కరెంట్ బొమ్మ

1
3

…. …… …….. …….

[dropcap]తే[/dropcap]జస్… తేజస్…!

కొంచెం కొంచెం తెలివి వస్తోంది.

చుట్టూ ఏమీ కనబడటంలేదు. ఎవరో మాత్రం అతనిని పిలుస్తున్నారు. ముఖం మీద తట్టి నిద్ర లేపటానికి ప్రయత్నిస్తున్నారు..

మెల్లమెల్లగా పరిసరాలు అస్పష్టత నుంచి స్పష్టత లోకి వస్తున్నాయి. డెటాల్ వాసన కొంచెం కొంచెం ముక్కుకి తగులుతోంది. కళ్ళకు తెల్లగా గోడలు కనిపిస్తున్నాయి. మానిటర్ లోనుండి బీప్ బీప్ మనే ధ్వనులు వినిపిస్తున్నాయి. కుడివైపున ఐవి స్టాండ్, దాంట్లోంచి సెలైన్ బాటిల్ దాని వెనకాల ముఖానికి మాస్కులు వేసుకుని వున్నవ్యక్తులు కనిపించసాగారు..

పక్కన పొడుగ్గా తెల్ల కోటులో వున్న వ్యక్తి మెడలో స్టెతస్కోప్ తలమీద ఆకుపచ్చని టోపీతో నోటికి ఎన్95 మాస్క్‌తో అతని వంకే చూస్తున్నాడు..

“లేవండి! కళ్ళు తెరవండి!” గట్టిగా నుదిటి మీద కన్ను చివర నొక్కుతున్నాడు.

“అబ్బా! నొప్పి!” అన్నాడు తేజస్.

“ఓకే! దట్స్ గుడ్! మీ పేరు చెప్పండి! “

“గుర్తుకు రావడం లేదు!”

తన పేరు ఏమిటి?

మరొక వ్యక్తి కొంచెం వయసులో పెద్దగా ఉన్నాడు. ఇతను డాక్టర్ వేషం లోనే ఉన్నాడు. ఇతను ఇంకా గట్టిగా తేజస్ చెంపల మీద కొట్టాడు.

“అబ్బ్…భ్భ .నొప్పి.” కళ్ళు తెరిచాడు.

కుడి చేయి తీసి చెంపమీద తడుముకోబోయాడు.

ఇప్పుడు బాగా స్పృహ వస్తోంది. తెలివి వస్తోంది.

తన కుడి చేయి లేదు!

కుడికాలు ఎత్తబోయాడు.

తన కుడి కాలు కూడా లేదు!

గుర్తుకొస్తోంది. నా పేరు తేజస్. నాకు ఏమైంది? నా చేతికి ఏమైంది!?

ఏమైందో నువ్వే చెప్పు! గుర్తుకు వస్తోందా?

కొంచెం కొంచెం , కానీ నా చెయ్యి ఏదీ, నా కాలు ఏదీ?… ఆగండి రాత్రి నైట్ డ్యూటీ చేసి ఈ ఉదయం ఆరు గంటలకు తిరిగి వెళ్లిపోయాను. యూనివర్సిటీ తర్వాత ఓవర్ బ్రిడ్జి వచ్చింది.

ఎదురుగా హెడ్లైట్లు మీద మీదికి వచ్చాయి నేను ఎలక్ట్రిక్ కార్లో భూమికి కొంచెం పైగా ఎగిరి వెళుతున్నాను.

యాక్సిడెంట్. ట్రక్కు నన్ను గుద్ది వేసింది. తల మీద పెద్ద దెబ్బ తగిలింది అనుకుంటాను. అంతా బ్లాక్ ఔట్..

మళ్లీ ఇప్పుడే తెలివి వస్తోంది.నా చెయ్యి కాలు లేవు. ఏం చేశారు? తేజస్ అరుస్తున్నాడు.

కొంచెం సేపు బీప్ బీప్ మని మానిటర్ శబ్దాలు తప్ప అంతా నిశ్శబ్దం. తెల్లటి దుస్తులు గ్రీన్ ఫేస్ మాస్కులు క్యాపులలో నర్సులు చుట్టూ నిలబడ్డారు.

నువ్వేం పని చేస్తావో చెప్పు! గుర్తు తెచ్చుకో!

గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. లీలగా దృశ్యాలు. తాను కూడా పూర్తి గ్రీన్ కలర్ పి.పి.యి కిట్‌లో ఆకుపచ్చని హెడ్ క్యాప్ ఎర్రని గాగుల్స్‌లో ఐసీయూ ప్రోగ్రాంలో ఉన్నాడు. ఎర్రటి క్రాస్ బొమ్మతో ఐసియు అనే బోర్డు కనిపిస్తోంది.

నిన్ననే ఈ స్థలంలోనే ఒక పేషెంట్ కి ఇంజక్షన్ చేస్తున్నాడు. ఆక్సిజన్ మాస్క్ పెడుతున్నాడు.

