ఒక దిలీప్ కుమార్ – 64 సినిమాలు – 49 – ఫిర్ కబ్ మిలోగీ

1
4

[box type=’note’ fontsize=’16’] సంచిక పాఠకుల కోసం దిలీప్ కుమార్ నటించిన ‘ఫిర్ కబ్ మిలోగీ’ సినిమాని పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

హృషికేశ్ ముఖర్జీ దర్శకత్వంలో రెండవసారి అతిథి పాత్రలో దిలీప్ కుమార్ నటించిన సినిమా ‘ఫిర్ కబ్ మిలోగీ’

[dropcap]పా[/dropcap]త సినిమాలలో ఒక స్థిరత్వం, ఒక నిండుతనం, ఒక అందం ఉండడానికి కారణం ఆ సినిమాలు నిర్మిస్తున్నప్పుడు చాలా వరకు దానితో సంబంధం ఉన్న ఆర్టిస్టులు, వ్యక్తులందరూ కూడా కలిసి పని చేసేవారు. దిలీప్ కుమార్ హీరోగా నటిస్తున్నా తన షాట్ అయిపోగానే మరో సినిమా గురించి వెళ్ళిపోవడం లాంటివి జరిగేవి కావు. ఆయన తను చేసిన సీన్ చివరికి స్క్రీన్‌పై ఎలా వస్తుంది, ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారు అన్నది కూడా చూసుకునేవారు. దేవదాస్ సినిమాలో రైల్లో దేవదాస్ తాగుతున్నప్పుడు, మరో షాట్‌లో స్టీం ఇంజన్ మండుతూ పొగ వదులుతున్నట్లు చూపిస్తారు. దేవదాస్ శారీరిక మానసిక పరిస్థితిని ఈ షాట్ చాలా చక్కగా వివరిస్తుంది. అది దిలీప్ కుమార్‌కి చాలా నచ్చిందట. ఎడిటింగ్ ఎవరు చేస్తున్నారు అని దర్శకుడు బిమల్ రాయ్‌ని అడిగారు. అప్పుడు బిమల్ రాయ్ తన దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తున్న హృషికేష్ ముఖర్జీని పరిచయం చేసారు. అలా మొదలయిన వారి స్నేహం చివరి దాకా కొనసాగింది. అప్పటి నుండి హృషికేశ్ ముఖర్జీని దిలీప్ సాబ్ సొంతంగా సినిమాలు తీయమని ప్రొత్సహిస్తూ ఉండేవారు.

తరువాత ఒక ఖాళీ ఇంట్లో ఒకసారి ఇద్దరు షూటింగ్ కోసమనే కలుసుకోవడం జరిగింది. గోడల మీద కొన్ని గుర్తులు ఆ ఇంట్లో అద్దెకుండే వెళ్ళిన వారివి ఉండిపోయాయి. అవి చూసి ఒక అద్దె ఇంటి కథతో సినిమా తీయాలనే ఆలోచన హృషికేశ్ ముఖర్జీకి వచ్చింది. దిలీప్ కుమార్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఆయన ఒక అతిథి పాత్ర పోషించగా హృషికేశ్ ముఖర్జీ తీసిన సినిమా ‘ముసాఫిర్’ ఒక సరికొత్త దర్శకుడిని హిందీ ప్రపంచానికి చూపించింది. హృషికేశ్ ముఖర్జీ మీద దిలీప్ కుమార్‌కి ఉన్న నమ్మకం ఆ సినిమాలో అతిథి పాత్ర పోషించడానికి ఒప్పుకుంది. 1957లో ‘ముసాఫిర్’ వచ్చినప్పుడు దిలీప్ కుమార్ సూపర్ స్టార్. అయినా ఆ అతిథి పాత్ర ఆయనకు అభ్యంతరం అనిపించలేదు. అలాగే 1974లో బిస్వజిత్, మాలా సిన్హాలతో హృషికేశ్ ముఖర్జీ ‘ఫిర్ కబ్ మిలోగీ’ అన్న సినిమా చేస్తున్నప్పుడు కూడా ఆయన కోరిక మీద దిలీప్ కుమార్ మరో సారి అతిథి పాత్రలో ఈ సినిమాలో నటించారు.

