[dropcap]కు[/dropcap]నుకు దుప్పటి
పూల రెక్కల పుప్పొడి ధూళిని
కను రెప్పల ఉషోదయాల
వెలుగు దారుల
కాలి నడకలకు జల్లి
చెట్టు గూటి గుడ్లింకా
నోటి ముక్కులు సవరించక ముందే
చెట్ట పట్టాలేసుకుని
బయలు దేరు తుంటాం.
మేం చుట్టు పక్కల వాళ్ళం.
ఇక్కడ ఇళ్ళు కట్టుకున్నప్పటి నుంచీ
ఆప్త నేస్తాలం అయిపోయాం.
రెండు మూడు చుట్లు తిరిగి
ఆటల మైదానం అవతలి గట్టుకు
వెళ్ళి కుదురు కుంటాం.
మేం కట్టుకున్న పాత నూలుచీర కొంగు చివరను గుత్తంగా చేర్చి
పట్టి బుగ్గ మీది కంటి చుక్కను మెత్తగ అద్దేందుకు వీలుగ కరవస్త్రంగా ఉపయోగిస్తాం.
ఆ పెద్దాయన రాలేదని
అడిగి తెలుసుకుంటాం.
అటు ఇటు వినికిడిగా
అనారోగ్యం వార్తకు చింతిలుతూ
కుశలంగా చూడాలని
మనసారా కోరుకుంటాం.
బిగుతు దుస్తుల యోగ
భంగిమల అమ్మాయి
సైజు జీరో వ్యాయోగానికి
బిర బిర వస్తుంటే
ముందు వెనుకల బరువును
బేరీజు వేస్తూ,
జతకట్టి వస్తున్న మోరకుల చేష్టలకు,
వదులుతున్న మా నిట్టూర్పుల ఆవిరికి
అడ్డం కట్టుకున్న ముఖ కవచం
మరక కట్టి మిగిలి పోతుంది.
నిన్న రాతిరి
నిశీధి నక్షత్రాల నిమిత్తంలో
జులాయి తీరుల వ్యసనాలలో
ఖాళీ సీసాలు గాలికి చెదిరే పొట్లాలకు,
వేకువ విధులకు తప్పక
గరిక చీపురు పట్టి వీధులూడ్చే గరిత
దూల తీరే తిట్లతో దీవెనె లిస్తుంటే,
అమ్మ చేత కసవు నెత్తించే
ఆకతాయి తీరులకు
తీర్పు నొక్కటి చెప్పలేక,
బొడ్డుకు చెక్కుకున్న చిల్లర రొక్కం
తీసి ఇచ్చి ఉస్సురంటూ,
ఊరడించు కుంటాం.
మా ఇంటి గుట్టు మట్టులు
రచ్చ చేయక గొంతులు తగ్గించి
పెద్దరికం నిలుపు కుంటాం
అసలు నిజం చెప్పాలంటే
ఉదయం నడకలకు కాదు
మేం కలిసేది
హృదయం విప్పు కోడానికి,
మ స్నేహానికి నిలకడగా
మనసు పంచుకోడానికి,
కొత్త లే అవుట్
విస్తరణల నిర్మాణ పథకంలో
గొప్పగ కట్టిన ఫంక్షన్ హాలుకు
బారు తీరిన వాహనాల
ఇరుకు సందు పక్కన పేరున్న బడిలో
చదువుల పోటీలకు నాటువేసే
బ్రతుకు బొమ్మల
అట్టహాసపు ప్రచారాలకు
పక్కకు తొలగి చోటిస్తూ
ఇంటికి చేరిన మాకు
సామాజిక శాస్త్ర మేదో చదివి నట్టుంటుంది.
పుటల చివర అభ్యాసానికి
ఖాళీ పూరించని ముచ్చటల
రట్టు చేయని పదమేదో రేపటికి మిగిలిపోతుంటుంది.