[box type=’note’ fontsize=’16’] “దెబ్బతిన్న ప్రకృతి వ్యవస్థ పునరుద్ధరణ అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అయినా ప్రయత్నం చేయక తప్పదు” అని ఈ వ్యాసంలో వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి. [/box]
నేడు కళ్ళకు కడుతున్న నాటి కాలజ్ఞాన భాష్యం:
[dropcap]సం.[/dropcap] 1900 నుండి 2060 దాకా సమాజ వికాసానికి సంబంధించి 1972లో ‘మిట్’ (MIT) కు చెందిన బృందం ఒక అధ్యయనం ద్వారా అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా – జనాభా, జనన/మరణ రేటు, ఆహార ఉత్పత్తి, పాల ఉత్పత్తి, వైద్య, విద్యా సేవలు, పునరుత్పాదక ఇంధన వనరులు, కాలుష్యం వంటి పలు అంశాల ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనానికి సంబంధించి కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను వ్రాసినది మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) కు చెందిన ప్రొఫెసర్ జెర్రీ ఫాస్టర్. ‘వరల్డ్-1’ వెర్షన్ అయిన ఈ ప్రోగ్రామ్ ప్రకారం –
1900 నుండి 1940 వరకు జీవన నాణ్యత పెరిగింది. అక్కడి నుండి వేగం తగ్గినా నిదానంగా 2020 నాటికి పతాకస్థాయికి చేరుకుంటుందని ఆ తరువాత పతనం దిశగా జారిపోతుందని రేఖా చిత్రాలతో సహా వెల్లడించారు. 1972 తర్వాత జీవన నాణ్యత ఎలా పడిపోయేదో కూడా కరెక్ట్‌గానే అంచనా వేయబడింది. 2020 నాటికి పరిస్థితులు విషమిస్తాయని, నివారణ చర్యలు చేపట్టని పక్షంలో, జీవన నాణ్యత సూచి ‘0’కి పడిపోగల ప్రమాదం ఉందనీ వేసిన అంచనాలు నూటికి నూరు శాతం నిజమని ప్రస్తుత పరిస్థితులు ఋజువు చేస్తున్నాయి.
కాలుష్యం కారణంగా మరణాలు సైతం సంభవిస్తాయని తద్వారా జనాభా తగ్గిపోతుందనీ ఆ అధ్యయనం హెచ్చరించింది. పై వివరాన్నిటితో వెలువరించబడిన ‘లిమిట్స్ టు గ్రోత్’ అప్పట్లో బెస్ట్ సెల్లర్ పుస్తకం.
‘వరల్డ్-1’ నమూనాని ఆధారంగా చేసుకొని ఆధునిక నమూనా 3వ తరం ‘వరల్డ్-3’ ను వాడి గయా హెర్రింగ్టన్ పూర్వపు అంశాలకు ‘ఎకోలాజికల్ ఫుట్ ప్రింట్’ను అదనంగా జోడించి అంచనా వేశారు. వీరూ ‘మిట్’ ప్రొఫెసరే. ఆ అంచనా ప్రకారం ప్రస్తుతం ఉన్న పరిస్థితులే కొనసాగితే 2040 నాటికి మానవజాతి మనుగడే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉంది. ఈ అధ్యయనం తాలూకు వివరాలన్నీ ‘జర్నల్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎకోలజీ’ (యేల్) లో పబ్లిష్ అయ్యాయి.
ఐ.పి.సి.సి – నివేదికలూ అరణ్య రోదనే:
గడచిన 30 సంవత్సరాలకు పైగా ఐ.పి.సి.సి. వాతావరణ మార్పులపై నిర్ణీత వ్యవధిలో నివేదికను విడుదల చేస్తూ వస్తోంది. కర్బన ఉద్గారాలు, ఉష్ణోగ్రతలో మార్పులు, సముద్రపు మట్టాలలో మార్పులు, గ్లేసియర్స్ వంటి అంశాలకు సంబంధించి జరిపిన అధ్యయనాల వివరాలు ఈ నివేదికలో ఉంటాయి. ఆ నివేదికల ప్రకారం –
2006-2018ల నడుమ సముద్ర మట్టాలు ఏటా సగటున 37 మిల్లీమీటర్లు చొప్పున పెరుగుతూ వచ్చాయి. గతంలో సుమారుగా వందేళ్ళకు ఒకసారి గాని లెక్కకు చిక్కని సముద్ర మట్టాల మార్పు ఇప్పుడు ప్రతి దశాబ్దానికి ఒకసారి తెలిసిపోతోంది. వాతావరణ పరిస్థితులు ఇలా కొనసాగితే ఆ మార్పు రానున్న కాలంలో ప్రతీ ఏటా నమోదుకు చిక్కినా ఆశ్చర్యపోనక్కరలేదు. కారణం –
ఆర్కిటిక్‌లో 7½ మిలియన్ చదరపు కిలోమీటర్లకు పైగా ఉన్న గ్లేసియర్స్‌లో 1½ మిలియన్ చదరపు కిలోమీటర్లు ఇప్పటికే కరిగిపోయింది. గ్రీన్‌ల్యాండ్, ఐస్‌ల్యాండ్, హిమాలయాలలో – హిమనీ నదులు కరగడంతో ఏటా ¼ వంతు మిల్లీమీటర్లకు మించి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. మంచినీరు సముద్రంలో కలవడంతో సముద్ర జలాలు వేడెక్కుతున్నాయి. సముద్ర జలాలు వేడెక్కడంతో మరింత మంచు కోసుకుపోవడం జరుగుతోంది. తుఫాన్ల ఉధృతి పెరిగి కుంభవృష్టి కారణంగా ఆ నీరూ సముద్రంలో చేరి సముద్ర మట్టం మరింత పెరగడానికి దోహదం చేస్తోంది.
దావానలాలు, వడగాడ్పులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలన్నిటికీ మానవ తప్పిదాలే కారణమని ఐ.పి.సి.సి. తాజా నివేదిక ఖరాఖండీగా తేల్చి చెప్పింది. వివిధ దేశాలు ‘నెట్ జీరో ఎమిషన్’ లక్ష్యాలను నిర్దేశించుకున్నాయి. అయినప్పటికీ అంత వ్యవధి లేదనే 2040 నాటికే ఉష్ణోగ్రతలు ప్రమాద సూచీలను దాటిపోనున్నాయని ఐ.పి.సి.సి. నివేదిక హెచ్చరించింది.
మనుగడ కావాలనుకొంటే చేసిన ఘోరమైన తపిదాలన్నిటినీ సరిదిద్దుకోవాలి నిజమే. కానీ యుద్ధ ప్రాతిపదికన నడుం బిగించినా రక్షణ సాధించుకోగలమన్న భరోసా లేదు. కారణం –
ఏ వ్యవస్థనైనా ధ్వంసం చేయగలిగినంత సులువుగా పునరుద్ధరించడం సాధ్యపడదు. అందులోనూ ఇక్కడ సమస్య మానవ నిర్మితాలైన వ్యవస్థలది కాదు. ప్రకృతి వ్యవస్థకు సంబంధించినది. దెబ్బతిన్న ప్రకృతి వ్యవస్థ పునరుద్ధరణ అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అయినా ప్రయత్నం చేయక తప్పదు.