వీడిన మబ్బులు

2
3

[dropcap]మూ[/dropcap]డు రోజుల ముసురు. ఆకాశం నిండా మబ్బులు మసకేసేసేయి. ఆగని వాన, అల్పపీడనం నడుస్తోంది. పగటికీ రాత్రికీ తేడా తెలియటంలేదు.

సూర్యుడు ‘కాజువల్ లీవు’లో వున్నాడేమో! నెమ్మదిగా ప్రొద్దున్నే వద్దామా, వద్దా అని మబ్బు తెరలను తోస్తున్నాడు, కొంచెం కదలిక, బద్దకంగా చిన్న కిరణాలు!

“బ్రతికేము నాయనా, లోక సాక్షీ, నీ వెచ్చని కిరణాలు సోకనీ మహానుభావా”, అని పెద్ద వాళ్లు ఇంటి బయటకు వచ్చి దణ్ణాలు పెడుతూ వుంటే, పిల్లలు “ఓహోహో! సూర్యుడు వచ్చేడు, వెల్కమ్” అంటూ కేరింతలు కొడుతున్నారు.

రామ్మూర్తి గారింట్లో వాతావరణం ఆందోళన కలిగిస్తోంది. అయన వయస్సు ఎనభై ఏళ్ల పై మాటే. భార్య ముందే కాలం చేసింది. తాలూకా ఆఫీసులో పని చేసి రిటైరయిన రామ్మూర్తి గారు వేదాలూ, ఉపనిషత్తులూ చదివేరు. నిత్యం భగవన్నామము చేస్తూ వుంటారు. బ్రతుకు తెరువును చదవలేదు. లౌక్యం అసలు తెలియదు. జీతం రాళ్లతో జీవితం భారంగా వెళ్లేది. ఇద్దరు అమ్మాయిలకు కష్టపడి పెళ్లిళ్లు చేసేరు. పెద్దలిచ్చిన పెంకుటిల్లు ఎంతో పాతది. శిథిలమవకుండా రిపేర్లు చేయించుకొంటూ కొన్నేళ్లు నెట్టుకొని వచ్చేరు. అయితే రెండవ అమ్మాయి పెళ్లికి ఇచ్చిన కట్నము, పెట్టిన ఖర్చులూ, భార్య సుస్తీకి చేసిన అప్పులు ఆ యింటిని మింగేసేయి ఫలితం అద్దె కొంపలోకి మారాల్సి వచ్చింది.

ఆఖరున పుట్టేడు కొడుకు శేఖరు. తల్లి సుస్తీతో మంచంమీద ఉండేది. పాపం పిల్లవానికి ఆలనా పాలనా కరువయినవి. అర్బకంగా వుండేవాడు. చీటికీ మాటికి అనారోగ్యాలు వేధించేవి.

ఆడదిక్కులేని ఇల్లు ఎలా వుంటుంది ? తండ్రీ తనూ తప్ప ఇంట్లో మాటామంతీ కలిపేవారు ఎవ్వరూ లేరు. అంతంత మాత్రంగా చదివిన శేఖరు, సర్కారీ బడుల్లో వెనక బెంచీలకు పరిమితమయ్యేడు. అత్తెసరు మార్కులతో పది, ఇంటరు పాసయ్యేడు.

“ఇక నావల్ల కాదు” అని చేతులెత్తేసేడు. మోండితనం, చిరాకు, ముఖం ఎప్పుడూ గంటుపెట్టినట్లే వుండేది. చూడ్డానికి కూడా అట్లకాడలాగా నల్లగా సన్నగా ఉంటాడు. జీవితంలో ఎప్పుడైనా నవ్వేడా – అనే అనుమానం వస్తుంది శేఖరును గమనిస్తే.

రామ్మూర్తి గారింటికి రెండు వీధుల అవతల గోపాలంగారుండేవారు. ఇద్దరికీ కొంత పరిచయం చిన్నప్పుడు ఉండేది. ఆఫీసుకువెళ్ళి వచ్చినప్పుడు తటస్థపడి, ‘ఓహో మీరా’ అనే వరకే. అంతకు మించి స్నేహం కాని, పలకరింపులు గాని లేవు.

