[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]
[dropcap]రా[/dropcap]మాయణం ఎప్పుడో జరిగింది. ఆ తరువాత ఎన్నో ఏండ్లకు కానీ దాన్ని వాల్మీకి రాయలేదు. అయినా రాముడు, సీత, రావణుడు ప్రస్తుతం నడుస్తున్న శకం 2021లో సైతం ఈ దేశంలోని సమాజంతో మమేకమైపోయారెందుకని? సీతారాములను ఒకరు పూజిస్తారు. ఒకరు రామకోటి రాస్తారు. ఒకరు రామాయణ పరిక్రమ చేస్తారు. దసరా వస్తే రావణ వధ చేస్తారు. ఇంకొకరు రాముడిని నిందిస్తారు. సీతారాములను గేలిచేస్తారు. రావణుడిని పొగుడుతారు. పూజిస్తారు. ఉత్సవాలు చేస్తారు. ఒక్క భారతదేశంలోనే కాదు. మన దేశం నుంచి కింద సౌత్ పోల్ దాకా ఉనికి ఉన్న దాదాపు అన్ని దేశాల్లోనూ ఏదో విధంగా రాముడు, సీత అస్తిత్వంలోనే ఉన్నారు. మహాభారతం కంటేకూడా ఎన్నో రెట్లు పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చే ఏకైక ఇతిహాసం రామాయణం. ఆసేతు హిమాచలం రామాయణమనే ఒకే ఒక్క సూత్రంతో కనెక్టివిటీ కలిగి ఉన్నది. సమాజంలో ఒక ఇంటిగ్రేషన్ కోసం మన పాలకులు ఈ కనెక్టివిటీని ఒక ప్రధాన ఉపకరణంగా వినియోగించాలన్న కోణంలో ఎందుకు ఆలోచించలేదో అర్థం కాదు. ముందునుంచీ కూడా ఈ దేశంపై ఇక్కడి ఫిలాసఫీపై, కల్చర్‌పై ఒకరకమైన నెగెటివ్ అప్రోచ్ ఉన్న నాయకులే ఈ దేశాన్ని పరిపాలిస్తూ వస్తున్నారు. ఎక్కువ మంది ప్రజలు ఆధారపడి ఉన్న వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను అనుత్పాదక రంగంగా మార్చేసి.. దేశాన్ని అంతులేని దారిద్య్రంలోకి నెట్టేశారు. అత్యంత సులభంగా అభివృద్ధి జరిగేందుకు అవకాశమున్న వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. అందుకోలేని రంగాలను ముందుకు తెచ్చి.. అద్భుతాలు చేయాలని చూసి బోర్లా పడ్డారు. భిన్న వైరుధ్యాలతో ఉన్న సమాజాన్ని సాంస్కృతికంగా ఐక్యం చేస్తున్న రామాయణాన్ని ఉపేక్షించారు. మన మూలాల్ని మనమే తూలనాడటం.. మనల్ని మనమే న్యూనత చేసుకోవడం.. మన చరిత్రను మనమే కాదని పక్కకు తోసేయడం.. మనల్ని నానా అగచాట్లపాలు చేసినవాళ్లను మహాత్ముల్లా కీర్తించడం అలవాటు చేశారు. ఈ దేశం ఎప్పటికీ ఏకం కాని దుస్థితికి తీసుకొచ్చారు.
ఇందులోనూ ప్రధానమైంది ఇతిహాసాల్లోకి ఆయా కాలమానాలకు అనుగుణంగా రకరకాల కథనాలను చొప్పించడం.. రామాయణం కూడా ఇందుకు మినహాయింపు కాలేదు. అది మంచి కావచ్చు. చెడు కావచ్చు. పాత్రలకు మరింత ఔన్నత్యాన్ని ఆపాదించి ఉండవచ్చు. దివ్యత్వాన్ని సమకూర్చి ఉండవచ్చు. అదే సమయంలో పాత్రల వ్యక్తిత్వాల హననమూ జరిగి ఉండవచ్చు. మొత్తం మీద మూల రామాయణానికి ఎంతో దూరంగా అక్కడక్కడా ప్రచారంలో ఉన్న కథల సమాహారంగా రామాయణం ఈ దేశంలో పునర్లిఖితమైంది. సీతారాముల చరిత్రలో రకరకాల కథనాలు పుట్టుకొచ్చాయి. ఈ పుక్కిటి కథలే సీతారాముల నయా రామాయణంగా మారిపోయాయి. ఒకటి కాదు.. రెండు కాదు వేల సంఖ్యలో రామాయణాలు పుట్టుకొచ్చాయి. కొత్త కొత్త కథలు చొచ్చుకొని వచ్చాయి. గమ్మత్తేమిటంటే.. ఇతర దేశాల్లో, మతాల్లో సిమిలర్‌గా కనిపించే అనేక కథనాలన్నీ ఒరిజినల్ రామాయణ గాథల్లో చేరి రామాయణాన్ని పెంచుకొంటూ పోయాయి. టిబెట్, మంగోలియా, చైనా, కంబోడియా, సైబీరియా, లావోస్, జపాన్, థాయ్‌లాండ్, మలేసియా, ఫిలిప్పీన్స్, బర్మా వంటి దేశాల్లో రకరకాల రామాయణాలు ఉన్నాయి. కొన్ని చోట్ల జానపద కళారూపాలుగా ఉంటే.. మరికొన్ని చోట్ల సాహిత్య ప్రక్రియల్లో భాగంగా ఉన్నాయి. వీటిలో ఒక్కొక్కటి సీతారాముల వ్యక్తిత్వాలను ఒక్కోరకంగా వ్యక్తీకరిస్తాయి. కావ్యాలు వచ్చాయి. నాటకాలు వచ్చాయి. పాటలు వచ్చాయి.. కళారూపాలు వచ్చాయి.
