టచ్‍ ఫోను

0
3

[dropcap]”లే[/dropcap]బరుదానా! నాకెదురు చెప్తావా? నోర్ముయ్” అంటూ లక్ష్మి జడపట్టుకుని గుంజుతూ, వంగబెట్టి వీపు మీద దెబ్బ వెంట దెబ్బ వేయసాగాడు.

భర్త కొట్టే ఆ దెబ్బలకు మొదట లక్ష్మి నిర్ఘాంతపోయింది. ఆ తర్వాత అతన్నుంచి విడిపించుకోవాలని ప్రయత్నించసాగింది.

“నన్ను మోసంజేసి పెల్లాడావు. పొలంలో పండే వడ్లు మనకు కూడా తిండి గింజలకు సరిపోతాయి. పాలకూ, పెరుక్కూ ఇబ్బంది పడక్కర్లేదు. కొద్దిరోజులు ఓర్సుకుంటే మీవాళ్ళు నన్ను ఇంట్లోకి రానిస్తారన్నావు. నన్నీ గొడ్డపాకలో వుంచావు. ఇక్కడ పగలే దోమలు, దుండీగలు కుడతన్నాయి. రోజూ పొలం పనులకు పోతాను. ఆ డబ్బుతో ఓ నెలరోజుల్లోనే నాకు మంచి టచ్ ఫోన్ కొనిస్తానన్నావు. ఇప్పుడు ఆ ఫోన్ ఊసే ఎత్తకుండా కొట్టటం కూడా మొదలుపెట్టావు” అంటూ లక్ష్మి బావురుమని ఏడ్చింది.

“మన పెళ్ళయి నెలైనా మా అమ్మా, నాన్నా మారకపోగా మనల్నే ఊరిడిచి పొమ్మంటున్నారు. నేనా గోలలో వుంటే నీకు టచ్‍ ఫోన్ కావాలా? ఒక్క తన్ను తన్నానంటే పోయి నేలగ్గరుసుకుంటావు” అన్నాడు నాగేశ్వర్రావు.

“మనది మాత్రం ఈ ఊరుగాదా? ఆళ్ళేదో అన్నారని నన్ను బాదితే ఏమొత్తది? నన్ను కొట్టి ఎల్లగొట్టమని చెప్పారా ఏంది? నేను లేబరుదాన్నని మొదటే నీకు తెలుసుగా? నీకీ సదువూ, ఉద్దోగం లేకపోయేసరికి మీ కులపోళ్ళు ఎవరూ నీకు పిల్లనియ్యలేదు. నన్ను పిచ్చిదాన్ని చేసి దబదబా గుళ్ళోకి తీసుకెళ్ళి నా మెళ్ళో పసుపుతాడు కట్టావు. మా వాళ్ళెవరికీ ఈ పెల్లి ఇష్టమే లేదు. నేనే నీమీద ఆశతో, నమ్మకంతో ఒప్పుకున్నాను. ఒక నెలకే నన్ను లేబరుదానివని అనటం, చెయ్యి చేసుకోవటమా?”

లక్ష్మీకేం సమాధానం చెప్పకుండా నాగేశ్వర్రావు బయటికెళ్ళిపోయాడు.

రాళ్ళపొయ్యిలో, తాటిమట్టల మంటలో మసిపట్టిన అల్యూమినియం గిన్నెల్ని తోముతూ లక్ష్మి ఆలోచనలో పడింది.

