[box type=’note’ fontsize=’16’] సంచిక కోసం సుప్రసిద్ధ కవి శ్రీ వి. ఆర్. విద్యార్థి గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది. [/box]
యుద్ధ భూమినుండి సాహితీ క్షేత్రానికి..!!
[dropcap]కొం[/dropcap]దరి జీవితాలు సమరం తోనే ప్రారంభమవుతాయి. సమరమే పునాదిగా భవితకు బంగారు బాటలు వేస్తాయి. అనుకోకుండా ఒకదానివెంట అలా సంఘటనలు జరిగిపోతూనే ఉంటాయి. ప్రస్తుత పరిస్థితి నుంచి ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుని గతాన్ని సింహావలోకనం చేసుకుంటే, మనం వేసిన ప్రతి అడుగూ ఒక్కో విచిత్ర వైనాన్ని మనకందిస్తాయి. పేదరికంతో యుద్ధము చేసి, దేశాన్ని సంరక్షించే విషయంలో శత్రు దేశాలతో యుద్ధం చేసి, విజయ గర్వంతో పదవీ విరమణ గావించడం; మళ్ళీ అందివచ్చిన ఉద్యోగ బాధ్యతలను శ్రద్ధగా కడకంటూ నిర్వహించడం చాలామంది జీవితాలలో అనుభవానికి రావచ్చు. అయితే దీనికి సమాంతరంగా తాము ఆశించిన, అమితంగా ప్రేమించి ప్రవృత్తిని ఇష్టంగా కొనసాగించడం కొద్దిమందికే సాధ్యం!
అలాంటి కొద్దిమందిలో ముందువరసలో చూడదగ్గ సాహిత్యకారుడు, కవి శ్రీ వి.ఆర్. విద్యార్థి గారు. వీరు చాలామందికి పుష్టికరమైన కవిగానే తెలుసును గాని, వాయు సేనలో పనిచేసి యుద్ధభూమిలో ‘రాడార్’తో అతి చాకచక్యంగా సేవలందించిన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సైనిక యోధుడని, నిజమైన భారతమాత బిడ్డడని చాలా మందికి తెలియదు. ఆయన విశ్రాంత జీవితంలో కవిత్వాన్ని అందించడమే గొప్ప శక్తిగా, తృప్తిగా భావిస్తున్న కవి విద్యార్థి గారు,తన జీవితాన్ని ఏ విధంగా విశ్లేషిస్తారో ఆయన మాటల్లోనే చదువుదాం!
~
ప్ర) విద్యార్థి గారూ నమస్కారం. మీ పూర్తి పేరు, కుటుంబ నేపథ్యం గురించి వివరిస్తారా?
జ) డాక్టర్ గారూ నమస్కారం. తప్పక ఈ వివరాలు మీకు తెలియజేస్తాను సార్. నా పూర్తి పేరు ‘వేలూరి రాములు విద్యార్థి’. ‘విద్యార్థి’ నా కలం పేరు. వేలూరి కమలమ్మ, నర్సయ్య (నరసింహ రావు) నా తల్లిదండ్రులు. వరంగల్లు నగరానికి ఆగ్నేయ దిశలో వున్న ‘గవి చర్ల’ గ్రామం నా జన్మ స్థలం. మాగ్రామం ప్రత్యేకత కలిగిన కాకతీయుల కాలం నాటిది. ఓరుగల్లు కోటకు నాలుగు దిక్కులా నాలుగు గ్రామాలున్నవి. అవి – తూర్పున మొగిలి చర్ల, దక్షిణాదిన గవి చర్ల, పడమరన ఉనికి చర్ల, ఉత్తరాన ముచ్చర్ల గ్రామాలు. ఈ నాలుగు గ్రామాలూ కాకతీయుల రాజధానియైన ‘ఆంద్ర నగరి’కి నాలుగు ద్వారాలు లాంటివి.
మా గవి చర్ల గ్రామంలో కాకతీయుల నాటి మూడు దేవాలయాలు ఉన్నాయి. అవి శివాలయం. పాంచాలరాయ దేవాలయం, గుండబ్రహ్మయ్య ఆలయం. ‘గుండబ్రహ్మయ్య’ – గురించి గవి చర్ల గురించి ఏకాంధ్రునాధుడు రచించిన ‘ప్రతాపరుద్ర చరిత్రము’ అనే గ్రంథంలో రాయబడింది. అట్లాగే శ్రీశైలంలో కూడా దీని గురించిన కొంత సమాచారం ఉందని చెబుతారు.
ప్ర) మీ జీవితం ‘యుద్ధం – శాంతి‘ అన్న పద్దతిలో నడిచిందనిపిస్తుంది. మొదట మీ యుద్ధం పేదరికంతో, ఆ తర్వాత దేశ రక్షణ కోసం సాగింది కదా! మీ బాల్యం చదువు గురించి చెప్పండి.
