జ్యోతిర్లింగ క్షేత్రం కాళేశ్వరం

1
4

[box type=’note’ fontsize=’16’] 14-1-59 నాటి ఆంధ్ర సచిత్ర వారపత్రిక స్వర్ణోత్సవ సంచికలో మాజీ ప్రధాని శ్రీ పి. వి. నరసింహారావు రచించిన వ్యాసాన్ని – ప్రత్యేక వ్యాసంగా సంచిక పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]దా[/dropcap]దాపు రెండువేల సంవత్సరాల నుండి తెలుగుదేశానికి వుత్తరపు సరిహద్దున విలసిల్లిన కాళేశ్వర మహాక్షేత్రం నేడొక కుగ్రామంగా, అతి దీనావస్థలో ఉంది. కాని కాలపురుషుని రాపిడివల్ల శిథిలావస్థకు గురియైనప్పటికీ ఈ ప్రాంతంలో అడుగుపెట్టే ప్రతి ఆంధ్రుని హృదయంలోనూ ఆంధ్రదేశ పూర్వవైభవ ప్రాభవాల గర్వం పెలుబికివస్తుంది. అత్యుత్తమమైన ఆంధ్ర సంస్కృతి పట్ల అభిమానం ఇనుమడిస్తుంది. చాళుక్య, కాకతీయ సామ్రాజ్యాల స్వర్ణయుగ దృశ్యం మనశ్చక్షువుల యెదుట సాక్షాత్కరిస్తుంది.

పవిత్ర జ్యోతిర్లింగధామమైన ఈ కాళేశ్వర క్షేత్రం కరీంనగరం జిల్లా మంతెన తాలూకాలో మంతెన నుండి దాదాపు 28 మైళ్ళు తూర్పున గోదావరికి దక్షిణతీరాన ఉంది. ఇక్కడే ముఖ్యమైన ఉపనది ప్రణీత గోదావరిలో కలుస్తుంది. కాళేశ్వర గ్రామానికి ఇరుప్రక్కలా దట్టమైన అరణ్యం ఉంది. మసక పడిందంటే మానవ సంచారం అసాధ్యం. అడవి మృగాల అరుపులతో, గర్జనలతో రాత్రి దద్దరిల్లిపోతుంటుంది. ఏ శిథిల దేవాలయంలోకి తొంగి చూస్తే, ఏ చిఱుతపులి గాండ్రుమని వినపడుతుందో చెప్పలేము. ఏ శివలింగంపైన ఏ సర్పరాజు పడగవిప్పి ఆటాడుతుంటాడో కూడా ఊహించలేము. గోదావరికి ఆవలిగట్టున నేటి బొంబాయి ప్రాంతంలోని చాందాజిలాకు చెందిన సిరివంచ పట్టణం రెండుమూడు మైళ్ళ దూరంలో ఉంది. అది తెలుగుల ప్రాంతమే. మరికొంత తూర్పుకు వెళ్ళితే, బస్తరు ప్రాంతం. మూడు రాష్ట్రాల పొలిమేరల్లో వున్న కాళేశ్వర క్షేత్రాన్ని చేరడానికి మన రాష్ట్రంలోని మంతెన, మహాదేవపురం మార్గాలకన్న పరరాష్ట్రంలోని సిరివంచ నుండి గోదావరి దాటి రావడమే సుగమమైన మార్గమని ప్రతీతి. అందుకనే జ్యోతిర్లింగాన్ని దర్శించడానికి వచ్చే యాత్రికుల్లో బొంబాయి బస్తరు ప్రాంతాలకు చెందినవారే అధికసంఖ్యలో ఉంటారు. రాకపోకల సౌకర్యం లేక మన కాళేశ్వరం మనకే పరాయి స్థలమైపోయింది.

