రెండు ఆకాశాల మధ్య-30

0
3

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]ఆ[/dropcap] జ్ఞాపకాలతో తనలో తను ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్తున్న షరీఫ్‌తో “ఆడవాళ్ళ బట్టల గురించి మీకు సరిగ్గా తెలియదు. మీ అక్క జైనాబీని తోడు తీసుకెళ్ళండి” అంది హసీనా.

“అలాగే” అంటూ షరీఫ్ కొంత దూరం ముందుకెళ్ళాడు. అతనికెందుకో అనీస్ గుర్తొచ్చింది. తన కూతురి పెళ్ళికి అనీస్‌కి కూడా బట్టలు కొనాలి కదా. తనకే రంగు దుస్తులిష్టమో కనుక్కుని వెళ్తే మంచిది కదా అనుకుని వెనక్కి తిరిగి జావేద్ యింటివైపుకు నడిచాడు.

షరీఫ్ వెళ్ళే సమయానికి జమీల్ స్కర్దూ వెళ్ళడానికి బయల్దేరబోతూ అతన్ని చూసి ఆగిపోయి “అస్సలాం వలేకుం చాచాజాన్” అన్నాడు.

“వలేకుం అస్సలాం జమీల్.. ఎలా ఉంది నీ వ్యాపారం?” అని అడిగాడు షరీఫ్.

“బావుంది చాచాజాన్.. అంతా అల్లా దయ” అన్నాడు.

తను పెళ్ళి దుస్తులు కొనడానికి స్కర్దూ వెళ్తున్నానని, తనకే రంగు బట్టలు కావాలో చెప్పమని షరీఫ్ అనీస్‌ని అడిగాడు.

“అమ్మని కూడా తోడు తీస్కెళ్తున్నావుగా మామూ.. మీ ఇద్దరికీ ఏది నచ్చితే అది కొనండి” అంది ఆనీస్.

షరీఫ్ బ్రోల్మో గ్రామంలోని బంధుమిత్రుల్ని కల్సుకుని తన కూతురి నిఖాకి హుందర్మో రావల్సిందిగా ఆహ్వానాలు తెలియచేయడం పూర్తయ్యేటప్పటికే మధ్యాహ్నమైంది. లతీఫ్ తన యింట్లో తినమన్నా వినకుండా అక్క యింటికెళ్ళి ఆమెతో కబుర్లు చెప్తూ భోజనం కానిచ్చేశాడు. అనీస్ పెళ్ళయ్యాక షరీఫ్ కన్పించిన ప్రతిసారీ ఆమె మూడు ప్రశ్నలు అడుగుతుంది. ‘అనీస్ ఎలా ఉంది? అత్తారింట్లో దానికి ఏ కష్టమూ లేదు కదా.. షొహర్ తనని బాగా చూసుకుంటున్నాడా?” ఆ రోజు కూడా ఇవే ప్రశ్నలు అడిగింది.

షరీఫ్ నవ్వి “మొన్న కలిసినప్పుడే కదక్కా అనీస్ బాగుందని చెప్పాను” అన్నాడు.

“నిజమేలేరా. ఐనా తల్లి మనసు కదా. దాని బాగోగులు తెల్సుకోవాలని ఎంత ఆరాటంగా ఉంటుందో తెలుసా? నువ్వు దాని కాపురం గురించి గంటల తరబడి చెప్పినా మళ్ళా మళ్ళా వినాలనిపిస్తుందిరా.”

“దానికేం అక్కా. ఆ యింట్లో మహరాణిలా ఉంది నా మేనకోడలు. అత్తామామలు దాన్ని స్వంత కూతురిలా చూసుకుంటున్నారు. జమీల్ తన భార్యని అందమైన గుల్‌దస్తాలా అపురూపంగా చూసుకుంటున్నాడు.”

“అదేమైనా వొళ్ళు చేసిందా?”