జ) మీరన్నట్టు, నిజంగా నాజీవితం అంతా సమరమే! ఒక విధంగా బాల్యం అంతా కడు పేదరికంలో గడిచింది. మాది వ్యవసాయ కుటుంబం. న్యాయంగా మా పూర్వీకుల నుండి రావాల్సిన ఆస్తి దక్కక, ఉన్న కొద్ది భూమిలో సైతం పంటలు పండక చాలా ఇబ్బందిగా ఉండేది. మా నాన్న ఒక యోగిలాంటి వాడు. ఆయన తన తండ్రితో పాటు సుప్రసిద్ధ హిందుస్తానీ గాయకుడు. మా నాన్నది గొప్ప గాత్రం. మా అమ్మ కష్ట జీవి, వ్యవసాయం చూసుకునేది. నా చదువు మా గవి చర్ల,లోనే సాగింది. అంటే పశువుల కొట్టంలో నడిచే ప్రభుత్వ పాఠశాలలో మొదలైంది. వెనకట మా నాన్నకు అక్షరాలు నేర్పిన సాతాని నారాయణ సారే.. నాకూ అక్షరాలు నేర్పాడు. అలా ప్రాధమిక విద్య గవి చర్ల లో, మాధ్యమిక, హైస్కూల్ విద్య మా వూరికి మూడు మైళ్ళ దూరంలో వున్న ‘సంగేమ్’లో జరిగింది. తర్వాత హన్మకొండలోని సుబేదారిలో వున్నఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సైన్స్ గ్రూపుతో ‘పి.యు.సి’ చదువుతూ ‘ఇండియన్ ఎయిర్‌ఫోర్స్’ లో చేరిపోయాను. ఒక వైపు ఉన్నత చదువులు చదివే స్తోమత లేకపోవడం, మరోవైపు, అమితమైన దేశభక్తి – ఈ రెండూ నేను సైన్యంలో చేరడానికి దోహద పడ్డాయి.
ప్ర) మీరు భారతీయ వాయుసేనలో చేరడానికి ప్రధాన కారణం?
జ) ముందే వివరించినట్టుగా ఒకటి – ఉన్నత చదువులు చదివే స్తోమత లేకపోవడం, రెండోది దేశభక్తి. సైన్యం అంటే యెనలేని ఆరాధన! నిజానికి నేను సైన్యంలో చేరడానికి నన్ను ప్రోత్సహించింది నాకు అన్నయ్యలాంటి లింగాల రాం చంద్రారెడ్డి. ఆయన ఆర్.ఎస్.ఎస్.కు చెందినవాడు. ఢిల్లీ లోని ఆర్.ఎస్.ఎస్., జనసంఘ్ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నవాడు. ఆయన తన తమ్ముడితో పాటు నన్నుకూడా ప్రోత్సహించడం వల్ల ఎయిర్‌ఫోర్స్‌లో చేరిపోయాము. రిక్రూట్మెంట్ పరీక్షలో అత్యధిక మార్కులు రావడం మూలాన మా ఇద్దరికీ మంచి ట్రేడ్ (బ్రాంచి) దొరికింది. సైన్యంపై అభిమానం పెంచుకోవడానికి కారణం మాత్రం మా మేనత్త భర్త జయసేన. ఆయన ఆర్మీల మరాఠా రెజిమెంట్‌లో పనిచేసేవారు.
ప్ర) తెలుగు భాషపై మీకు మక్కువ యెట్లా ఏర్పడింది? అందుకు కారకులు ఎవరు?
జ) చిన్నతనంలో (రెండవ తరగతిలో) మా భట్రాజు సారు ‘కవులు’ అంటే తెలుసా? అని క్లాసు పిల్లలకు ప్రశ్న వేశారు. నేను వెంటనే లేచి “తెల్సు సార్, మా భూమిని కౌలు కిచ్చినం గదా! కవులంటే అదే సార్” అని అన్నాను. మా సారు పెద్దగా నవ్వి “భడవా! కవులంటే కౌలు చేసే వాళ్ళు కాదు. కవిత్వం రాసేవాళ్ళురా! వాళ్ళు పుస్తకాలు రాస్తారురా” అన్నారు. క్లాసులో మిగతా పిల్లలకు కూడా కవులంటే తెలీదు మరి! అయితే మా సారు అలా చెప్పినప్పటి నుండీ వారం రోజులపాటు నాలో ఒకటే ఆశ్చర్యం, మథనం. అసలు స్వంతంగా రాయడం ఎట్లా? అని నాలో ఆలోచనలు. అప్పటినుండీ తెలుగు భాషపై మక్కువ పెరిగింది. దానికి తోడు నాకు సదాశివరావు, సాంబశివరావు గారు లాంటి తెలుగు పండితులు నాకు చదువు చెప్పడం వల్ల, తెలుగుపై ప్రత్యేకమైన ఇష్టం ఏర్పడ్డది. మా పూర్వీకుల్లో ఒక కవి పండితుడు వున్నారని ఆ చిన్నతనంలో నాకు తెలీదు!
ప్ర) మీ మొదటి రచన ఎప్పుడు, ఏ పత్రికలో వచ్చిందో చెబుతారా?
జ) నిజానికి నేను 11-12 ఏళ్ల మధ్యనే మొదటి కవిత – “హిమాలయపు కొండల్లో / కొంకర్లు పోయే చలిలో.. / బార్దర్లు కాసే సైనికుడా !’’ అని,కాగితంపై రికార్డు చేసాను. ఇంచుమించు అప్పటి నుండీ ఏదో ఒకటి రాస్తూ పోవడం అలవాటైంది.
