[dropcap]ఆ[/dropcap]నందనిలయం, పట్నంలోని ఓ విశాలమయిన బంగళా. అందులో నివసిస్తున్నవారు, అయిదుగురు. గృహ యజమాని ఆనందరావు, బేంకులో జనరల్ మేనేజరు. ఆయనకు, తెలుగు సాహిత్యంలో ప్రవేశం ఉంది. ఎప్పుడయినా, మూడ్ లో ఉన్న సమయంలో, భారత, భాగవతాలలోని పద్యాలు నెమరు వేసుకొంటూంటాడు. ఇంటి ఇల్లాలు పద్మజ, పేరున్న లాయరు. ఆనందరావు, పద్మజల మొదటి సంతానం, సరిత. ఊళ్ళోనే, ఇంజనీరింగు, మొదటి సంవత్సరం చేస్తున్నది. పెద్దకొడుకు చైతన్య, 11లో ఉన్నాడు. పుస్తకాల పురుగు. రెండవవాడు మారుతి, 9లో ఉన్నాడు. వాడికి, క్రికెటు అంటే పిచ్చి. వీరితోబాటు, సహజీవనం చేస్తోంది: నుదుట, మెడపైన, విశాలమయిన, నల్లటి మచ్చలు గల; లేబ్రడూల్ సంతతికి చెందిన, ‘ఆర్లో’ అని పిలువబడుతున్న, తెల్లని శునకం. రాత్రి భోజనాలు, అందరూ కలసి చేస్తూంటారు. ఆ సమయంలో, సరదాగా కబుర్లు చెప్పుకొంటూ, ఒకరి మీద ఒకరు జోక్సు వేసుకొంటూంటారు.
పార్వతమ్మ, అయిదేళ్ల క్రితం ఆనందనిలయంలో, వంటమనిషిగా చేరింది. నమ్మకస్తురాలు. నెమ్మదస్తురాలు. వంటిల్లు బాధ్యదంతా, ఆవిడదే. సీతాలు, నాలుగు సంవత్సరాల క్రితం, పనిమనిషిగా ప్రవేశించింది. అంతకు ముందు, ఓ మిలిటరీ ఆఫీసరు ఇంట్లో పనిచేసి, అన్ని పనులలోను బాగా తరిఫీదయింది. కూనిరాగాలు తీస్తూ, హుషారుగా పని చేస్తూంటుంది.
ఆ దినం శనివారం. సంధ్యాసమయం. ఆనందనిలయంలో, అత్యవసర సమావేశం జరుగుతోంది. చర్చనీయాంశం, పట్నంలో, నలుప్రక్కలా వ్యాపిస్తున్న కరోనా వ్యాధి దృష్ట్యా, తీసుకోవలసిన జాగ్రత్తలు. వాటిలో ముఖ్యమయినవి: పార్వతమ్మ, సీతాలు, రోజూ ఇంట్లోకి రాగానే, పరిశుభ్రంగా, కాళ్ళూ, చేతులూ, సబ్బుతో రాసి రాసి, కడుక్కోవాలి. ఇంట్లో ఉన్న సమయంలో, వారు తప్పక మాస్కులు ధరించాలి. ఇంకా, ఏ, ఏ, జాగ్రత్తలు తీసుకోవాలో, ఆలోచిస్తున్నారు. ఇంతలో, పద్మజకు సీతాలు ఫోను చేసింది. తను నివసిస్తున్న పేటలో, కరోనా వ్యాధి, ఆందోళన కలుగజేస్తున్న కారణంగా, ప్రభుత్వం, తక్షణ నిషేధాజ్ఞలు ప్రకటించిందట. పేటలో వారెవ్వరూ, వారి ఇళ్ళనుండి బయటకు రాకూడదట. బయటవారెవ్వరూ, పేటలోనికి అడుగు పెట్టరాదట. అందువలన, ఆ ఆజ్ఞలు ఉన్నంతవరకు, తను పనిలోకి రాలేనని, సీతాలు వినయంగా తెలియబరచింది. పద్మజ ఫోను, స్పీకరులో ఉంది. దగ్గరలోనే ఉన్న నలుగురికి, శుభవార్త తెలిసింది. ‘కిమ్ కర్తవ్యం’ అని, ఒకరి ముఖం ఒకరు చూడసాగేరు. జనరలు మేనేజరు ఆనందరావు, క్రైసిస్ మేనేజిమెంట్ లోకి దిగేడు. ముందుగా, సీతాలు చేస్తున్న, లిస్ట్ అఫ్ డ్యూటీసు, నెమరు వేసుకొన్నారు. అవి నిరాటంకంగా నిర్వర్తించడానికి, కార్యాచరణ ప్రణాళిక తయారు చేయ నారంభించేరు. దానిలో భాగంగా, సీతాలు, మరల డ్యూటీలో చేరేవరకు, ఎవరి బట్టలు వారు, ఉతుక్కోవాలి. ఎవరి బట్టలు ఏ రోజో, షెడ్యూలు తయారయింది. ఎవరి గదులు, వారే, రోజూ శుభ్రపరచుకోవాలి. డిష్‌వాషింగ్, మున్నగు పనుల విషయంలో, డివిజను ఆఫ్ లేబర్, చర్చిస్తున్నారు. ఆ సమయంలో, మరో బాంబు పేలింది. పార్వతమ్మ నుండి టెలిఫోను వచ్చింది. ఆవిడ నివసిస్తున్న ఏరియాకు, నిషేధాజ్ఞలు జారీ అయ్యేయిట. అవి సడలించేవరకు, పనిలోనికి రాడానికి, తన అసమర్థతను, వినయంగా తెలియబరచింది. ఈ అనూహ్య పరిణామంతో, ఆనందనిలయంలో రూపకల్పన కాబోతూన్న కార్యాచరణ ప్రణాళిక, బేక్ టు స్క్వేర్ వన్‌కు వచ్చింది. సీతాలుతో బాటు, పార్వతమ్మ విధులు కూడా, పరిగణలోనికి తీసుకొని, నూతన, విధుల కేటాయింపు పట్టిక, తయారు చేయవలసి వచ్చింది. మరల, ఆనందరావు నాయకత్వం వహించేడు. కొత్త పట్టిక తయారయింది. ఒకరికొకరు సహకరిస్తూ, ఆ క్లిష్ట పరిస్థితిని సంయుక్తంగా ఎదుర్కోవాలని, అయిదుగురూ సంకల్పించేరు.
శనివారం, కాలసముద్రంలో కలసిపోయింది. ఆదివారం, పురుడు పోసుకొంది. ఆనందనిలయంలో, నిర్ధారించిన నియమాలు అమలులోకి వచ్చేయి. అందరికన్నా ముందుగా డ్యూటీలో చేరింది, ఇంటి ఇల్లాలు. ఐ పేడ్ లోనికి చూస్తూ, తయారు చేస్తున్న ఉప్మాకు, తుది మెరుగులు దిద్దుతోంది. మిగిలిన నలుగురూ, బ్రేక్‌ఫాస్ట్ ఆరగించేక, విధులలో చేరడానికి సంసిద్ధంగా ఉన్నారు. డైనింగు టేబులు చుట్టూ ఆసీనులయ్యేరు. కొద్ది క్షణాల్లో, ఆవిర్లొస్తున్న ఉప్మా, వారి ముందు లేండ్ అయింది.
“అమ్మా, ఉప్మా ఘుమ ఘుమలాడుతోంది. గ్రేట్ జాబ్. కన్గ్రేట్స్.” ఛెఫ్ అవతారమెత్తిన లాయరుగారికి, ఒక కితాబు ఇచ్చింది, కాబోయే ఇంజనీరు.
“ముదితల్ నేర్వగరాని విద్య గలదే, గూగులుండగన్.” శ్రీమతిని, ఓ సన్నాయి నొక్కుతో ప్రశంస చేస్తూ, ఉప్మానారగించ ఆరంభించేడు, ఆనందరావు.