మరలనిదేల రామాయణంబన్నచో.. యీ ప్రపంచకమెల్ల తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్లు.. తనదైన రుచులు తనవిగాన.. చేసిన సంసారమే చేయుచున్నది.. తనదైన అనుభూతులు తనవిగాన.. మహాకవి అన్నట్టు.. రామాయణం ఎవరికి ఎలాంటి అనుభూతి కలిగిస్తే ఆ అనుభూతి వ్యక్తీకరణ సీతారాముల చరిత్రను పునర్లిఖితం చేశాయి. దాదాపు అన్ని భాషల్లోనూ రామాయణాలు వచ్చాయి. అన్నింటిలోనూ వాల్మీకి రామాయణంలో లేని కనీసం ఒక్కటైనా అంశం కచ్చితంగా ఉంటూ వచ్చింది. రామాయణాన్ని ఒరిజినల్‌గా రాసిన వాల్మీకి అనే కవి ఎక్కడో ఉండిపోయాడు. బౌద్ధమతంలో ఒక రామాయణం ఉన్నది. జైన మతానికీ ఒక రామాయణం ఉన్నది. అన్ని మతాల్లో, అన్ని జాతుల్లో, అన్ని నాగరకతల్లోనూ ఒక్కో రామాయణం పుట్టుకొచ్చింది. జానపద గాథల్లో సీతారాముల కథల్లోని వైవిధ్యానికి అంతే లేదు. స్త్రీల పాటల్లోనూ ఒక రామాయణం ఉన్నది. అయితే ఈ రామాయణాలన్నింటిలోనూ ఉన్న సిమిలారిటీ ఏమిటంటే.. సీతారాములే ప్రధాన పాత్రధారులు.. రావణ సంహారమే ముగింపు.
బౌద్ధులు, జైనులు కూడా రామాయణాన్ని తమకు అనుకూలంగా వాడుకొన్నారు. బౌద్ధులు.. బుద్ధుడి పూర్వజన్మలో రాముడిగా పేర్కొన్నారు. జైనులేమో.. రావణుడు యజ్ఞయాగాదులను ధ్వంసం చేయించారు. అతని హింసకు వ్యతిరేకంగా అహింసను ప్రబోధించారు. అదే సమయంలో బౌద్ధులు, జైనులు హిందూ ధర్మాన్ని అపహాస్యం చేయడానికి, అపఖ్యాతి పాలుచేయడానికి రామాయణ గాథకు విపరీత కథనాలను జోడించారు. ఎంత విపరీతమంటే.. ఒకానొక బౌద్ధ రామాయణంలో రాముడికి సీత చెల్లెలు, భార్య. ఖోటాన్ రామాయణంలో రామలక్ష్మణులిద్దరికీ భార్య, లావోస్ రామాయణంలో హనుమంతుడు రాముని కొడుకు. మలేసియా రామాయణంలో మండోదరి దశరథుని పెద్ద భార్య, దశరథుని కొడుకు రావణాసురుని కూతురును పెండ్లాడి.. రావణుణ్ణి చంపుతాడు. ఇట్లా ఒకదానితో ఒకటి పొసగని.. పొంతనలేని కథనాలను పుట్టించారు.