“నాగేశ్వర్రావు ఎన్నిమాటలు చెప్పాడు? టచ్ ఫోనంటే నీకు బాగా ఇష్టం కదా తొందరగానే కొనిపెడతానన్నాడు. తనసలు సరిగా పనులు సేయటానికే పోవటం లేదు. సోంబేరిలాగా వుంటున్నాడు. వాళ్లకున్న కొద్ది పొలాన్ని వాళ్ళ నాన్నే చూచుకుంటున్నాడు. వాళ్ళ అమ్మా నాన్నలకు నచ్చచెప్పి నన్ను తమింట్లోకి తీసుకుపోతానన్నాడు. తను నమ్మింది. తన పుట్టింట్లో తను సాలా కష్టపడేది. రెండు మూడుసార్లు డబ్బులు కూడబెట్టగలిగింది. మంచి టచ్‍ ఫోను కొనుక్కుందామనుకునే లోగానే అమ్మో, నాన్నో ఏదో అవసరానికి డబ్బు అడిగేవాళ్ళు. తను కాదనలేక ఇచ్చేసేది. ఏంటో? నాలుగువేలు పెట్టి మంచి ఫోనే కొనుక్కోలేకపోతున్నాను. ఇప్పుడు ఊరిడిసిపోవాలా? అంత తప్పు తామేం జేశారు? ఈ ఊర్లోనే ఇల్లు దీసుకుని ఏరే వుంటే పోలా? ఏంటో ఏమి అర్దం గావడం లేదు. ఈ నాగేశ్వర్రావు అమ్మకీ, నాన్నకీ ఆ మాత్రం సెప్పలేడా”

***

“ఏరా నాగేశూ! మేం జెప్పిన మాట ఏం జేశావు? మీ నాన్న ఒకటే సతాయిస్తున్నాడు. మాకు మాట మాత్రమైనా చెప్పకుండా ఆ లేబరుదాన్ని కట్టుకొస్తివి. దాన్ని ఇంట్లో ఎట్లా పెట్టుకుంటామనుకున్నావు? అదే పొరుగూరుదో కాదు. ఊర్లో అందరెరిగిన పిల్ల. ఇల్లిల్లూ దిరిగి పాచిపన్లు చేసిన పిల్ల. మీ నాన్న ఎవరి ముఖమూ చూడలేకపోతున్నాడు. ఒకటే కుమిలిపోతున్నాడు. నాకూ ముద్ద దిగటం లేదు. మా మాటిని మా కళ్ళకు కనపడకుండా దూరంగా పోయి బతకండి. ఎన్నాళ్లు గడిచినా ఆ పిల్లను మాత్రం ఇంట్లోకి రానివ్వం. నేను కొంత డబ్బిస్తాను. అది తీసుకుని ఎటైనా వెళ్ళండి.”

“వెళ్ళండి…. వెళ్ళండి అంటావు. ఎక్కడికని పోయేది? ఎట్టా బతికేది? మన కులంలో నాకెవరైనా పిల్లనిస్తానని ముందుకొచ్చారా? వయసైపోతుందని నేను దీన్ని కట్టుకున్నాను.”

“నోర్ముయ్యిరా. ఇరవై ఆరేళ్ళకే నీకు తొందరపుట్టింది. కొన్నాళైనా ఆగాల్సింది. చిన్నప్పట్నుంచీ అంతే. నీకంతా తొందరే. వెనకా ముందు ఆలోచించవు. నీ తర్వాత నీ తమ్ముడున్నాడు. వాడూ ఎంతో బాధపడుతున్నాడు. రోజూ మేం ముగ్గురం ఇది తల్చుకుని, సరిగా తిండి తినలేకపోతున్నాం. రెప్పమూయలేకపోతున్నాం. మీ నాన్న వాలకం చూస్తుంటే, ఆ మనిషి ఏం ప్రాణం మీదకు తెచ్చుకుంటాడోనని భయంగా వుంది. నీ కాళ్ళకు దండం పెడతా నామాటిను.”

“ఇప్పుడిన్ని మాటలంటున్నావమ్మా. పెళ్ళి సంగతి చెప్పలేదు కాని, చావిట్లో కాపరం పెట్టేటప్పుడు నీకు చెప్పాను. అప్పుడంతా ఊరుకున్నావు. ఇప్పుడు మెడపట్టి గెంటుతున్నావు. ఇంట్లో తిండిగింజలు తింటూ, దొడ్లో పాడి తాగుతూ బతకొచ్చని నేననుకున్నాను. పో…. పో అంటే నేనెక్కడికి పోయేది? అదీ నేను ఎట్టా బతకాలి?”

