ఈజీగా ఇంగ్లీష్ ఛాప్టర్ 13

0
3

[dropcap]మీ[/dropcap]రు తెలుగు మీడియమా? అయితే ఇది మీ కోసమే. ఇకపై మీరు మాతృభాషలాగా ఇంగ్లీష్ మాట్లాడగలరు. MNC జాబ్ తెచ్చుకోగలరు.

~

మనలని ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా మాట్లాడించడంలో అడ్డు పడుతున్న మూడో రహస్యం గూర్చి తెలుసుకుందాం.

అది ఏమిటి అంటే, మనం ఇంగ్లీష్‌లో మాట్లాడటానికి అనుసరిస్తున్న అనువాద పద్ధతి.

చాలా మంది అనుకుంటారు అనువాద పద్ధతి మంచిదే కదా, దీని వల్ల నష్టం ఏమిటి అని.

అనువాదం చేయడం వల్ల మనం మన ఫీలింగ్స్‌ని కమ్యూనికేట్ చేయగలమేమో కానీ మనకు ఫ్లూయెన్సీ రాదు.

ఎందుకలా అంటున్నానో తెల్సుకోవాలంటే మనం ముందుగా ఫ్లూయెన్సీ అంటే అర్థం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

చాలా మంది చాలా రకాలుగా ఫ్లూయెన్సీని నిర్వచించినా, ఏ గందరగోళం లేకుండా చాలా సింపుల్‌గా చెప్పే ప్రయత్నం చేస్తాను.

Fluency = Linking between – Thinking and Speaking

అంటే ఏమిటి అంటే, మన మనసులో కలిగే ఆలోచనలని, నూటికి నూరు పాళ్ళు మాటల్లో చెప్పగలగడం.

అంటే ఏదైతే చెప్పాలని మనం మనసులో అనుకుంటున్నామో, అది మాటల్లో నూటికి నూరు శాతం చెప్పగలగడం అన్నమాట.

ఒక చిన్న యాక్టివిటీ ఇస్తాను, చేయండి.

కాసేపు కళ్ళు మూసుకుని, మీరు మీ మిత్రులతో, కుటుంబ సభ్యులతో తెలుగు మాట్లాడిన సందర్భాలను గుర్తు తెచ్చుకోండి, మీరు చెప్పదలచుకున్న విషయాలని యథాతథంగా వారికి చెప్పారా లేదా ఆలోచించండి.

హాయిగా చెప్పగలిగారు కద. ఇప్పుడు ఒక సారి ఆలోచించండి ఎందుకు అలా సులభంగా(ఫ్లూయెంట్‍గా) మాట్లాడగలిగారు మీరు? దీనికి సమాధానం ఒక్కటే, అది ఏమిటి అంటే మీ మనసులో ఉన్న ఆలోచనలకి, మీ మాటలకి నేరుగా లింకు ఉంది. మధ్యలో ఆ లింకు తెగిపోవడం లేదు.

అదే ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఏమి జరుగుతోందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనం పాటిస్తున్న విద్యా విధానం ప్రకారం మనకు ఎలా అలవాటు అయిందంటే,

* మొదట తెలుగులో ఆలోచిస్తాము

* తర్వాత ఇంగ్లీష్ లోకి అనువాదం చేస్తున్నాము

* చివరగా ఇంగ్లీష్‌లో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాము, అవునా కాదా?

ఈ విధమైన అనువాద పద్ధతి ద్వారా మన ఫ్లూయెన్సీకి ఇబ్బంది ఏమి జరుగుతోంది తెలుసా?

ఫ్లూయెన్సీ అంటే ఏమిటి – ఆలోచనకి మాటకి మధ్య ఉండే లింకు ఫ్లూయెన్సీ అని తెలుసుకున్నాము కదా. ఇప్పుడు ఈ లింకు తెగిపోయి మధ్యలో ట్రాన్స్‌లేషన్ అనే అడ్డంకి వస్తోంది.