కాళేశ్వర చరిత్రను నేటివరకు క్షుణ్ణంగా పరిశీలించినవారు లేరు. కాని దేవాలయాలను పరిశీలిస్తే, జైన బౌద్ధయుగం వాటి ఛాయలు అక్కడక్కడ స్పష్టంగా గోచరిస్తాయి. కాబట్టి కొన్ని దేవాలయాలైనా జైన బౌద్ధకాలానికి సంబంధించినవనీ, క్రమేణా శైవమత ప్రాబల్య పరిణామంగా కాళేశ్వర ముక్తీశ్వర లింగాల స్థాపన జరిగి ఈ మహాక్షేత్రం రూపొంది యుండవచ్చునని ఊహించవచ్చు. ఈ దృష్ట్యా లెక్క వేస్తే కాళేశ్వర ప్రాశస్త్యం రెండువేల సంవత్సరాల నుండి అవిఛ్ఛిన్నంగా ఉంటూ వచ్చిందనీ, ఈ క్షేత్రం భారతీయ సంస్కృతీవికాసంలో అనేక ఘట్టాలకు సాక్షిగా నిలిచి ఉంటుందని స్పష్టమౌతుంది.

పూర్వం నిశంభుడనే రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తుండగా ఆంధ్రవిష్ణు (వర్ధనుడు) అనే రాజు దండెత్తివచ్చి నిశంభుణ్ణి జంపి ఈ కాళేశ్వర మండలాన్ని తన వేంగిరాజ్యంలో కలుపుకున్నాడని నిర్ణయించడానికి చారిత్రకాధారాలున్నవి. ఆంధ్రవిష్ణువు క్రీ.శ. ఆరవ శతాబ్దం వాడని ఒక అంచనా. ఈ ప్రాంతంలో నిశంభుడు రాజ్యం చేస్తున్నప్పుడు కాళేశ్వర పట్టణంలోనే 26 చెరువులు ఉండేవట. వందక్రోశ ప్రమాణం కూడా చెప్పడం కద్దు. కాబట్టి ఆ కాలంలో కాళేశ్వరం సకలవైభవాలతో తులతూగే మహాపట్టణంగా విలసిల్లింది. రాజ్యానికి పొలిమేరల్లో ఉన్నందువల్ల పరాయిరాజుల ముట్టడి, సైన్యాల రాపిడి యుద్ధాల హడావిడి ఈ ప్రాంతంలో తప్పక ఉండి ఉంటుంది. దానికి నిదర్శనంగా కాళేశ్వర పరిసరాల్లో నేటికి అనేక దుర్గ చిహ్నాలు స్పష్టంగా కనిపిస్తాయి. అక్కడి మహారణ్యాన్ని గాలించి పరిశీలిస్తే దీనికి సంబంధించిన మరెన్నో వివరాలు తెలుసుకోవచ్చు.

కాకతీయ సామ్రాజ్యంలో కాళేశ్వరం ముఖ్యమైన రక్షణ కేంద్రంగా వున్నట్లు తెలుస్తుంది. ప్రతాపరుద్ర చక్రవర్తికి అంకితమిస్తూ విద్యానాధుడు రచించిన ’ప్రతాపరుద్రీయ’మనే గ్రంథంలో

“యై ర్దేశ స్త్రిభి రేష యాతి మహతీం ఖ్యాతిం త్రిలింగాఖ్యయా
యేషాం కాకతిరాజకీర్తివిభవైః కైలాస శైలః కృతః
తే దేవాః ప్రసర త్ప్రసాదమధురాః శ్రీశైల కాళేశ్వర
ద్రాక్షారామనివాసినః ప్రతిదినం త్పచ్ఛ్రేయసే జాగ్రతు॥”