1966లో (అప్పుడు ఎయిర్‌ఫోర్స్‌లో పని చేసేవాడిని) బరోడాలోని ‘మఖరపురా ప్యాలెస్’లో ఉండేవాళ్ళం. ఒక రాత్రి కలలో ఒక అపరిచిత స్త్రీ నాకు ఒక కవితను డిక్టేట్ చేస్తూ మధ్యలోనే అదృశ్యమైపోయింది. మరునాటినుండీ క్రమం తప్పకుండా కవితలు రాయడం జరిగింది. వాటిలో కొన్ని మా కుటుంబానికి దాగ్గరి వారైన ప్రజాకవి ‘కాళోజి’ గారికి పంపించాను. వాటిలో కొన్ని హన్మకొండ లోని ‘మిత్రమండలి’ అనే సాహిత్య సమావేశంలో వినిపించారు. ‘మా వూరు’ అనే కవితకు అక్కడ బాగా పేరు వచ్చింది. ఇక అప్పటినుండీ కాళోజీ సోదరులు నన్ను బాగా ప్రోత్సాహించడం జరిగింది. ఈ నేపథ్యంలో 1969లో, నా మొదటి కవిత ‘లో వెలుగులు’ అనే సంకలనంలో ‘రాములు’ పేరు తోనే వచ్చింది. అప్పుడు నేను బెంగుళూరులో వున్నాను. అచ్చులో, నా కవితను చూసుకుని చాలా ‘థ్రిల్’ గా ఫీల్ అయ్యాను. ఎయిర్‌ఫోర్స్‌లో నా తెలుగు మిత్రులకు చూపించాను.
ఆ తర్వాత 1975లో నాటి ప్రముఖ పాత్రికేయులు, ఆంద్రజ్యోతి సంపాదకులు నార్ల వెంకటేశ్వర రావు గారు పరిచయమై నా కవితల్ని బహుదా ఇష్టపడి, చాలా కవితల్ని ఆంద్రజ్యోతిలో ప్రచురించినారు.
ప్ర) విద్యార్థి గారూ మీరు ఎక్కువగా కవిత్వమే రాస్తారనుకుంటాను కదా! మీ అభిమాన కవులు ఎవరండీ?
జ) నేను చిన్నతనంలో చిన్న.. చిన్న కవితలు, కథలు, వ్యాసాలూ రాసేవాడిని. కానీ, తర్వాత ఒక తాత్విక దృష్టితో లోకాన్ని చూడడం అలవడి ఆ అనుభవాల్ని అనుభూతుల్ని కవిత్వ మాధ్యమం ద్వారా ప్రకటించడం ఉత్తమంగా ఉంటుందని కవిత్వం పైననే నా దృష్టిని కేంద్రీకరించాను. అలా నా కవిత్వ రచనా వ్యాసంగం కొనసాగింది.
నాకు అభిమాన కవులు చాలా మందే వున్నారు. తెలుగులో – శ్రీశ్రీ, తిలక్, కాళోజీ సోదరులు, అలాగే మా పై తరంవాళ్ళునూ. నా తరంలో నా సీనియర్స్ ఒకరిద్దరు వున్నారు. నేను నా కవిత్వంలో తొంబై పాళ్ళు తెలుగు కవులకు, తెలుగు నెలకు దూరంగా ఎక్కడో, ఉత్తర భారతంలోనో, ఉత్తర అమెరికా లోనో రాసిందే! అందుకే ఇక్కడి సాహిత్యోద్యమాలతో నేను అంతగా ప్రభావితుణ్ణి కాలేదు, నాపై ఎవరి ప్రభావం ఉందో ఇదమిత్థంగా చెప్పలేను. అది పాఠకులే చెప్పాలి. కాకుంటే తెలుగు ఆధునిక కవిగా ఎదగడానికి ‘అధ్యయనం’ చాలా ఉపయోగ పడింది. ప్రపంచ సాహిత్యంలో, ఆధునిక కవుల్లోనూ చాలామంది అభిమాన కవులున్నారు.
ప్ర) మీరు రాసే కవిత్వానికి సాధారణంగా ఎట్లాంటి అంశాల్ని ఎన్నుకుంటారు? ప్రేమ కవిత్వంపై మీ అభిప్రాయం?
జ) మీరనుకుతున్నట్లు అలా ఎన్నుకోవడం అంటూ ఏమీ ఉండదు. ఎదురైన అంశం లేదా సమస్యను బట్టి ఎట్లా స్పందిస్తే అట్లా రాస్తాను. అంటే దేనికి స్పందిస్తే దానిపై రాస్తాను. అది అలా వుంచితే, కవికి ఒక దృష్టి అంటూ ఉండాలి. అలాగే కవి దార్శనికుడై ఉండాలి. నేను రాసిన/రాస్తున్న కవిత్వంలో ఎక్కువగా, ప్రకృతి, ప్రేమ తాత్వికత, అనే ముఖ్యమైన సామాజిక అంశాలుంటాయి.
ఇక ‘ప్రేమ కవిత్వం’ గురించి చెప్పాలంటే, నా దృష్టిలో ప్రేమ కవిత్వం – అమ్మాయిలూ, అబ్బాయిల మధ్య ఏర్పడే ఆకర్షణ నుండి పుట్టిన కవిత్వం కాదు. ‘ప్రేమ’ అనేది పూరిగా భిన్నమైన విషయం.
ప్ర) ప్రఖ్యాత తత్వవేత్త శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారితో మీకు పరిచయం ఉన్నట్లు చెబుతారు. అది ఎట్లా జరిగింది? మీ చిన్నవయస్సులోనే వారితో చర్చలు చేసే అవకాశము మీకు ఎట్లా వీలైంది? వారి ప్రభావం ఏమైనా మీ వ్యక్తిత్వం పై మార్పు కలిగించి ఉంటుందంటారా?