ఒక్కసారి అతని మెదడులో వేయి ఎలక్ట్రిక్ బల్బులు వెలిగి ఆరినట్లు అయింది.

నేను… డాక్టర్ తేజస్‌ని……. డాక్టర్ని! ఆగండి! నా చేతికి ఏమైంది? ప్లీజ్! చెప్పండి! బాగా గాయాలు తగిలినాయా? గ్యాంగ్రీనా? ఏంప్యుటేషన్ చేశారా?

మళ్లీ నిశ్శబ్దం.

“డాక్టర్ తేజస్! సో సారీ! యాక్సిడెంట్ లో నీ కాలు చెయ్యి నలిగిపోయాయి. తీసేశాము.”

అయ్యో!!!

అయ్యో!!!

తేజస్వి బాధగా కళ్ళు మూసుకున్నాడు.

శ్రావ్స్… స్రవంతికి చెప్పారా? ప్లీజ్ చెప్పకండి! షాక్ తింటుంది? ఓ!నా జీవితం ఏమవుతోంది!

అతని గొంతులో నుంచి ముద్ద ముద్దగా యాంత్రిక స్వరంతో ఏడుపు రాసాగింది.

తేజస్! ధైర్యం తెచ్చుకోండి! నీకు ఇంట్యుబేట్ చేయవలసిన అవసరం కూడా లేదు. ఆక్సిజన్ ఇవ్వవలసిన అవసరం కూడా లేదు. పోయింది చెయ్యీ, కాలూ మాత్రమే. బహుశా రేపు సాయంత్రానికి కల్లా వచ్చేస్తాయి.

ఎలా ఎలా? గ్రాఫ్ట్ సర్జరీ? ఆర్టిఫిషియల్ లింబ్?

అంత త్వరగా ఎలా చేయగలం అంటున్నారు?

ఆ ఇద్దరు డాక్టర్లలో ముసలి వ్యక్తి నుదిటిపై ముడతలు పడి గంభీరంగా ఉన్నాడు. ఆయన తెల్ల జుట్టు హెడ్ క్యాప్ లోంచి వెండి రంగులో మెరుస్తోంది. ఎర్ర కళ్ళద్దాలు లో నుంచి ఆయన కళ్ళు నిశితంగా చూస్తున్నాయి.

“తేజస్ 7776!

ఎందుకంటే నీవు ఒక డిజిటల్లీ డిజైన్డ్ హెల్త్ పర్సన్. డి.హెచ్.పీ అంటాము. నీకు లింబ్స్ ఆర్డర్ చేశాం. త్వరలో వచ్చేస్తాయి.”

అంటే అంటే?

“నీకు తెలిసి ఉంది అనుకుంటున్నాం. కానీ తెలియక పోవటం ఆశ్చర్యమే. తలమీద దెబ్బకి మర్చిపోయి ఉండొచ్చు. నువ్వు ఒక యాంత్రిక డాక్టర్‌వి. నీకు గాయం తగలడం రక్తం పోవడం ఉండదు. ఎలక్ట్రిసిటీ లేక ఛార్జింగ్ బ్యాటరీ నుంచి పనిచేసే..”

“రోబోట్ డాక్టర్‌నా?”

తేజస్ నిర్ఘాంత పోతున్నాడు.

“చాలా మంది పని చేస్తున్నారు నీ లాగానే. వారానికి రెండు ఇలాంటి యాక్సిడెంట్ కేసులు మాకు వస్తూనే ఉంటాయి. నిన్ను తేలికగా బాగు చేస్తాం. జబ్బులు తగలకుండా రిస్క్ లేకుండా అంటువ్యాధుల రోగులకి ఈ వైరస్ మహమ్మారి వచ్చినవారికి చికిత్స చేయడానికి నిన్ను ఐసీయూలో ఉపయోగిస్తున్నారు. మామూలు మానవ డాక్టర్లు కూడా నీతో కలిసి పని చేస్తున్నారు. బహుశా నీకు చెప్పి ఉండకపోవచ్చు. లేదా నీ రాండం మెమరీలో ఆ ప్రోగ్రాం లేకపోవచ్చు. అయినా ఎందుకు బాధ? త్వరగా బాగా అయిపోతావ్! కాలు చెయ్యి నీకు వచ్చేస్తాయి రిలాక్స్!”

“వీళ్ళు డాక్టర్లా లేక రోబోటిక్ ఇంజనీర్లా?”

తెల్లని కోట్లు రెపరెపలాడుతుండగా నడిచి వెళ్ళిపోయారు.

“గుడ్! అతనికి రాండమ్ ఎక్సెస్ మెమరీ హార్డ్ డిస్క్‌లో సరిగ్గానే ఉంది.”

