[dropcap]అ[/dropcap]నంతుడికి చిత్రకళ పట్ల ఎంతో ఆసక్తి. అందుకే హిమాలయ ప్రాంతంలో ప్రసిద్ధుడైన చిత్రదత్తుడనే గురువు వద్ద చిత్రకళను అభ్యసించాడు. అనంతుడు ఎంతో శ్రద్ధాశక్తులతో చిత్రకళ నేర్చుకుని మనుషుల్ని, పశుపక్ష్యాదుల్ని జీవం ఉట్టి పడేలా చిత్రీకరించేవాడు.
అలా చిత్రకళను అభ్యసించిన తరువాత గురువు చిత్రదత్తుడి వద్ద శెలవు తీసుకుని తన ఊరికి బయలు దేరేందుకు చిత్రదత్తుడి పాదాలకు నమస్కరించాడు.
“చూడు అనంతా, ఏ విద్య అయినా నేను పూర్తిగా నేర్చుకున్నాను అనుకోకూడదు. నిరంతరం అభ్యాసం చేస్తూనే ఉండాలి అనే తపన ఉండాలి. తపనే నిన్ను పరిపూర్ణ కళాకారుడిగా చేస్తుంది” అని ఆశీర్వదించి పంపాడు.
అనంతుడు హిమాలయాలనుండి తన ఊరికి బయలుదేరి మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకునేందుకు సూర్యముఖి అనే గురువు గురుకులంలో విశ్రమించాడు. సూర్యముఖి అనంతుడితో మాట్లాడుతూ అతని చిత్రకళను గురించి తెలుసుకున్నాడు. సూర్యముఖి మంచి తపస్సంపన్నుడు. ఆయనకు అనేక విద్యలు తెలుసు. అనంతుడి చిత్రకళను చూడాలని ఒక రాతి పలక మీద మందార పువ్వును గీయమని అడిగాడు.. అనంతుడు సూర్యముఖికి నమస్కరించి రాతి పలక మీద అధ్బుతంగా మందార పువ్వు, కొమ్మ, ఆకుల్ని చిత్రీకరించాడు. ఆ బొమ్మలో జీవకళ ఉట్టి పడింది!
సూర్యముఖి చిరునవ్వు నవ్వి, “జీవం ఉట్టిపడేలా చిత్రీకరించావు, నీ చిత్రకళ అద్భుతం. మరి నీవు గీసిన బొమ్మకి ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో చూస్తావా?” అంటూ ఆ బొమ్మ మీద చేతిని తిప్పి ఏదో మంత్రం చదివాడు. చిత్రంగా ఆ మందార చిత్రం నిజమైన కొమ్మతో కూడిన పుష్పంగా మారి రాతి పలక నుండి జారి పడింది!
అనంతుడు అమిత ఆశ్చర్యంతో సూర్యముఖి కాళ్ళ మీద పడి, “మహానుభావా మీ శిష్యరికంలో మీ చిత్రప్రాణ విద్యను అభ్యసించాలనుకొంటున్నాను. నన్ను ఆశీర్వదించండి” అని వేడుకున్నాడు.
అనంతుడి జిజ్ఞాస చూసి సూర్యముఖి అనంతుణ్ణి తన శిష్యుడుగా చేర్చుకుని రెండు సంవత్సరాలలో చిత్రకళలో అనేక మెళకువలతో బాటు చిత్రప్రాణ విద్య కూడా నేర్పించాడు. ఆ విద్యను పూర్తి చేసుకున్న తరువాత సూర్యముఖి పాదాలకు నమస్కరించి తన ఊరు వెళ్ళేందుకు అనుమతి కోరాడు.
“నాయనా నీకు చిత్రప్రాణ విద్య నేర్పించాను. కానీ నీవు అనవసరంగా వాడకూడదు. అదిగాక ఆ విద్యను ప్రదర్శిస్తున్నప్పుడు ఎంతో లోకజ్ఞానం, ఆలోచన అవసరం. ఆ విద్య వలన నీకు గానీ మరి ఎవ్వరికైనా హాని జరుగకుండా ప్రదర్శించు” అని ఆశీర్వదించి పంపాడు.
ఆ విధంగా ఆశీర్వాదం పొందిన అనంతుడు తన ఊరికి బయలు దేరి మార్గమధ్యంలో శంభుసింహ మహారాజావారి ఆస్థానానికి వెళ్ళి తన చిత్ర ప్రాణ విద్యను ప్రదర్శించాడు. అందమైన పక్షుల్ని, కుందేళ్ళను చిత్రీకరించి వాటికి ప్రాణం పోశాడు!
శంభుసింహ మహారాజు ఆశ్చర్యపోయి తన పెంపుడు పులిని బోనులో చూపించి దానిని చిత్రీకరించి ప్రాణం పోయమని చెప్పాడు.
“మహారాజా ఆలోచించండి, అది క్రూర జంతువు. దానిని సృష్టిస్తే అది మననే చంపగలదు” చెప్పాడు అనంతుడు.
“నీ జ్ఞానం ఉపయోగించి మన మీద అది దాడి చేయకుండా ఉండేటట్టు చిత్రీకరించు… చూస్తాను” అని నవ్వుతూ అన్నాడు మహారాజు.
అనంతుడు పులిని చూసి పులి చిత్రాన్ని కోట గోడ మీద అధ్బుతంగా చిత్రీకరించాడు. కానీ ముందరి రెండు కాళ్ళని చెరిపివేసి ఆ చిత్రానికి ప్రాణం పోశాడు!
కాళ్ళు లేని కుంటి పులి వారి ముందు ప్రత్యక్షమయి అలాగే కూర్చుండి పోయింది. శంభుసింహ చప్పట్లు కొట్టి, “ఆ విధంగా కాళ్ళు లేని పులి చిత్రీకరించే బదులు దానికి గొలుసు చిత్రీకరించి బంధించి ఉండవచ్చు కదా” అన్నాడు.
“మహారాజా, ప్రాణం పోయడమన్నది కేవలం మనుషులు, జంతువులు చెట్ల వంటి ప్రాణులకు మాత్రమే. అది అయినా తాత్కాలికమే. ప్రాణం లేని గొలుసు, వస్తువులకు నేను ప్రాణం పోయలేను, సృష్టించలేను” అని శంభుసింహుని అనుమానాన్ని నివృత్తి చేశాడు.
శంభుసింహుడు అనంతుడి కళను పొగిడి బోలెడు బంగారం, తన రాజ ముద్రికతో కూడిన ప్రశంసా పత్రం ఇచ్చి,”నీ కళ ను దుర్వినియోగం చేయకుండా ప్రజలను ఆనంద పరచడానికి మాత్రమే చిత్రీకరించు. నీకు సమ్మతమైతే నా ఆస్థాన చిత్రకారుడిగా చేరు” అన్నాడు శంభుసింహుడు.
అనంతుడు సంతోషంతో శంభుసింహ మహారాజు ఆస్థాన చిత్రకారుడిగా చేరి మహత్తర చిత్రాలు చిత్రీకరిస్తూ అద్భుత చిత్రకారుడిగా పేరు తెచ్చుకున్నాడు.