బౌద్ధ జాతక కథల్లో ఒక రామ కథ ఉన్నది. బోధిసత్త్వుడు అనే రాజు.. మేనమామ అరాచకాలను సహించలేక.. రాజ్యాన్ని వదిలేసి భార్యను తీసుకొని అడవులకు వెళ్లిపోయాడు. ఆ అరణ్యంలో దుర్మార్గుడైన నాగుడనేవాడు ఉన్నాడు. ఈ రాణిగారి మీద అతని కన్నుపడింది. మునివేషం వేసుకొని వచ్చాడు. బోధిసత్త్వుడు ఓ రోజు బయటకు వెళ్లిన సమయాన్ని అనువుగా చేసుకొని రాణిని ఎత్తుకొని పారిపోయాడు. మధ్యలో ఒక పెద్ద పక్షి వచ్చి వాడికి అడ్డుపడింది. దాన్ని ఎదిరించి ఆ నాగుడు సముద్ర ప్రాంతానికి వెళ్లిపోయాడు. బోధిసత్త్వుడు తిరిగి వచ్చాడు. భార్యకోసం వెతికాడు. ఆయనకూ ఒక వానరుడు దొరికాడు. అతను దుఃఖంలో ఉన్నాడు. ఇద్దరూ పరస్పర సాయం చేసుకొందామనుకొన్నారు. ఆ వానరుడిని ఈ బోధిసత్త్వుడు రక్షించాడు. తరువాత అతని సేనను వెంటపెట్టుకొని వెళ్లి సముద్రానికి వెళ్లాడు. అక్కడ శక్రకపి అనే వానరుడి పర్యవేక్షణలో వంతెన కట్టి నాగుడు ఉన్న చోటికి వెళ్లాడు. నాగుడిని చంపాడు. శక్రకపి రాణిని విడిపించుకొని వచ్చాడు. అంతా కలిసి తిరిగి రాజ్యానికి వెళ్లారు. అప్పటికే మేనమామ చనిపోయాడు. ఈయన రాజ్యం స్వీకరించాడు.
ఇందాకే చెప్పినట్టు జాతక కథల్లో దశరథ జాతకం అనే ఒక కథ ఉన్నది. ఇందులో దశరథుడు వారణాసిని పాలిస్తూ ఉంటాడు. అతనికి 16 వేల మంది భార్యలు. పట్టపురాణికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పేరు రామ పండితుడు. చిన్న కొడుకు పేరు లక్ష్మణ పండితుడు. దశరథుడు ఆ తర్వాత మరో భార్యను చేసుకొన్నాడు. ఆమెకు భరతుడు పుట్టాడు. పుత్రోత్సాహంలో వరమిచ్చాడు. ఆమె తరువాత కోరుకుంటానన్నది. కొన్నేండ్ల తరువాత భరతుడికి రాజ్యం ఇవ్వమని అడిగింది. దశరథుడు ఇవ్వలేదు. సవతి తల్లి రామలక్ష్మణులను చంపేస్తుందేమోనన్న భయం పట్టుకొన్నది. దీంతో కొడుకులను పిలిచి ఏ సామంత రాజ్యానికో పోయి బతకండని సలహా ఇచ్చాడు. వాళ్లు సరేనన్నారు. వాళ్లు అడవికి వెళ్లారు. భరతుడు పోయి అన్నను రాజ్యం స్వీకరించమని కోరాడు. ఆయన కాదన్నాడు. పాదుకలు తెచ్చి పట్టాభిషేకం చేశాడు. వాటి సమక్షంలోనే తీర్పులిచ్చేవాడు. తీర్పు సక్రమంగా ఉంటే పాదుకలు శాంతంగా ఉండేవి. లేకుంటే తమలో తాము కొట్టుకొనేవి. మూడేండ్ల తర్వాత రామ పండితుడు తిరిగి రాజ్యానికి వచ్చాడు. రాజ్యం చేపట్టి పాలించాడు.