“అంత కాపరం ఈదలేనివాడివి పెళ్ళెందుకు చేసుకున్నావురా? మీ నాన్నా, నేనూ, కష్టపడితే కూర్చుని తింటానని చెప్పటానికి సిగ్గుండాలి. నువ్విక్కడే వుంటే, నీ కాళ్ళమీద నువ్వు బతకడం నీకు రాదు. అందుకే దూరంగా పోతే బాధ్యత తెలుస్తుంది. నాచేత మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవద్దు. నువ్వు చెయ్యగలిగిన పనే చేసి సంపాదించు. పెళ్ళాన్ని పోషించు. నాలుగు రోజులు పోతే మేం మారతామనుకోకు. ఇదే ఆఖరుమాట.”

***

“మా అమ్మా నాన్నా గట్టి పట్టుదల మీదే వున్నారు లక్ష్మీ. మనల్ని దూరంగా పోయి బతకమనే అంటున్నారు. ఇదంతా నా తమ్ముడి ఆలోచన అయి ఉంటుంది. ఈ వంకతో మనల్ని ఇంట్లో చేరనీయకుండా వున్నదంతా తనే వాటేసుకోవాలని చూస్తున్నాడు. ఎవడికి తెలియని భాగోతం! మా అమ్మా నాన్నా వాడికే వంత బాడుతున్నారు. మా నాన్న నాతో మాట్లాడటం మానేశాడు. అన్నీ మా అమ్మ చేతే చెప్పిస్తున్నాడు.”

“రోజూ ఇంటికి బోయి మీ అమ్మను బతిమాలుకుంటూనే వుంటివి. పోనీ ఆల్ల పాపం ఆల్లకే. మనిద్దరం సాకిరీ చేసుకుందాం. బతకలేమా ఏంటి?”

“ఏంటే బతికేది? నాకేమైనా ఉద్యోగమా? నికరమైన పనేదైనా వున్నదా?”

“ఎందుకంత భయం? మా వాళ్ళంతా బతకటంలా? వాళ్లంతా కష్టపడుతున్నారు. వాళ్ళకు మాత్రం ఉద్యోగాలు, నికరమైన పన్లూ వుండాయా ఏంటి? ఏ పని దొరికితే ఆ పని చేత్తారు. చీకూ చింతా లేకుండా బతుకుతున్నారు. వాళ్ళందరు టచ్ ఫోన్లు కూడా కొనుక్కున్నారు.”

“నోర్ముయ్ లేబరుదానా. మాట్టాడితే టచ్ ఫోనంటావు. అదేంటో కూడు, గుడ్డా పెట్టేటట్లు. ఏం చేసి బతకాలా? ఎక్కడికి పోవాలా? అని నేనేడుస్తుంటే టచ్ ఫోను కబుర్లు చెప్తున్నావు.”

“ఇంకోసారి లేబరుదానా! అన్నావంటే ఊరుకోను. మర్యాదగా వుండదు. నోరు అదుపులో పెట్టుకో. అమ్మా నాన్నా పోషించలేకపోతే బతకలేమని భయపడుతున్నావు. నువ్వేం మగాడివి! నీకంత భయమైతే మా ఇళ్ళ దగ్గరకు పోదాం పద. ఒకిల్లు తీసుకుందాం. బడ్డీ కొట్టు పెట్టుకుందాం. బదుకుదాం.”

“నా బతుక్కు అదొక్కటే తక్కువైంది. పోయి పోయి మీ పేటలోనే కాపురం పెట్టాలా? నలుగురూ నోట్లో వూస్తారు. ఆ మాట ఇంకెప్పుడూ వాగబాకు.”

“ఏదో నీ సుఖం కోసం నన్ను కట్టుకున్నావు. అంతకు దప్ప నా కులమన్నా, నా వాళ్ళన్నా, నీకు చీదరగా వున్నది” అంటుంటే లక్ష్మికి ఏడుపు వచ్చేసింది.

“ఛత్ ఏడుపాపు” అంటూ నాగేశ్వర్రావు నేలను కాలితో ఒక తన్ను తన్నాడు.

***

“నిన్ను చూడాలనిపించే వచ్చాను లచ్మీ. ఈ గొడ్డపాకలో గొడ్ల మధ్యే వున్నావు. పెద్ద కులపోణ్ణి కట్టుకున్నావు. వాళ్ళ వాళ్ళు నిన్ను ఇంటో కలుపుకుంటారని నాకైతే నమ్మకం లేదు.”