“కొద్దిగా వొళ్ళు చేసిందక్కా. బుగ్గల్లో నిగారింపు వచ్చేసింది. మరింత అందంగా కన్పిస్తోంది.”

“నాకు దాన్ని చూడాలని తహతహగా ఉందిరా.”

“ఇంకెన్ని రోజులక్కా. ఆస్మ పెళ్ళికి నాలుగు రోజుల ముందే మా వూరికొచ్చేస్తావుగా. నీ కూతుర్ని తనివితీరా చూసుకోవచ్చు” అన్నాడు షరీఫ్.

భోజనాల తర్వాత ఓ గంట విశ్రాంతి తీసుకుని, ఇద్దరూ స్కర్దూ నగరానికి బయల్దేరారు.

***

డిసెంబర్ 16 మధ్యాహ్నం:

హుందర్మో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. భారతీయ సైనికులు తుపాకులు ఎక్కుపెట్టి గ్రామంలోకి ప్రవేశిస్తున్నారన్న వార్త దావానలంలా పాకిపోయింది. బంగ్లాదేశ్ విమోచన కోసం భారతదేశం పాకిస్తాన్‌తో జరిపిన యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయిందనీ, బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిందనీ, పాకిస్తాన్ బార్డర్లో ఉన్న కొన్ని గ్రామాల్ని భారతదేశం హస్తగతం చేసుకుందనీ, ఇప్పుడు హుందర్మో గ్రామం మీదికి కూడా దండెత్తి వస్తోందనీ.. కొన్ని నిజాలు మరికొన్ని వూహాగానాలు కలిపి రకరకాల పుకార్లు బయల్దేరాయి.. అందులో మరీ ముఖ్యమైన పుకారు భారత సైనికులు ఎదురుపడిన ప్రతి గ్రామస్థుడ్ని కాల్చి చంపేస్తారనీ, యిళ్ళని కాల్చేస్తారని, వాళ్ళ పొలాల్ని ధ్వంసం చేస్తారనీను.

గ్రామస్థులంతా ప్రాణ రక్షణ కోసం ఎక్కడి పనులక్కడ వదిలేసి గుహలోకి పారిపోయారు. పారిపోవడానికి అవకాశం లేని కొంతమంది గుట్టల వెనక, రాళ్ళ వెనక నక్కి గుండెలు చిక్కబట్టుకుని కూచున్నారు.

కొంతమంది సైనికుల్తో మేజర్ మాన్‌సింగ్ వూళ్ళోకి ప్రవేశించాడు. సైనికుల భుజాలకు వేలాడుతూ తుపాకులున్నాయి తప్ప, ఎవ్వరూ తుపాకుల్ని ఎక్కుపెట్టి, కనిపించిన వాళ్ళనల్లా కాల్చేయాలనే ఉద్దేశంతో హుందర్మో గ్రామంలోకి రాలేదు. అప్పటికే భారత సైన్యం దాదాపు ఎనిమిది వందల చదరపు కిలోమీటర్ల పాకిస్తాన్ భూభాగాన్ని ఆక్రమించుకుంది.

మేజర్ మాన్‌సింగ్ హుందర్మో ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకతని గానీ, ప్రతిఘటనని కానీ వూహించడం లేదు. సరిహద్దురేఖకు దగ్గరగా ఉండే గ్రామస్థులు శాంతిని కోరుకునేవారు తప్ప కయ్యానికి కాలు దువ్వేవారు కాదని అతనికి బాగా తెలుసు. అతని ఉద్దేశం ఆ వూరి ప్రజల్ని కల్సుకుని, ఈ రోజునుంచి హుందర్మో గ్రామం భారతదేశ సార్వభౌమాధిపత్యం కిందికి వస్తుందనీ, గ్రామస్థులు ఇకనుంచి పాకిస్తానీయులుగా కాక భారతీయులుగా గుర్తింపబడతారనీ, అందుకు అవసరమైన గుర్తింపు కార్డులు తొందర్లోనే అందరికీ అందచేయబడ్డాయని చెప్పాలనుకున్నాడు.