అనే శ్లోకంలో ఆంధ్రదేశంలోని మూడు జ్యోతిర్లింగాలు ఉల్లేఖించబడినవి. రుద్రమదేవి కాలంలో గన్నారెడ్డి అనే సేనాని ఆధ్వర్యంలో ఈ ప్రాంతం ఉన్నట్టు చారిత్రకాధారాలున్నవి. కాకతీయులనాటి ఒక శాసనంలో కాళేశ్వరం, అన్నవరం, చందుపల్లి, మహాదేపురం మొదలైన గ్రామాల పేర్లు ఉల్లేఖించబడ్డాయి. ఈ గ్రామాలు నేటికీ ఆ పేరుతోనే ఉన్నాయి. అంతేకాక ఈ ప్రాంతంలో చెరువులన్నింటిలోను తామరపూలు విశేషంగా ఉన్నాయి. ’దామరకుంట’ అనే గ్రామం నుండి కాళేశ్వరం వరకు ఉన్న తటాకాలన్నింటి నుండి తామరపూలు పూజకై కాళేశ్వరం తెచ్చే ఆచారం ఉండి ఉండేదని ప్రతీతి. ఏదెలాగున్నా, కాళేశ్వర క్షేత్రం సాంస్కృతికంగాను, చారిత్రకంగాను అత్యధిక ప్రాశస్త్యం కలిగివున్నదనడం నిర్వివాదం.

మతవిషయకంగా పరిశీలిస్తే కాళేశ్వరక్షేత్రం హిందువులందరికి అత్యంత పవిత్రస్థలంగా పరిగణించబడుతుంది. శ్రీరాముడు వనవాసం చేస్తూ ఈ ప్రాంతంలో నివశించాడని చెప్పుకుంటారు. అందుకు తార్కాణంగా అనేక శివాలయాలతో, శివలింగాలతో పాటు కాళేశ్వరంలో రామాలయం కూడా ఉంది. వివిధ మత సమైక్య ధ్యేయాన్ని ప్రతిపాదించే రామలింగస్వామి ధామం కాళేశ్వర ప్రాశస్య్తాన్ని వేనోళ్ళ చాటుతుంది.

స్కాంద మహాపురాణాంతర్గత సనత్కుమార సంహితలోని ‘కాళేశ్వరఖండ’మనే భాగంలో కాళేశ్వరక్షేత్రానికి సంబంధించిన వర్ణనలు, అఖ్యాయికలు, ఎన్నో ఉన్నాయి. ఈ భాగం పుస్తకరూపంలో ప్రకటింపబడింది. ఈ గ్రంథంలో కాళేశ్వరక్షేత్ర మహాత్య్మాన్ని అనేక కథల ద్వారా నిరూపించారు. నేటి ఆధునిక ప్రపంచంలో ఈ అఖ్యాయికల ప్రాముఖ్యమెలాగున్నా క్షేత్రప్రాశస్త్యాన్ని నిరూపించడంలోను, భక్తుల హృదయాల్లో అనన్య భక్తి విశ్వాసాలను రేకెత్తించడంలోను ఈ కాళేశ్వరఖండం ఇదే కోవకు చెందిన మరే రచనకునూ ఏమాత్రం తీసిపోదని నిస్సందేహంగా చెప్పవచ్చు.

