అగ్రహారం అరుగు

0
3

[dropcap]ఆ[/dropcap] అగ్రహారం అరుగు ఓ చర్చల వేదిక. “మొత్తానికి బ్రాహ్మణ్యం గట్టెక్కింది” – అని సంతోష ప్రకటన చేశాడు యాజులు ఆ అరుగు మీద.

అక్కడ ఓ గంట నించీ “బ్రాహ్మణ్యం ఎక్కడ ఉండేది –  ఎక్కడికి చేరింది?” విషయం మీద చర్చలు దొర్లి తెర్లాయి.

శ్రీనివాసశాస్త్రి ఓ పిట్ట కథ చెప్పాడు – శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ఓ కథ నించి. చెరువు గట్టున స్పృహ తప్పి పడి ఉన్న ఓ సుభద్ర ముఖం పై నీళ్లు చల్లి తెలివి తెప్పించారు చుట్టూ ఉన్న వాళ్లు. ఒకడు ఆమె నోట్లో నీరు పోయబోతే శాస్త్రం తెలిసిన బాపడొకడు చెంబు లాగేశాడు – “బయటికి వెళ్లిన మనిషి స్నానం చెయ్యకుండా మంచి నీళ్లు పుచ్చుకంటుందట్రా?” అంటూ.

అదీ! “అక్కడ ఉండేది నిన్న గాక మొన్న మన బ్రాహ్మణ్యం. ఇప్పుడు ఆఫీసునించి వచ్చిన ఆడది మంచి నీళ్లు, కాఫీ తాగట్లా?” అని శాస్త్రి ముగించాడు. “ఆఫీసు ఆడవాళ్లలో బాపన ఆడాళ్ళే ఫస్టు” అన్నాడు కొసరుగా, ఏదో పెద్ద లెక్చర్‌కి నాందిగా. ‘బ్రాహ్మణ్యం – ఆధునికతా’ అతని సబ్జెక్టు.

“ఒకప్పుడు ఓడ ఎక్కి సముద్రం దాటడం మనకి నిషిద్ధం… అలాగే విమానం ఎక్కి దేశం దాటడం కూడా… ఇప్పుడు ఆకాశాలూ, సముద్రాలు దాటి మన పిల్లకాయలు అక్కడి పనులు చెక్కబెట్టడం లేదూ?” అని వర్తమానాన్ని సోంభట్ల రాంబాబు గుర్తు చేశాడు శాస్త్రికి మద్దతుగా. రాంబాబు ఇంటికి ఆనుకుని ఉన్న తన ఇల్లు కూలిపోతుంటే అతడికే అమ్మాడు శాస్త్రి. ఆ గుడ్ విల్ శాస్త్రి మీద లేకపోలేదు రాంబాబుకి.

“అవును మరి… నలుగురితో బాటు నారాయణ అంటున్నాం మనమూను. పూర్వం ఉద్ధరిణితో ఒంటిరిగా మిగిలాం. ఎవరైనా జంట కలవబోతే తేరపారి చూసి అసుంటా అంటూ ఒంటిగా అఘోరించాం కదా!” అన్నాడు సోంభట్ల.

బులుసు రాము “ఇప్పుడు కాలేజీ, ఆ పై చదువులతో నలుగురి మధ్యకి వచ్చాం” అన్నాడు. “అంత మాత్రాన బ్రాహ్మణ్యం ఒదిలేశామా… అంటూ సొంటూ వదిలేశామా అదీ లేదు… ఇదీ లేదు. ఏమీ మారలేదు” అన్నాడు సొంఠి వారి కిట్టు.

“ఆ అంటూ సొంటూ ఎప్పుడో ఆవల పెట్టాం. ఎలా కుదురుతుంది.” అవునంటున్నాడో, కాదంటున్నాడో తెలియకుండా అన్నాడు పైగా.

“వేదాన్ని పెరటి విత్తు చేశాం. కంఠతా పట్టినాం గాని అర్థాలు… అబ్బే” అని నిజం ఒప్పుకోమన్నట్టు బులుసు కళ్లల్లోకి చూశాడు సొంఠి.

“మడి బట్ట వదిలేశాం. చుట్టలకట్ట బోడ్లో దోపాం. కాని ఇంజనీరింగ్ చదువుల్లో మనమే ఫస్టు” అని జబ్బ చరిచాడు.
“ఇంజనీరింగ్ ఏమో కాని డాక్టరీ చదువు ఒంటబట్టలేదు” అని చెప్పాడు బులుసు.

అక్కడ విషయ జ్ఞానం కంటే, తర్కం కంటే, లోక జ్ఞానానందం ఎక్కువగా సాగుతోంది. చరిత్రకారుడో, విశ్లేషకుడో ఆ కబుర్లు వింటే పెద్ద ఉద్గ్రంథమే అవుతుంది. అక్కడ అందరు కుర్రాళ్లు ఎక్కణ్ణించి ఒచ్చారో  తెలియనివాళ్లు; కన్యాశుల్కం అని ఓ నాటకం, అరికాలి కింద మంటలు వంటి కథలు ఉన్నాయని తెలియని వాళ్లు ఆ కబుర్లలోకి ఎలా జొరబడాలో తెలియక గుడ్లప్పగించి చూస్తున్నారు. సహనం లేని ముగ్గురు చెట్టు కింద టీ వాలా దగ్గర చేరారు. సిగరెట్లు బాకీ తీర్చకుండా ఎలా వస్తాయో అని ఓ ఇద్దరు ఆలోచిస్తున్నారు. ఇక్కడ అరుగు వేడెక్కుతోంది.