తీరా గ్రామంలోకి ప్రవేశించగానే సైనికులకు ఒక్క శాళ్తీ కూడా కన్పించలేదు. గ్రామం అంతా ఖాళీ అయిపోయి, బోసిపోయిన యిళ్ళు మాత్రమే దర్శనమిచ్చాయి. మేజర్ మాన్‌సింగ్‌కి గ్రామస్థులంతా ఏమయ్యారో అర్థం కాలేదు. పక్క వూరైన బ్రోల్మోకి పారిపోయారేమో అన్న అనుమానం కూడా వచ్చింది.

కానీ అంత సమయం అతనివ్వలేదు. హెచ్చరిక లేకుండా వూళ్ళోకి సైనికుల్లో ప్రవేశించడం జరిగింది కాబట్టి బ్రోల్మోకి పారిపోవడం అసంభవమనిపించింది.

ఐనప్పటికీ అనుమానం తీరక ఇద్దరు సైనికుల్ని బ్రోల్మోకెళ్ళే దారెంట వెళ్ళి చూసి రమ్మని పంపించాడు. వాళ్ళు గుర్రాల్ని దౌడు తీయిస్తూ షింగో నదీ తీరం వరకు వెళ్ళి తిరిగొచ్చి ఎవ్వరూ కన్పించలేదని చెప్పారు. మరి వూరు వూరంతా ఏమైపోయింది? అందరూ ఎటుకెళ్ళిపోయారు? ఎక్కడ దాక్కున్నారు? మేజర్ మాన్‌సింగ్‌కి అదంతా అర్థంకాని ప్రహేళికలా అన్పించింది

“యిళ్ళన్నీ సోదా చేయండి. చుట్టుపక్కలంతా గాలించండి. ఒకవేళ ఎవరైనా దొరికితే మరింత భయపెట్టకండి. వాళ్ళు అప్పటికే భయంతో సగం చచ్చిపోయి ఉంటారు. ధైర్యం చెప్పి, అనునయంగా నా దగ్గరకు పిల్చుకుని రండి” అంటూ తన సైనికులకు ఆదేశాలు జారీ చేశాడు.

ఏ యింటికీ తాళం వేసి లేదు. సైనికులు యిళ్ళల్లోకి దూరి అంతా వెతికారు. ఓ యింట్లో ఎనభై యేళ్ళ ముసలతను మంచం మీద పడుకుని కన్పించాడు. సైనికుల్ని చూడగానే “నన్ను చంపకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను” అంటూ భయంతో హిస్టీరిక్‌గా ఏడ్వసాగాడు. “నిన్నేమీ చేయం. భయపడకు” అని అతనికి ధైర్యం చెప్పి “వూళ్లోవాళ్ళందరూ ఎక్కడికెళ్ళిపోయారు?” అని అడిగారు. “నాకు తెలియదు. నన్నేమీ అడక్కండి. నన్ను కాల్చి చంపకండి” అంటూ చలిజ్వరం వచ్చిన వాడిలా వణికిపోసాగాడు. అతను నడవలేడు కాబట్టి అతని కుటుంబ సభ్యులు వదిలేసి వెళ్ళిపోయి ఉంటారనుకుని, సైనికులు మేజర్ మాన్‌సింగ్‌కి విషయం చేరవేశారు.