పూర్వం యమధర్మరాజు లోకులందరూ తనను దూషిస్తున్నారని విచారపడి సర్వసుఖాలు సమకూర్చే ఒక పట్టణం విశ్వకర్మ చేత కట్టించాడట. ఆ పట్టణమే యముని పేర కాళేశ్వరమని ప్రసిద్ధికెక్కినది. అక్కడ ముక్తీశ్వర స్వరూపంలో వెలసిన శివుని సేవించిన వారెల్లరు జన్మరహితులై పోవడం చేత కొంతకాలానికి యమలోకానికి వెళ్ళే ప్రాణుల సంఖ్య చాలావరకు తగ్గిపోయి యమధర్మరాజు గారి సిబ్బందికి దాదాపు నిరుద్యోగ సమస్య నెదుర్కొన వలసి వచ్చిందట! ఈ విషమ పరిస్థితిని యముడు శంకరుకునికి నివేదించగా “నా పానవటము మీదనే నీ పేరున లింగప్రతిష్ఠ చేయుము; నిన్ను పూజింపక నన్ను పూజించువానికి ముక్తిలేదు” అని సూచించి కొందరు ప్రాణులైనా ముక్తికి అనర్హులై యమ లోకానికెళ్ళే ఆస్కారం కల్పించాడట!…. అందుకనే కాళేశ్వర, ముక్తేశ్వర ఉభయలింగాలు ఒకే పానవట్టం మీద ప్రతిష్ఠంపబడినవి. లింగాలకు అభిముఖంగా నిలిస్తే, ఎడమవైపు కాళేశ్వరలింగం, కుడివైపు ముక్తీశ్వరలింగం ఉన్నది. పూజావిధానంలో కాళేశ్వరలింగం మొదట, ఆ తదుపరి ముక్తీశ్వరలింగం వస్తుంది. ముక్తీశ్వర నామంతో వెలసిందే జ్యోతిర్లింగం. ఈ లింగానికి రెండు రంధ్రాలున్నవి. వాటిలో ఎంత నీరుపోసినా అవి నిండవు. నీరు రంధ్రాలగుండా నేరుగా త్రివేణీ సంగమం వరకు పోయి నదిలో కలుస్తుందని భక్తుల విశ్వాసం.

కాళేశ్వర క్షేత్రం దక్షిణ కాళి అని పిలువబడుతుంది. ఈ పేరు అలంపురం మొదలగు అనేక క్షేత్రాలకు కూడా ఉంది. కాని కాళేశ్వరక్షేత్ర విశేషమేమంటే పావిత్ర్యం దృష్ట్యా కాశీకన్న కాళేశ్వరమే వరిముల్లు వాసి అధికమని “యవాధికః కుతోహేతోః కాళాఃకాళేశ్వరో భివేత్” అనే లోకోక్తి వల్ల ప్రతీతమౌతుంది కాళేశ్వర ఖండంలో!

“సంసారతారణోపాయౌ కాశీకాళేశ్వరా ఉభౌ
సర్వలోకేషువిఖ్యాతౌ తీర్థం జౌ సుపాననౌ
అహోకాశ్యాం మహచ్చిత్రం వృణాంజన్మపునర్నహి
యద్యసిచేచ్ఛ శిర్మౌళౌ శరీరే రజతప్రభా
అహోకాళేశ్వరే చిత్రం నజీవో నశివాకృతిః
దర్శనాన్ముక్తి నాధన్య భవతాః నందరూపభాక్”

అనే పంక్తుల్లో కాశీ కాళేశ్వర క్షేత్రాల న్యూనాధిక్యాలు సద్భక్తుల శ్రద్ధాసక్తులు ఇనుమడించే విధంగా వర్ణింపబడ్డాయి.

అలాగే జాహ్నవీ గౌతమి సంవాదం కూడా ఈ క్రింది పంక్తుల్లో ఎంతో యుక్తిగా వర్ణించబడింది.

“అహంహి ఋషికిన్యాస్మి రాజకన్యాసి జాహ్నవి!
అద్యాంతు గౌతమీ గంగా ద్వితీయా జాహ్నవీ తథా
సర్వవేదమయ స్సాక్షా దౌతమొమత్పితాప్రభుః
శుచిర్విప్రశ్శుచికరః వర్ణానాం బ్రాహ్మణోగురుః
మయా చ సర్వతశ్శంభు ర్వర్త తేచ త్వయా క్వచిత్
ఆద్యా సమధికాచాహం మత్సమావా కథం భవేః…..”

ఇంతేగాక ప్రయాగలో త్రివేణీ సంగమం మాత్రమే ఉంటే కాళేశ్వరం వద్ద పంచగంగా సంగమం ఉన్నట్టు ఈ క్రింది శ్లోకంలో చెప్పబడింది.

“ప్రణీతా వరదా వైన్యా గౌతమీచ సరస్వతీ
నదః పంచవహంత్యత్ర ప్రయాగత్కోటిశోఽధికం…..”