జ) మీరన్నది నిజమే! నా పదహారేళ్ళ వయస్సులోనే శ్రీ జిడ్డు కృష్ణమూర్హి గారి ఆలోచనా విధానానికి ఆకర్షితుడనై వారి ఉపన్యాసాలు శ్రద్ధతో చదివాను. 1969 డిశంబర్‌లో మద్రాసుకు వెళ్లి వారి ఉపన్యాసాలు వినడం కూడా జరిగింది. అలాగే గ్రూపు చర్చల్లో పాల్గొన్నాను. చివరికి 1970, జనవరి ఐదున వారితో స్వయంగా సంభాషించే అవకాశం దొరికింది. జీవితపు మౌలిక అంశాలపై వారితో చర్చించి, నా సందేహాలు తీర్చుకున్నాను. అప్పుడు నా వయస్సు ఇరవై నాలుగేళ్లు మాత్రమే! ఇక నాపై వారి ప్రభావం సంగతి అంటారా – అవును నా ఆలోచనా విధానంలో, ప్రపంఛాన్ని దర్శించే విధానంలో చాలా మార్పు వచ్చింది. ఈ ప్రపంచాన్ని మరో డైమెన్షన్‌లో చూడగలుగు తున్నాను.
ఇకపోతే జిడ్డు కృష్ణమూర్తి గారిలా వైయక్తిక జీవితాన్ని గడుపుతున్నానా? అంటే చెప్పడం సాధ్యం కాదు. ఆ ‘అంశం’ చాలా లోతైనది, చాలా చర్చించవలసినదీనూ. చాలా విషయాలకు రియాక్ట్ అవుతుంటాను, వాటి ప్రభావాలకు లోనవుతుంటాను కానీ బయట పడిపోతుంటాను. ఇలాంటి విషయాలకు సరైన సమాధానం అంటూ దొరకదు.
ప్ర) కాళోజీ సోదరులతో మీ పరిచయం గురించి చెప్పండి. మీకు తెలిసినంత వరకూ తెలంగాణా ఉద్యమంలో కాళోజీ పాత్ర ఎటువంటిది ?
జ) కాళోజీ సోదరులతో పరిచయం నా ఎనిమిదేళ్ల వయస్సులోనే ఏర్పడ్డది. అది కూడా మా కుటుంబాల మధ్య ఉన్న బంధుత్వాల వల్ల ఏర్పడిందని చెప్పాలి. కాళోజి విశ్వమానవుడు. ఆయనకు భౌగోళిక సీమలు హద్దులు కావు. కాకుంటే తాను పుట్టిన గడ్డకు అన్యాయం జరుగుతున్నది కనుక ‘విశాలాంధ్ర’ ఏర్పడడంలో ముఖ్య పాత్ర వహించిన వాళ్లలో ఒకడైన కాళోజి తర్వాత తెలంగాణావాది అయినాడు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి నాయకత్వం వహించాడు. తెలంగాణా ఉద్యమంలో కాళోజీ పాత్ర అద్వితీయమైనది, అపూర్వమైనదీ, రాజకీయాలకు అతీతమైనదీనూ!
ప్ర) తెలంగాణా తొలి/మలి ఉద్యమాలతో మీకు ఎటువంటి సంబంధాలు ఉండేవి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణా ప్రజలు కోల్పోయింది ఏమిటీ? ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం సాధించిన తర్వాత సాధించిన విజయాలేమిటీ?
జ) తెలంగాణా తొలి ఉద్యమ కాలంలో నేను సైన్యంలో ఉన్నాను. కనుక ఇక్కడ నా పాత్ర అంటూ ఏమీ లేదు. అయితే ఉద్యమాన్ని సమర్థిస్తూ కొన్ని కవితలు రాసి ఇక్కడి మిత్రులకు పంపించాను. మలి ఉద్యమంలో కూడా రాజకీయంగా నా పాత్ర అంటూ ఏమీ లేదనే చెప్పాలి. ఇకపోతే సాహిత్య పరంగా ‘తెలంగాణా రచయితల వేదిక’, ‘తెలంగాణా రచయితల సంఘం’ వ్యవస్థాపకుల్లో ఒకడిగా, అలాగే రచయితల ‘జె.ఏ.సి’ లో సభ్యుడిగాను వున్నాను. మిత్రులతో కలిసి చైతన్య మహాసభలు ఏర్పాటు చేసాము. అనేక కవి సమ్మేళనాలు ఏర్పాటు చేసి ప్రత్యేక తెలంగాణా కోసం ఉద్యమించిన వాళ్ళల్లో నేనూ ఒకణ్ణి.
విశాలాంధ్ర ఏర్పడ్డాక సాంస్కృతికంగా, ఆర్థికంగా ఎంతో కోల్పోయింది తెలంగాణా ప్రాంతం. చివరికి ద్వితీయ శ్రేణి పౌరుడి స్థాయికి దిగజారిపోయారు ఇక్కడి ప్రజలు. ఈవాళ తెలుగునేల ఇలా రెండుముక్కలు కావడానికి ఆంధ్రా మేధావులు, రాజకీయ నాయకులూ ప్రధాన కారణం అని నేను అనుకుంటున్నాను, ఆంద్ర ప్రజలు మాత్రం కానేకాదు!
తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి ఏడేళ్లే కదా అయింది! ఆశించిన విధంగా అభివృద్ది చెందడానికి సమయం పట్టవచ్చు. ముఖ్యంగా యువతకు దీని ఫలాలు దక్కవలసి వుంది. వాళ్ళ అస్థిర జీవితాలను తలచుకుంటేనే బాధ కలుగుతుంది. ఎట్లాగూ.. రాజకీయాలు.. రాజకీయాలే! ఇప్పుడైనా, ఎప్పుడైనా, యువతరం అప్రమత్తంగా ఉండవలసిందే! అప్పుడే తగిన అభివృద్ధి, పొందవలసిన విజయాలూను.
ప్ర) మీరు 1965, 1971 యుద్దాలలో పాల్గొన్న విషయం చాలామందికి తెలియదు. ఆ యుద్దాలలో మీ పాత్ర ఎలాంటిది?
జ) ఈ రెండు యుద్దాల్లోనూ నేను తూర్పు పాకిస్తాన్ సరిహద్దుల్లో వున్నాను. నేను టెక్నికల్ పర్సన్ అయినప్పటికీ ప్రాథమికంగా ‘కంబిటెంట్ సోల్జర్’ని కనుక మా మిలటరీ సాయుధులను కాపాడవలసి ఉంటుంది. 1971-బంగ్లాదేశ్ యుద్ధంలో నాది ఎంతో విశిష్టమైన పాత్ర. నాది అంతా ‘రాడార్’తో పని. ఆ రాడార్‌ను ఆపరేట్ చేస్తున్నప్పుడు, మిగతా టీమ్ రాడార్ స్కోపులు పూర్తిగా శత్రువుచే ‘జామ్’ చేయబడ్డాయి. నేను ఉపయోగిస్తున్నది మాత్రం కొంత మేరకు సురక్షితంగా వుంది. అతి జాగ్రత్తగా శత్రు విమానాల జాడను గుర్తించి, ఆ సమాచారాన్ని మా డైరెక్టర్ (కమాండింగ్ ఆఫీసర్) గారికి అందించడం వల్ల శత్రు విమానాలను తరిమి కొట్టడానికి, ఆ పైన ధ్వంసం చేయడానికీ, నా సమాచారమే కారణం అయింది. నిజం చెప్పాలంటే ఈ యుద్ధంలో చాలా ప్రమాదం నుండి పడ్డట్టే!
ప్ర) తెలుగు నేలకూ, తెలుగు సాహితీ మిత్రులకూ దూరంగా ఎక్కడో దేశ సరిహద్దుల్లో సైనిక కార్యకలాపాలలో నిమగ్నమై వుండే మీరు అసలు కవిత్వం ఎట్లా రాయగలిగారు?
జ) తెలుగు సాహితీ మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సజావుగా సాగుతుండేవి. సెలవుల్లో వచ్చినప్పుడు వివిధ పత్రికలూ, సాహిత్య సంబంధమైన పుస్తకాలు తెచ్చుకుని, వాటిని సమగ్రంగా అధ్యయనం చేస్తుండేవాడిని. నాకు డ్యూటీ లేని సమయంలో నేను కేవలం చదవడం, రాయడం మాత్రమే చేసేవాడిని. అందరికీ దూరంగా ఉండడం వల్ల నా కవిత్వం చాలావరకూ స్వతంత్రంగానే వున్నది, ఎలాంటి వాదాలలో కొట్టుకుని పోలేదు!
ప్ర) సైన్యంలో మీ సేవలను గుర్తించి ప్రభుత్వం ఏమైనా అవార్డులు ఇచ్చిందా?
జ) ప్రభుత్వం నుండి ప్రత్యేకమైన అవార్డులు ఏమీ రాలేదు. 1971లో మాత్రం నా పనితనాన్ని గుర్తించారు గానీ, అవార్డు మాత్రం మా ఇంచార్జికి ఇచ్చారు.
ప్ర) వైమానిక దళం నుండి స్వచ్ఛందంగా ఎందుకు పదవీ విరమణ చేయవలసి వచ్చిందో చెబుతారా?
జ) కారణం లేకపోలేదండీ! సైనికుడిగా పదిహేనేళ్ల సర్వీసులో ఎప్పుడూ నేను క్రమశిక్షణ తప్పిన సంఘటనలు లేవు. నాపై ఎప్పుడూ చెడ్డ రిమార్కులు కూడా రాలేదు. కానీ జిడ్డు కృష్ణమూర్తి గారిని కలిసి చర్చించిన తర్వాత సైన్యంలో పనిచేయ వద్దని నిశ్చయించుకున్నాను. అందువల్లనే స్వచ్ఛంద పదవీ విరమణ చేయవలసి వచ్చింది.
ప్ర) మీది ప్రేమ వివాహమా? మీ పెళ్లి ఎప్పుడు జరిగింది?
జ) మాది పెద్దలు ఏర్పాటుతో జరిగిన వివాహమే. మా పెళ్లి ఫిబ్రవరి 14, 1971 న జరిగింది. పెళ్ళైన తర్వాతనే ప్రేమలో పడ్డాం. నా సహచరికి కవితల రూపంలో ఉత్తరాలు రాస్తూండేవాడిని. 1971లో యుద్ధరంగం నుండి ఆమెకు రాసిన ‘సైనికుడి ఉత్తరం’ చాలా ప్రాచుర్యం పొందిన కవిత.