గోపాలం గారి అమ్మాయి సునీత. ఇంటరు పాసైయింది. టైపు, షార్టుహేండు నేర్చుకొని, పరీక్షలు హయ్యర్ రెంటిలోనూ పాసైయింది. అదృష్టముతోపాటు, అవకాశం కూడ కలిసి వచ్చింది. జిల్లా పరిషత్తులో గుమస్తా వుద్యోగం సంపాదించుకోగలిగింది. గవర్నమెంటు ఉద్యోగము – జీతం తక్కువే – కాని భవితకు భరోసా ఏటా ఇంక్రిమెంట్లు నాలుగయిదేళ్లకోసారి ‘పే రివిజను’ వుంటాయి. బదిలీలుండవు. ఉన్న ఊరు కదలక్కరలేదు. అన్నింటికన్న గొప్పవిషయం రిటైరైతే పెన్షను, ఇంకేం కావాలి?

ఇలా ఉండగా రామ్ముర్తి గారికి స్నేహితులు సలహా చెప్పేరు “మీరు ఒక్కరూ మీ అబ్బాయితో తంటాలు పడుతున్నారు. శేఖరుకు వయస్సు వచ్చింది. పెళ్లి చెయ్యండి. ఎన్నాళ్లు మీరే వండుకొని ఇబ్బందిపడతారు గనుక” అన్నారు.

గోపాలంగారి అమ్మాయి సునీత గురించి చెప్పి. “ఆ పిల్ల కూడా సామాన్యంగానే వుంటుంది. మీకన్నా వాళ్లకు ఆర్థిక స్తోమత కూడ పెద్దగా ఏమి లేదు. మీ శేఖరానికి ఆ అమ్మాయిని చేసుకొంటే బాగుంటుంది” అన్నారు.

ఓ మంచి రోజున వాళ్లలో ఒక్కరిద్దరు పెద్దరికం వహించి, గోపాలం గారి ఇంటికి వెళ్లి మాట కలిపేరు. అప్పుడే ఆఫీసుకు బయల్దేరుతున్న సునీతకు ఆ మాటలు చెవిన పడినాయి. చర్రున ముందు గదిలోకి వచ్చి “ఏమిటీ ఆ శేఖరుగాడినా! ఎవరు చేసుకొంటారు? అట్లకాడలా ఉంటాడు. అయినా ప్రెవేటు ఉద్యోగం స్థిరమేమిటి? ఇంతకూ నాకు ఏం తక్కువ? దర్జాగా గవర్నమెంటు పోస్టు. నాకిప్పుడే పెళ్లి ప్రసక్తి తేవద్దు” అని ధాటీగా చెప్పి, చరా చరా గేటు తీసుకోని బయటకు వెళ్ళిపోయింది. అందరూ నిశ్చేష్టులయ్యేరు.

కాలం ఆగదుగా! కొంతవరకు కుంటినడకలుగా అనిపించినా ఒక్కోసారి పరిగెడుతుంది. పదేళ్లు గడిచిపోయేయి. ఎన్నిమార్పులొచ్చాయి దేశంలో! జనమంతా టి.వి మోజులో పడిపోయారు. సినిమా పిచ్చి వుండనే వుంది! టి.వి దానికి వంతపాట.

పూర్యం ఒకరింటికి ఒకరు వెళ్లి కబుర్లు చెప్పుకోవడము, ఇరుగుపొరుగు వారు పలకరింపులు, లోకం పోకడలు మాట్లాడుకోవడము ఉండేది. ఆడవాళ్లకు పేరంటము, నోములు, వ్రతాలు సందడిగా సాగేవి. దీని వలన సమాజంలో ఏం జరుగుతోందో తెలిసేది. ఇప్పుడు అవన్నీ మాయం! ఎవరింట్లో వాళ్లే యమ బిజీ, టి. వి. చానేళ్లు పెరిగినకొద్ది సామాజిక చానెళ్లు మూసుకుపోయేయి. చరవాణి, స్మార్ట్ ఫోన్ వచ్చేక మనిషికి మనిషితో పనిలేదుగా! అయినవాళ్లు కనబడితే నుదురు ముడుచుకుపోతుంది. అక్కర్లేని అపరిచితులతో లక్ష కబుర్లూ – లైకులూ జోకులూను. “ఎంతదూరమో అదీ అంత చెరువే” అన్న లెక్క.