“అవును అమ్మమ్మా! నేనెంటే వాళ్ళెవరికీ ఇట్టంగా లేదు. నన్ను లేబరుదానికిందే జమ కడుతున్నారు. ఇప్పుడు ఊరిడిసి పొమ్మంటున్నారు. నాగేసుకి ఎదిరించే దమ్ము లేదు. తిన్నగా ఏదీ సేయడు. ఎట్టా బతకాలో! ఇక్కడ ఏరే వుంటే పోద్ది”

“వున్నా అమ్మాబాబులతో తగువాడతాడు. అంతకుమించి మరేం వుండదు. సరైనోడు అయితే కట్టపడి కాపరాన్ని ఈదుతాడు. నేను ఊరికెళ్ళిన తర్వాత మీ తాతలో మాట్టాడతాను. మా ఊరన్నా వచ్చి బతుకుదురుగాని. ఎంబడితోనే ఏ సంగతీ సెప్తాను.”

అన్న ప్రకారమే “మా ఊరు వచ్చేయండి” అన్న కబురు పంపింది లక్ష్మి వాళ్ళ అమ్మమ్మ. ఒకప్పుడు పోస్టాఫీసు పెట్టిన పాత ఇంటిలో రెండు గదులు బాడుక్కు తీసుకున్నారు. ఆ ఊళ్ళో స్టేట్ బ్యాంక్ వారి ఎ.టి.ఎం వున్నది. దానికి వాచ్‍మెన్‍గా లక్ష్మి వాళ్ళ తాతయ్య ఉంటున్నాడు. తనకు బదులుగా ఇప్పుడు నాగేశ్వర్రావును వాచ్‍మెన్‍గా మాట్లాడి పెట్టాడు. అక్కడ రోజూ లోపలా బయటా లక్ష్మి ఊడ్చి శుభ్రం చేసేది. దానిగ్గాను మరో నాలుగువందలు ఇచ్చేవాళ్ళు. నాగేశ్వర్రావు స్టూలొకటి వేసుకుని ఎ.టి.ఎం ముందు కూర్చునేవాడు. ఫోన్‍లో పాటలు వింటూ కాలక్షేపం చేసేవాడు. తనకొచ్చే జీతంలో ఇల్లు గడవదన్న ఆలోచన అసలేం లేదు.

ఏ పని చేసి డబ్బులు సంపాదించాలా? మంచి టచ్‍ ఫోన్ ఎప్పుడు కొనుక్కోవాలా? అన్న ఆలోచనతోనే ఉన్నది లక్ష్మి. ఆ ఫోన్ మీద ఇష్టం రోజు రోజుకి పెరిగిపోతున్నది. తనకేదైనా పని కావాలని అమ్మమ్మతో సంప్రదించింది.

ప్రస్తుతానికి రెండిళ్ళల్లో పాచిపని చేయమన్నది. ఆ మాట విని నాగేశ్వర్రావు గొడవపెట్టుకున్నాడు.

“ఆళ్ళెవరో ఇడిచిన బట్టల్ని ఉతికి, వాళ్ళ ఎంగిలి బొచ్చెలు తోముతావా? అవునులే లేబరుదానికి ఇంకేం చేతనవుతాయి?”

“ఆ మాటే అనొద్దన్నాను. నువ్వే సంపాదించి ఇల్లు గడుపు. నేనిల్లు కదలను” అంటూ లక్ష్మి వాదనకు దిగింది.

చివరకు రోజూ వెళ్ళి జీడిపప్పు పాకింగ్ చేసే పని ఒప్పుకున్నది. ఉదయమే వెళ్ళి సాయంకాలానికొచ్చేది. వారానికొకసారి జీతమిస్తున్నారు. కాని చేతిలో డబ్బులేం మిగలటం లేదు. కొత్త కాపరానికి నాలుగు వస్తువులూ అవసరమవుతున్నాయి. కొనక తప్పటం లేదు. కొన్నాళ్ళు అలా గడిచింది. అతికష్టం మీద లక్ష్మి దగ్గర నాలుగువేలు జమయ్యాయి. ఇప్పుడైనా టచ్ ఫోన్ కొనాలనుకున్నది. ఆ మాటే నాగేశ్వర్రావుతో చెప్పింది.