చిరునవ్వుతో, వ్యంగ్యంగా ధన్యవాదాలు కురిపిస్తూ, పద్మజ వారి మధ్య ఒక కుర్చీలో ఆసీనురాలయింది.
“ఈవేళ, లాండ్రీ ఎవరి టర్ను.” ఉప్మానారగిస్తూ తెలియగోరింది, పద్మజ.
“ఈవేళ చైతూ, టర్నమ్మా.” మారుతి సమాధానం.
నోటిలో ఉన్న వేడి ఉప్మాను, ఒక్కమారుగా టేబులు మీదకు రాల్చి, “అమ్మా, వాడికేన్నోమార్లు చెప్పేను, నన్నలా పిలవవద్దని. గట్టిగా చెప్పమ్మా, వాడికి.” తల్లికి అప్పీలు పెట్టుకొన్నాడు, తనయుడు.
“సరే, చెప్తా, గాని, నీ అబ్జక్షను ఏమిటి.” తెలియగోరింది, తల్లి.
“చైతూ, చైతూ, ఏమిటమ్మా, చిత్తుకాగితంలా. ఐ డోంట్ లైక్ ఇట్.” ఖచ్చితంగా చెప్పేడు, చైతన్య.
“ఓకే. ఇహమీదట, వాడినెవరూ, చైతూ, అని పిలవకండి. వాడు ఫీలవుతున్నాడు.” లాయరుగారు, జడ్జీ అవతారంలో, తీర్పు చెప్పేరు.
కమ్మని ఉప్మా, అయిదుగురు ఆరగించేరు. తండ్రీ, పిల్లలు విధులలో చేరడానికి సన్నాహమవుతున్నారు.
“జయ హనుమాన, జ్ఞాన గుణ సాగర,” కుర్చీలోంచి లేస్తూ, బజరంగబలిని తలచుకొంటున్నాడు, ఆనందరావు.
“జనరల్ మేనేజరుగారు, హనుమాన్ చాలీసా నెమరువేసుకొంటున్నారు. కారణమేమిటో.” ఓ వ్యంగ్యాస్త్రం సంధించింది, పద్మజ.
“లాయరుగారూ, మా అమ్మమ్మ చెపుతూండేది. ఏదైనా, పెద్దపని తలపెట్టినప్పుడు, హనుమాన్ చాలీసా వల్లె వేసుకోమని.” కొద్ది క్షణాలు కళ్ళు మూసుకొని నమస్కారం చేస్తూ, కారణం వివరించేడు, ఆంజనేయభక్తుడు.
“ఏమిటో, శ్రీవారు తలపెట్టిన అం…త పెద్దపని.” లాయరు గారి క్రాస్ ఎక్జామినేషను.
“ఇల్లం…తా వేక్యూమ్ చెయ్యాలి.” నాటక ఫక్కీలో సమాధానమిచ్చేడు, ఆనందరావు.
తల్లీ, పిల్లలు, ఫక్కున నవ్వేరు.
“మీ నాండీ,( నాన్నగారండీ, పదంలో ఆద్యంతాలు కలిపి, ముగ్గురు పిల్లలు sms భాషలో రూపొందించిన పదం) చాలా కష్టమయిన పని చెయ్యాలి గదూ. వేక్యూమ్ క్లీనరు వెం…టా , తా… పీ…గా నడుచుకొంటూ వెళ్ళాలి. సో, ఇవాళ మీ నాండీకి, ఓ అప్పడం ఎక్స్‌ట్రా.”
పిల్లలు ముగ్గురూ, “గ్రేన్టేడ్.” అన్నారు. వినయం నటిస్తూ ధన్యవాదాలు చెప్పేడు, ఆనందరావు.
ఎవరి పనులలోకి వారు వెళ్ళేరు.
కిచెన్లో, తల్లికి సహకరిస్తూ, శిక్షణ పొందుతోంది, సరిత. ఆ రొజు మధాహ్నభోజన మెన్యు, ముందురోజు సమావేశంలో, సభ్యులందరి సమ్మతితో తయారయింది. పద్మజ, గూగులులో, సాంబారు చేయుటకు కావలిసిన సామగ్రి, తయారుచేయు విధము, కూతురుతో కలసి, శ్రద్ధగా చూస్తోంది. ఆ సమయంలో, పద్మజ ఫోను మ్రోగింది. ఫోను ఎత్తుకొని, విషయం విన్నాక, “తీరిక చూసుకొని, తరువాత ఫోను చేస్తాను.” అని, చికాకు ముఖంతో, ఫోను స్విచ్ ఆఫ్ చేసింది.
