చిగురించే చెట్టొకటి
ఆశలఊసుల్ని తోరణంచేసి
ఊయలలూగుతోంది
మత్తకోకిలస్వరంతో మది మరులుగొన్న
పున్నాగవనమై పలవరిస్తోంది
వసంతగానశోభకు
నెత్తావి పరిమళం మధురోహల
మల్లెలను జల్లుతోంది
గుప్పెళ్ళతో లేతమామిళ్ళచివుళ్ళు
అమృతమై
తలపుల వాకిళ్ళను వెలిగిస్తూ
ఆకురాల్చిన జ్ఞాపకాలను
అందమైన అనుభూతులుగా
దాచి
మదిదోచే వసంతంతో
మనిషిదో
అనంతకాల అనుబంధం
ముడుచుకున్న మనసుకి
రెక్కలుతొడిగి
గువ్వలా ఎగరేసే
వసంతం
వసివాడని సంతసం
తామసము తొలగించే
తాపసి సంతకం
సి.యస్.రాంబాబు