“ఎ.టి.ఎం పక్కనంతా ఖాళీ చోటే. పచ్చగడ్డి బాగా వున్నది. నీ దగ్గరున్న డబ్బుల్తో గొఱ్ఱెనో, మేకనో కొనుక్కుంటే మేపుకోవచ్చు. మనకు బాగా లాభం వస్తుంది. టచ్‍ఫోన్ ఇంకోసారి కొనుక్కోవచ్చు.”

“నువ్వు చెప్పిన మాట బాగానే వున్నది. మా తాత్తో సెప్తాను. తనైతే సూసి కొంటాడు.”

తాత నాలుగువేలకు ఒక మాదిరి సైజున్న గొఱ్ఱెపిల్లను కొనిపెట్టాడు.

“లచ్మీ దీన్ని బాగా మేపుకోండి. తొందర్లోనే పదివేలు పలుకుతుంది. వచ్చే సాయిబుల పండగ నాటికి తయారవుతుంది” అన్నాడు తాత.

నాగేశ్వర్రావు దాన్ని మేపసాగాడు. లక్ష్మికి కూడా అదంటే బాగా మోజుగా వున్నది. తాము తినేయన్నీ గొఱ్ఱెపిల్లకూ పెట్టసాగింది. అది స్వంత బిడ్డలాగా మాలిమి అయింది. పగలంతా ఎ.టి.ఎం దగ్గర తిరిగి రాత్రిళ్ళు మంచంకింద పడుకోసాగింది.

జీడిపప్పుల పాకింగ్ దగ్గరకు వెళుతుంటే రోడ్డమ్మట చిత్తుకాగితాలు ఏరుకునే అతని చేతిలో టచ్‍ ఫోన్  చూసి లక్ష్మి నిట్టూర్చింది.

“నా దగ్గర నాలుగువేలు ఎప్పుడు పోగయ్యేను? ఎప్పుడూ ఫోన్ కొంటానో” అనుకున్నది.

రెండునెలలు గడిచాయి. గొఱ్ఱెపిల్ల పెరిగింది. “ఒకటిరెండు నెలల్లో దీన్ని అమ్మేసుకోవచ్చు. మంచి రేటే వస్తుంది. అమ్మగా వచ్చిన డబ్బుల్లో నాలుగువేలు పెట్టి ఫోన్ కొనాలి” అన్న ఆలోచనకొచ్చింది. ఎ.టి.ఎం వెనకాల పిచ్చి మొక్కల మధ్యలో లేత పసుపురంగు చామపువ్వంత పెద్ద సైజులో పుట్టగొడుగు మొలిచింది. కొంచెం దూరానికి కూడా దుర్వాసన వస్తున్నది. పైగా అది విషపూరితమైనది. పిచ్చిమొక్కల్ని తింటూ గొఱ్ఱె ఆ పుట్టగొడుగును కూడా తిన్నది. కాసేపటికి దాని గొంతంతా నీలుక్కుపోయి నోటి వెంట నురగ రాసాగింది. గురక కూడా పెట్టసాగింది. అప్పుడే వచ్చి నాగేశ్వర్రావు నేలమీద పడిపోయిన దానిని ఆటోలో వేసుకుని పశువుల ఆసుపత్రికి వెళ్ళాడు.

“లాభం లేదు. ఒంటిరంగు కూడా మారుతున్నది. ఏదో విషపదార్థం తిన్నట్లున్నది” అన్నారు.

కాసేపట్లోనే గొఱ్ఱె చనిపోయింది.

లాభం తెచ్చిపెడుతుందనుకున్న గొఱ్ఱె అసలే లేకుండా పోయిందని లక్ష్మి దిగులుపడింది. అప్పుడే లక్ష్మి నెల తప్పింది.