తేజస్ ప్రపంచం మారిపోయింది. నేను డాక్టర్‌ని మనిషిని కాదా! రోబోట్? రోబోట్ డాక్టర్!! ఎడం చెయ్యి, ఎడం కాలు బలిష్టంగా కండరాలతో మనిషి శరీరంలాగానే ఉన్నాయి. లోపల ఏముంటుందో!

ఒక్కసారి అతనికి భయంకరమైన సత్యం గోచరించింది.

తను మనిషి కాదు. వైర్లు హార్డ్డిస్కు కలిగి ప్రోగ్రాం చేయబడిన ఒక కరెంటు బొమ్మ! మరి ఈ అనుభూతులు ఆలోచనలు ఏమిటి? జరిగేది కనిపించేది అంతా నిజమేనా. ఇది ఒక ఇది ఒక భ్రమా, వాస్తవమా? కృత్రిమ వాస్తవమా? సృష్టించిన వ్యక్తిత్వమా?

….. …… …..

“నీ చెయ్యి కాలు ఒక్కరోజులో వచ్చేస్తుంది. ఖర్చులన్నీ రోబోటిక్స్ ఇన్కార్పొరేటెడ్ వాళ్ళు భరిస్తారు. డోంట్ వర్రీ!” అని చెప్పాడు అతను.

“మీరు డాక్టరా లేక ఇంజినీరా, ఎప్పుడూ చూడలేదు!”

అతను నవ్వి అన్నాడు.

“నీలాంటి కరెంటు బొమ్మలు మాకు వారానికి ఒకటి రెండు రిపేర్‌కు వస్తూనే ఉంటాయి. నేను రోబోటిక్స్ ఇంజనీర్నే. కానీ మెడిసిన్ కూడా తెలుసు. నిన్ను రోబోటిక్ డిస్పెన్సరీ ల్యాబ్ లోకి మారుస్తాం. డోంట్ వర్రీ !నీ మెమరీ సరిగ్గానే ఉంది. నీకోసం నీ భార్య వచ్చింది. మాట్లాడు.ఓకే DR తేజస్7776?”

“DR అంటే డాక్టర్ అనా?”

“అవును! అదిగో నీ భార్య!”

“ఆగండి సార్.నేను కరెంటు బొమ్మను అయితే నా భార్య ఏమిటి? ఆమె కూడా రోబో యేనా? స్త్రీ ఎలా అవుతుంది? ఇంతవరకూ నా జీవితం ఆమెతో ఎలా గడిచింది?”

“ఆమెతో మాట్లాడు. నీకు నీదైన జీవితం అనుభవం అన్నీ ఉన్నాయి. నీకు కూడా అది తెలుసు. అన్నీ గుర్తుకు వస్తాయి.”

స్రవంతి. తను ముద్దుగా పీల్చుకునే శ్రావ్స్. లోపలికి వచ్చింది. ఎర్ర చీర బ్లౌజ్ పోనీ టైల్ నుదిటి మీద ఎర్రని బొట్టు.

“తేజీ ఏమైంది?”

“నువ్వు కూడా కరెంట్ బొమ్మ వేనా?”

“ఏం మాట్లాడుతున్నవ్? తల మీద దెబ్బ తగిలి పిచ్చి లేచిందా? మామూలు అమ్మాయినే. నీ భార్యని. ఏం గుర్తుకొస్త లేదా. ఏమైంది నీకు?”

అతను మాట్లాడలేదు.

అన్నీ ఇప్పుడుజ్ఞాపకం వస్తున్నాయి. పది సంవత్సరాల నుంచి నుంచి ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఆదర్శనగర్‌లో మానవీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్. ఇద్దరూ కలిసి కాఫీ తాగటం, మాట్లాడుకోవటం, తినడం సంసారం కూడా… కలిసి భోజనం చేయటం అన్నీ గుర్తుకు వస్తున్నాయి. హాస్పిటల్ కి తను రావటం పోవటం దృశ్యాలు కనిపిస్తున్నాయి. సంసారం కూడా భ్రమ యేనా? కలిసి పడుకోవడం తినటం కూడా ఊహేనా. మరి అనుభూతులు? అంతకుముందు తను ఎక్కడ పుట్టాడు? ఎక్కడ చదువుకున్నాడు? తన తల్లిదండ్రులు ఎవరు? ఏమీ గుర్తుకు రావటం లేదు.

“శ్రావ్స్! నేను మనిషిని కాదు ఇప్పుడే తెలిసింది. నన్నెవరో ప్రోగ్రాం చేసి రోబో డాక్టర్‌గా వాడుకుంటున్నారు. కానీ నువ్వు నాకు తెలుసు. నీతో జీవితం అంతా జ్ఞాపకం వస్తోంది.”

“నీకు మతి గాని పోయిందా? ముందు వైద్యం జరుగనీ! ఇప్పటికి బతికి ప్రాణాలతో ఉన్నావు మాట్లాడుతున్నావు. అంతే చాలు!”