ఆ రోజుల్లో పెళ్లి సంబంధాలు కుదరడం పెద్ద సమస్యగా మారలేదు. ఇరుగుపొరుగు, పెళ్లి, పేరంటం, గుడి, పార్కు – ఇలా తరుచు కలుసుకొన్నప్పుడు మాటలలో పెళ్లికి ఎదిగిన అమ్మాయిలు, అబ్బాయిలు గురించి ప్రస్తావన వచ్చేది. ఎవరికీ సరిపడ సంబంధాలు వాళ్లు చక్కగా కుదుర్చుకోవడానికి అవకాశం ఉండేది. పెళ్లి పేర మోసాలు తక్కువగా ఉండేవి.

మరి ఇప్పుడు? రోజులు మారిపోయేయి. ‘మేరేజీ బ్యూరోలు’ వెలిసేయి అక్కడికి వెళ్లి మాట్లాడుకోవాలి. అదో పెద్ద వ్యాపారం. అడ్వర్టైజుమెంట్లు, హంగామా, ఆఫీసులు, ఏ.సి. గదులు, రిసెప్షనిస్టులు, వేచి ఉండే గదులు – ఇలా హడావిడి. సంచాలకుని గదిలోకి వెళ్లడానికి ముందస్తుగా సమయం కేటాయించుకోవాలి. ఫీజులు, అప్లికేషన్లు నింపడము, ఆన్లైన్కు అవకాశాలు! ఆహా! ఆకాశమే హద్దు! మన వివరాలన్నీ వాళ్లకు చెప్పాలి. వాళ్లు మాత్రం మనకు కావలసిన వివరాలు ఇవ్వరు కొన్ని కావాలని దాచిపెడతారు.

పిండి కొద్దీ రొట్టె! మన స్టేటస్, పలుకుబడి, ఉద్యోగం – దీనిని బట్టి, వధూవరుల ఉద్యోగం, విద్య వగైరాలను బట్టి సంబంధాలు చెప్తారు. రేట్లు వేరుగా ఉంటాయి. మామూలు వాళ్లకు ‘లిస్టులు’ పడేస్తారు. వెతుక్కోవాలి. మనకు సరిపడేవి మనం వ్రాసుకొని వెళ్లాలి. తీరా చేసి అందులో పెళ్ళయిపోయినవారు ఎందరో!!! అప్డేటింగు వుండదు.

ఎన్నారైలు, హై ఫై ఉద్యోగస్తులూ కావాలంటే ‘ప్రీమియం’ ఫీజు! వేలల్లో వసూలు! ఇది చాలక మరో ముందడుగు వేసేరు. మోడరన్ పెళ్లిళ్ల పేరయ్యలు “మీరు వెంటనే రెడీనా! అయితే చెప్పండి. వధువు వివరాలు వాళ్లు చెప్పవద్దన్నారు. జాతకం చూసుకోవచ్చు. సరిపడిందంటే, ఓ మంచిరోజున మేము మిమ్మల్ని తీసికొని వెళ్లి అమ్మాయిని చూపిస్తాము. ఖర్చులన్నీ మీవే. నెలలోగా పెళ్లి జరిపించెయ్యవచ్చు!” ఇలాంటి ఆఫర్లు! సంబంధం కుదిరితే సంబరమే పైసా వసూల్. వారిపంట పండినట్లే! అవకాశం అసలు వదలరు వారు.

సరే, ఏదయితే తప్పుతుంది. ఎలాగో అలాగా పని జరగాలి. ఎక్కడా సంబంధాలు కనపడినప్పుడు చిన్న ఆశైనా ఎంతో ముందుకు నడిపిస్తుంది. ఇప్పుడు రామ్మూర్తిగారు కూడ అలాంటి అవస్థలో వున్నారు. శేఖరుకు ముప్పయి అయిదు దాటిపోయేయి.