ప్ర) సాహిత్య సృజనలో మీ శ్రీమతి గారి ప్రోత్సాహం ఎలా ఉండేది సెలవిస్తారా?
జ) తాను కవిత్వం రాయకపోయినా, మంచి భావుకత వున్న మహిళామణి. నన్ను ఎప్పుడూ రాయమని ప్రోత్సహిస్తుంది. నేను స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన తర్వాత మా ఇంటికి ఎంతోమంది సాహితీ మిత్రులు కుటుమాలతో సహా వచ్చేవారు. వారందరికీ నా శ్రీమతి స్వయంగా భోజనాలు ఏర్పాటు చేసేది. ఇప్పడు కరోనా కారణం వల్ల మంచికో, చెడ్డకో, రాకపోకలు బంద్ అయినాయి.
అతిశయోక్తి కాదు గానీ కాళోజి గారి ఇల్లు తర్వాత సాహిత్యకారులకు మా ఇల్లే కేంద్రంగా ఉండేది. గంటల తరబడి చర్చలు జరిగేవి. సాహిత్యం తప్ప మరో అంశం మా చర్చల్లో చోటు చేసుకునేది కాదు. గత పదమూడు సంవత్సరాలుగా ‘మిత్ర మండలి’ సమావేశాలు ఎక్కువగా మా ఇంట్లోనే జరిగాయి.
ప్ర) మీ పిల్లలకు సాహిత్యంపట్ల అభిరుచి ఏమైనా ఉందా? మీరు వాళ్ళకోసం తగినంత సమయం కేటాయించలేదనే అభియోగం మీమీదేమైనా ఉందా?
జ) సాహిత్యం అని కాకుండా నిజం చెప్పాలంటే మా కుటుంబంలో అందరూ ఏదో ఒక కళకు అంకితమైనవారే! మా నాన్న హిందూస్థానీ సంగీతంలో కొంత ప్రావీణ్యత ఉన్నవారే. సరే -నేను కవిత్వం రాస్తాను కదా! నా శ్రీమతికి క్రాఫ్ట్ వర్క్‌లో మంచి ప్రావీణ్యత వున్నది.
మా పెద్దకుమారుడు అమరేంద్ర వేలూరి, ఫోటోగ్రఫీ, పెయింటింగ్, కవిత్వం, ఆంగ్లంలో వ్యాసాలూ రాస్తుంటాడు. మా రెండో పుత్రుడు శైలేంద్ర వేలూరి మంచి విమర్శకుడు, సాహిత్యం బాగా చదువుతాడు. ఇకపోతే మా చిన్నకోడలు కూడా ఆంగ్లంలో కవిత్వం రాస్తుండేది, ప్రస్తుతం రాయడం లేదనుకోండి. అయితే చిన్నకోడలు తాతగారు పద్య కవి, ఆధ్యాత్మికుడు. మా మనుమరాళ్లు క్లాసికల్ డాన్సు నేర్చుకుంటున్నారు. ఒక మనుమరాలు హిందుస్తానీ సంగీతం కూడా నేర్చుకుంటున్నది. తర్వాత, పెద్ద మనుమడు పియోనాలో ఉద్దండుడు! స్వయంగా పాటలకు ట్యూన్లు కడతాడు. తద్వారా ఎన్నో పురస్కారాలు పొందాడు కూడా. చిన్న మనుమడు చాలా చిన్నవాడు. వీళ్లంతా అమెరికా పౌరులే!
మా కుమారులిద్దరూ ఇక్కడ చదువుకునే రోజుల్లో నేను ఎక్కువ సమయం వాళ్ళతో గడిపేవాడిని కాదన్నది వాస్తవం. కానీ మా ఇంటి సాహితీ వాతావరణం వాళ్లకు చాలా నేర్పింది అని గట్టిగా చెప్పగలను.
ప్ర) నిట్ – వరంగల్ (ఒకప్పటి రీజినల్ ఇంజనీరింగ్ కళాశాల) లో మీ అనుభవాలు, మీ సేవల గురించి చెప్పండి.
జ) ఎయిర్ ఫోర్స్ వదిలేసిన తర్వాత హైదరాబాద్ లోని ఒక టివి కంపెనీలో ‘క్వాలిటీ కంట్రోల్’ చూసేవాడిని. అది ఒక ప్రైవేట్ కంపెనీ. జీతం చాలా తక్కువగా ఉండేది. అలా రెండేళ్లపాటు ఆర్థిక ఇబ్బందులకు గురిఅయ్యాము. తర్వాత ఒకరిద్దరు, వరంగల్ సాహితీమిత్రుల సహకారం వల్ల అప్పటి ఆర్.ఈ.సి (ఇప్పటి నిట్) కి వచ్చి చేరాను. దాదాపు మూడేళ్లపాటు ‘నేషనల్ ఫిజికల్ లేబొరేటరీ’ వారి ప్రాజెక్టులో (రీసెర్చ్ వర్క్) పని చేసాను. తర్వాత ‘ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్’ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్ (అసిస్టెంట్ ఇంజనీర్‌కు సమానమైన రెగ్యులర్ పోస్టు) గా చేరి పద్దెనిమిది సంవత్సరాలు పనిచేసి పదవీ విరమణ చేసాను. ఆ కళాశాలలో పనిచేసిన రోజుల్లో కాలేజీ మ్యాగజైన్ తెలుగు విభాగానికి సహాయ సంపాదకుడిగా చాలాసార్లు పనిచేసాను. కళాశాలలో నిత్యం నిర్వహించే సెమినార్ల విషయాల వార్తలు పత్రికల కోసం తయారు చేసి పెట్టేవాడిని.
ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే కొందరు ప్రొఫెసర్లతో సన్నిహిత సంబంధాలు పెంచుకుని ‘సైన్స్ ఫిలాసఫీ’ ముఖ్యంగా నాకు చాలా ఇష్టమైన ఆస్ట్రో ఫిజిక్స్‌లో కొన్ని ప్రాథమిక సందేహాల్ని నివృత్తి చేసుకునే అవకాశం కలిగింది.
నేను పనిచేసిన కాలంలో సబ్జక్ట్స్‌లో అథారిటీ వున్న ప్రొఫెసర్స్ ఉండేవారు. ఈ కళాశాల వాతావరణం మా ఇద్దరు కుమారులను విద్యావంతులుగా తీర్చిదిద్దింది. ఇప్పుడు అదే కళాశాల నిట్‌గా రూపాంతరం చెందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు సమకూరుతుండడం వల్ల మరింత అభివృద్ధి దిశలో పయనిస్తున్నది. ఈ కళాశాల అప్పట్లోనే అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్నది.
ఈ కళాశాలలో ఎప్పుడూ, ఏవో సాహిత్య కార్యక్రమాలు జరుగుతుండేవి. మిత్రులం కొందరం కలిసి ఆకుల వెంకటేశ్వర్లు (సమత) ఆంగ్ల కవితల్ని ‘flora’ అనే పేరుతో ప్రచురించాం. ఆ పుస్తకం ఆవిష్కరణ సభ చాలా గొప్పగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ కాళోజీ, పాములపర్తి సదాశివరావు, ప్రొ. ఎస్. లక్ష్మణమూర్తి మొదలగు మహామహులు హాజరైనారు. ప్రొ. రోణంకి లక్ష్మణ మూర్తిగారు, ప్రొ. రాఘవాచార్య గారు ఈ కావ్య ప్రచురణకు ఆర్థికంగా సహాయ పడ్డారు.
ప్ర) మీ రచనల గురించి వివరించండి.
జ) ఎక్కువగా నేను కవిత్వమే రాసాను. కొన్ని సాహిత్య వ్యాసాలు కూడా రాయడం జరిగింది. ఇంతవరకూ నా కవిత్వం ఏడు సంపుటాలుగా వచ్చింది. అవి అలలు, పలకరింత, మంచు మైదానం, ఖండాతర, ఘర్మ సముద్రం, దృశ్యం నుండి – దృశ్యానికి, ఇతర కవితలు మొదలైనవి. ‘దక్కన్ దస్తూరి’, ‘ఓరుగల్లు చేవ్రాలు’ అనే సాహిత్య వ్యాస గ్రంథాలు ముద్రణకు సిద్ధంగా వున్నాయి. ఇంకా ప్రచురించాల్సిన కవిత్వం చాలా వుంది. నా ‘నోట్ బుక్’ కూడా ముద్రణకు సిద్ధంగా వుంది. నా కవిత్వం చాలా మట్టుకు ఆంగ్లము, ఉర్దూ, హిందీ భాషలలో అనువాదానికి నోచుకుని పుస్తక రూపం దాల్చాయి. మలయాళంలో కూడా అనువదింప బడ్డాయి, గానీ పుస్తక రూపం దాల్చలేదు.
వీటితో పాటు నాలుగు సమాలోచనా గ్రంథాలు వెలువడ్డాయి. ‘షాయర్’ అనే ఉర్దూ సాహిత్య పత్రిక, పాలపిట్ట తెలుగు మాసపత్రిక, నా గురించీ, నా కవిత్వం గురించీ ప్రత్యేక సంచికలు తీసుకు వచ్చాయి. అంతమాత్రమే కాకుండా, దూరదర్శన్,టి.వి -10, ఆల్ ఇండియా రేడియో, సాహిత్య గోదావరి, నమస్తే తెలంగాణా, ఆంద్రప్రభ, సాక్షి, ఆంద్రజ్యోతి పత్రికలు ప్రత్యేక ఇంటర్వ్యూలు ప్రచురించాయి.
అలాగే, ‘కవితా వార్షిక’కు సహా సంపాదకుడిగా వున్నాను. ‘దిక్కులు’ అనే వీడియో కవితా సంకలనానికి సంపాదకత్వం వహించాను. వరంగల్ లోని పోతన విజ్ఞాన పీఠంలో వరుసగా ఏడు సంవత్సరాలు అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించాను. ‘మిత్ర మండలి’కి గత పదమూడు సంవత్సరాలుగా కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నాను.
ప్ర) మీ అమెరికా సాహిత్య కార్యక్రమాల గురించి వివరంగా చెబుతారా?
జ) అమెరికా అనుభవాలు చాలా వున్నాయండి. 2001లో ‘తానా’ సభల్లో పాల్గొన్నాను. డెట్రాయిట్ నగరంలో నా కావ్యం ‘మంచు మైదానం’ ఆవిష్కరింపబడింది. ఇంకా మిల్ వాకీ, అట్లాంటా, కొలంబియా, డాలస్ నగరాల్లో నా చేత ఉపన్యాసాలు, కవితాగానం చేయించారు.