ఇద్దరు ఆకుపచ్చ యూనిఫారంలో స్ట్రెచ్చర్‌తో వచ్చి నిలబడ్డారు.

“రోబోటిక్ ల్యాబ్స్‌కి.”

“ఓకే ” అన్నాడు నీరసంగా. ఇదేదో తెలుసుకోవాల్సిందే అనుకున్నాడు మనసులో.

………. ….. …..

అది సమీప భవిష్యత్తులో వున్న పెద్ద మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి. క్వాలిటీ కేర్ హాస్పిటల్స్ లిమిటెడ్. దానికి పక్కనే మరొక బహుళ అంతస్థుల భవనంలో రోబోటిక్ రిసెర్చ్ అండ్ రిపేర్ ల్యాబ్ INC ఉంది.

వాళ్ళు ఏం చేసేదీ గమనిస్తూనే ఉన్నాడు. తలకి వెనుక భాగం లోకి ఒక సూది గుచ్చేశారు. తరువాత ఛాతీ మీద స్క్రూ లతో పనిచేసి మెటల్ ప్యానెల్స్ విడివిడిగా తీశారు. లోపల ఏదో హార్డ్డిస్కుల లాంటి పరికరాలు తీసి పరీక్షించి మళ్ళీ లోపల పెట్టారు.

ఎడం చేయి కూడా ప్యానల్స్ తోనే ఉంది.

కుడి చెయ్యి కాలు తనవి చూపించి, “ఇదిగో తేజస్ 7776, నీ కొత్త కాలూ, చేయీ” అని తన ఖాళీగా ఉన్న భుజం సాకెట్‌లోకి చేతిని అమర్చారు. పైన కండరాలలో ఉన్న ప్యానల్ తీసేస్తే వైరులు,ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు చిన్న చిన్న తెల్లటి అల్యూమినియం రంగు మైక్రోచిప్ లు.

ఆ తరువాత తుంటి కీలులో కాలు .బలిష్టంగా కండరాలతో దాని కింద యంత్రపు కీళ్లు వైర్లు మళ్లీ మైక్రోచిప్‌లు అమర్చారు.

ఈ కార్యక్రమం ఒక రెండు గంటల పైనే పట్టింది. “నొప్పిగా ఉందా ఏమిటి?” వారిలో ఒకడు వేళాకోళంగా నవ్వాడు.

తేజస్‌కి కోపం వచ్చింది. మళ్లీ అణుచుకున్నాడు. “నీకు ఛార్జింగ్ చేస్తున్నాం. సూపర్ లిథియం బ్యాటరీస్. మూడు నెలల దాకా అనుమానం లేదు. హి…హి…హి” నవ్వాడు ఒకడు. “అసలు అవయవాలకు కూడా ఏమీ ఇబ్బంది లేదు.హి…హి…హి”

ఆ వెక్కిరింత అర్థం అయింది.

ఆ తరువాత అతనిని లేచి నడిపించారు. అంతా బాగానే ఉంది.

తనకు మళ్లీ చుట్టూ ఉన్న ప్రపంచం, జ్ఞాపకాలు వాతావరణం అన్నీ తెలుస్తున్నాయి

ఆ రాత్రి ఫ్లయింగ్ కారు యూనివర్సిటీ దగ్గర సీతానగర్ ఫ్లైఓవర్ మీద నడుపుతున్నాడు.

తన తప్పు లేదు. ఎవడో తాగి నడిపేవాడు ఢీకొడితే తనేం చేస్తాడు?

కానీ మంచిదే అయింది. ఇలాగైనా తన అస్తిత్వం తనకి తెలిసింది.

“ఓకే తేజస్ 7776. నువ్వు ముందు రిసెప్షన్‌లో బిల్ మీద సంతకం చేసి నీ భార్యతో కలిసి వెళ్లి పో, ఈ ఒక్కసారికి కంపెనీ నీ బిల్ ఇస్తుంది.

ఈ ఒక్కసారికి నీకు మీ అపార్ట్మెంట్ దాకా క్యాబ్ ఇస్తారు. రేపటి నుంచి మళ్లీ ఇంటెన్సివ్ కేర్లో డ్యూటీ చేయాలి. ఐసియు వార్డు నెంబర్ త్రీ. చాలామంది వైరస్ పేషెంట్లు వస్తున్నారు మరి. ఇది 50 ఏళ్ల తర్వాత వచ్చిన పాండమిక్. నీ అవసరం చాలా ఉంది.”

తేజస్ మనసు చేతన అంతా బాగానే ఉన్నది.

కానీ మరొక చేతనలో సంశయం జిజ్ఞాస ఆవిర్భవించింది.

“ఈ వెనుక నీడిల్ తీసేయండి”

“ఓకే నీ ప్రపంచం నీకు వాపస్!”

