ఒడిశా రాష్ట్రంలో రాయగడ పట్టణం జిల్లా కేంద్రం. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు ఛత్తీస్‌ఘడ్ సరిహద్దులు. ఆంధ్రప్రదేశ్ దగ్గరగా ఉండడం, వైద్యం, విద్య కోసం విశాఖపట్నం; వ్యాపార లావాదేవీల కోసం విజయనగరం, వైజాగు మీద ఆధార పడడం మూలాన తెలుగు సంస్కృతి మా ఊర్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తెలుగు వార్తాపత్రికలు, తెలుగు సినిమాలకు కొదవలేదు.
ఉగాది వస్తుందంటే ఊపందుకొంటుంది మా రాయగడ. స్థానికంగా ఉన్న కళ్యాణమండపంలో కపిసేన… సారీ… కవులం చేరతాం. అక్కడ రామోజీరావు, పరుచూరి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాంటి పాత్రలు కనపడుతాయి. దినపత్రిక స్టింగర్ ఒకతను కవిసమ్మేళనానికి తానే కారకుడినని అన్నట్టు గోరోజనం చూపెడతాడు. ధోవతి, కండువా ధరించి అసలు సిసలైన ఆంధ్రుడిని నేనేనంటూ పండితుల వారొకరు పరుచూరిలా పరవళ్ళు తొక్కుతాడు. పురోహితుడి రాకతో పంచాంగ శ్రవణం ఆరంభమవుతుంది. కవితా పఠనంలో పాల్గొన్న కవులకు కండువా వేసి ఫోటోలు తీసుకోవడం ఒక సరదా. ఉగాది పచ్చడి, పులిహోర సేవించి ఎవరి ఇళ్ళకు వాళ్ళు తరలి వెడతాం. రాయగడలో ఉన్న ఆరేడు సంస్థలన్నీ కలిసి ఉత్సవకమిటీగా ఏర్పడి ఉమ్మడిగా యీ పండుగని నిర్వహిస్తాయి. అక్కడికి పక్షం రోజుల తర్వాత వస్తుంది ‘పనా సంక్రాంతి’. అది ఓఢ్రుల నూతన సంవత్సరం. పెరుగు, అరటిపళ్ళు, మిరియాల పొడి, పంచదార పలుకులు వేసి చిక్కగా పానకం చేసి పంచుతారు. కవితా గోష్ఠి ఉంటుంది.
ఉగాది నాటి సాయంత్రం కళ్యాణమండపం ప్రాంగణంలో వేదిక మీద వినోద కార్యక్రమం ఉంటుంది. ఒక ఏడాది సినీ నటుడు బాబూమోహన్, మరో ఏడాది సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ జనాలను తన వైదుష్యంతో రంజింపజేసారు.
రాష్ట్ర, కేంద్ర, పంచాయితీ ఎన్నికలుంటే ఆ ఏడాది ఏ సందడి ఉండదు, కారణం ఈ వేడుకలను జరిపించేది రాజకీయ పార్టీలు. నెటిజన్స్‌కి అర్థమయి ఉంటుంది.
మా ఊరికి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘జయపురం’కి ఒక చరిత్ర ఉంది. విక్రందేవ్‌వర్మ పరిపాలించిన పట్టణం ఇది. తెలుగు అంటే ఆయనకి పంచప్రాణాలు. స్థానిక ఎమ్.ఎల్.ఏ. ఉగాది వేడుకల్లో మమేకమైపోయి వచ్చిన కళాకారులతో స్టెప్స్ వేసి ప్రజలని అలరిస్తూంటాడు. తెలంగాణ శకుంతల, గొల్లపూడి మారుతీరావు, ఏ.వి.ఎస్. బాబూమోహన్, కళ్ళు చిదంబరం, వైజాగ్ ప్రసాదు తదితర సినీనటులు ప్రదర్శనలు ఇవ్వడం ముదావహం.
మాకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘బరంపురం’కి సిల్క్‌సిటీ అని పేరు. బరంపురం పట్టు వస్త్రాలకు ప్రసిద్ధి. అధిక శాతం తెలుగువాళ్ళున్న ఈ పట్టణంలో ఉగాది వేడుకలు చూడాలి. ఆంధ్ర భాషాభివర్ధని సమాజం, ఆంధ్రా సంస్కృతీ సమితి లాంటి సంస్థలు పిల్లలకు, మహిళలకు ముగ్గుల పోటీలు, క్విజ్ కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు పంచుతారు. కవి సమ్మేళనాలతో కనుల పండువగా సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వడం చెప్పుకోదగ్గ విషయం.
400 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాష్ట్ర రాజధాని ‘భువనేశ్వర్’కి ఒక ప్రత్యేకత ఉంది. సిటీ ఆఫ్ టెంపుల్స్ అని మరో పేరు. నగరం నడిబొడ్డునున్న యూనిట్ ఫోర్‌లో ఆంధ్రా కల్చరల్ అసోసియేషన్ షష్ఠిపూర్తి చేసుకున్న సంస్థ. పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి సేవనం, మహిళల ఆటపాటలు, వినోద కార్యక్రమాలతో తెలుగువాళ్ళకు ఆ రోజు ఆటవిడుపు. ఇక్కడికి ఇరవై, పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న కటక్ అతి పురాతన పట్టణం. తెలుగువాళ్ళు అత్యధికం. ఒక వీధికి తెలంగా బజారు అని కూడా పేరు. ఐక్యత అన్న సంస్థ ఉగాది పండగని అతి గొప్పగా చేస్తుంది. సంబరాలు అంబరాన్ని తాకుతాయి.
ఖుర్దా రోడ్డు, సంబల్‌పూరు, సునాబెడా తదితర పట్టణాల్లో కూడా ఉగాది వేడుకలు బాగానే జరుపుకుంటారు ప్రవాసాంధ్రులు.
– ఆనందరావ్ పట్నాయక్