టిబెట్‌కు దగ్గరలో ఖోటాన్ ప్రాంతం ఉన్నది. ఇక్కడ కూడా ప్రచారంలో ఉన్న ఒక కథ ఉన్నది. దీని ప్రకారం దశరథుడికి సహస్రబాహుడనే కొడుకు ఉంటాడు. అతడిని పరుశురాముడు హతమారుస్తాడు. ఇతనికి ఇద్దరు కొడుకులు. మొదటివాడు రైస్మణుడు, రెండోవాడు రాముడు. ఈ రాముడు తన తండ్రిని చంపిన పరుశురాముణ్ణి, 18 లక్షల మంది బ్రాహ్మణులను హతమారుస్తాడు. ఇదే టైంలో దశగ్రీవుడనే రాక్షసుడికి కూతురు వల్ల మరణం రాసిపెట్టి ఉన్నది. దీంతో తన కూతురును పెట్టెలో పెట్టి నదిలో పారేశాడు. ఆ పెట్టె ఒక రుషికి దొరికింది. ఆయన ఆమెను పెంచాడు. ఒక భవనం చుట్టూ గీత గీసి దాని మధ్యలో ఆమెను ఉంచాడు. ఆ గీత దాటి ఎవరూ ముందుకు పోలేరు. ఓ పెద్ద రాబందు ఆమెను రక్షిస్తుంటుంది. ఆమె పేరు సీత. ఇద్దరు అన్నదమ్ములు ఆమెను చూసి మోహితులయ్యారు. ముందుగా గీత దాటలేకపోయారు. తరువాత ఆమెకు సమర్యలు చేయడం మొదలుపెట్టారు. ఒకనాడు నూరుకన్నుల లేడి ఒకటి అక్కడికి వచ్చింది. అన్నదమ్ములిద్దరు దాని వెంట వెళ్లారు. దశగ్రీవుడు వచ్చి.. అక్కడున్న రాబందును సంహరించి ఆమెను ఎత్తుకెళ్లారు. ఇద్దరు అన్నదమ్ములు సీతను వెతుక్కుంటూ వానరభూమికి వచ్చి.. అక్కడ వారిలో వారు రాజ్యం కోసం కొట్టుకోవడం చూశారు. అక్కడ అన్నదమ్ములైన సుగ్రీవుడు, నందుడి మధ్యన యుద్ధం జరుగుతుంది. సుగ్రీవుడిని సంహరించి నందుడికి రాజ్యం ఇచ్చారు. నందుడు సీతాన్వేషణ చేశాడు. దశగ్రీవుడి మీదకు దండెత్తి వెళ్లారు. నాగాస్త్రాలు.. సంజీవినీ మూలికలు అన్నీ వచ్చాయి. ఈలోగా రాముడు దశగ్రీవుడి జాతకాన్ని చూశాడు. అతని ప్రాణం అతని బొటనవేలులో ఉన్నది. రాముడు ఆ బొటనవేలును చూపించాలని దశగ్రీవుడిని కోరాడు. అతను చూపించాడు. ఇతను బాణం వేశాడు. దశగ్రీవుడు పడిపోయాడు. అతడిని బంధించారు. కప్పం కట్టడానికి దశగ్రీవుడు అంగీకరించాడు. ఇక్కడ దశగ్రీవుడిని చంపలేదు. తరువాత రైస్మణుడు, రాముడు సీతతో నూరేళ్లు జీవించారు. ఈ జాతక కథలో చివరన బుద్ధుడు పూర్వ జన్మలో రైస్మణుడని, మైత్రేయుడు రాముడని చెప్తారు.
లావోస్‌లో రామజాతకం అనే కథ ఉన్నది. ఇందులో ఇంద్రప్రస్థపురంలో దశరథుడు, విరులహుడు అనే ఇద్దరు అన్నదమ్ములున్నారు. పెద్దవాడికి రాజ్యం దక్కకపోవడంతో విరులహుడు రాజ్యం చేశాడు. దశరథుడు అడవులు పట్టిపోయాడు. అక్కడే ఓ నగరాన్ని కట్టుకొని రాజ్యం ఏర్పాటు చేసుకొన్నాడు. విరులహుడి కుమారుడు రావణాసౌనుడు దశరథుడి రాజ్యానికి వచ్చి అతని కూతురు శాంతను ఎత్తుకుపోయాడు. రావణసౌనుడు ఇంద్రప్రస్థానికి చేరుకొనేలోగానే శాంతకు సోదరులైన రామలక్ష్మణులు ఎన్నో సాహస కృత్యాలు చేశారు. వాళ్లు ఇంద్రప్రస్థానికి చేరుకొని రావణసౌనుడితో యుద్ధం చేశారు. చివరకు రావణసౌనుడు రాజీపడి శాంతను పెండ్లి చేసుకొంటాడు.
