~
[dropcap]క[/dropcap]న్నీటి చెలమలుగా
విచ్చుకుంటున్న దెందుకు
ఆవిరి మాటల మబ్బుల దారి
కథలనేవో మోస్తూ
తరలివస్తున్న దెందుకు
కొంచెమైనా చల్ల పరచని వాన గాలి
అప్పటినుంచీ ఇప్పటిదాకా
కరగక నిలుచున్న దెందుకు
నీడ నివ్వలేని
అనేక తరాల మాటల ఆకాశం
గారడీ మనుషుల మాటలు చెప్పుకు
నవ్వుకు పోతున్న దెందుకు
అమాయకపు పిట్టల గుంపు
కన్ను తెరిచి మూస్తున్న
కాలపు కంటి రెప్పల మధ్య
కునుకు తీయలేక పోతోందెందుకు
మసక పట్టిన మనిషి కన్ను
ఇంకా ఏం కావాలని
కోరికలను కంటికి కట్టి వూగుతోంది
రాదారి నదిపై వూగిసలాడే
ఎరల చేయి
ఏ రాగానికై వెతుకుతోంది
మకిలి పట్టిన నాగరికతల
అమానవత్వపు మనిషి పాట