కవి శ్రీ విన్నకోట రవిశంకర్ నాకు ఆత్మీయ మిత్రుడు. ఆయన ద్వారా పెమ్మరాజు వేణుగోపాలరావు, వెల్చేరు నారాయణ రావు, వేలూరి వెంకటేశ్వర రావు గార్లు పరిచయమై వారితో పలుమార్లు సాహిత్య చర్చలు చేసే అదృష్టం నాకు కలిగింది. అలాగే డా. జంపాల చౌదరి లాంటి సాహితీవేత్తలతో పరిచయం పెరిగింది. అక్కడే ప్రపంచ సాహిత్యాన్ని ఆంగ్ల భాషలో అధ్యయనం చేసే సదవకాశం కలిగింది.
ప్ర) మీకు లభించిన పురస్కారాల వివరాలు చెప్పండి.
జ) పురస్కారాల విషయంలో నేను చాలా వెనుకబడి వున్నానేమో అనిపిస్తుంటుంది. అయినా వచ్చిన పురస్కారాలతో నేను తృప్తిగానే వున్నాను. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, వానమామలై వరదాచార్య పురస్కారం, జాషువా పురస్కారం (వరంగల్) సత్తుపల్లి వారిచే జీవిత సాఫల్య పురస్కారం లభించాయి.
ప్ర) వరంగల్ సాహితీ క్షేత్రంలో మీ పాత్ర ఎటువంటిది?
జ) కాళోజీ సోదరులు బ్రతికున్నంత కాలం చాలా కార్యక్రమాలు నిర్వహించాను. పోతన విజ్ఞాన పీఠం, మిత్రమండలి, జయమిత్ర వంటి సాహిత్య సంస్థలతో కలిసి పనిచేసాను. అనేక ఔత్సాహిక రచయితల కవితా సంకలనాలకు ముందుమాటలు రాసి ప్రోత్సహించాను.
ప్ర) జీవితం/ప్రపంచం గురించి మీ అభిప్రాయం చెప్పండి.
జ) ఇది ఎవరికైనా చిక్కు ప్రశ్నే. జీవితం గురించి ప్రత్యేకంగా ఒక అభిప్రాయం అంటూ ఏర్పరచుకోవడం సరైనది కాదనుకుంటాను. అదొక ప్రయాణం. ఆ ప్రయాణం ఎలాసాగుతుందో ఎవరూ చెప్పలేరు. ప్రపంచం విషయం కూడా ఇంచుమించు ఇంతే!
అయితే నా అభిప్రాయం ఏమిటంటే, ఈ ప్రపంచంలో ‘హింస’ తప్ప మరే పాపమూ లేదు. “అది చేస్తే పాపం… ఇది చేస్తే పాపం..” అని మతాలూ, తత్వవేత్తలూ చెప్పేవి కాలాన్ని బట్టి మారుతుంటాయి. అయితే హింస – అంటే కేవలం రక్తపాతం సృష్టించడం మాత్రమే కాదు, ఇంకా అనేక రూపాలలో హింస ఉంటుంది. అందుకే మానవజాతి ఆవిర్భావము నుండీ ఇప్పటివరకూ, ఇంకా ముందుకాలాల్లో కూడా ‘హింస’ ఒక్కటే నిషేదించ దాగిన అంశం. ఇదే నేను జీవితంలో తెల్సుకున్నది, నేర్చుకున్నది ,కులాలు మతాలూ దేశాలు, ఇంకా నానారకాల సరిహద్దులు, హింసను ప్రోత్సహించేవే! మానవ జాతికి ఏమాత్రం శాంతి లేకుండా చేసేవే, జాతి వినాశనానికి మూలాలే! ఈ హింసకు పునాది కేవలం స్వార్థమని ఆలోచిస్తే అందరికీ విషయం విదితమౌతుందనుకుంటాను.
ప్ర) ప్రస్తుతం కవిత్వం రాస్తున్న యువతీ యువకులకు మీరిచ్చే సందేశం ఏమిటీ?
జ) సందేశం అంటూ చెప్పేది ఏమీ లేదు కానీ, కొందరైతే మంచి కవిత్వమే రాస్తున్నారు. అయితే నేను గ్రహించింది ఏమిటంటే, వీరిలో అధ్యయనం లోపించింది.. కవిత్వం రాయాలనుకునేవారు ఆధునిక సాహిత్యంతో పాటు, పూర్వ కవుల సాహిత్యం కూడా అధ్యయనం చేయాలి. వారి రచనా విధానంలోని మెళుకువలను అవగాహన చేసుకోవాలి. అప్పుడే తమకంటూ ఒక ప్రత్యేక శైలి అలవడుతుంది. మంచి కవిత్వం రాసే అవకాశం ఏర్పడుతుంది.
~
మంచి సమాచారం అందించారు విద్యార్థి గారు. మీ జీవనయానం చాలామంది యువతీయువకులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. మీనుండి మరింత మంచి కవిత్వం రాబోయే రోజుల్లో పాఠకులకు అందుతుందనే ప్రగాఢ విశ్వాసంతో వున్నాము. ఈ సందర్భంగా నా పక్షాన, ‘సంచిక’ యాజమాన్యం పక్షాన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
** సంతోషం ప్రసాదుగారూ.. మీకు.. సంచిక సంపాదక వర్గానికీ ధన్యవాదాలండీ. నమస్కారం!