మాన్‌సింగ్ అతని మంచం మీద ఓ పక్కగా కూచుని, అతనికి భరోసా ఇస్తూ మృదువుగా మాట్లాడాడు. “మేము భారతదేశ సైనికులం. మీ వూరిని స్వాధీనం చేసుకున్నాం. మీ వూరితో పాటు మరికొన్ని వూళ్ళని కూడా మా సైనికులు హస్తగతం చేసుకున్నారు. ఈ వూరు ఇకనుంచి పాకిస్తాన్‌లో భాగం కాదు. మీరు కూడా ఇప్పుడు భారతీయులైపోయారు. మీ గ్రామస్థులందరికీ ఈ విషయం చెప్పాలనే వచ్చాం. మేము మీకు మిత్రులం. మీకు సాయం చేస్తాం తప్ప హాని తలపెట్టం. ఇప్పటికైనా నిజం చెప్పండి. వూరి వాళ్ళందరూ ఎక్కడికెళ్ళిపోయారు?” అని అడిగాడు.

చాలాసేపు నచ్చచెప్పాక ఆ ముసలతనికి వీళ్ళు తనక్కానీ, మిగతా గ్రామస్థులకు గానీ హాని తలపెట్టరన్న నమ్మకం కుదిరింది. “అందరూ గుహలోకెళ్ళి దాక్కున్నారు సర్కార్” అన్నాడు.

“ఎక్కడుందా గుహ?”

“నేను చూళ్ళేదు సర్కార్. ఏడేళ్ళ క్రితం పక్షవాతం సోకింది. అప్పటినుంచి మంచంలోనే ఉన్నాను. నాకిప్పుడు ఎనభై నాలుగేళ్ళు. ఆరేళ్ళ క్రితం జరిగిన యుద్ధమప్పుడు ఆ గుహ గురించి జావేద్ చెప్పడంతో కొంతమంది ఆ గుహలోకెళ్ళి దాక్కున్నారు. అప్పుడు కూడా నేను యింట్లోనే ఉండిపోయాను. ఆ గుహ ఎక్కడో కొండకు ఎగువన ఉందని, దాని ముఖ ద్వారం చాలా ఇరుగ్గా ఒకరిద్దరు మనుషులు పట్టేటంత వెడల్పే ఉంటుందని అనుకుంటుంటే విన్నాను. అంతకు మించి నాకేమీ తెలియదు” అన్నాడు.

మాన్‌సింగ్ వెంటనే కొంతమంది సిపాయిల్ని పిలిచి గుహ ఎక్కడుందో వెతికి తనకు తెలియచేయమని హుకుం జారీ చేశాడు. మళ్ళా ముసలతనితో మాట కలుపుతూ “మీ పేరేమిటి?” అని అడిగాడు.

“నా పేరు హాజీ మస్తాన్ ఖాన్ హుజూర్. పదేళ్ళ క్రితం హజ్ యాత్ర చేసి వచ్చాను.”

“మరి మీ కొడుకు మిమ్మల్నిలా వదిలేసి వెళ్ళడం తప్పు కదా. 1965 యుద్ధమప్పుడు కూడా వదిలేసి వెళ్ళాడంటున్నారుగా.”

“వాడి తప్పు లేదు హుజూర్. ఆరేళ్ళ క్రితం వచ్చిన యుద్ధమప్పుడు యిళ్ళమీద ఫిరంగి గుళ్ళు పడ్తాయేమోనన్న భయంతో వూళ్లోని సగం మంది గుహలోకెళ్ళి దాక్కున్నారు. నాతోపాటు చాలామందే యిళ్ళల్లో ధైర్యంగా ఉండిపోయారు సర్కార్. ఇప్పుడు హిందూస్తాన్ సైనికులు దాడికొస్తున్నారని తెలిసి అందరూ పరుగెత్తారు. నా కొడుకు నన్ను భుజం మీద వేసుకుని మోసుకెళ్తానన్నాడు. నేనే వద్దన్నాను హుజూర్.”

“ఎందుకు వద్దన్నారు?” అతని వయసుని దృష్టిలో ఉంచుకుని మాన్‌సింగ్ గౌరవసూచకంగా ‘మీరు’ అనే సంబోధిస్తున్నాడు.