‘ఫిర్ కబ్ మిలోగీ’ సినిమా 1966 లోనే షూటింగ్ మొదలయిందట. కాని ఏవో కారణాల వలన ఆగిపోయి మళ్ళీ 74లో పూర్తి అయ్యింది. ముందు దీనికి బందగి అని తరువాత అనోఖా ప్యార్ అనే పేరు ఖరారు చేసారు. “అనోఖా ప్యార్” అనుకున్నాక 1971లో “గుడ్డి” సినిమాలో జయ బాదురి షూటింగ్ చూస్తున్న సీన్‌లో ఈ సినిమాలో దిలీప్ సాబ్‌పై షూట్ చేస్తున్న సీన్లను చూపిస్తారు హృషికేశ్. “గుడ్డి” సినిమా కూడా వీరి దర్శకత్వంలో వచ్చిందే. దిలీప్ కుమార్ సినిమాలన్నీ గమనిస్తే గుర్రంపై ఒక హీరోగా బహుశా ఎక్కువ సినిమాలలో స్వారీ చేసింది ఆయనే ఏమో. చాలా సినిమాలలో వీరిని గుర్రపు స్వారీ చేస్తూ చూస్తాం. ‘ఫిర్ కబ్ మిలోగీ’ లో ఆయన ఎంట్రీ ప్రతి సారి గుర్రం మీదే చూస్తాం.

హృషికేశ్ ముఖర్జీ సినిమాలలో మనకు కనిపించే కామన్ పాయింట్, వీరి సినిమాలలో పాత్రలన్నీ కూడా చాలా వరకు మధ్య తరగతి జీవితంలో నుంచి వస్తాయి. అందుకే వారి సినిమాలు సహజంగా ఉంటాయి. ఎక్కువ హంగులు లేకుండా అపార్ట్మెంట్‌లలో, నగరం నడిబొడ్డున బస్‌లలో అతి మామూలుగా ఉండే వ్యక్తుల జీవిత కథలను వీరు తన సినిమాల ద్వారా రికార్డ్ చేసేవారు. ఈ సినిమాలో కూడా హీరో ఒక చిన్న ఆఫీసులో టైపిస్ట్. అద్దె ఇంట్లో చాలా జాగ్రత్తగా ఖర్చు చేసుకుంటూ తన సంపాదనను ప్రతి నిమిషం గుర్తు తెచ్చుకుంటూ జీవిస్తుంటాడు. ఆ ఇంటి యజమానురాలి కూతురు నీలిమ అతన్ని ప్రేమిస్తుంది. కాని రాజేశ్ ఈ విషయాన్ని గమనించడు. సంవత్సరం అంతా కష్టపడి పని చేసి తరువాత అతనికి ఒక నెల రోజులు ఒక హిల్ స్టేషన్‌లో ప్రకృతి మధ్యన ఖర్చుకు భయపడకుండా మనసుకు నచ్చినట్లుగా జీవించడం అతని అలవాటు. ఒకసారి అలా అతను కొండల మధ్య గడుపుతున్నప్పుడు పల్లెటూరి వేషధారణలో ఒక అమ్మాయిని చూస్తాడు. తను పాడుతున్న పాట ఆమె నోటి వెంట విని ఆమెను కలుసుకుంటాడు. ఇద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. ఆమె తన పేరు పారు అని, తాను ఒక పెద్ద ఇంట్లో పని మనిషినని చెబుతుంది.

ఆ చోటనే రాజేశ్‌కు దేవిదాస్‌తో స్నేహం అవుతుంది. అతను ఒక ధనవంతుని కొడుకు. నచ్చిన అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకోవాలని అతని కోరిక. రాజేశ్‌కు దేవిదాస్ తన చెల్లెలి ఆఫీసులో ఉద్యోగం ఇప్పిస్తాడు. అయితే ఆ ఆఫీసు యజమానురాలిగా సప్నాను చూసిన రాజేశ్‌కి ఆమె పారోలా ఉండడం చూసి అనుమానం వస్తుంది. పారో వారి ఇంట్లోనే పని చేస్తుందని తెలుసుకుని అతని అనుమానం ఇంఅా బలపడుతుంది. పారో, సప్నలు ఒకరే అని తన ప్రేమను పరిహాసం చేస్తూ సప్న పారోగా నటిస్తుందని అతను అనుమానపడతాడు. చివరకు ఇద్దరూ ఒకటే అని అతనికి తెలుస్తుంది. సప్న సరదాగా పారోగా మొదలు పెట్టిన ఆట ఆమెను తరువాత ఇబ్బంది పెడుతుంది. చివరకు ఆమె నిజం చెప్పే లోపే ఆమె నటనను గొప్పవారి వినోదంగా అర్థం చేసుకుని ఆమెపై కోపంతో రాజేశ్ ఆ ఉద్యోగం వదిలి వెళ్ళిపోతాడు.