మళ్లీ నవ్వారు. నీ ఊహలు నీ రియాలిటీ వాపస్! చెక్ చేసుకో! రాత్రికి స్రవంతితో” వెకిలి గానే అనిపించింది వాడి నవ్వు.

ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చేదాకా వాళ్ళ నవ్వులు వేళాకోళాలు అతని బాధిస్తూనే ఉన్నాయి.

ఏది తన వాస్తవికత? నిజమైనదా? అబద్ధమా – తనకు కృత్రిమ మేధ సృష్టించారా?

తన అనుభూతులు, ఆకలి, ఆఖరికి సంసార సౌఖ్యం స్రవంతి పెట్టే ముద్దులు అన్నీ ప్రోగ్రాం చేయబడినవేనా?

అతనికి తన మెదడు వెనుక భాగంలోని ఎలక్ట్రోడ్ తన చుట్టూ రంగులతో మెరిసిన మానిటర్లు అన్నీ గుర్తుకు వచ్చాయి.

నేను ఎవరిని? ఇదంతా నిజమేనా? నా భార్య నిజమేనా? లేక మిధ్యా బింబమా? నాకు ఒక సొంత వ్యక్తిత్వం ఉందా లేదా?

లేదా, వారు చెప్పింది చేస్తూ పోతూ ఉండటం ఏనా?

ఇది ఏమైనా సరే తెలుసుకోవాల్సిందే!

….. …… …… …… …….

తేజస్ రోబోట్ రిపేర్ ల్యాబ్ నుంచి బయటకు వచ్చేసరికి బయట హాల్‌లో స్రవంతి సోఫాలో కూర్చునివుంది.

“పోదాం పద! ఇక నీ డ్రైవింగ్ చాలు! క్యాబ్ వచ్చింది! ఇంటికి పోయి రెండు రోజులు రెస్ట్ తీసుకోవచ్చు!”

“స్రవంతి! నువ్వు స్త్రీ వా రోబోవా?”

“ఏందా పిచ్చి ప్రశ్న? నీ గురించి డాక్టర్‌కి చెబుదామనుకున్నా. పిచ్చి పట్టింది ఏమో సైకాలజిస్టుకు చూపించండి అని. మళ్లీ నీ ఉద్యోగం తీసేస్తారేమో అని ఊరుకున్నా. అవును నీ భార్యని స్రవంతిని. ఇక చల్! పోదాం!”

“అయితే చెప్పు మనకి పిల్లలు ఎంతమంది?”

ఆమె అరుపు అరిచింది.

“ఏంది చూసినకొద్దీ? ఇంకా పిచ్చి ప్రశ్నలు వేస్తున్నావ్? నీకు తెలియదా. మనకు పిల్లలు లేరని… పదేళ్లుగా ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ల కోసం తిరుగుతున్నమనీ అది కూడా యాదికి లేదా? నడు,నడు క్యాబ్ వచ్చింది “

దూరాన సెంట్రల్ మానిటరింగ్ ఆఫ్ డి హెచ్ పి అని బోర్డు ఉన్న భవనం హాస్పిటల్ పక్కనే ఉంది.

ఇద్దరు తెల్లని కోట్లు గ్రీన్ టోపీలు ధరించిన వ్యక్తులు అక్కడ ఒక గదిలో త్రీడీ మానిటర్స్ కేసి చూస్తున్నారు.

మానిటర్ లలో వాళ్ళురెండు ఆకారాలని గమనిస్తున్నారు.

“మాల్ ఫంక్షనింగ్. మెమరీ డిస్క్. సిగ్నల్ ప్రాబ్లం.7776‌ని అబ్జర్వ్ చేయాలి. నలభై ఎనిమిది గంటలు చేయాలి. ఇది అపాయకరమైన డి హెచ్ పి గా మారవచ్చు. లేదా మళ్లీ నార్మల్గా కావచ్చు చెప్పలేం.”

తేజస్ స్రవంతి వాళ్ళ అపార్ట్మెంట్ చేరుకున్నారు.

“రెస్ట్ తీసుకో! డిన్నర్ ఆర్డర్ చేశాను. డ్రోన్ ఇంకో అరగంటలో వస్తుంది.”

“నిజం చెప్పు మన పెళ్లి రోజు ఎప్పుడు”

“పిచ్చోడా, 1990 మార్చి 5 అంత మరచి పోతున్నావా”

“మీ నాన్న పేరు ఏమిటి”

“నీ మామ పేరు మర్చిపోయినవా నే చెప్ప!”

అతను తల పట్టుకుని సోఫాలో కూలబడ్డాడు.

వర్చువల్ టీవీలో వార్తలు వస్తున్నాయి.

యాంకర్ తెర మీది నుంచి దిగి వార్తలు చెబుతున్నాడు. దృశ్యాలు నిజంగా గదిలో జరుగుతున్నట్లుగా ఉన్నాయి. ఇల్లంతా చల్లబడింది.