ఇల్లు బోసిపోయింది. తనా పెద్దవాడయిపోతున్నారు. ఆ విధంగా మేరేజీబ్యూరో వారు చెప్పిన షరతులన్నింటికీ అంగీకరించేరు. శేఖరును ఒప్పించి, పెళ్లిళ్ల పేరయ్య వెంటరాగా టాక్సీలో బయల్దేరారు ప్రక్క వూరికి ‘పేరయ్యగారు’ దారి చూపగా ఓ యింటి ముందు కారు ఆగింది.

ఆ గృహస్థు వచ్చి సాదరంగా లోపలి తీసికొనివెళ్లేడు. కొంతసేపటికి ‘అమ్మాయిని’ తీసికొని వచ్చేరు! ఆశ్చర్యం! ఆమె సునీత! గోపాలం గారి అమ్మాయి! అందరూ వుండిపోయేరు. కాస్సేపు నిశ్శబ్దం. శేఖరు ముఖం కోపంతో జేవురించింది. సునీత అంతకన్నా తక్కువ తినలేదు. ‘నువ్వా’ అని శేఖరు అన్నాడు. “ఆ! నువ్వా, నీకింకా పెళ్ళికాలేదా” అంది సునీత. ఠక్కున లేచి శేఖరు బయటకు నడిచేడు.

మోడరన్ మేరేజీబ్యురో వారి మాయ! పెళ్లి కూతుర్ని ప్రక్క వూళ్లో చూపించేరు!!!

అయితే ఇంతకాలమూ శేఖరుకు పెళ్ళికానట్లే సునీతకు కూడ ఏమీ కలిసి రాలేదు. ‘ప్రభుత్యోద్యోగం, స్వాతంత్రము, స్వేచ్ఛ’ పేరుతో కొన్నేళ్లు, అహకారంతో కొన్నేళ్లు వచ్చిన సంబంధాలన్నింటికీ వంకలు పెట్టింది. వయస్సు పెరిగిపోయింది. సంబంధాలు రావడము ఆగిపోయింది. పాపం గోపాలంగారు కాలం చేసేరు. సునీత తన తల్లితో పాటు జీవిస్తోంది. మరో గ్రామంలో డెప్యుటేషన్ మీద రెండు మూడేళ్లు పని చేయవలసివచ్చింది. తిరిగి తన వూరుకు చేరుకుంది. ఇప్పుడు ఇరవైవేల పైమాటగా జీతంవస్తోంది.

కాలం ఆగదు ఎవ్వరికి! మనిషి ఆశకు, స్వార్థానికి హద్దు లేదుగా, కొన్ని అనర్థాలు తెచ్చిపెట్టుకుంటున్నాడు. కొన్ని వాటంతట అవే వస్తూ ఉంటాయి. ఇంక 2020 సంవత్సరం! రెండు సున్నాలతో వున్నది! బీభత్సము సృష్టించింది విశ్వవ్యాప్తంగా మహమ్మారీ కోవిడ్ దావానలంలా వ్యాపించింది. జనజీవనం అస్తవ్యస్తమయింది. కర్ఫ్యూలు, లాక్డౌన్లు, మాస్కులు, సామజిక దూరాలూ! అబ్బా! అతలాకుతలమయింది. మానవజీవితం! సమాజం ఇంకా కుచించుకుపోతోది. ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటిపై వాలటంలేదు. పెళ్లి, జననం, చావు, వేడుకలు, విహారం – అన్నీ కళావిహీనం!!!