“ఎవరమ్మా, ఫోను,” సరిత అడిగింది.
“మన ఎదురింటి, రాజేశ్వరమ్మ. సుబ్బారాయుడుషష్ఠి, ఏ రోజో, పంచాంగం చూసి చెప్పమంది. సుబ్బారాయుడుషష్ఠి, ధర్మరాజదశమి, కావాలినవాళ్లు, ఓ పంచాంగం కొనుక్కోవచ్చుగా. ఆ పని చేయరు.” అని, విసుక్కొని, సాంబారు చెయ్యడానికి, సన్నాహమయింది పద్మజ.
బంగాళాదుంపలు, మెత్తబడ్డాయో లేదో, ఫోర్కుతో నొక్కి చూస్తోంది, పద్మజ. ఈ లోగా పేన్ట్రీ నుండి ఓ కప్పు కందిపప్పు తెమ్మని, శిక్షణ పొందుతున్న ట్రైనీకు చెప్పింది.
“అమ్మా, కందిపప్పుడబ్బాలో, అడుక్కి నాలుగు బద్దలున్నాయి. ఏం చెయ్యమన్నావ్. స్టోరులోకి వెళ్లి తేనా.” పేన్ట్రీ నుండి సలహా కోరింది, సరిత.
“నువ్విలారా. ఆనంద్, స్టోరు రూములో వేక్యూమ్ చేస్తున్నట్టుంది. మెసేజ్ పెట్టు. కందిపప్పు పేకెట్ ఒకటి తెమ్మని.” పద్మజ స్పందన.
“నాండీ, స్టార్ రూమ్ నుండి, కందిపప్పు పేకెట్ ఒకటి, అర్జన్టుగా తెమ్మనమని, అమ్మ చెప్పింది.” గూగుల్ హోమ్ లో, మెసేజ్ పెట్టింది, సరిత.
నిమిషాలమీద, పప్పు పేకెట్లు రెండు తెచ్చి, శ్రీమతికి అందించి, “లోకల్ పేకింగులా ఉంది. పేకెట్ల మీద, ఏమీ రాసి లేదు. దానికి తోడు స్టోరు రూములో లైటు కూడా లేదు. రెండు పేకెట్లలోని పప్పూ, సుమారుగా ఒకేలాగ కనిపిస్తూంటే, వాటిలో, ఏది కందిపప్పో, డౌట్ వచ్చింది. టు బి ఆన్ ది సేఫ్ సైడ్, రెండూ తెచ్చేను. ఏది కందిపప్పో, చూసి తీసుకో. రెండోది, స్టోర్ లో పెట్టిస్తాను.” ఆనంద్ ఉవాచ.
తల్లీ, కూతురూ, ఫక్కున నవ్వేరు.
“నాండీ, ఇది కందిపప్పు…ఇది శనగపప్పు.” హోమ్ సైన్సు లో, తండ్రికి క్లాసు తీసుకొంది, కూతురు.
“తల్లీ, ఏది కందిపప్పో, ఏది శనగపప్పో, తెలీని వాళ్ళు, బేంకులో జనరల్ మేనేజర్ పనులు ఎలా చేస్తున్నారమ్మా.” ఓ విసురు విసిరింది, పద్మజ.
“తల్లీ, ఏది ఏ పప్పో తెలియడానికి, బేంకుల్లో పప్పులమ్మరని, లాయరుగారికి బోధపడేటట్టు చెప్పమ్మా. కోర్టులో అమ్ముతారేమో, నాకు తెలీదు.” అట్టు తిరగేసేడు ఆనంద్.
కందిపప్పు అధ్యాయం, చిరునవ్వులతో ముగిసింది.