అందువల్ల మనం మాట్లాడే మాటలు గ్రామర్ ప్రకారం కరెక్టుగానే ఉండవచ్చు గానీ, మనకు మాట్లాడేటప్పుడు ఫ్లో (ఫ్లూయెన్సీ) దెబ్బ తింటుంది.

ఇది ఒక ప్రధాన కారణం. (ఈ కింద ఇవ్వబడిన ఇమేజెస్ చూడండి)

అనువాద పద్ధతిలో ఉన్న ఇంకో ప్రధాన లోపం ఏమిటో చెబుతాను.

మనం ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నాము? – స్కూల్లో కదా.

అక్కడ ప్రధానంగా ఏమి చెప్పారు? – ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుంటే గానీ ఇంగ్లీష్ రాదు అని చెప్పారు కదా.

మనకు ఏ ఉద్దేశంతో ఇంగ్లీష్ గ్రామర్ నేర్పారో ఎప్పుడైనా ఆలోచించారా మీరు?

స్కూల్లో ఇంగ్లీష్ గ్రామర్ ఎందుకు నేర్పారు? – మన చేత ఇంగ్లీష్ వ్రాయించే దానికి.

సహజంగానే మనం అనువాదం చేసేటప్పుడు వాక్య నిర్మాణం కోసం గ్రామర్ వాడుకుంటాము, మనకు తెలిసిన గ్రామర్ స్కూల్లో మనకు నేర్పిన గ్రామర్. కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్కేమిటంటే మనం నిర్మించే వాక్యాలు మట్లాడే భాషలాగా సరళంగా ఉండకుండా, ఏదో బుక్స్ నుంచి బట్టీ పట్టి అప్పజెప్పినట్టు ఉంటాయి. ఎందుకు అంటే ఏ భాషలో అయినా వ్రాసే భాష, మాట్లాడే భాష వేరు వేరుగా ఉంటాయి.

ఇప్పుడు తెలుగు విషయానికే వస్తే, పత్రికలలో వాడే భాష, మనం మాట్లాడే భాష రెండూ కూడా తెలుగే అయినప్పటికీ, కాస్తా తేడాగా ఉంటుంది కద. కాబట్టి అనువాద పద్ధతి ద్వారా నిర్మింపబడ్డ వాక్యాలు, పదబంధాలు ఇవి వినటానికి నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి.

అంటే నేటివ్ స్పీకర్స్ మాట్లాడే ఇంగ్లీష్ సరళంగా, వినటానికి హాయిగా ఉంటే, అనువాద పద్దతి ద్వారా నిర్మింపబడ్డ వాక్యాలు నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి. పైగా ఈ అనువాదం అనే ప్రాసెస్‌లో ప్రతి తడవా వాక్యనిర్మాణం చేయటంలో ఆగి ఆగి వాక్య నిర్మాణం చేయటం వల్ల విలువైన సమయం వృథా అవుతుంది. ఫ్లో ఎటూ రాదు, పైపెచ్చు కృతకంగా ఉండే వాక్య నిర్మాణం జరుగుతోంది.

కాబట్టి ఎట్టి పరిస్థితిలో అనువాద పద్ధతి ద్వారా ఫ్లూయెన్సీ రాదు.

మరొక్క ముఖ్యమైన విషయం.

నన్ను అర్థం చేసుకోండి. గ్రామర్ అనవసరం అని నేను చెప్పటం లేదు. కానీ గ్రామర్ అనేది సహజ సిద్దంగా మనకు ఒంటబట్టాలి గానీ, ఇలా పట్టుపట్టి నేర్చుకుంటే, గ్రామర్ వస్తుందే గానీ ఆ భాషలో ఫ్లూయెంట్‌గా మాట్లాడటం రాదు.

ఇప్పుడు ఉదాహరణకి ఒక విషయం చెబుతాను.

ఐశ్వర్యా రాయ్ గారి మాతృభాష ఏమిటో మీకు తెలుసా?

అలాగే,దీపికా పడుకోన్ గారి మాతృభాష ఏమిటో మీకు తెలుసా?

