[dropcap]ఇం[/dropcap]టినుంచి పని
విడతలుగ కొనసాగుతుంటే,
ఇదే అదను సరి అనుకుని
గడుసరి గోపిక కన్న బిడ్డ మా కిట్టి,
సప్త సముద్రాలను చుట్టిన
భూమండలాన్నంతటిని
నోరు తెరచి మొదటి సారి
నెట్ వర్క్ ను చూపిన ఆచిన్ని కృష్ణునికి వీడు సాటి.
చెరసాలలో జనించిన
ఆ కన్నయ్యను తలపిస్తూ
మమతల బంధనాలకు చిక్కి,
గంపలకెత్తిన సంతసాల చిత్తపు
జల్లులు కురిసే వేళ
ప్రసార మాధ్యమాలలో
చేతుల కందని దూరాల
చిత్తరువుల మాయకు మారిన జగజెట్టి.
తోటి గోపాల బాలకులతో
తెల్లటి గోవులకు నడుమ
నవ్వుల మేఘం మెరుపులను రువ్వుతూ
చెడుగుడు ఆటల నాడిన
ఆనాటి క్రీడాపటువును తలపిస్తూ
రక రకాల లక్క బొమ్మలతో ఆడుతూ
ఆనంద కెరటాలకు పొంగిన శ్రీహరి కోటల
కాళీయ నృత్యం చేస్తుంటాడు మా చిట్టి.
జనపదాల రేపల్లెలో
ఆగడాల తెరువుల చెలరేగి,
నడయాడిన ఆ నాటి అడ్డాల
శిశువు వలె చిట్టి పాదాల నానుకుని
పాకుతు చిరు గజ్జెల సవ్వడితో
మా మురిపాల పెరుగు వెన్నల నిండు
మనసుల ఉట్టిని అంతరిక్షం అంచుల వరకు
కొల్లగొట్టిన పసివాడు మా పుట్టి.
కరుణల కన్నయ్య వీడు,
మా ముకు తాడును కట్టిన ఘనుడు,
వీధి తలుపులన్ని మూసుకున్న సమయాన
కనక దాసునకు ఆనాడు
కరి వరదుడు గుడితలుపులు తెరచినట్టు
మహా భాగ్యావకాశాన
ఆ దేవుడు నరుడై వచ్చినట్టు,
మా ముంగిట అవతరించి వచ్చిన
నాటకాల రసరాట్టు గారాల మా కుట్టి.