[dropcap]”శూ[/dropcap]న్యం శూన్యం అని అంటారు కదనా? ఆ శూన్యాన్ని చూడాలని వుందినా?” అంటా రాజన్నని అడిగితిని.
“దానికేం భాగ్యం చూడరా” అనె అన్న.
“ఏడనింకా ఎట్ల చూసేది?” తిరగా అంట్ని.
“గుడి గంట కొట్టు, చెవుల్లారా దణి (ధ్వని) విను. గుడి గోపురం పైన మనసు పెట్టి నీ చూపులా ఆకాశం పక్క చూడిరా” చెయ్యి చూపిస్తా అనె.
“ఇట్ల చేస్తే కనపడుతుందానా?” అంటా అనుమానం పడితిని.
“ఊరా! కనపడుతుంది” నమ్మకముగా అనె.
“ఒగేల (ఒకవేళ) కనపడకుంటేనా?” అంటా నసిగితిని.
“కనిపిచ్చినా… కనపడకపోయినా శూన్యమేరా” అదో మాద్రిగా అనె.
“నాకి అర్థం కాలేదునా” అంట్ని.
“ఆత్రము పడితే అర్థము అయ్యెల్దురా. నిదానం రా… నిదానం రా…” అని చెప్పిన అన్న కొన్నాళ్ళకి శూన్యంలా చేరి శూన్యం అయిపోయ.
నేను కూడా నిదానంగా నా విదానం మార్చుకొంట్ని.
ఏచనపై ఏచన చేస్తిని. ఏమోమో చేస్తిని.
ఆ పొద్దు శూన్యం నాకి కనిపిచ్చే… క్షణంలో నేను లేకుండా పోతిని. జీవం నుండి నిర్జీవ శవం అయిపోతిని.
***
ఆ పొద్దు = ఆ రోజు