“డబ్బు సాయం చేసేవారు ఎవరూ లేరు. నేనే జాగ్రత్తపడి కానుపుకు డబ్బు కూడబెట్టుకోవాలి. ఇప్పుడప్పుడే చాలినంత డబ్బు పోగవదు. మంచి టచ్ ఫోను కొనలేను. అయ్యో దేవుడా!” అనుకున్నది

రెండు నెలలు గడిచిన తర్వాత లక్ష్మికి కడుపు పోయింది. ఏడుస్తూ కూర్చుంది.

“దరిద్రపుదానా! నీ జాతకమే అంత. ఏదీ కలిసిరాదు. మా అమ్మ ఏ పని చేసినా కలిసొచ్చుద్ది. చేతి చలవ, చూపు తీరు బాగుండాలి” అని ఆడిపోసుకున్నాడు నాగేశ్వర్రావు.

“జరిగే నష్టాలకు నేనేడుస్తుంటే నీ మాటలేంటి? నీ జాతకమే బాగుండలేదేమో?”

“అవును. నా జాతకం బాగోకే నిన్ను కట్టుకున్నాను.”

“లచ్మీ! ఒక నెలరోజుల పాటు ఇంటిపట్టునే వుండు. ఒంటో బలంలేకే కడుపుపోయింది. బలానికి తినాలి” అంటూ అమ్మమ్మ లక్ష్మిని ఇంటి పట్టునే ఉంచేసింది.

కొద్దికొద్దిగా దాచిన డబ్బు కాస్తా ఖర్చులకు కరిగిపోయింది. మరలా పనికి వెళ్ళడం మొదలు పెట్టింది. టచ్‍ఫోన్ కొనటం ఆలస్యమయ్యే కొందికీ లక్ష్మికి దానిమీదే ధ్యాస పెరిగిపోసాగింది. ఖర్చులు తగ్గించుకుని మరలా కొద్దికొద్దిగా డబ్బు కూడబెట్టసాగింది. ఇంటికి తెస్తే ఖర్చవుతుందని కొంత డబ్బు పనిచేసే చోటే దాయసాగింది.

మూడువేలు పోగయ్యాయి. “అమ్మయ్యా! ఇంకో వెయ్యి కూడేస్తే చాలు అనుకున్నది. చౌకఫోను, పాతది, ఏదో కొనకుండా కొత్తది మంచిదే కొనాలి. దాన్ని వేళ్ళతో కదుపుతూ చూసుకోవాలి. అది ఎన్నాళ్ళనుండో తను కనే కల. నిజం చేసుకోవాలి” అన్న తపన ఎక్కువైంది.

ఆ రోజు రోడ్డుదాటి ఇంటికి భోజనానికని నాగేశ్వర్రావు బయలుదేరాడు. వెనుకనుంచి వచ్చిన మోటార్ బైక్‍ను అతను చూసుకోలేదు. బైక్ అతను బ్రేక్ వెయ్యలేకపోయాడు. ఫలితంగా బైక్ తగిలి నాగేశ్వర్రావు రోడ్డుమీద అంతదూరం వెళ్ళిపడ్డాడు. తల పగిలి రక్తం కారసాగింది. బైక్‍తో పాటు దానిమీదున్న మనిషి కూడా కిందపడ్డాడు.

“నా తప్పేం లేదు, అతనే నాకడ్డం వచ్చాడు” అని తేల్చి ఒళ్ళు దులుపుకుని తన బండిని లేపి తీసుకుని అతనెళ్ళిపోయాడు.

నాగేశ్వర్రావుని ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వున్న ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. ఎక్కువగానే తలకు కుట్లు పడ్డాయి. ఒళ్ళంతా కొట్టుకుపోయి రోడ్డు దెబ్బలు తగిలాయి. ఆసుపత్రిలో మూడురోజులుంచి ఇంటికి పంపేశారు. “రోజు తలకు కట్టిన కట్టు మార్పించుకోవాలి. వ్రాసిచ్చిన మందులు వాడాలి. జాగ్రత్తగా చూడాలి” అని చెప్పారు.

కట్టు మార్చే ఆర్. యం. పి డాక్టరు ఫీజుకు, మందులకూ, ఇంట్లో ఖర్చులకూ దాచిన మూడువేలు ఖర్చయిపోయాయి. నాగేశ్వర్రావు కోలుకునే దాకా తాతే కాపలా పని చేస్తున్నాడు. లక్ష్మిపనిలో కెడుతున్నది.

