ప్రాణవాయువు నిండిన శరీరం

0
4

[dropcap]ధ[/dropcap]నంజయరావుకి గత ఆరు నెలలుగా జీవితం నిస్సారంగా తోస్తోంది. ఏ పనీ చేయాలనిపించటం లేదు. ఆరునెలల క్రితం భార్య అకస్మాత్తుగా మరణించడంతో జీవితంలో శూన్యం ఆవహించినట్లనిపిస్తోంది.

విశాఖపట్నం మహానగరంలో తాను ఒక పెద్ద మందుల కంపెనీకి అధిపతి. ఏ కొరతా లేదు. కానీ ప్రేమించి పెళ్ళాడిన భార్య మరణం మానసికంగా కృంగదీస్తోంది. ఆరో తరగతి చదువుతున్న కూతురుని సరిగ్గా చూసుకోలేకపోతున్నాడు. అటు కంపెనీ వ్యవహారాల్లో కూడా శ్రద్ధ తగ్గిపోతోంది. అలాంటి సమయంలో స్నేహితుడి సలహా పాటించి కూతురుని ఒక మంచి రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించుదామనుకున్నాడు. అలా పంపించడానికి మనసు ఒప్పుకోకపోయినా తను తేరుకునే వరకూ అదే మంచిదనిపించి అయిష్టంగానే డెహ్రాడూన్‌లో వున్న డూన్ స్కూల్లో చేర్పించేశాడు. వెనక్కు వచ్చాక ఇల్లు మరింత బావురుమనిపిస్తున్నట్లు తోచడంతో నిద్రపట్టక తూర్పు తెలవారకముందే అరకు లోయ వైపు వెళ్ళాడు. అక్కడ సూర్యోదయం, ఆ కొండల అందాలు చూసే సరికి రోజూ అలా వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. అక్కడైనా కాస్త మనసుమారి ప్రశాంతత చిక్కుతుందేమో అనిపించింది.

ఈ రోజూ అలాగే ప్రకృతిని చూస్తూ డ్రైవ్ చేసుకుంటూ గమనించకుండానే అరకులోయ కొండలు దాటి పాడేరు అనే వూరిని కూడా దాటి వెళ్ళిపోయాడు. అక్కడ విశాలంగా అనంతమైన ఆకాశాంలోకి ఈ భూమి చొచ్చుకుపోతోందా అనిపించింది. పక్షులు ఎగురుతూ వేస్తున్న కూతలు ఆవలి లోకాల అందాల గురించి చెబుతున్నాయా అనిపిస్తోంది. ధనుంజయ్ కారుని ఓ పక్కకి ఆపి ఆ అందాల్ని చూసి యిక్కడ కనీసం ఒక రోజైనా వుండిపోతే బాగుండేది అనుకున్నాడు. సుమారు ఒక గంట తరువాత దూరంగా ఇద్దరు ఆడవాళ్ళు నెత్తిపై కట్టెల మూట మోసుకుంటూ రావడం కనిపించడంతో దగ్గరకు వెళ్లి “ఇక్కడ ఒకటి రెండు రోజులు వుండడానికి ఏదైనా చోటు దొరుకుతుందా?” అని అడిగాడు. వాళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ “రెండు మూడు మైళ్ళ దూరంలో బొక్కెల్లు గ్రామం వుంది, అక్కడేమైనా దొరకొచ్చు” అనేసి తమలో తాము ఏదో గొణుక్కుంటూ వెళ్లిపోయారు.

ఓ పదినిమిషాలలోనే బొక్కెల్లు గ్రామం కనిపించింది. రోడ్డు పక్కనే కారు ఆగే సరికి కొంచెం దూరంలో వున్న పెద్ద రావిచెట్టు కింద ఆడుకుంటున్న పిల్లలు ఒక్కసారిగా ఆట ఆపేసి కారు చూద్దామని వస్తున్నారు. పిల్లల ఆట గోల వెంటనే సద్దుమణిగే సరికి కొంచెం దూరంలోనే వున్న గుడిశలోంచి నీలమ్మ కంగారుగా బయటకొచ్చి పిల్లలేమయ్యారని వెతకసాగింది.

నీలమ్మ గుడిశలోంచి బయటకురాగానే ధనంజయ్ కారు దిగి “ఇక్కడ ఒకటి రెండు రోజులు వుండడానికి ఏదైనా గది లేదా యిల్లు దొరుకుతుందా అమ్మా!” అని అడిగాడు. ఆమె ఒక క్షణం అతనిని తేరిపార చూసి “అలసిపోయి నట్టున్నారు. ముందు చాయ్ తాగుతారా బాబూ” అని అడిగింది. “అలాగేనమ్మా” అనే సరికి గుడిలోకి వెళ్ళబోతూ ఆగి “మా కాడ పంచదార లేదు మరి బెల్లం చాయ్ తాగుతారా బాబూ” అని అడిగింది. “పర్వాలేదు తాగుతానమ్మా” అన్నాడు.