స్టోరు రూములో పని ముగించుకొని, కిచెన్‌లో నున్న ఓ కుర్చీలో, నీరసంగా చతికిలబడ్డాడు, ఆనంద్. చేతి రుమాలుతో సున్నితంగా, నుదురు తుడుచుకొంటూ, “లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యె” పోతనగారి భాగవతంలో, గజేంద్రుని మొర, దగ్గరలోనున్న ఇద్దరకు వినబడేటట్లు, నెమరువేసుకొన్నాడు, ఆనంద్.
“శ్రీవారు, అంతగా చతికిలబడిపోడానికి కారణమేమిటో.” ఉల్లిచెక్కు తరుగుతున్న, పద్మజ, చిరునవ్వుతో, ఓ విసురు విసిరింది.
“అమ్మా, నాండీకి అలవాటులేని పని. పాపం, అలిసిపోయినట్టున్నారు.” తండ్రికి సానుభూతి పలుకులు పలికింది, ముద్దుల కూతురు.
“ఏవమ్మా, మీ నాండీకి అంత వెన్న రాస్తున్నావ్. Amazon లో కొత్తగా ఏదైనా చూసేవా ఏమిటి, ఆర్డరు పెట్టడానికి.” కూతురు మీదకు ఓ చిరునవ్వు విసిరి, “అంతా, నాటకం. మరో కప్పు కాఫీ కావాలి కాబోలు. తొందరగా చేసి ఇయ్యమ్మా. లేకపోతే సొమ్మసిల్లిపోతాడు.” అదే చిరునవ్వుతో, పరిహాసం చేసింది, పద్మజ.
“డాక్టరుగారు, కరెక్టుగా డయగ్నైజ్ చేసేరు. థేంక్ యు.” భార్యామణి చేరువన నిలబడి, చమత్కారంగా సెల్యూట్ చేస్తూ, స్పందించేడు, ఆనంద్.
ఆవిర్లొస్తున్న కాఫీ మగ్గుని, తండ్రి ముందుంచి, తల్లి దగ్గరకు వెళ్ళింది, సరిత. కమ్మని కాఫీని, ఊదుకొంటూ, ఆస్వాదిస్తున్నాడు, ఆనంద్. ఆ సమయంలో, డోర్ బెల్లు వాగింది.
అప్పటివరకు, H.M.V. పోజులో, పద్మజ కాళ్ళదగ్గరే, వినయంగా కూర్చున్న ‘ఆర్లో’ ఒక్కమారుగా, భౌ భౌ మని మొరుగుతూ, మెయిన డోరు దిక్కుగా పరుగులు తీసింది.
“ఆనంద్, మేమిద్దరం పనిలో ఉన్నాం. ఎవరొచ్చేరో చూస్తావా, ప్లీజ్.” తన నివేదన సమర్పించుకొంది, పద్మజ.
“సెర్టెన్లీ.” అని తలుపు తియ్యడానికి వెళుతున్న, ఆనంద్‌ని గమనించి, “మహానుభావా, వెయిట్.” అని ఆపింది పద్మజ.
వెనక్కు తిరిగి, “ఏమిటయింది.” అని అడిగేడు, ఆనంద్.
“మాస్కు పెట్టుకొన్నావా. నిన్న మీటింగులో, తమరే, అందరికి హెచ్చరిక చేసేరు. ఎవరైనా బెల్లు వేస్తే, తలుపు తీయడానికి, మాస్కు పెట్టుకోకుండా వెళ్ళొద్దని. జ్ఞాపకముందా.” అర్జన్ట్ బ్రేకు వేసింది, పద్మజ.
నాటక ఫక్కీలో, రెండు చెవులూ పట్టుకొని, నాలిక కరుచుకున్నాడు, ఆనంద్.
మాస్కు ధరించి, తలుపు తీయడానికి వెళ్ళేడు, ఆనంద్.