వాళ్ళు రాగానే సెన్సార్లు యాక్టివేట్ అయి ఎయిర్ కండిషనింగ్ ఆన్ అవుతుంది.

డోర్ దగ్గర ఉన్న మానిటర్ ఆకుపచ్చగా వెలిగింది. చిన్న సంగీత ధ్వనులు చేసింది. డ్రోన్ డిన్నర్ ప్యాకెట్లు తలుపు దగ్గరగా పడవేసింది అన్నమాట.

స్రవంతి వెళ్లి తలుపు తెరిచి డిన్నర్ ప్యాకెట్లు తీసుకుని టేబుల్ మీద పరిచింది.

నిశ్శబ్దంగా ఇద్దరు తిన్నారు.

ఈమెతో తను పదేళ్ళు జీవించాడా? అవును. ఇప్పుడు పదేళ్ల క్రితం పెళ్లి దృశ్యం కనిపిస్తోంది. మళ్లీ అదే మసకగా మారుతోంది.

కొన్నిసార్లు తాము ఇద్దరూ బెడ్ రూమ్‌లో ఉన్న దృశ్యాలు… కనిపించి అదృశ్యం అవుతున్నాయి.

ఓ ముసలి వ్యక్తి తెల్లటి గడ్డాలు మీసం జులపాలు జుట్టుతో మాసిన పంచ ,చిరిగిన చొక్కాతో పాత పెంకుటిల్లు ముందు నిలుచున్నాడు.

అవును అది తన ఊరే! ఏవో వంటలు వండుతున్న వాసనలు.

“నీకు ఇష్టమైన కూర! తిను బిడ్డ!” తన తల్లి మాటలు ఎక్కడి నుంచో ప్రతిధ్వనులలా వినవస్తున్నాయి.

అది ఏ ఊరు?

“నిద్రపో ఇంక. రెస్ట్ తీసుకో .అంతా మంచిగ అయిపోతవ్” స్రవంతి డబుల్ బెడ్‌లో అటు తిరిగి పడుకుంది.

నీలం రంగుతో మెరిసే అంకెల డిజిటల్ గడియారం 10:30 అని టైం చూపిస్తోంది.

నిద్ర గోలి!!!! గుర్తుకొస్తోంది! లోరాజ్పామ్2 mg. వేసుకోవాలా? రోబోకి కూడా గోలీలు ఇస్తారా! కానీ డాక్టర్ చెప్పాడు.

కాదు.తను ఒక కరెంటు బొమ్మ. డిజిటల్ మెమరీ. దీనికి టాబ్లెట్‌లు ఎలా పనిచేస్తాయి. వాడు అబద్ధం చెప్పాడు. ఏదో సహజత్వం కోసం మభ్యపెట్టాడు. అత్యాధునిక పరిజ్ఞానం ఉన్న డిజిటల్ రోబో తాను. మందులు ఎందుకు. ఊరికే ఒక మిథ్యా వ్యక్తిత్వం ఏర్పరిచారు!

అవును తను ఒక మెడికల్ డాక్టర్. ఇంజక్షన్ ఇవ్వటం వైరస్ రోగులకు టాబ్లెట్లు ఆక్సిజన్ పెట్టడం నోటి ద్వారా ట్యూబ్‌లు అమర్చి ఆక్సిజన్ ఇవ్వటం… తనకి వచ్చు!

బహుశా ఇదంతా ప్రోగ్రామే, కానీ స్రవంతి నిజమేనా తెలుసుకోవాలి!

ఈ గది నిజమేనా లేక వారు సృష్టించిన మిథ్యా బింబమేనా? మెత్తగా ఉంది పరుపు. చల్లగా ఉంది గాలి. ఇవన్నీ నిజం కాదా?

అర్ధరాత్రి 12 గంటలు అయింది అతను లేచి బెడ్ మీద కూర్చున్న వాడు హాల్ లోకి వెళ్ళాడు.

తన డిజిటల్ ల్యాప్ టాప్ లో బటన్ నొక్కితే హెల్పర్ వచ్చింది. ఆమె వర్చువల్ ఆడపిల్ల ఆకారంలో ఉంది.

గుర్తొచ్చింది ఆమె పేరు వీనస్. లాప్టాప్ ఆన్ చేసి వీనస్ అని పిలిచాడు. గదిలో ఐదు అడుగుల ఎత్తు ఆడపిల్ల ప్రత్యక్షమయింది.

మినీ స్కర్ట్‌లో కళ్లజోడు పెట్టుకుని తెలివిగా కనిపిస్తోంది.

తేజస్ 7776 డి హెచ్ పి! గుడ్ ఈవెనింగ్! ముందుగా గివ్ మీ పాస్వర్డ్ డాక్టర్!”

అతనికి కొద్దిగా గుర్తుకు వచ్చింది.

PKY9999

“రాంగ్ .మళ్లీ ట్రై చేయండి మర్చిపోతే చెప్తాను.”