కాళేశ్వర క్షేత్రంలో శివలింగాలు, ఆలయాలు అనేకములున్నవి. గ్రామానికి దాదాపు మైలున్నర దూరాన ఆదిముక్తీశ్వరాలయం ఉంది. ఈ ఆలయం చుట్టు రెండు ఫర్లాంగులదూరం వఱకు ఎక్కడ త్రవ్వినా ఎర్రని గుండ్రని రాళ్ళు దొరుకుతాయి, ఆ రాళ్లను పగలగొడితే లోపలనుండి విభూతి వస్తుంది. నాటికీ నేటికీ ఈ విచిత్రమైన పాషాణపేటికా విభూతిని చూచి యాత్రికులు ఆశ్చర్యచకితులౌతారు. పరిసరంలో మరెక్కడా ఇలాంటి రాళ్ళు లేవు.

భారతదేశంలో బ్రహ్మాలయాలు మూడు స్థలాల్లో మాత్రమే ఉన్నాయని అంటారు. ఆ మూడు స్థలాల్లో కాళేశ్వరం కూడా వుంది. ఇంతేకాక కాళేశ్వరంలో ముక్తీశ్వరాలయంతో పాటు వెంకటేశ్వరాలయం, సరస్పతి ఆలయం, అన్నపూర్ణాలయం, బిందుమాధవస్వామి ఆలయం, బాలరాజేశ్వరాలయం, వీరభద్ర దేవాలయం, రామాలయం, ఆదిముక్తీశ్వరాలయం, చంద్రశేఖరాలయం, సంగమేశ్వరాలయం, లోడేశ్వరాలయం, సిదేశ్వరాలయం, గాయత్రిఆలయం, మహామాయాలయం, సోమేశ్వరాలయం మున్నగు అనేక దేవాలయాలున్నవి. ఇవన్నీ దాదాపు శిధిలావస్థలోనే ఉన్నాయని ఇదివఱకే చెప్పియున్నాను.

ఆలయాలే కాక ఇక్కడ బ్రహ్మతీర్థం, చిద్ఛుఖతీర్థం, జ్ఞానతీర్థం, పక్షితీర్థం, సంగమతీర్థం, హనుమంతతీర్థం, నరిసింహతీర్థం, వ్యాసతీర్థం అనే అష్టతీర్థాలున్నవి. ఈ తీర్థాలు కూడ నేడు చాలావఱకు నామమాత్రంగానే ఉన్నాయని చెప్పవలసి వస్తుంది.

ముక్తీశ్వరాలయంలో కాళేశ్వర ముక్తీశ్వరలింగాలే గాక కోణార్కమందిరంలో వలె సూర్యనారాయణుని దివ్య విగ్రహం ఉంది. జయవిజయుల విగ్రహాలున్నవి. మందిరావరణలో మరికొన్ని శిల్పకళాఖండాలున్నవి. దాదాపు మూడు గజాల పొడుగున ఒక మత్స్యవిగ్రహం వుంది.

కాళేశ్వరంలోని అనేక విగ్రహాలను లింగాలను దేవాలయాలను ఇతర పురాతన వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించి వాటి తాత్విక ప్రాముఖ్యాన్ని గుర్తించి అనుసంధానం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వివిధ కాలాలకు వివిధ మతాలకు తత్వాలకు సంబంధించిన అనేక నూతన విషయాలు ఈ ప్రాంతపు కాఱడవిలోను భూగర్భంలోను, అస్తవ్యస్తంగా చేలలో పడివున్న అనేక వస్తువుల్లోను దాగుకొని ఉన్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు.