సందర్శకుని సాగనంపి, ఆనంద్, భార్యామణి చెంత చేరి, “పద్మా, కరోనా చాలామందిని నిరుద్యోగులను చేసింది కాని, సెల్ఫ్ ఎంప్లోయమెంటుకి, కొత్త అవకాశాలు కల్పించినట్లుంది” అని వ్యంగ్యంగా, ఓ స్టేట్మెంట్ ఇచ్చేడు.
“జరిగిందేమిటో చెప్పు. చాలా సేపు మాట్లాడినట్లున్నావ్. ఎవరొచ్చేరేమిటి.” అని, ఓ చిరునవ్వుతో, ప్రశ్న సంధించింది, పద్మ.
“విను. తలుపు తియ్యగానే, ఎర్రని పట్టుపంచ, ఆకుపచ్చని శాలువా, నుదిటిన, భుజాల్న, దట్టంగా విభూతి, పెద్ద కుంకం బొట్టుతో, ఓ నల్లని ఆసామీ ప్రత్యక్షమయ్యేడు. ప్రజలకు, కరోనా సోకకుండా ఉండడానికి, రేపు అర్ధరాత్రి, అమ్మవారి ఆలయంలో పూజలు చేస్తున్నాడట. మనందరి నామగోత్రాలడిగేడు.” అని ఇంకా వివరాల్లోకి వెళ్ళబోతూంటే,
” వాడికెందుకు అవన్నీ.” అని కొద్దిగా చికాకు బడుతూ అడిగింది, పద్మ.
“అవి ఇస్తే, పూజ, మన పేరన కూడా చేస్తాడట. అది, ఫ్రీ కాదుసుమీ. ఒక్కరే అయితే 150 ట. జంటకు 250. పిల్లలు ఒక్కొక్కరికి 75 రూపాయలు. ఆన్‌లైన్‌లో పూజ చూడొచ్చునట.” అని వ్యంగ్యాన్ని వ్యక్తబరుస్తూ, చిరునవ్వుతో, సమాధానమిచ్చేడు, ఆనంద్.
“వాడికేమిటి చెప్పేవు, నువ్వు.” పద్మజ స్పందన.
“అమెరికాలో, కిందటి వారమే, ఈ కరోనా పూజ, పెద్ద ఎత్తున, మూడు రోజులు, రాత్రీ పగలు చేసేరూ… అక్కడున్న, నా మేనత్త కొడుకు… అందులో మా అందరి పేరున కూడా… పూజ చేయించేడూ, అని నచ్చచెప్పీ, వాడిని వదిలించుకొన్నాను.” అని పరీక్షలో నూటికి నూరూ స్కోరు చేసిన విద్యార్థిలా, పోజు కొడుతూ, భార్యామణి భుజం తట్టి, సగర్వంగా ఉవాచ, ఆనంద్.
“మెచ్చితిని, మగడా, మెచ్చితిని. నాకు తెలీక అడుగుతున్నాను, నీకు మేనత్తలే లేరుకదా, కొడుకుని, ఎక్కడనుండి తెచ్చేవు, సత్య హరిశ్చంద్రా. ఆన్ ది స్పాట్ అబద్ధాలు, కూడా చెప్పగలవనమాట.” చమత్కరించింది, పద్మజ.
“మరేమిటనుకొన్నావు. మీ కోర్టులో సాక్ష్యాలు చెప్పడానికి పనికివస్తాను కదూ.” తనూ చమత్కరించేడు ఆనంద్.
ముగ్గురి మందహాసాలతో ముగిసింది, కరోనా పూజ కథ.
కొద్ది క్షణాల తరువాత, ఆనంద్ కిచెను నుండి బయలుదేరుతూండగా, “నాండీ, ఇవాళకు మీ డ్యూటీ అయిపోయిందిగా, ఎక్కడికి వెళిపోతున్నారు, ఇక్కడ కూర్చోండి.” అని ముచ్చటబడుతూ, ముద్దులకూతురు అడిగింది.
“లాండ్రీ చేసుకోవాలమ్మా, వెళతాను.” అని నచ్చచెప్పబోయేడు, ఆనంద్.
“ఇవాళ, పెద్దతమ్ముడి టర్ను కదా, మరచిపోయేరేమిటి.” తండ్రికి జ్ఞాపకం చేసింది, సరిత.