“నన్ను ఎత్తుకుని నా కొడుకు వేగంగా పరుగెత్తలేక శత్రు సైనికులకు దొరికిపోతే నన్ను నేను క్షమించుకోలేనుగా హుజూర్. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. నా కొడుకు సహీ సలామత్ ఉండాలని నన్నెత్తుకోబోతున్న వాడ్ని వారించి, తొందర పెట్టి యింట్లోంచి పంపించేశాను.”

“మీ తండ్రి ప్రేమకు జోహార్లు మస్తాన్ ఖాన్ సాహెబ్. మీకిదే నా శాల్యూట్” అంటూ మాన్‌సింగ్ లేచి నిలబడి అతనికి శాల్యూట్ చేశాడు. అతని మంచితనాన్ని చూసి, అతనిస్తున్న గౌరవమర్యాదల్ని చూసి మస్తాన్‌ఖాన్ కంట్లో నీళ్ళూరాయి.

“మాఫ్ కరనా సర్కార్. మిమ్మల్ని శత్రు సైనికులని అన్నందుకు.. మీరు భారతదేశస్థులైనా మా శ్రేయోభిలాషులే” అన్నాడు మనస్ఫూర్తిగా.

“జనాబ్.. ఇప్పుడు మాతో పాటు మీరు కూడా భారతదేశస్థులే” అంటూ నవ్వాడు మాన్‌సింగ్.

గుహ ఎక్కడుందో వెతకడానికి పోయిన సైనికులు తిరిగొచ్చి “ఎంత వెదికినా రాళ్ళ గుట్టలు తప్ప గుహ కన్పించలేదు సర్” అన్నారు.

ఈలోపల ఇద్దరు సైనికులు ఓ ముసలతన్ని పట్టుకొచ్చారు. “ఇళ్ళకు దూరంగా గుబురుగా పెరిగున్న మొక్కల వెనకాల దాక్కుని ఉంటే పట్టుకొచ్చాం సర్” అన్నారు.

అతని వైపు పరిశీలనగా చూశాడు మాన్‌సింగ్. వయసు అరవైకి దగ్గరగా ఉండొచ్చనుకున్నాడు. మనిషి భయంతో వణికిపోతున్నాడు. అతనికి ధైర్యం చెప్పి, “ఇంతకూ నువ్వెందుకు గుహలోకి పారిపోలేదు” అని అడిగాడు.

“మోకాళ్ళ నొప్పులు హుజూర్. పరుగెత్తడం అటుంచి వేగంగా నడవను కూడా లేను. గుహ చాలా దూరం కదా. దానికి తోడు చాలా ఎత్తుకి ఎక్కాలి. అందుకే మొక్కల వెనక దాక్కున్నా” అన్నాడతను.

“పోయినసారి యుద్ధమప్పుడు ఆ గుహలోనే దాక్కున్నావుగా” నవ్వుతూ అడిగాడు మాన్‌సింగ్.

“అవును హుజూర్. అప్పటికింకా మోకాళ్ళ నొప్పులు మొదలవ్వలేదు” యింత క్రితం అతన్లో ఉన్న భయం పోవటం వల్ల అతను కూడా నవ్వుతూ సమాధానమిచ్చాడు.

“సరే. ఆ గుహ ఎక్కడుందో మాకు చూపించు” లేచి నిలబడూ అన్నాడు.

అతనికి పచ్చి వెలక్కాయ గొంతులో ఇరుక్కునట్టయింది. ఇప్పుడు గుహ ఎక్కడుందో తెలియదని చెప్పలేడు. గుహని చూపిస్తే తన తోటి గ్రామస్థులందర్ని సైనికులకు పట్టిచ్చినవాడవుతాడు.

“మోకాళ్ళ నొప్పులు హుజూర్.. నడవలేను” అన్నాడు ఏమనాలో తెలీక.

“నడవక్కర లేదు. అవసరమైతే మా సైనికులు మోసుకెళ్తారు” అంటూ నవ్వాడు మాన్‌సింగ్.