అన్ని మతాలతో పాటు కాళేశ్వర క్షేత్రానికి మహమ్మదీయ మతసంపర్కం కూడ కలిగింది. ఏ దేవాలయాన్నో, మార్చి కట్టిన పెద్ద మసీదొకటి ఊరి వెలుపలనే ప్రత్యక్షమౌతుంది. ఔరంగజేబు చక్రవర్తి కాళేశ్వరం సందర్శించాడని, ఇక్కడ ఒక రాత్రి గడిపాడని, ఈ క్షేత్రప్రభావం చేత ఆ రాత్రి తన నమాజు చేయడం మరచిపోయాడని, అందుకు చకితుడై ఇక్కడి మట్టిని తీసికొని వెళ్ళి తనకన్న పరమ ధార్మికురాలైన తన తల్లి మంచం క్రింద చల్లగా ఆమె కూడా నమాజు చేయడం మరిచిపోయిందని ఒక కట్టుకథ ప్రచురితమై ఉంది. చారిత్రకంగా ఇదెంతవరకు సత్యమో చెప్పలేము. మొత్తానికి కాళేశ్వర మహాత్యాన్ని నిరూపించె కథలెన్నైనా వినవచ్చును.

ఇందగు దేవతల ప్రభావంతో విలసిల్లిన ఈ ప్రాంతంలో నివసించే మానవుల స్థితిగతులు మాత్రం అత్యంత శోచనీయంగా ఉన్నాయి. 26 తటాకాలు కలిగిన మహాపట్టణమని చెప్పుకోబడే కాళేశ్వరంలో నేడు చెప్పుకోతగ్గ చెరువు లేదు. గ్రామ జనాభా దాదాపు ఒక వెయ్యి వుంటుంది. పూరిగుడిసెలు, నెలల తరబడి కాయగడ్డలు తిని బ్రతుకుతూ నానారోగాలకు గురి అయ్యే మూక ప్రజానీకం సర్వకామ్యార్థ ప్రదాత అనబడే ముక్తీశ్వరునికి మూడువైపులా మూలుగుతున్నారు. ఏ వస్తువు కావాలన్నా సిరివంచ ప్రాంతం నుండి రావలసిందే. పదిమందికి వంట చేయవలసి వస్తే బియ్యంతో సహా ఏ పదార్థమూ ఈ ఊరిలో దొరకదు. తమకేం కావాలో కూడా తెలియనంతటి శుద్ధ అయాకులిక్కడి ప్రజలు. ఊరిలో ఉన్న కొద్దిపాటి భూవసతి ఒకరిద్దరూ పెద్దలకు మాత్రమే ఉంది. తక్కినవారందరేం చేశారో, ఎలా బ్రతుకుతున్నారో అంతా ఆ ముక్తీశ్వరుని లీలలాగే కనిపిస్తుంది.

జగిత్యాల తాలూకాలోని ధర్మపురి నుండి మొదలుకొని గోదావరీ తీరస్థ ప్రాంతమంతా ఆంధ్రుల పురాసంస్కృతికి ఆటపట్టుగా ఎంతోకాలం వరకు ప్రకాశించింది. మంత్రకూటమనే సార్థకనామం కలిగిన మంతెన తాలూకాలో ఎక్కడ అడుగుపెట్టినా చాళుక్య కాకతీయ సామ్రాజ్యాల నాటి కళాఖండాలు, ఆ కళాఖండాల ఖండిత భాగాలు కానవస్తాయి. శోధన చేస్తే ఎన్నెన్నో శిలా శాసనాలు కూడా దొరికే అవకాశం ఉంది. కాని మన సంస్కృతితో సానుభూతి లేని ప్రభుత్వాల క్రింద నలిగి ఈ ప్రాంతం ఎంతో అధోగతి పాలైంది. రాత్రింబగళ్ళు చెమటోడ్చి ఆత్మబలాన్ని మేళవించి నిర్మించిన అసమాన సుందర శిలావిగ్రహాలు, నేడు స్వార్థపరుల ఇండ్లలో త్రొక్కుడు బండలుగాను, గోడల కట్టురాళ్ళుగాను, తుదకు పాకీదొడ్లలోను హఠాత్తుగా కనపడితే సంస్కృతీ గంథం కలిగిన ఏ వ్యక్తికైనా కన్నీరొలకక మానదు.