“వైద్యంలో కమ్మవారితో వెనక పడ్జాం.” అని నిట్టూరుస్తూ మద్దతు కోసం చుట్టూ కలియ చూశాడు శొంఠి. ఓ ఇద్దరు ఆ మాటను కళ్లతో ఒప్పుకున్నారు.

“అయ్యా పరంధాములు ఈ పూట తన కోసం చూడద్దన్నాడు. పని ఉందిట” అంటూ వచ్చాడు పంచాగ్నుల పంతులు.

“ఇక వాడికి ఈ అరుగు చాలా దూరమే రా, పాపం మోటార్ మీద ఇంత దూరం రయ్యని రావడం ఏం మాటలా? రియల్ ఎస్టేట్ ములిగిపోదూ? ” అంటూ ఎత్తి పొడిచాడు మళ్లీ!

అందరూ పెదిమ విరుపుతో తీర్పు ప్రకటించారు అక్కడ లేని అతగాడి మీద.

శ్రీనివాసశాస్త్రి మళ్లీ అందుకున్నాడు. “అప్పటి వేదం చదువుతో అబ్బింది లేదుగాని. సాటి మనుషులకు దూరం అయ్యాం. నేర్చుకోకపోవడమే జనానికి నేర్పాం. మతానికి కూడా మడికట్టాం” అన్నాడు దీర్ఘ ఉపన్యాసానికి గొంతు సవరించుకుంటూ. “వేదం పట్టుబడక ఇంగ్లీషు చదువులు రాక పురోహితుల సంఖ్యకి పెద్ద ముప్పే అఘోరించింది” పంచాగ్నుల వారు చర్చలో దూరుతూ ఓ ఉప్పు వదిలారు.

“ఒకటే వృత్తి. భోక్తం, చెప్పకు – ఒళ్లు మండిపోతోంది” అన్నాడు ఉద్యోగంలో మోక్షం ఉందనే ఓ వేతన శర్మ.

“మన బ్రాహ్మణ్యం వేరు కుంపటి పెట్టుకుంటే ఎలా ఉంటుంది. అహా… ఆ అవసరమైతే కనబడుతోంది. అంతా చదువులకి ఎగబడుతూ మనల్ని దూరం పెడుతున్నారు.” ఓ సలహా విసిరాడు శ్రీనివాసశాస్త్రి ముఖంలోకి చూస్తూ పంచగ్నులు.

“అద్గదీ… అప్పుడు గాని అటు కుక్షింభరత్వం, ఇటు ఆధిపత్యం భద్రంగా ఉండదు. అప్పుడు మనువు అదే చేశాడు. దానా దీనా ఇప్పుడు వేరు కుంపటి కావాల్సిందే. హిందూ కుంపట్లో అగ్రనిప్పు” ఆ సూచనలోని ప్రాసంగికతని కల్లూరి మెచ్చకొన్నాడు… నంటూరి ‘ఎట్లా’ అని అడిగాడు.

ఈ చర్చ ఇలా సాగుతుండగా అవధాని నడినయసు పంచెకట్టుకి బిగించిన కండువ విప్పి భుజంపై కప్పుకొని చల్లగా జారుకొన్నాడు. పక్క వీధి కొట్లో కొన్న నైన్టీని అక్కడి చెట్టు కింద గొంతులోకి జారవిడచి సీసా విసేరేసాడు. అది సర్రున దూసుకు పోతున్న బట్టల వ్యాపారి దూర్జటి స్కూటరు చక్రం తాకడికి ఇంతెత్తు ఎగిరింది. నైన్టీ కొట్టిన అవధానికి అప్పుడు గాని అంత దాకా సాగిన చర్చల ఘాటు దిగలేదు. చెట్టు చాటు సీసా సరసం నించి వస్తూనే మిగలి ఉన్న ఓ కిక్కు అగ్రహారం అరుగు దగ్గర దులపరించాడు – “బ్రాహ్మణ్యం ఎప్పుడూ బాగుంది. అప్పుడు… ఇప్పుడూ… ఆ” అని తలవిదిలించాడు.. “మరి దేముణ్ణి అప్పుడు జైల్లో పెట్టాం. ఇప్పుడు ఉద్యోగాలతో తీరికలేక ఇంట్లో ఓ మూల కూర్చో బెట్టాం. అదేరా మన మతం… అందుకోసం బ్రాహ్మణ్యం… సన్నాసి” అంటూ సొంఠి వీపు మీద చరిచాడు అవధాని. ఓ ఏడాది చిన్న… అదీ… లోకువ!