ఓ సైనికుడి గుర్రం మీద అతన్ని కూచోబెట్టారు. వాళ్ళ వెనక మరో గుర్రం మీద మాన్‌సింగ్ బయల్దేరాడు. మిగతా సైనికుల్ని గ్రామంలోనే ఉండమని చెప్పాడు. గుహలో దాక్కున్నవాళ్ళు సైనికుల గుంపుని చూస్తే భయభ్రాంతులై కకావికలైపోవడమో, అసాధారణంగా ప్రవర్తించడమో చేస్తారేమోనని వాళ్ళని రావద్దన్నాడు. గ్రామస్థుల్ని శాంతపరచి, నచ్చచెప్పి, గ్రామంలోకి తీసుకురావాలని అతని ఆలోచన..

కొండవాలులో వెడల్పాటి మెట్లు తొలిచినట్టుగా ఉంది తోవ. గుర్రాలు మెల్లగా నడుస్తున్నాయి. అక్కడక్కడా రాళ్ళ గుట్టలు కన్పిస్తున్నాయి. హుందర్మో గ్రామంలోని యిళ్ళన్నీ ఇలాంటి రాళ్ళతోనే కట్టబడి ఉన్నాయన్న విషయం మాన్‌సింగ్‌కి గుర్తొచ్చింది. చాలా ఎత్తుకి చేరుకున్నాక ముందు వెళ్తున్న గుర్రం ఆగిపోయింది. సైనికుడితో పాటు గ్రామస్థుడు కూడా గుర్రం దిగి దిక్కులు చూస్తూ నిలబడ్డాడు.

వాళ్ళ వెనకే ఉన్న మాన్‌సింగ్ కూడా గుర్రం దిగి “ఎక్కడా గుహ?” అని అడిగాడు.

గ్రామస్థుడు వెర్రిచూపులు చూస్తూ “ఇక్కడే ఎక్కడో ఉండాలి హుజూర్. ఏమైపోయిందో అర్థం కావడం లేదు” అన్నాడు.

సైనికుడికి కోపం వచ్చింది. “తమాషా చేస్తున్నావా? ఇక్కడే ఉండాల్సిన గుహ ఏమైపోతుంది? మాయమైపోతుందా? మా మేజర్ సాబ్ మంచితనం వల్ల బతికిపోయావు. లేకపోతే నీ చమ్డాలు వలిచి నిజం చెప్పించేవాడ్ని. ఆ గుహ ఎక్కడుందో చూపిస్తావా లేక నాలుగు తగిలించమన్నావా?” అన్నాడు హూంకరిస్తూ.

“అల్లా కసం హుజూర్. ఇక్కడే ఉండాలి” అన్నాడతను ఆశ్చర్యంలో తలమునకలౌతూ.

“అతన్ని బెదిరించొద్దు. మెల్లగా అడుగు. అతన్ని కంగారు పెట్టకు” అన్నాడు మాన్‌సింగ్. అతను కూడా తన చూపు ఆనినంత మేర చుట్టూ పరికించి చూశాడు. అక్కడ పెద్ద రాళ్ళగుట్ట తప్ప గుహ ఉన్న జాడలేమీ కన్పించడం లేదు.

“మనల్ని మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు సార్. ఇతనికి గుహ ఎక్కడుందో తెలుసు. కావాలనే మనల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు” కోపంతో వూగిపోతూ అన్నాడు సైనికుడు.

“లేదు హుజూర్. గుహ ఇక్కడే ఉండాలి. నేను నిజమే చెప్తున్నా. మీరు చాలా మంచివారని, దయగలవారని మా వూళ్లోకెల్లా బుజుర్గ్ హాజీ మస్తాన్‌ఖాన్ చెప్పాక కూడా మీతో అబద్ధం చెప్తానా హుజూర్” బిక్క మొహం వేసుకుని అన్నాడతను. ఏడుపొక్కటే తక్కువతనికి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here