ఎవరో తన పాస్వర్డ్ మార్చారు! తనని తాను మార్చుకునేందుకు వీలు లేకుండా చేశారు. తనెవరో అడుగుదాం అనుకున్నాడు. తనని ఎవరు కంట్రోల్ చేస్తున్నారో తెలుసుకుందాం అనుకున్నాడు

“పాస్వర్డ్‌కి ఆధారం కావాలా?”

“ఎస్.” బలహీనంగా అన్నాడు

“నీ కూతురి పేరు.పుట్టిన సంవత్సరం”

ఇదెలా? తనకు కూతురు ఉందా!”

మెదడులో ఏదో మెరిసినట్లయింది.

అవును తనకు కూతురు ఉంది. చాలా అందమైన పదేళ్ల బేబీ. ఎలా మర్చిపోయాడు? ఆ పిల్ల సంతోషంగా కేరింతలు కొట్టడం ఎగ్జిబిషన్లో జెయింట్ వీల్ మీద తిరుగుతూ ఉండటం కనిపిస్తోంది. అవును తన అమ్మ పేరు పేరు అది.అదే పెట్టుకున్నాడు.

లక్ష్మి 2000 ‌కరెక్ట్. ఇప్పుడు ఏం కావాలో చెప్పండి తేజస్. డిజిటల్ స్త్రీ గొంతు వినిపించింది.

“నా హార్డ్ డిస్క్ ఎలా ప్రోగ్రాం చేశారో కావాలి. ఈ రోబోటిక్ డాక్టర్ ఉద్యోగం చేసే ముందు నేను ఎవరిని? ప్రాణాలు ఉన్న మనిషి నా లేక యంత్రాన్నా? లేక కుదరదా చెప్పు వీనస్!

వీనస్ యాంత్రికమైన నవ్వు నవ్వింది.

“టాప్ సీక్రెట్ ఈ సమాచారాన్ని నీకివ్వబడదు. ఇది డీహెచ్పీ సెంట్రల్ ఆఫీస్ కమాండ్. నీ పేరు తేజస్ 7776. డిజిటల్లీ ప్రోగ్రామ్డ్ హెల్త్ పర్సన్. pandemic 50 వార్డులో పని చేస్తున్నావ్. నీడ్యూటీ ఐసీయూలో. నీ భార్య పేరు స్రవంతి. నేను నీ సెంట్రల్ యూనిట్‌ని.

నేను నీ దగ్గరే ఉన్నా కంట్రోల్ మాత్రం సెంట్రల్ ఆఫీస్‌లో ఉంది. నీ కింకేం కావాలన్నా చెప్పు. పాటలు? వార్తలు ?జోక్స్?”

“షట్ అప్” అన్నాడతను. “వెళ్ళిపో! గెట్లాస్ట్!”

వీనస్ ఒక నీలి వెలుగువెలిగి ఆరిపోయింది.

అతను ఎందుకో కోపంతో ఊగిపోతున్నాడు.

టేబుల్ అరలో టూల్ కిట్ ఉంది. మైక్రో స్క్రూ డ్రైవర్స్ ఉన్నాయి. లెన్స్ ఉంది. బయటికి తీశాడు.

ఒక గంట పని తర్వాత తన పొట్ట మీది ప్యానల్ అన్ని విడదీసాడు. rectus abdominis ఎబ్డొమినోస్ కండరాలు లాగ ఉన్నవి తీసి పక్కన పెడితే లోపల మెరుస్తూ నల్లటి హార్డ్ డిస్క్ మీద ఎర్రటి డిజిటల్ సర్క్యూట్స్.

ఒక్కొక్కటే ఎలక్ట్రిక్ ప్రోబ్‌తో చెక్ చేయసాగాడు.

జ్ఞాపకాలు మారిపోతున్నాయి.

ఒకసారి పంట పొలాలు. ట్రాక్టర్ తోలుతున్న రైతు.

ఒకసారి యుద్ధంలో సైనికుడు.

ఒకసారి ఫ్యాక్టరీ శ్రామికుడు.

ప్రస్తుతం తను ఒక డాక్టర్.

చుట్టూ చూశాడు. క్రమక్రమంగా అంతా అస్పష్టంగా ఉంది. సోఫాలు కుర్చీలు గోడ మీద పెయింటింగ్ అస్పష్టంగా కరిగిపోతున్నాయి.

“యు స్టుపిడ్ ఏం చేస్తున్నావు”

స్రవంతి కళ్ళు నులుముకుంటూ బెడ్ రూమ్ లోంచి బయటకు వచ్చింది.

“పిచ్చి పట్టింది నీకు. ఆపేయ్ నేను సెంటర్ కి ఫోన్ చేస్తా. ఎమర్జెన్సీ రిపేరింగ్ టీం వస్తారు నువ్వు ఏం చేయకు ఊరుకో. నువ్వు చేసే పని చాలా అపాయం .”

