలో సహరిలో సాధారణ ప్రచురణకు నాది ఒక కథ గెలిచింది.
- మామ్స్‌ప్రెస్సో, కహనియా, స్టోరీ మిర్రర్, సుకుత, తపస్వి మనోహరం,….లాంటి ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్‌లలో చాలా కథలు రాశాను. చాలా ప్రశంసా పత్రాలు వచ్చాయి.
చాలా ప్రింట్ మీడియా వాళ్ళకి కథలు పంపాను. ఇంకా సెలక్షన్ ప్రాసెస్‌లో ఉన్నాయి అవి.
సాహిత్యంపై నా ఉద్దేశం:
సాహిత్యం గురించి చెప్పే అంత పెద్ద దాన్ని కాదు నేను. నాకు ఆ అనుభవం కూడా లేదు. కానీ నాకంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి అంతే.
సాహిత్యం అంటే నా దృష్టిలో సమాజాన్ని మేల్కొలిపే సాధనం. సాహిత్యం దేశ సంస్కృతిని పెంపొందిస్తుంది. సాహిత్యం అనేది గతిశీలత కలిగింది. కాలాన్ని బట్టి అది కొత్త పుంకలు తొక్కుతుంది. సాహిత్యం అంటే కథలు, కవితలు, వ్యాసాలు మాత్రమే కాదు, చేసే పనుల ద్వారా ఎదుటి వారిలో రస (నవరసాలు) స్పూర్తిని కల్గించేది ఏదైనా సాహిత్యమే అని నా అభిప్రాయం.
పూర్వకాలంలో దేశ, కాల గతులు వివరాలు ఈ సాహిత్యం ద్వారానే ప్రజలకి చేరేవి. అప్పట్లో సాహిత్యం ప్రజల వద్దకు చేరడానికి సమయం పట్టేది. కాని, నేడు సోషల్ నెట్వర్కింగ్ పుణ్యమా అని అందరినీ చేరుతుంది ఈ సాహిత్యం.