ఆ కొండల మధ్య పల్లెలో తేజా సింగ్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ పల్లెకి నాయకుడు అతను. అతనికి తన చెల్లెలు అంబ అంటే చాలా ఇష్తం. ఆమె అక్కడి దివాన్‌ని ప్రేమిస్తుంది. ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మించి దివాన్ ఆమెను తప్పుకు తిరుగుతుంటాడు. చివరకు సప్నాతో అతని పెళ్ళి నిశ్చయమవుతుంది. రాజేశ్ కూడా తన పాత ఉద్యోగం వదిలి దివాన్ దగ్గరే పని చేస్తుంటాడు. రాజేశ్ ఇంటి యజమానురాలు కూతురు నీలిమ ఇచ్చిన సమాచారంతో అతన్ని వెతుక్కుంటూ సప్నా దివాన్ వద్దకు వస్తుంది. కాని దివాన్ కాబోయే భార్యగా ఆమెను చూసి రాజేష్ ఆమెకు ఇంకా దూరం అవుతాడు. చివరకు తేజా సప్నా తన చెల్లెల్ని అవమానించిందని అపోహపడి ఆమెను బంధించడంతో ఒక్కొక్కటిగా అన్నిమనస్పర్ధలు తొలగిపోయి, రాజేశ్ సప్నాలు ఒకటవుతారు, దివాన్ అంబ ప్రేమను అంగీకరించి ఆమెను వివాహం చేసుకుంటాడు. రాజేశ్‌గా బిస్వజిత్, సప్నాగా మాలా సిన్హా నటించారు. తేజా సింగ్‌గా దిలీప్ కుమార్ కనిపిస్తారు. ఆ అవధి భోజ్పురి యాస ఆయనకు నప్పినట్లు మరెవరికీ నప్పదు. అందుకే కాబోలు హృషికేశ్ ముఖర్జీ వారిని ఈ పాత్రకు కోరి తీసుకున్నారు.

‘ఫిర్ కబ్ మిలోగీ’లో వచ్చే కహీ కర్తి హోగీ వో మేరా ఇంతజార్ అన్న పాటను ముఖేష్, లతా మంగేష్కర్లు పాడారు. ఇది “ది లోన్లీ బుల్” అన్న ఇంగ్లీష్ ఆల్బమ్ నుండి తీసుకున్న ట్యూన్. ఇది హెర్ప్ ఆల్బర్ట్ కంపోజిషన్. హిందీ పాట పల్లవి పూర్తిగా ఈ గీతం ప్రేరణతో తయారయిందే. హిందీ సినీ రొమాంటిక్ హిట్ పాటలలో ఒకటిగా ఇది ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఇది కాక ఈ సినిమాలో ఒక కిషోర్ కుమార్ పాట మరో మూడు లత పాడిన సోలో పాటలున్నాయి. ఈ సినిమాకు పాటలు రాసింది మజ్రూహ్ సుల్తాన్‌పురి. సంగీతం అందించింది పంచం దా అని అందరూ ప్రేమగా పిలుచుకునే ఆర్. డీ. బర్మన్.

ఈ సినిమాలో దిలీప్ కుమార్ సోదరి పాత్రలో నటించిన నటి నాజ్. ఈమె బాల నటిగా హిందీ చిత్రసీమలో ప్రవేశించారు. దేవదాస్ సినిమాలో పార్వతి చిన్నప్పటి పాత్రను వేసి మెప్పించిన నటి ఈమె. రాజ్ కపూర్ తీసిన “బూట్ పాలిష్”లో కుడా ఆమెకు మంచి పేరు వచ్చింది. గురుదత్ “కాగజ్ కే ఫూల్”లో ఆయన కూతురుగా కూడా నటించారు. దేవదాస్ సినిమాలో ఈమెతో పాటు నటించిన బాల నటుడు రత్తన్ కుమార్ తరువాత పాకిస్తాన్ వెళ్ళిపోయారు. దేవదాస్‌లో వీరిద్దరి నటనను 1955 లో న్యూ యార్క్ టైమ్స్ పత్రిక ఎంతో కొనియాడింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమా ప్రదర్శించినప్పుడు బేబీ నాజ్ పాబ్లితో కాల్వో అనే స్పానిష్ బాల నటుడితో కలిసి ఉత్తమ బాల నటులుగా ప్రశంసా పత్రాన్ని పొందారు. హీరోయిన్‌గా పెద్దగా ఆమె సక్సెస్ కాలేదు. తరువాత శ్రీదేవి దక్షిణాది నుండి హిందీకి వెళ్ళిన కొత్తలో ఆమెకు నాజ్ డబ్బింగ్ కూడా చెప్పారు.