పైగా మేమేం తక్కువ తిన్నాము అని విరుచుకు పడిన వానలు. రోజులు తరబడి సూర్యుడు కనబడక, వాగులు, వంకలు నీటి వరదతో జన జీవనము చిన్నాభిన్నం అయిపోతున్నది. అవును, రామ్మూర్తి గారింట్లో కూడా వాతావరణం ఆందోళన కరంగా ఉంది. ఇన్నేళ్ళపాటు దైవబలంతోనూ, ఆత్మవిశ్వాసంతోను నెట్టుకొని వస్తున్నారు. కరోనా కారంణంగా ఇంటికే పరిమితమయ్యేరు. నడిచే అలవాటు దూరమయింది. వాన, వంగుడీ కారంణంగా వారం బట్టీ నలతగా వున్నారు. గతమంతా నెమరు వేసుకొంటుంటే – బాధ తప్ప ఆనంద ఘడియ ఒక్కటీ గుర్తుకు రావటం లేదు. “అబ్బాయి జీవితం ఇలా తయారయిందేమిటి? పాతికవేలు మేరేజి బ్యూరోల వారికి చెల్లించేను ఆశతో, అది అడియాస అయింది. ఈ ఇంటికి దీపం పుట్టే ఆడ దిక్కును పొందే భాగ్యమే లేదా? నా బ్రతుకు ఇలా తెల్లారిపోవాలా? కొడుకు జీవితంలో ఆనందానికి నోచుకోలేదా? నేను ఏమీ చేయలేనా ఇన్ని కష్టాలు పడ్డాను. నారాయణమూర్తి, కనికరించవా” అని కన్నీరు పెట్టుకొన్నారు.

‘ఇద్దరు ఆడపిల్లలు వున్నారు. పెళ్ళిళ్ళు చేసి పంపించాను. అల్లుళ్ళు నా పాలిట యముళ్ళు అయ్యేరు కదా. మీ నాన్నను అది అడుగు, ఇది అడుగు అంటూ పుట్టింటికి పంపించేస్తే – వాళ్ళ దాష్టీకాలన్నీ భరించేను. కోరినవి ఇచ్చాను. తృప్తి లేదు. అమ్మాయిలు ఇద్దరు ఒక్కనాడైనా ‘నాన్నా తిన్నావా, బాగున్నావా, తమ్ముడు ఎలా వున్నాడ’ని నోరారా అడగలేదు. తమ్ముడి పెళ్ళికి ఏవిధమైన సహాయం చేయలేదు. అక్కలిద్దరినీ చూస్తే శేఖరుకు భయం, కోపం తప్ప వాత్సల్యమే కలగలేదు. ‘నాన్నా వాళ్ళిద్దరూ మాట్లాడితే మనమీదకి యీ దాడి ఏమిటి’ అని బాధపడేవాడు. ఆ కారణంగానే వాడికి ఒంటరితనం, కోపం పెరిగి పోయాయి’ ఇలా రామ్మూర్తి గారికి ఆలోచనల పరంపర తెమిలేదు కాదు.

రామ్మూర్తి గారింటి పక్కనే చిన్న డాబా ఇల్లు వుంది. అందులో వెంకన్న గారు లక్ష్మమ్మగారు నివసిస్తున్నారు. ఆమెకు రామ్మూర్తి గారి పరిస్థితి చూసి హృదయం కరిగింది. ఈ కరోనా ‘షాక్’, ముసురులతో అయన మంచం మీద వుండటం బాధ కలిగించింది. ఆ దంపతులిద్దరూ ప్రతిరోజు కాస్సేపు రామ్మూర్తి గారి దగ్గర కూర్చుని మాటా మంతీతో సమయం గడిపేవారు. “అన్నయ్యగారూ, ధైర్యంగా వుండాలి. ఈ కరోనా మనల్నేమీ చెయ్యదు. మనకు రాదు. మనం నియంత్రణగా దూరంగా ఉండి అన్ని జాగ్రత్తలు తీసికొంటున్నాం కదా. కాస్త ఎండలు వస్తే జలుబు తగ్గిపోతుంది” అని చెప్పేవారు. శేఖరు పరిస్థితి కళ్ళారా చుస్తే ఆమెకు బాధ వేసింది.

లక్ష్మమ్మ గారికి సునీత తల్లి శాంత ఒకసారి శివాలయంలో పరిచయమైయింది. అది మొదలు ఆమె తన గోడు వెళ్లబోసుకుంది. “ఏం చెప్పను అక్కయ్యగారు – సునీత మొండిది. వచ్చిన సంబంధానికల్లా వంకలు పెట్టింది. ఇప్పుడు అనుభవిస్తోంది. వంటరి బ్రతుకు. నేనుపోతే దిక్కెవ్వరు” అని బాధపడేది. కళ్లనీళ్లు కార్చేది.