ప్రస్తుతం థాయ్‌లాండ్ దేశానికి వెనకట సయాం అన్న పేరు ఉన్నది. అక్కడ అయోధ్య అన్న నగరం ఉన్నది. ఇది బ్యాంకాక్‌కు ఉత్తరాన 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. క్రీ.శ.135 నుంచి క్రీ.శ.1767 దాకా ఈ అయోధ్యలో 37 మంది రాజులు పాలించారు. వీరిలో చక్రివంశ స్థాపకుడైన రాముడు రామాయణాన్ని కావ్యంగా రాశాడు. ఇది కూడా ఆరు కాండలతో కూడుకొన్న మహాకావ్యమే. ఇందులో రామాయణంలో లేని అనేక కథలు, బంధుత్వాలు కనిపిస్తాయి. మనం భూకైలాస్ సినిమాలో చూసిన రావణుడు ఉమాదేవిని ఎత్తుకొని లంకకు తీసుకొని వెళ్లేందుకు చేసే ప్రయత్నం ఈ సయాం రామాయణంలోని గాథనే. మండోదరిని తీసుకొన లంకకు వెళ్తున్న సమయంలో వాలి మండోదరిని అపహరిస్తాడు. ఆమెతో క్రీడిస్తాడు. ఆమెను గర్భవతిని చేస్తాడు. వాలి దగ్గర అంగదుడనే మంత్రి ఉంటాడు. అతడు మండోదరి గర్భంలోని పిండాన్ని ఒక మేక కడుపులో నిక్షిప్తంచేసి ఆమెను తిరిగి రావణుడి దగ్గరకు పంపిస్తాడు. మేక కడుపులోంచి పుట్టిన బిడ్డకు తిరిగి అంగదుడనే పేరు పెట్టి వాలికి అప్పగిస్తాడు. ఇదొక చిత్రమైన కథ.
మలేసియాలో శ్రీరాముడిని భక్తిభావంతో ఆరాధిస్తారు. ‘దేవ జెరెంబున్’ అని ఆయన్ను కొలుస్తారు. అంటే రాముడు పరబ్రహ్మమని అర్థం. ఇక్కడ చరిత్ర మహారాజా వన, హికాయత్ శ్రీరామ అనే రామ చరిత్రలు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో మండూరపురాన్ని పాలించే దశరథుడికి మండూదారి అనే భార్య ఉన్నది. పిల్లలు లేరు. యజ్ఞం చేసి పిల్లలను కన్నాడు. పిల్లలు పెరుగుతున్నారు. ఓ రోజు రావణుడు మండూదారి అందం గురించి విని దశరథుడి దగ్గరకు వచ్చాడు. అతిథి సత్కారాల తరువాత మండూదారిని తనకు ఇవ్వాలని అడిగాడు. దశరథుడు కాదనలేక మండూదారిని ఇచ్చేశాడు. కానీ ఆమెకు వెళ్లడానికి మనస్కరించక తన చర్మం నుంచి ఒక ఛాయా మండూదారిని సృష్టించింది. ఆమెను రావణుడి వెంట పంపించింది. ఆమె రావణుడి రాజ్యానికి వెళ్లింది. ఈ లోగా దశరథుడు ఆకాశమార్గాన రహస్యంగా వెళ్లి చాయా మండూదారితో శయనించాడు. కూతురు పుట్టింది. ఆమె వల్ల రావణుడికి ప్రాణ గండం ఉన్నదని చెప్పగానే ఆమెను పెట్టెలో పెట్టి నీళ్లలో వదిలేశాడు. ఆ పెట్టె కాలి అనే రుషికి దొరికింది. ఆయన పెంచి పెద్దచేశాడు.
ఇక ఆనంద రామాయణంలో మహాలక్ష్హిని పుత్రికగా పొందాలని పద్మాక్షుడు తపస్సుచేశాడు. ఆమె ఆయన కూతురుగా జన్మించింది. ఆమెకు యుక్తవయస్సు రాగానే స్వయంవరాన్ని ప్రకటించాడు. ఆకాశ నీలవర్ణంచేత ఎవరు తన దేహాన్ని పరిలేపనం కావించుకోగరో వారికి పిల్లనిస్తానన్నాడు. స్వయంవరానికి వచ్చినవాళ్లంతా మంటపాన్ని విధ్వంసంచేసి వెళ్లారు. పద్మాక్షుడు మరణించాడు. ఆయన భార్యలు సహగమనం చేశారు. కూతురు పద్మ.. అగ్నిలోకి దూకి అందులోనే ఉంటుంది. రాక్షసులు ఆమెకోసం గాలించి విఫలమయ్యారు. ఆ తర్వాత ఒకరోజు పద్మ అగ్నిలోంచి బయటకు వచ్చి విహరిస్తున్న సమయంలో రావణుడు ఆమెను పుష్పకం నుంచి చూసి మోహించాడు. చెరపట్టబోయాడు. ఆమె మళ్లీ అగ్నిలోకి దూకింది. అగ్నికుండాన్ని వెతికితే.. పంచరత్నాలు దొరికాయి వాటిని పెట్టెలో పెట్టుకొని లంకకు వెళ్లి భార్య మండోదరికి ఇస్తాడు. పెట్టె తెరిస్తే అందులో పాప ఉన్నది. ఆ పాప నేను లంకకు వచ్చి నిన్నూ నీ లంకనూ నాశనం చేస్తానని చెప్పింది. రావణుడు ఆ పెట్టెను మిథిలలో ఒకచోట భూమిలో పాతిపెట్టారు. ఆ పెట్టె జనకుడికి దొరికింది. సీత అని పేరు పెట్టుకొన్నాడు.
