మా తెలుగు నేల
మహా తెలుగు నేల
మహానదుల స్వరమేళా మా తెలుగు నేల
మహాగనుల నిధి నేల మా తెలుగు నేల
మహామహులు జనియించిన
మహాచరిత గల నేల మా తెలుగు నేల
శాతవాహనులతో
మహాఖ్యాతి పొందె ఈ నేల
కాకతీయులతో
ఘనకీర్తి నొందే ఈ నేల
కత్తులతో శత్రువులను ఘంటముతో రసజ్జలను
తత్తరబిత్తర పరచిన రాయలదీ మహా నేల మా తెలుగు నేల
బతుకమ్మ బోనాల తిరణాల తెలంగాణ నేల
దుర్మార్గపు దొరల గద్దె దింపిన తెలంగాణ నేల
పేరడిగితె చాలు చెట్లు రాళ్లు గుట్టలు కొండలు
వీర తెలంగాణయని మారు మోగె ఈ నేల మా తెలుగు నేల
పౌరుషమే నీరై పెల్లుబికే రాయలసీమ
పొరపొరలలో పుష్యరాగ మొలికే రతనాలసీమ
తాత్త్విక రాగాల గాలి వీచే రాయలసీమ
సాత్విక రాజస తేజస్వీ రాయలసీమ మా తెలుగు నేల
తొడచరిచే ధీరతనం పురివిప్పిన పలనాడు
ఉలి పిలిచే శిల్ప కళా అమరావతి వెలనాడు
ప్రత్తి పొగాకు పండు మిరప పంటల సిరినాడు
చాపకూడుతో ఏకత చూపినదీ ఒకనాడు మా తెలుగు నేల
మునివేళ్లతో నేలను గిల్లితి నీళ్ళొచ్చే కోస్తా
పల్లెకు వడ్డాణాలై మెరిసే కాలువల రస్తా
సూర్యరశ్మిని జల్లెడ పట్టే కొబ్బరి తోటల
కోనసీమ సశ్యామల శోభిత సర్కారు కోస్త మా తెలుగు నేల
గాండ్రించిన తాండ్రపాపరాయనిదీ పౌరుషాంధ్ర
గర్జించిన ఉద్యమాల విస్ఫులింగ కళింగాంధ్ర
సంగీత క్షీర స్వరధారలదీ మహా ఆంధ్ర
సూర్యునికే సింధూరం అందించిన ఉత్తరాంధ్ర మా తెలుగు నేల
డా. సుద్దాల అశోక్‌తేజ