టచ్‍ఫోన్ ఊసెత్తగూడదేమో? అది కొనాలనుకున్నప్పుడల్లా ఏదో ఒక అనర్థం జరుగుతుందని కంగారుపడింది. కాని మరలా మనసు పీకుతూనే వున్నది. లక్ష్మి మరలా నెల తప్పింది. “అమ్మో! ఈసారి ఏమౌతుందో! దేముడా! దేముడా! చల్లగా చూడు” అని దండాలు పెట్టుకోసాగింది. వాళ్ళమ్మ వచ్చింది. అమ్మ, అమ్మమ్మ ధైర్యం చెప్పారు. ఐదు నెలలు గడిచాయి. ఆరోగ్యం బాగానే వున్నది.

“నెలలు నిండితే పనిచేయలేను. కాన్పు అయినా కూడా పసిబిడ్డతో పనిలోకి పోలేను. నాగేశ్వర్రావు సంపాదన అన్నిటికీ సరిపోదు. కాన్పయ్యేలోగా తనే జాగ్రత్తగా ఉండి వీలైనంత డబ్బు కూడెయ్యాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో పురుడు పోసుకున్నా, కొడుకో, కూతురో పుడితే వాళ్ళను పెంచటానికి ఖర్చవుతుంది. కడుపుతో వున్నప్పుడు నేను తింటానికి కాయా, కమ్మా కావాలి. తాగటానికి బలం మందులు కావాలి” అని ఆలోచించి పైసా పైసా పోగేయాసాగింది లక్ష్మి.

తాతకు ఆయాసం వున్నది. చలికాలం కావటాన ఆయాసం ఎక్కువయింది. ఇంట్లో నుంచి కదల్లేకపోతున్నాడు.

“రోజూ రెండు గిద్దెల పాలైనా ఏడిఏడిగా తాగిస్తే మనిషికి కాస్త ఆదరువుగా వుంటుంది. చేపనూనె గోలీలు తెప్పించి వాడమంటున్నారు. నీ మేనమామకు చెప్పాను. ఏం పట్టించుకోవడం లేదు. నాకాడ డబ్బుల్లేవు” అన్నది అమ్మమ్మ బాధగా.

తమకోసం ఇంత చేసిన తాతకు ఈ చిన్న సాయమైనా చెయ్యాలనిపించింది లక్ష్మికి. తాతకోసం రోజు రెండు గిద్దెలపాలు తనే కొని ఇస్తున్నది. మంచి తేనె తెప్పించింది. చేపనూనె గోలీలున్న పెద్దసీసా పన్నెండువందలు పెట్టి కొన్నది. ఇవన్నీ తాతకిస్తుంటే లక్ష్మి మనసుకు ఎంతో బాగున్నదనిపించింది. చేతిలో వున్న డబ్బు చాలావరకు అయిపోయింది. మళ్ళీ కూడబెట్టాలనుకున్నది. కాన్పు సమయానికి తల్లి వస్తానన్నది. మనిషి సాయమే కాని ఆర్థికంగా ఆదుకోలేని స్థితి వారిది.

నెలలు నిండాయి. లక్ష్మి పనికి వెళ్ళలేకపోతున్నది. నాగేశ్వర్రావు సంపాదనతో ఇల్లు బొటాబొటీగా గడుస్తున్నది. వాచ్‍మెన్ పని మానుకుని మరేదైనా పని చూసుకోమంటే “అమ్మో! నావల్ల ఎక్కడవుతుంది” అంటాడు. తలకు దెబ్బ తగిలించుకున్నాక మరీ అర్భకంగా తయారయ్యాడు.

తను కూడబెట్టిన డబ్బు అడిగి తెచ్చుకున్నది. నాలుగువేలు ఉన్నాయి. ఒకప్పుడైతే నాలుగువేలు పోగవగానే టచ్ ఫోన్ కొనాలని ఉబలాటపడేది. కాని ఇప్పటి పరిస్థితి వేరు. తన ఆరోగ్యం కోసం, పుట్టబోయే సంతానం కోసం జాగ్రత్త పడుతున్నది.