జైన గ్రంథాలలో ఆది నాథుడు మొదట రామకథను కథనం చేశాడని ప్రతీతి. అరవయ్యో తీర్థంకరుడైన సువత్రముని కాలంలో రామకథ వచ్చిందని కూడా చెప్తారు. ఋషభనాథుని కాలంలో రామకథా గేయాలు ప్రచారంలో ఉన్నాయని చెప్తారు.
జైనులు రామచంద్రుడిని సిద్ధ పరమాత్ముడిగా భావిస్తారు. పునర్జన్మ లేకుండా నిర్యాణం తరువాత కైవల్యాన్ని పొందగలిగే చరమ దేహధారిగా కొలుస్తారు. జైన ధర్మమైన అహింసను పరిపూర్ణంగా పాటించిన మహనీయుడు. అందుకే జైన సంప్రదాయం ప్రకారం వాలిని, రావణుడిని లక్ష్మణుడు హతమారుస్తాడే తప్ప రాముడు చంపడు. జైనులు రాముడిని పద్ముడని కూడా పిలుస్తారు. భువనతుంగసూరి అనే రచయిత సియా చరియ (సీతా చరిత్ర) అనే కావ్యాన్ని రాశాడు. జినదాసుడు రామదేవ పురాణం రచించాడు. జైనుల గ్రంథాలలో రామనాటకం ప్రసక్తి కూడా ఉన్నది. హస్తి మల్లుడు మైథిలీ కల్యాణ నాటకం రాశాడు. హేమచంద్రసూరి రచించిన త్రిషష్టి శలాక పురుష పురాణంలోని సప్తమ పర్వంలో రామ చరిత్ర కనిపిస్తుంది.
జైన రామాయణాల్లో కొన్ని విరుద్ధ అంశాలు కూడా ఉన్నాయి. రావణుడు ఆదర్శ ప్రభువు. మూడు ఖండాలలో అతడికి శత్రువన్నవాడే లేదు. అతడు అడుగుపెట్టిన దేశం పాడిపంటలతో సిరి సంపదలతో తులతూగి కరువుకాటకాలు లేక భూలోక స్వర్గంలాగా ఉంటుంది. అనేక దేవాలయాలు కట్టించాడు. యజ్ఞయాగాదులను ఆపించాడు. ఎందుకంటే జైన ధర్మంలో అతి ముఖ్యమైన అహింసను పాటించడం కోసం.. బలులను నిరోధించడం కోసం యజ్ఞయాగాదులను ఆపించాడు.
స్త్రీల రామాయణ పాటల్లో మన జీవితాల్లోని కష్టసుఖాలు, ఆచార వ్యవహారాలు, వావి వరుసలు, ఆటపాటలు, నోములు, వ్రతాలు, పంతాలు, పట్టింపులు అన్నీ కూడా సీతారాములకు ఆపాదించారు. కాకపోతే మూల వ్యక్తిత్వాలకు విఘాతం కలుగకుండా కథలను మలచుకొన్నారు. అందుకే ఇవి బాగా ప్రాచుర్యం పొందాయి.
మరి కొన్ని రామాయణాల్లో.. కొన్ని పురాణాల్లో రాముడు ఏకపత్నీవ్రతుడు కాదని.. ఇరవై ఎనిమిది మంది భార్యలు ఉన్నారని చెప్తారు. దుర్వాస రామాయణంలో సీత అనుమతితో రాముడు పదహారు మంది భార్యలను పెండ్లి చేసుకొన్నారట. జైన రామాయణంలో సీత, ప్రభావతి, రతినిభ, శ్రీరమ అనే నలుగురు భార్యలు రాముడికి ఉన్నారట. లక్ష్మణుడికి విశల్య రూపవతి, వనమాల, కల్యమాలిక, రత్నమాలిక, జితపద్మ, భయవతి, మనోరమ అన్న పేర్లు గల భార్యలున్నారు.
రాముడిని లోకోత్తర నాయకుడిగా, సీతను పరాశక్తిగా సంభావించి చేసిన రచనలు కూడా అనేకం వచ్చాయి.
వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాం.
- తత్వ సంగ్రహ రామాయణం.. ఏడు అధ్యాయాల గ్రంథమిది. ఇందులోనూ మూల రామాయణంలో లేని సంఘటనలు అనేకం మనకు ఇందులో కనిపిస్తాయి.
- వాశిష్ఠ రామాయణం.. దీనిని జ్ఞాన వాశిష్ఠమని పేరు. ఇందులో వైరాగ్యం, ముముక్షుత్వం, ఉత్పత్తి స్థితి, ఉపాసన, నిర్వాణముల ఆధారంగా రామాయణ గాథ ఉంటుంది.