ఆరోజు ఆదివారం లక్ష్మమ్మ గారికి శేఖరును చూడగానే ఒక ఆలోచన వచ్చింది. చిన్న లౌక్యం వుపయోగించింది. “ఒరే అబ్బాయీ పంతాలకు పోతే పనులు నెరవేరవు. నువ్వు ఇలా ఉండిపోయేవు అక్కడ సునీతా అంతే. దేవుడు మీ యిద్దరికీ రాసి పెట్టేడేమో అనిపిస్తోంది. బంగారంలాగా పదిహేనేళ్ళ క్రితం జరగవలసిన పెళ్ళి అహంకారం, బింకం కలిసి కాలదన్నుకున్నారు. కదరా – నీవు మన్మథుడివీ కాదు. ఆమె మనోహరీ కాదు. పెళ్ళికి అందము, ఉద్యోగము ముఖ్యం కాదురా! సంయమనం, సర్దుకుపోవడం తెలియాలి. నామాట మీద గౌరవం వుంచు. ఈ వేళ మంచిరోజు. తిన్నగా సునీత ఇంటికి వెళ్ళు, మా అబ్బాయి నీకు తోడు వస్తాడు. శాంతమ్మ గారిని పక్కన కూర్చుండ బెట్టుకుని సునీతతో మాట్లాడు. కొంచెము శాంతంగా ప్రవర్తించు” అన్నది. శేఖరం బయల్దేరాడు.

“సునీతా – సంవత్సరాలు గడిచిపోయాయి. ఇద్దరికీ వయస్సు మీద పడింది. ఒకరికి వొకరు తెలిసినవాళ్ళము. చాలా ఆలస్యం అయిపోయింది. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అర్థించడానికి వచ్చేను. మీ అమ్మను గౌరవంగా ఆదరిస్తాను. మా నాన్నను నీవు పెద్ద దిక్కుగా భావించు. నువ్వు సరే అంటే నేనే కాదు. పెద్దవాళ్ళిద్దరు మనశ్శాంతి పొందుతారు. మనోవ్యథ లేకుండా జీవితం గడుపుతారు. ఆలోచించుకో – నీ ఇష్టం ఆపైన” అన్నాడు.

ఆ సాయంత్రం సునీత, వాళ్ళ అమ్మను వెంట బెట్టుకొని లక్ష్మమ్మ గారింటికి వచ్చింది. ఆమె సాదరంగా వాళ్ళిద్దరినీ లోపలికి పిలిచి కాసేపు మాట్లాడేక శేఖరానికి కబురు పెట్టింది.

“అబ్బాయి శేఖరం, వచ్చే శుక్రవారం పంచమి, మంచిరోజు, పురోహితులు గారికి కబురు పంపు. మూడు ముళ్ళు వేయిస్తాము. మనం నలుగురం చాలు” అంది. ‘సరేనమ్మా’ అని ఆమెకు నమస్కరించి ఇంటికి వెళ్ళాడు శేఖరం. రామ్మూర్తిగారు బెంగపోయి, ఆనందంతో లేచి కూర్చున్నారు. పడమటి వైపు కిటికీలొంచి సూర్యకిరణాలు గదిలోకి ఠీవిగా వచ్చేయి.

ఇరువైపుల వారి స్నేహితులూ ఉత్సాహంతో పెళ్ళి ఏర్పాట్లు చేసారు. శేఖరు, సునీత దంపతులయ్యారు. కళ్ళు తెరిచి వాస్తవాన్ని చూసారు. అతి ఆశ, మాట పట్టింపులను పక్కన పెట్టగలిగారు.

మనుష్యుల మధ్య అడ్డుగోడలు, దూరాలూ పెంచుకుంటే పెరిగిపోతాయి. అవి తగ్గాలంటే – మనిషే వివేకం పెంచుకోవాలి. మనిషి కదలాలి. కలసి అడుగులు వేస్తే జీవితం సుఖమయమే కదా. అప్పుడు ఎలాంటి మబ్బులయినా విడిపోడానికి అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here