….. …… ……

తేజస్ అప్రతిభుడై చూస్తున్నాడు.

హార్డ్ డిస్క్ లాగి బయటకు తీసి చేతితో పట్టుకున్నాడు చాలా వైర్లు వేలాడుతున్నాయి.

తన చుట్టూ కరిగిపోతున్న దృశ్యాలు. ఆశ్చర్యంగా ఇంకా ఇప్పుడు స్రవంతి కూడా కరిగిపోతోంది.

ఆమె చీర బ్లౌజ్ నీలపు ఎర్రటి రంగులుగా మారి ముఖం సాగిపోయి బొట్టు ఎర్రగా నేల మీద పడి ఒక ప్రవాహంలా అయిపోయింది

అనుకున్నది నిజమే .ఆమె ఒక బింబం.

ఇదంతా మిథ్యా ప్రపంచమేనా.

తను చేసే పనే ఒక నిజమా. లేక అది కూడా అబద్ధమేనా.

నిజం ఏమిటో తెలుసుకోవాలి. అబద్ధం ఏమిటో తెలుసుకోవాలి. తను తను మిథ్య అయితే మరో పది నిమిషాల్లో తెలిసిపోతుంది.

తలుపు బద్దలు కొట్టుకుని నలుగురు వచ్చి నిలబడ్డారు.

“ఎమర్జెన్సీ సర్వీసెస్”

ఒకడు నోటి దగ్గర ఉన్న చిన్న మైక్ లో పై అధికారికి చెబుతున్నాడు ఎమర్జెన్సీ టీమ్ రిపోర్టింగ్ డి హెచ్ పి 7776 పూర్తిగా మాల్ ఫంక్షన్ చేస్తున్నాడు. దాన్ని ఏం చేయాలో ఆర్డర్స్ కావాలి. అది ప్యానెల్స్ అన్ని లాగేసుకుంటోంది.

అది త్వరలో హింసాత్మకం కావచ్చు .ఏం చేస్తుందో తెలియదు

ఇప్పుడు తేజస్ చేతిలో లేజర్ గన్ ఉంది

ఇందాక కబోర్డ్ లో కనిపించింది

దానిని రెండు చేతులతో పట్టుకుని

ఇప్పుడు నేను “అది” అయ్యానా?

యు బాస్టర్డ్స్! నన్ను ఎందుకు ఇలా తయారు చేశారు? మిమ్మల్నందర్నీ చంపిగాని నేను పోను! లేసర్ మెరుపులు మెరిసాయి ఎమర్జెన్సీ టీమ్ చేతులెత్తారు .

డోంట్ షూట్ !7776 ! మేం ఆర్డర్ లు ఫాలో అవుతున్నాము అంతే .నిన్ను మళ్ళీ బాగు చేస్తాం” అతను వినడం లేదు .కార్పెట్ మీద అతని స్రవంతి ఇప్పుడు ఒక చిన్న ఎర్రటి చారలా మిగిలిపోయింది.

ఆకుపచ్చ నీలి ఎరుపు రంగు చారలు. అపార్ట్మెంట్ అదృశ్యమౌతోంది.ఇది కాక తల్లి తండ్రి కూతురు ఊరు పొలాలు అన్ని రంగులు గా కరిగి అదృశ్యమైపోయాయి.

వాళ్ళలో ఇద్దరు ఇప్పుడు నేల మీద పడ్డారు.

మిగిలిన ఇద్దరు వాళ్ల లేసర్ గన్లతో అతని శరీరంమీద కాల్చారు.

అపార్ట్‌మెంట్ అంతా క్రమంగా అదృశ్యమై తెల్లటి పొగతో నిండిపోయింది.

ఎమర్జెన్సీ మానిటరింగ్ వ్యక్తులు మాత్రం బయటికి తూలుతూ నడిచి వచ్చారు.

ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ డీహెచ్‌పి 7776ని నిర్మూలించాము. మాలో ఇద్దరు చనిపోయారు. ఇద్దరు గాయపడ్డారు. త్వరగా ఆంబులెన్సుని పంపండి.

బయటంతా మరో ప్రపంచపు ట్రాఫిక్‌లో ఎగిరే కార్లూ, వెలుగు చిమ్మే ట్రాఫిక్ లైట్‌ల మథ్య ఎల్ఈడీ లైట్లు వెలుగుతూ ఆంబులెన్స్ రాసాగింది. అది గాల్లో తేలుతూ సైరన్ మోగిస్తూ ఉంటే మిగతా ట్రాఫిక్ దారి ఇస్తోంది. ఇప్పుడు విసురుగా గాలి వీస్తోంది. ఆదర్శ్‌నగర్. మానవీ అపార్ట్మెంట్స్. అంధకారం నిండిన ఖాళీ తప్ప అక్కడ ఇప్పుడు ఏమీ లేదు.

….. ….. ….. ……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here