- అద్భుత రామాయణం.. ఇందులో సీత పూర్వ చరిత్ర కనిపిస్తుంది. రాముడు రూపుమాపలేని రావణుణ్ణి సీత పరిమార్చినట్లు ఇందులో వర్ణించారు.
- ఆధ్యాత్మ రామాయణం.. ఇది బ్రహ్మాండ పురాణాంతర్గతం. ఏడు భాగాలుగా ఉంటుంది. శ్రీరాముడే పరమాత్మ. సీతయే ప్రకృతి స్వరూపిణి అయిన లక్ష్మి.. ఇదంతా పార్వతీ పరమేశ్వరుల సంవాదంగా మనకు కనిపిస్తుంది.
- వశిష్ఠోత్తర రామాయణం.. దీనికి సీతావిజయమని మరోపేరు కూడా ఉన్నది. ఇందులో 12వ అధ్యాయంలో నూరు తలల రావణుడిని సీత హతమార్చినట్లు వర్ణించారు.
నాటకాలు
భాసుడు అభిషేక నాటకము రచించాడు. ఇందులో భాసుడు వాల్మీకినే ఎక్కువగా అనుసరించాడు. అశోకవనం, వాలిసుగ్రీవ యుద్ధం వంటి కొన్ని ఘట్టాలలో మాత్రమే చిన్న చిన్న మార్పులు చేసి రసవంతంగా కథను సాగించాడు. ఇక ప్రతిమానాటకంలో కైకేయి నిష్కళంకగా మనకు కనిపిస్తుంది. ఆమె దోషం ఏదీ లేదన్నట్టుగానే చిత్రించాడు. రాముడికి నారచీరలు ఆమె స్వయంగా తెచ్చిచినట్టు ఉంటుంది. సీత సిగ్గు పడుతుండగా రాముడే ఆమెకు నారచీర కట్టినట్టుగా ప్రతిమానాటకం వర్ణించింది. ముఖ్యంగా అరణ్యకాండ ఆధారంగా ఈ నాటక రచన సాగింది. భవభూతి మహావీర చరితం నాటకంలో మూల రామాయణానికి చాలా మార్పులు చేశాడు. రాముడి మాహత్మ్యాన్ని ఎక్కువగా వర్ణించడానికి ప్రాధాన్యమిచ్చాడు. రాముడిని మహావీరుడిగా చిత్రించాడు. సీతారాముల ప్రేమ స్వరూపాన్ని ఉదాత్తంగా, ఉత్తమంగా తీర్చిదిద్దాడు. భవభూతి ఉత్తరరామచరిత్ర ప్రధానంగా ఉత్తరకాండ ఆధారంగానే సాగుతుంది. రావణ సంహారానంతరం.. పట్టాభిషేకం, సీతాపరిత్యాగం, లవకుశుల జననం ఇందులోని ప్రధాన ఇతి వృత్తాలు. మనకు తెలిసిన లవకుశ సినిమా వృత్తాంతం ప్రధానంగా ఈ ఉత్తర రామచరితాన్ని ఆధారం చేసుకొని చిత్రించిందే. ఇందులో ముఖ్యమైన విషయమేమంటే.. చివరలో సీతారాములు పునఃసమాగమం. వారిద్దరు తిరిగి ఏకమై.. రాజ్యానికి తిరిగి రావడం ఇందులోని విశేషం. ఇక దిఙ్నాగుడి కుందమాల కూడా ఉత్తర రామచరితాన్ని ఆధారం చేసుకొన్నదే. ఇందులో రామునకు గోమతీ తీరంలో కుందమాల ఒకటి కనిపించి.. అది సీతారచితమని.. సీతా విషయ స్మరణ కలిగి వాల్మీకి ఆశ్రమానికి వెళ్లి సీతను చేరడమనే కథ ఇందులో కనిపిస్తుంది. మురారి అనర్ఘ రాఘవం రాముని వంటి సుగుణాభిరాముడు లోకమున వేరే నాయకుడు లేనే లేడని నిరూపిస్తుంది. వాల్మీకి రామాయణంలో లేని పలు పాత్రలు ఇందులో మనకు కనిపిస్తాయి. ఇక రాజశేఖరుడు రచించిన పది అంకముల బాలరామాయణం అతి పెద్ద నాటకం. కాశ్మీర రాజు జయాపీడుడికి సమకాలికుడు ఈ రాజశేఖరుడు. మహారాష్ట్ర దగ్గర చేది మండలం ఇతని స్వస్థానం. ఇతను బాలభారతం కూడా రచించాడు. ఈ కథ రావణుడు సీతను కల్యాణం చేసుకోనెంచి మిథిలకు రావడంతో మొదలవుతుంది. రావణుడు శివధనుస్సును ఎత్తలేక అవమానం పాలవటం ఈ బాలరామాయణంలోని కథే. ఇది వాల్మీకి రామాయణంలో లేదు. సీతారాముల వివాహ సమయంలో పరుశురాముడు రావడం కూడా ఇందులోని సన్నివేశమే. మూల రామాయణంలో వివాహానంతరం రాముడు అయోధ్యకు తిరిగి వెడుతుండగా మార్గ మధ్యంలో పరుశురాముడు రాముడికి ఎదురునిలుస్తాడు. అక్కడే నారాయణ ధనుస్సును అందిస్తాడు. ఈ నాటకంలో మాత్రం సీతారామ కల్యాణ మంటపానికే పరుశురాముడు వచ్చి రాముడిని ప్రశ్నిస్తాడు. ఇది నాటకీకరణ కోసం చేసింది. చివరకు ఇదే మూల రామాయణ కథగా మారిపోయింది.