“వాడికేదో వర్కుందటమ్మా. ఇవాళ నన్ను లాండ్రీ చేసుకోమని రిక్వెస్ట్ చేసేడు. ఎల్లుండి, నా టర్ను రోజున, వాడు చేసుకొంటానన్నాడు. బట్టలు లోడు చేసి, వెంటనే వచ్చేస్తానమ్మా.” అని హామీ ఇస్తూ, మేడమీదున్న లాండ్రీ రూముకు అడుగులు ముందుకు వేసేడు.
“ఇంకా, ఇరవైనాలుగు గంటలు కాలేదు, అప్పుడే, mutual exchanges మొదలయ్యేయా.” మందహాసంతో, స్పందించింది, పద్మజ.
కిచెనులో, వంటకాలు సుమారుగా తయారయ్యేయి. అంతలో, మారుతి గదినుండి కెవ్వుమని కేక వినిపించింది.
“ఏదో కోతి పని చేసుంటాడు. కాలో, చెయ్యో, విరక్కొట్టుకొన్నాడో ఏమిటో, వెంటనే మారుతి రూముకు వెళ్లి, ఏమిటయిందో చూసి చెప్పమని, పెద్దతమ్ముడికి మెసేజ్ పెట్టమ్మా.” ప్రక్కనే ఉన్న కూతురుతో చెప్పింది, ఆందోళన పడుతున్న కన్నతల్లి.
గూగులులో మెసేజ్ వెళ్ళింది. వెంటనే, చైతన్యనుండి జవాబొచ్చింది.
“వాడికేమీ కాలేదక్కా, మనవాళ్ళు, సెకండ్ వన్ డే కూడా, ఓడిపోయేరు. సీరీస్ పోయేయని, నెత్తీ నోరు, బాదుకొన్నాడు. డోంట్ వర్రీ. హి ఈజ్ ఒకే.”
“థేంక్ గాడ్.” సరిత నిబ్బరబడుతూ, తల్లివంక చూసింది.
“ఇంత, క్విక్‌గా…రిప్లయ్ ఇచ్చేడు. వాడు, ఎక్కడనుండి మాట్లాడుతున్నాడో…కనుక్కో అమ్మా.” లాయరుగారి మదిలో, ఏదో సందేహం.
గూగుల్, సందేహ నివారణ చేసింది. ఇద్దరు అన్నదమ్ములూ, మారుతి గదిలోనే ఉన్నారు. క్రికెట్ మేచ్ చూస్తున్నారు.
“చూసేవమ్మా, ఏదో రాచకార్యం ఉందని, మీ నాండీతో, ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టుకొని, క్రికెట మేచ్ చూస్తున్నాడు. మీ నాండీకి, తెలీదనుకొంటున్నావేమిటి. ఇద్దరూ, కలిసి ఆడిన నాటకం.” కూతురు ముఖంలోకి చిరునవ్వుతో చూస్తూ, అంది, పద్మజ.
“పోనీలే అమ్మా, ఇవాళా, రేపూ, పండు ముసలాళ్ళు కూడా, అర్ధరాత్రి దాకా కూర్చొని, క్రికెట్ మేచులు చూస్తున్నారు. ఈ కరోనా, ఎప్పుడు కంట్రోల్ అవుతుందో గాని, ప్రస్తుతం వీధిలోకి వెళ్లే పరిస్థితి లేదు. చిన్న వాళ్ళు. ఏదో కాలక్షేపం కావాలిగదా.” తమ్ముళ్లకు వకాలతు పలికింది, సరిత.
వంటకాలన్నీ, రడీ అయ్యేయి. లంచికి వేళాయె. ఐదుగురూ, డైనింగ్ టేబులు చేరుకొన్నారు. సరదాగా కబుర్లు చెప్పుకొంటూ, వేడి వేడి, వంటకాలు ఆస్వాదిస్తూ, భోజనాలు చేసేరు. రాత్రి భోజనాలు కూడా అయ్యేయి. ఆనందనిలయంలో, ఓ ఆదివారం అలా గడిచింది.