హృషికేశ్ సినిమాలలో ‘ఫిర్ కబ్ మిలోగీ’ సినిమా పెద్దగా చెప్పుకోదగ్గది కాదు. తన అన్ని సినిమాల మాదిరిగా దీనిలో కూడా దర్శకులు కామెడీకి పెద్ద పీట వేశారు. దేవన్ వర్మ మంచి టైమింగ్‌తో ఈ సినిమాలో తన స్టైల్‌లో నటించారు. దిలీప్ కుమార్ పాత్ర ఒక ఐదు సీన్లలలో వస్తుంది. కాని పెద్దగా ఆయనకు సంభాషణలు లేవు. అతి సామాన్యమైన పాత్ర ఇది. అందుకే దీన్ని దిలీప్ కుమార్ ఫిల్మోగ్రఫీని సమూలం విశ్లేషిస్తున్న కోణంలో చూడాలి తప్ప సినిమాగా లేదా పాత్రగా దీనికి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వలేం.

ఫిర్ కబ్ మిలోగీ సినిమాలో దిలీప్ కుమార్ దుస్తులు ప్రత్యేకంగా వుంటాయి. ఇక్కడ దిలీప్ కుమార్ కు సంబంధించి ఒక విషయం ప్రస్తావించుకోవాలి. ఆరంభమ్నుంచీ దిలీప్ కుమార్ సినిమాల్లో తాను ధరించే దుస్తుల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునేవారు. ఆయన స్క్రిప్ట్ చదివి, పాత్ర స్వభావాన్ని ఆకళింపు చేసుకోవటంతోపాటూ, కళ దర్శకుడితోటీ, ఇతరుల తోటీ లోతయిన చర్చలు జరిపి పారే నేపథ్యాన్నీ, సామాజిక స్థితిగతులను తెలుసుకునేవారు. అవన్నీ తెలుసుకున్న తరువాత తన వ్యక్తిగత దర్జీ ఇబ్రహీం ఖాన్ తో కలసి ముంబాయి అంతా తిరిగి బట్టలుకొని, పాత్రకు తగ్గట్టు దుస్తులను రూపొందించేవారు. దిలీప్ కుమార్ సినిమాల్లో ఆయన దుస్తులను 45 ఏళ్ళుగా రూపొందిస్తున్నది ఇబ్రహీం ఖాన్ మాత్రమే. విధాత సినిమాలో దిలీప్ కుమార్ షమ్మీ కపూర్లు రైలు ఇంజన్ డ్రైవర్లు. అందుకోసం నీలి రంగుదుస్తులను కొనమని నిర్మాత గుల్షన్ రాయ్ ఇబ్రహీం ఖాన్ తో చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారం దుస్తులను ఇబ్రహీం ఖాన్ తయారుచేశాడు. అయితే, దిలీప్ కుమార్ ఆ కొత్త బట్టలను తీసుకుని బొగ్గు గుట్టపై రుద్దింపించారు. ఎందుకంటే ఇంజన్ డ్రైవర్ దుస్తులపై బొగ్గు మరకలుండాలని. సినిమాలో ఆ దృశ్యం చూస్తే, షమ్మి కపూర్ బట్టలు తళ తళ లాడుతూంటాయ్. దిలీప్ కుమార్ బట్టలు నలిగి, బొగ్గుమరకలతో వుంటాయి. దుస్తుల గురించి అంత శ్రద్ధ తీసుకుంటారు దిలీప్ కుమార్. ఫిర్ కబ్ మిలోగీ లో అతిథి పాత్ర అయినా దుస్తుల గురించి ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. అది, సినిమాలో దిలీప్ కుమార్ దుస్తులను గమనిస్తే స్పష్టంగా తెలుస్తుంది. అతి సామాన్యమైన పాత్ర అయినా, తనదైన ప్రత్యేకముద్ర వేస్తూ, అతి జాగ్రత్తగా నటిస్తారు దిలీప్ కుమార్. ఒక్క నిముషం పాత్రే కదా అని తేలికగా తీసుకోరు. అందుకే, దిలీప్ సాబ్ కాసేపే కనిపించే పాత్ర ధరించినా, ఆ సినిమా విలువ పెరుగ్తుంది. అది, దిలీప్ సినిమాగానే గుర్తింపు పొందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here