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా రామాయణాలు ఉన్నాయి.. ఇవన్నీ మన సంస్కృతిలో ప్రవేశించి మూలరామాయణాన్ని సైతం మరిపించాయి. ఇవేవీ వాల్మీకి రచించిన అసలైన రామాయణంతో సంబంధం ఉన్నవి కావు.. రామాయణ గాథను ఆధారం చేసుకుని ఆ పాత్రలను కథలో ఉపయోగించుకుని రకరకాల కాలాల్లో రాసిన కథలే. అసలైన మూల రామాయణానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు.. కథలో.. కథనంలో పోలికలు తప్ప.. ప్రధాన కథతో వీటికి ఎలాంటి లింక్స్ లేవు. తమ తమ ప్రాంతాల్లో ప్రచారాల్లో ఉన్న కథల్ని, అమలులో ఉన్న ఆచారాల్ని కలగలుపుకుని రాసిన కథలే ఇవన్నీ.. కాకపోతే.. వీటిని మూలరామాయణంతో పోల్చి.. ఆ కథని, ఈ కథని కలగలిపి.. రామాయణాన్ని కలగాపులగం చేసి రామాయణం ఇతిహాసాన్ని గందరగోళంలో పడేసే యత్నం చేశారు.. దాని చారిత్రక మూలాలను, పవిత్రతను, విశ్వసనీయతను నష్టపరిచే ప్రయత్నం చేశారు. కానీ, కొంచెం కూడా సడలించలేకపోయారు.
చివరగా ఒక్కమాట.
వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే
వేదః ప్రాచేతసాదాసీత్సాక్షా ద్రామాయణాత్మనా..
వేదవేద్యుడగు పరమ పురుషుడు శ్రీరామచంద్రుడుగా లోకమున ఆవిర్భవించగా, వాల్మీకి వల్ల ఆ వేదమే రామాయణమైనది. అందుకే..
వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహా మంటపే
మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుష్ఠితం
అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్త్వం మునిభ్య పరం
వ్యాఖ్యాంతం భరతాభిః పరివృతం రామం భజే శ్యామలం
~
ఏడాదికి పైగా సాగిన.. ఈ వ్యాస పరంపరకు ఇప్పటికి స్వస్తి. దీనికి సంకల్పించిన మా నాన్నగారు.. సాక్షాత్ సరస్వతి.. ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యగారికి.. ప్రతి వ్యాసంలో అవసరమైన మార్పులను సూచిస్తూ.. సవరణలు చేస్తూ.. ముందుకు నడిపించిన కస్తూరి మురళీకృష్ణకి..ఈ వ్యాసాలను రాయటంలో స్వేచ్చనిచ్చి ప్రచురించిన సంచిక పత్రిక సంపాదక వర్గానికి ధన్యవాదాలు. నాలో ఈ సంకల్పాన్ని కలిగించి.. అన్నీ తానే అయి ఈ వ్యాస పరంపరను రాయించిన సద్గురువులు శ్రీ కందుకూరి శివానందమూర్తిగారి పాదపద్మములకు శతథా.. సహస్రథా.. వినమ్రంగా నమస్సులు సమర్పించుకొంటున్నా.. గురువుగారి ఆశీస్సులు ఇలాగే నన్ను ముందుకు నడిపిస్తే.. కొద్ది రోజుల్లో మరో కీలక భారతీయమైన అంశంతో మీ ముందుకు వస్తాను.
ధర్మో రక్షతి రక్షితః
కోవెల సంతోష్ కుమార్, రచయిత.