రావి చెట్టు పక్కనే వున్న పెద్ద బండ చూపించి “ఆడ కూకోండి బాబూ. చాయ్ తెత్తాను” అని వెళ్ళిపోయింది. మొదటి సారి బెల్లం చాయ్ తాగుతున్న ధనుంజయ్‌కి “బాగుందే” అనిపించింది. మోహమాటం వదిలేసి “ఇక్కడ ఒక రోజు వుండాలని వుంది. ఉండడానికి గది, భోజనం దొరుకుతాయా?” అంటూనే “డబ్బులు ఎంతైనా పర్వాలేదు అమ్మా యిస్తాను” అన్నాడు. నీలమ్మ నవ్వుతూ “నా గుడిసె దగ్గిరే ఇంకోటి ఖాళీగా వుంది. ఆడ ఎవరూ వుండటం నేదు. మీరాడనే పొడుకోవచ్చు బాబూ. భోజనం నాకు సేతనైంది ఎడతా. డబ్బులొద్దు బాబూ” అనేసి వంట చెయ్యడానికి గుడిసెలోకి వెళ్లిపోయింది.

ధనుంజయ్‌కి ఎదురుగుండా కొంచెం దూరంలో నీళ్లు పారుతున్న శబ్దం వినిపించింది. కారు దిగి చూద్దామని బయలుదేరాడు. కొంచెం దూరం నడిచేసరికి కొండని ఒరుసుకుంటూ పారుతున్న చిన్న సెలయేరు కనిపించింది.

ఆ స్వచ్ఛమైన నీళ్ళు చూడగానే స్నానం చేస్తే బాగుంటుంది అనిపించింది. రోజూ పట్టుమని పది నిమిషాలు చేయని స్నానం ఇప్పుడు ఎంత సేపు చేసినా తనివితీరట్లేదు. గంట సేపు స్నానం చేశాక ఏరు బయటకు రాగానే భయంకరమైన ఆకలి వేసింది. కారు దాకా వచ్చి భోజనం దొరుకుతుందా అని మరోసారి అడగటానికి సిగ్గేసింది. ఈలోగా నీలమ్మే వచ్చి “రండి బాబూ భోజనం సేద్దురుగానీ” అనడంతో బతికానురా అని మనసులోనే అనుకుని గుడిసెలోకి అడుగు పెట్టాడు. కోడిగుడ్లు వేసి పులుసు పెట్టింది. దానితోపాటు అన్నం ఆ తరువాత మజ్జిగాన్నం తినేసరికి కాసేపటిలోనే ఒళ్ళు తెలియని నిద్ర, పట్టేసింది. లేచేసరికి చీకటి పడింది. తిరుగు ప్రయాణం చీకటిలో వెళ్ళటం అంత మంచిది కాదనిపించి రాత్రి అక్కడే వుండిపోయాడు.

రాత్రి భోజనం చేస్తూండగా తను వచ్చినప్పుడు చెట్టు కింద ఆడుకుంటున్న పిల్లలు ఆరుగురూ కనిపించారు కానీ నీలమ్మ భర్త కనిపించలేదు. ఉండబట్టలేక “మీ ఆయన కనిపించడేం?” అని ధనుంజయ్ అడిగేసరికి నీలమ్మ “నాకు ఇరువై ఏళ్ళప్పుడు నా పెనిమిటి పెద్ద రోగమోచ్చి చచ్చిపోయాడు బాబూ. అప్పటినుంచీ నా ముగ్గురు పిల్లల్ని నేనే సాకుతున్నాను. నా అన్నయ్య పిల్లలు మరో ముగ్గురు తోడయ్యారు. వాల్ల నీ నేనే సాకుతున్నా బాబూ” అనగానే “అదేమిటీ మీ అన్నయ్యకు ఏమయ్యింది?” అని ధనంజయ్ అడగగానే నీలమ్మ “వాడూ అట్టాగే రోగమొచ్చిపోయాడు బాబూ” అంది.

“మరి మీ వదినో” అని అడిగేసరికి “వాడు చనిపోయి ఏడాది అవుక ముందే ఇంకొకరితో లేచిపోయింది” అన్నది. ధనంజయ్‌కి యింకేం మాట్లాడాలో తోచలేదు.

మరునాడు ఉదయం తిరుగు ప్రయాణానికి బయల్దేరే లోపు వాకిట్లో నీలమ్మ చాయ్ పట్టుకుని ప్రత్యక్షమైంది. తాగేందుకు డబ్బులివ్వబోతుంటే ససేమిరా వద్దంది. ధనంజయ్ “నీలమ్మా! విశాఖపట్నం వస్తావా? నీ బతుక్కి ఒక దారి చూపిస్తాను” అన్నాడు. నీలమ్మ “వద్దు బాబూ! నేను మా బొక్కెల్ల యిడిసిపెట్టి యాడకీ పోలేను” అని జవాబిచ్చింది.

ధనుంజయ్‌కి అర్థమైపోయింది నీలమ్మ ఊరు విడిచి పెట్టి రాదని. జేబులోంచి విజిటింగ్ కార్డ్ తీసి యిస్తూ తన భార్య విషయం కూడా మనసు విప్పి చెప్పాక “నీలమ్మా నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నా సహాయం అడుగు. మీ వూరు వచ్చాక నా గుండెల్లోనే కాదు శరీరమంతా ప్రాణవాయువు నిండిపోయింది. నా పాపను హాస్టల్ నుంచి వెనక్కు తీసుకు రావడానికి యివేళే వెళ్తాను” అని పిల్లలకు టాటా చెబుతూ ఉషారుగా కారు తీశాడు. దూరంగా మంచు తెరలు తొలగి కొండల్లో సూర్యోదయమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here