అదేంటి సార్, మధ్యలో వాళ్ళ గూర్చి ఎందుకు ప్రస్తావన తెస్తున్నారు అని అంటారా? అక్కడికే వస్తున్నాను. ఐశ్వర్యా రాయ్ గారి మాతృభాష తుళూ భాష, దీపికా పడుకోన్ గారి మాతృభాష కొంకణీ భాష. అలాగే మన హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న అనేక లంబాడ తండాలలో నివసించే నాయక్‌ల మాతృభాష లంబాడీ భాష.

ఈ భాషలన్నింటికీ సామ్యం ఏమిటి అంటే ఈ భాషలకు లిపి లేదు. సహజంగానే పుస్తకాలు ఉండవు ఈ భాషలలో. అదే విధంగా గ్రామర్ పుస్తకలు ఉండవు కద.

అంత మాత్రానా ఆ భాషలకు గ్రామర్ (వ్యాకరణం) ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది.

ఆ భాషలే కాక ఇలా లిపి లేని ఎన్నో భాషలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. వాటికి ఖచ్చితంగా గ్రామర్ ఉంటుంది. ఆ భాషలలో మాట్లాడటం నేర్చుకోవాలి అంటే, మీరేం చేయాలి? పని కట్టుకుని ఆ గ్రామర్ సూత్రాలు నేర్చుకుని ఆ భాషలు మాట్లాడాల్సిన పని లేదు, ఆ భాష మాట్లాడే వ్యక్తులతో తిరిగి వారితో మాట్లాడుతూ ఉంటే, ఆ భాషలో మాట్లాడే పరిజ్ఞానం మనకు వస్తుంది.

ఇదే పద్ధతి ఇంగ్లీష్‌కి కూడా వర్తిస్తుంది.

వినడం, మాట్లాడుతూ ఉండటం ఇదే సరి అయిన పద్ధతి మనం ఒక భాషలో మాట్లాడాలి అంటే. కొబ్బరికాయలోకి నీరు చేరినంత సహజంగా గ్రామర్ మీద పట్టు మనకు సహజంగానే వస్తుంది ఇలాంటి సహజమైన పద్ధతి వల్ల.

అలా కాకుండా నేను గ్రామర్ నేర్చుకుని, అనువాదం చేస్తూ మాట్లాడతాను అని ఎవరైనా అనుకుంటే, వారు తమ ఫీలింగ్స్‌ని నెమ్మది నెమ్మదిగా కమ్యూనికేట్ చేయగలరే తప్ప హాయిగా (ఫ్లూయెంట్‌గా) మాట్లాడలేరు.

అనువాద పద్దతి ద్వారా మీకు మేము ఇంగ్లీష్ నేర్పిస్తాము అని ఎవరైన అంటున్నారు అంటే, వారు మీకు గ్రామర్ సూత్రాలు నేర్పిస్తారే తప్ప, మీకు ఫ్లూయెన్సీ వచ్చేటట్టు ఎట్టి పరిస్థితులలో చేయలేరు. ఇది ఖాయం.

ఇంకో అతి ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు. ఇది తెల్సుకుంటే మీరు అనువాద పద్ధతికి ఆమడ దూరంలో ఉంటారు.

మొదట మీకు సింటాక్స్ అన్న ఒక విషయం చెప్పాలి.

సింటాక్స్ అంటే వాక్య నిర్మాణం అని చెప్పుకోవచ్చు. తెలుగు భాషలో వాక్య నిర్మాణం ఎలా ఉంటుందో గమనించారా ఎప్పుడైనా?

ఇక్కడ కొన్ని వాక్యాలు ఇస్తున్నాను చూడండి.