ఇంతేకాదు ఇంకొక పరిస్థితి కూడా ఆసన్నం కాబోతున్నది. కాళేశ్వరానికి దాదాపు 40 మైళ్ళు దిగువన నీలంపల్లి వద్ద కట్టబోయే ఇచ్చంపల్లి జలవిద్యుఛ్ఛక్తి ప్రాజెక్టు జలాశయంలో ఈ ప్రాంతంలోని చాలాభాగం మునిగిపోబోతున్నది. ప్రాజెక్టులు కట్టినంత త్వరితగతిని పురావస్తు సేకరణ అనుసంధానం జరుపడం సాధ్యపడని పని. కాబట్టి ఈ చరిత్రాత్మక ప్రాంతపు సవివర పరిశీలన శీఘ్రమే ప్రారంభించి అపురూపమైన వస్తువులను భద్రపరచవలసిన తక్షణ బాధ్యతను తఛ్ఛాఖాధికారులు వెంటనే గుర్తించడం అత్యవసరం.

విశాలాంద్ర స్థాపనతో కాళేశ్వర మహాక్షేత్రానికి మంచిరోజులు వచ్చాయని పలువురు భావిస్తున్నారు. శ్రీశైల, ద్రాక్షారామ క్షేత్రాలవలెనే కాళేశ్వరం కూడా ఇకమీద ఆంధ్రుల ప్రముఖ యాత్రా స్థలం కావలసివున్నది. ఇందుకు ముఖ్యంగా కావలసింది రోడ్డు సౌకర్యం. మహాదేవపురం నుండి కాళేశ్వరం వరకు 12 మైళ్ళ రోడ్డు తయారైతే ముక్తీశ్వర స్వామి మహాత్య్మం దానంతటదే దేశ వ్యాప్తమయ్యే సూచనలున్నాయి. ఆంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు ప్రముఖులు, లక్ష్మీ పుత్రులు, పండితులు, ప్రభుత్వాధినేతలు ఈ మధ్యనే కాళేశ్వరం పట్ల శ్రద్ధాసక్తులు ప్రకటించడం అత్యంత ముదావహం. ఆంధ్ర ప్రభుత్వ రెవిన్యూశాఖా మాత్యులు శ్రీ కళా వెంకటరావు ఇదివరకే కాళేశ్వర దర్శనం చేశారు. శాసన సభాధ్యక్షులు శ్రీ అయ్యదేవర, తదితర మంత్రులు ఈ మహాక్షేత్రాన్ని దర్శించే అవకాశాలున్నాయి. ఆంధ్రుల దృష్టి నాకర్షించి అనతికాలంలోనే కాళేశ్వర క్షేత్రంలోని దేవతలు, మానవులు పునరుద్ధరింపబడతారనే ఆశ ఇప్పుడిప్పుడే పొడ చూపుతున్నది.

ఆంధ్రదేశ సంస్కృతికి త్రిలింగ క్షేత్రాలు ముక్కువంటివి. మిగతా రెండు జ్యోతిర్లింగాలు నేటి ఆంధ్రావనికి మధ్యభాగంలో ఉన్నాయి. కాని కాళేశ్వరం మాత్రం నాటికీ నేటికీ ఆంధ్రరాష్ట్రపు ఉత్తరపుటెల్లగా నిలచి ఉంది. పర రాష్ట్రీయులు కూడ విరివిగా దర్శించే ఈ క్షేత్రం ఆంధ్ర సంస్కృతీ ప్రాశస్య్తాన్ని ప్రతిబింబించేదిగా మళ్ళీ రూపొందుతుందని, అందుకు కావలసిన సర్వప్రయత్నాలు వెంటనే కొనసాగుతాయని ఆశిద్దాం.

పి.వి నరసింహారావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here