లక్ష్మికి ప్రభుత్వాసుపత్రిలో కాన్పయింది. కూతురు పుట్టింది. కూతుర్ని ఎత్తుకుని సంబరంగా ఇంటికొచ్చింది. టచ్‍ ఫోన్ సంగతి తాత్కాలికంగా మర్చిపోయింది. లక్ష్మి వాళ్లమ్మ ఓ పదిహేను రోజులుండి అన్ని పనులూ అలవాటు చేసింది. తనతో లక్ష్మిని కూడా రమ్మన్నది. కాని లక్ష్మి ఇష్టపడలేదు.

“ఇక్కడ అమ్మమ్మ వున్నదిగా. నాకు సాయపడుతుంది. పైగా నేను నీతోపాటే వస్తే నాగేశ్వర్రావుకు తిండి ఇబ్బందవుతుంది. చేసే పని కూడా మానేసి వచ్చినా వస్తాడమ్మా.”

“నీ ఇష్టం” అంటూ ఆమె వెళ్ళిపోయింది.

నాగేశ్వర్రావుకు కూతురు పుట్టడం అంత ఇష్టంగా లేదు.

“కొడుకు పుడితే బాగుండేది. మనవణ్ణి చూసుకునైనా మా అమ్మా నాన్న మనల్ని ఇంట్లోని రానిచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది. వాళ్లకిష్టం లేనట్లుంది. మా అమ్మను రమ్మని ఫోన్ చేశా. రానే లేదు. అదే మనవడైతే తప్పకుండా వచ్చేది. అయినా నీకు కొడుకెక్కడ పుడతాడులే? దేనికైనా రాసిపెట్టి వుండాలి.”

“నువ్వూ, నీ తమ్ముడూ ఇద్దరూ మగాళ్ళే. మీ ఇంట్లో ఆడపిల్ల లేదు. నాయంగా అయితే మీ వాళ్ళకు మనవరాలంటేనే ఇష్టముండాలి. మీ అమ్మ నా కూతుర్ని చూడటానికి రాకపోతే పోనీ. నా కూతురు పెరగదా? పెద్దవదా?”

ఆ రోజు కూతురుకు స్నానం చేయించి ఒళ్ళంతా ఒత్తుగా పౌడర్ వేసింది. కళ్ళకు కాటుకా, నల్లబొట్టూ పెట్టింది. నాగేశ్వర్రావు ముక్కూ, రంగు వచ్చి పిల్ల చూడచక్కగా వున్నది. ఆ ముక్కూ, రంగు సూసి కదూ నేను పడిపోయింది అనుకున్నది లక్ష్మి.

‘కూతురు మెలకువతో ఉన్నప్పుడూ, నిద్రపొయేటప్పుడూ ఒకటే బోసినవ్వులు నవ్వుతుంది. దాని బుగ్గలు దూది కంటే మెత్తగా వున్నాయి. వాటిని నా వేళ్ళతో కదిలుస్తుంటే ఎంతో సంతోషం కలుగుతుంది. దాని నవ్వులో, దాని కళ్ళలో ఎన్ని ఎలుగులో, ఎన్నిరంగులో? ఏ టచ్ ఫోనును వేళ్ళతో కదిలిస్తుంటే మాత్రం ఇంతకంటే ఎక్కువ సంతోషం కలుగుతుందా? అసలు దాని ముఖమే పున్నమి చందమామ కంటే బాగున్నది. టచ్‍ ఫోనులో ఉండే సంగతులన్నీ నా తల్లి కళ్ళలో, నా తల్లి చిరునవ్వులో, నా బంగారు తల్లి ముఖంలోనే కనపడుతుండాయి. నా తల్లి కాళ్ళకూ చేతులకూ వున్న ఒక్కో ఏలే ఒక్కో టచ్‍ ఫోన్‍తో సమానం. ఇప్పుడు నేనింకే టచ్‍ ఫోనూ కొనుక్కోనక్కరలేదు. ఇప్పుడన్నీ నాకు నా కూతురే’ అనుకుని కోరిక తీరిన మనసుతో తృప్తిగా మురిసిపోయింది లక్ష్మి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here