  • అతను కారు నడుపుతున్నాడు
  • ఆమె వంట చేస్తూ ఉంది
  • వారు సినిమాలు నిర్మిస్తారు
  • ఆయన సంగీత దర్శకత్వం వహిస్తారు
  • నేను ఊరికి వెళ్ళాను

ఈ వాక్యాలు అన్నింట్లో మీరు గమనిస్తే ఒక అంశం కనిపిస్తుంది. అది ఏమిటి అంటే,

కర్త + కర్మ + క్రియ

(sub + Object + Verb)

అంటే తెలుగు భాషలో ఇది స్టాండర్డ్ వాక్య నిర్మాణం అన్న మాట. మీకు ఇతర భారతీయ భాషలలో ప్రవేశం ఉంటే మీరు ఇంకో ఆసక్తికరమైన విషయం తెల్సుకుంటారు, అదేమిటంటే ఒక్క తెలుగులోనే కాదు భారతీయ భాషలన్నింటిలోను ఇదే పద్ధతిలో వాక్య నిర్మాణం ఉంటుంది.

ఇప్పుడు మీకు కళ్ళు బైర్లు కమ్మే విషయం ఒకటి చెబుతాను.

కర్త + కర్మ + క్రియ అనే పద్దతిలో వాక్య నిర్మాణం ఉన్నప్పటికీ మీరు ఈ వాక్య నిర్మాణంలో ఎన్ని మార్పులు చేసినా అర్థం మారదు. అదే మన భారతీయ భాషలలో ఉన్న గొప్పదనం.

కావాలంటే చూడండి,

అతను కారు నడుపుతున్నాడు

అతను నడుపుతున్నాడు కారు

కారు అతను నడుపుతున్నాడు

నడుపుతున్నాడు అతను కారు

నడుపుతున్నాడు కారు అతను

కారు నడుపుతున్నాడు అతను

ఇలా వాక్య నిర్మాణంలో ఎన్ని మార్పులు చేసినా ఆ వాక్యం తాలూకు అర్థంలో ఏమీ తేడా లేదు. ఇది ఒక్క తెలుగులోనే కాదు, అన్ని భారతీయ భాషలకు వర్తిస్తుంది. ఇలాంటి వెసులుబాటు ఇంగ్లీష్ భాషకి లేదు.

మీరు ఇంగ్లీష్ వాక్యాలలో ఇష్టమొచ్చినట్టు అలాంటి మార్పులు చేసి వాక్య నిర్మాణం చేయబోతే అవి తప్పు వాక్యాలు అవుతాయి. వాటిని సింటాక్స్ ఎర్రర్స్ అంటారు.

కాబట్టి అనువాద పద్ధతి ద్వారా ఒక భారతీయ భాష నుంచి ఇంకొక భారతీయ భాష నేర్చుకోవచ్చేమో గానీ , ఇంగ్లీష్ మాట్లాడాలంటే, అనువాద పద్ధతి అస్సలు పనికిరాదు.

ఎందుకో మీరే చూడండి.

అతను కారు నడుపుతున్నాడు

He car is driving (X)

ఇంగ్లీష్ లో వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది అంటే

కర్త + క్రియ + కర్మ

sub + verb + Object

మరి తెలుగులో వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది మీకు తెలుసు కద

కర్త + కర్మ + క్రియ

Sub + Obje + verb

కాబట్టి అనువాదం చేస్తూ మాట్లాడే ప్రయత్నం చేసే కుర్రాళ్ళు, వారికి తెలియకుండానే

He car driving

She food cooking

He film watching

లాంటి వాక్య నిర్మాణం చేసి అందరూ నవ్వుతూ ఉంటే, కంగారు పడిపోయి ఇంగ్లీష్ మాట్లాడే ప్రయత్నం మానేస్తూ ఉంటారు.

కాబట్టి అనువాద పద్ధతి ద్వారా ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా మాట్లాడటం రాదు గాక రాదు.

మనం ముందు ముందు తెలుసుకోబోయే పద్ధతుల ద్వారా మీకు ఫ్లూయెన్సీ ఖచ్చితంగా వస్తుంది.

మీరంతా సిద్ధమే కదా.

(వచ్చే వారం Common Errors in English by Indian Speaker)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here