“అసలు శుభ్రంగా ఉన్న మనల్ని ఆ మనువుగాడు చెడగొట్టాడ్రా… ఒరే ఓ భక్తి… ఓ అధ్యాత్మికత లేకుండా ఆడు మన బేంబలకి వేదాలిచ్చి చుట్టూ అజ్ఞానం కంచె పెంచాడ్రా… ఇప్పుడెక్కడున్నాయిరా వేదాలు?” – అవధాని.

“లేవు. ఇప్పుడంతా భగవద్గీత…” సోంభట్ల.

“ఇంకా నయం… కల్లు గీత అన్నావుకాదు… గీత ఎప్పటిది… మతం ఎప్పటిదిరా?”

“మతం ఎప్పుడు లేదురా… అంతా వేదమే… అన్నీ అందులోనే.”

“మరి అదిప్పుడేదిరా?”

“అదేనర్రా నేననేది.. బేపన చేతిలో వేదం పెట్టి చుట్టూ అజ్ఞానం దడి కట్టాడు. ఎవర్నీ చదువుకోనిస్తేనే? అవ్వ”
తలోకరూ తలో మాట విసురుతూ ఉంటే చర్చ జోరందుకుంది.

“ఈళ్ల కెక్కేసిందిరా యాజులూ… పద… ఇప్పుడు అర్జంటుగా మనువుని దులపరించి మతాన్ని శుభ్రం చేయనిదే ఈళ్లతో కాదుగాని ఆ చెట్టు కిందకి పోదాం… బీడీ కట్ట తీసుకో…” అవధాని!

యాజులు అవధానికి గురు స్థానమిచ్చి “ఇదిగో గురూ” అటూ బీడీ అందించాడు. అగ్గిపుల్ల గీసి ముట్టించాడు. “గురు ఏంట్రా గురు, గురువుగారు అను” అని అవధాని కసురుకుని చటుక్కున ఏదో గుర్తొచ్చినట్లు “అవునొరే… మన భాష కూడా చంకనాకి పోతోందిరోయ్” అని మతమో, భాషో ఏది ముందు ఉద్ధరించాలో తేల్చుకోడానికి ఇంకో నైన్టీ దిశగా కదిలాడు. యాజులు కట్టలో మిగిలిన బీడీ. ఆనక్కి దాచుకోడంతోను జేబులో పెట్టుకుంటా ఆ వెనకే కదిలాడు. యాజులు కూడా నైన్టీ మప్పాలని అవధానికి ఉంది కాని ఎప్పుడు సరిపడా డబ్బులుండి చావడం లేదు. ఈ మధ్య ఈ కరోనాతో అందరూ ‘కోవిదు’లయిపోతూ కాసు పెద్ద తిరకాసై కుచుంది.

ఇక్కడ అరుగు మీద చర్చ మధ్యలో శ్రీనివాసశాస్త్రి మళ్లా మనువుని లంకించుకన్నాడు. “పుటం పెట్టేశాడ్రా మనువు వేదాలకి. ఎవ్వళ్లనీ నేర్చుకోనివ్వలేదు. మన బేమ్మల నెత్తికి చుట్టి మనల్ని వెలేసేలా చుట్టూ ఉన్నోళ్లలో అక్కసు పెంచాడు. మనం కొత్తడుగు – హిందూ మతం నించి విడిపోయి వెదుక్కోవాలిప్పుడు” అన్నాడు.

అందుకు అందరూ సైలెంట్ అయిపోయారు.

ఆ మాట ఎవరికీ ఇష్టం లేదని శాస్త్రికి అర్థమైపోయింది. ఆ సంగతి ఆ ఆతగాడికి ముందే తెలుసు. ఇందాకా పంచాగ్నులు ఇదే సుచన చేసినప్పుడు పట్టించుకోని వాళ్లు ఇప్పుడు మౌనాన్ని ఆశ్రయించడం శాస్త్రి గమనించి ‘ఓ అగ్గిపుల్ల గీశాం… రాజుకోనీ’ అనుకుని అక్కడ నించి నిష్క్రమించాడు.

ఇక ఆ అరుగు అక్కడితో చల్లారిపోయి రచ్చ బండ చర్చ మర్నాటికి వాయిదా పడింది. అంతా పేకాట, బీడీ, నైన్టీ, సినిమా చర్చల్లో పడిపోయారు.

అరుగుని అనుకొని ఉన్న ఓ చెట్టు మీంచి ఆశగా ఎదురు చూపులు విసురుతున్న ఓ మాల కాకి ‘లాభంలేదు ఇక తద్దినాల్లేవిక్కడ’ అనుకొని, పిల్లల చదువులతో ఒడ్డున పడ్డ బ్రాహ్మల తీరుని ‘కా…కా…’ అని శపిస్తూ ఎగరిపోయింది.

సముద్రాల ఆవల దూరదూరాల్లో దేశ దేశాల్లో అదే సమయంలో అరుగు పెద్దల పిల్లలు… చదువుల రెక్కలార్చుకు వెళ్లిన వాళ్లు –  తోటి ఎన్.ఆర్.ఐ. సకల నరులతో సమంగా  స్వేద వేదం ఒలికిస్తున్నారు. స్వేదంలో బేమ్మలకి మినహాయింపు లేదష!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here