జీవన రమణీయం-176

2
3

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]ఆ[/dropcap]యన గట్టిగా, “వాట్ ఈజ్ దిస్? నీకు టైపింగ్ రాదా?” అనేసరికీ, నేను బొటబొటా కన్నీళ్ళు కార్చేసాను. అప్పటిదాక బయట వాళ్ళు ఎవరూ అంత గట్టిగా కోప్పడలేదు. స్కూల్లో కూడా నేను కొంచెం పెట్ స్టూడెంట్‌ని, టీచర్స్‌కి. దామోదర్ గారు బయటకి తీసుకెళ్ళి నన్ను చాలా కన్‍సోల్ చేశారు, “సార్ అలా గట్టిగా మాట్లాడ్తారు కానీ హృదయం వెన్న” టైప్‍లో. ఎవరికీ దామోదర్ గారికొచ్చినంత తెలుగొచ్చేది కాదు!

విజయ్… ఈయన ఎం.డి. గారి పెద్దకొడుకు, పాపం వినాయకుడు మూషిక వాహనం మీదొస్తున్నట్లు, 1982లో తన సువేగా మీద వచ్చేవాడు. గుజ్జురూపం, స్థూలకాయం, మా కాలనీలో ఆడపిల్లలు, “గణేష్ మారాజ్‌కీ జై” అని ఏడిపించేవారు! కానీ అతని మనసు చాలా మంచిది. కార్మికులతో బాటు పని చేసేవాడు! బి.కామ్ చేశాడు. ఎకౌంట్స్ చూసేవాడు. నన్ను పిలిచి నవ్వించి, నా ఏడుపు ఆపించాడు. ఆయనా, ఎండి గారిని సార్ అనే అనేవాడు. ఫ్యాక్టరీలో 104మంది వర్కర్క్స్ వుండేవారు. నేను తీరిక సమయంలో వాళ్ళ పేర్లన్నీ టైప్ చేసేదాన్ని, అటెండెన్స్ కోసం. ఒకసారి ఫ్యాక్టరీలోకి అటెండెన్స్ పిలిచే పని కూడా నాకే చెప్పారు. నేను అటెండెన్స్ పిలుస్తుంటే, ‘హా జీ’ అని అందరూ అన్నారు. ఒకతను అనలేదు. “కౌన్ హై తూ? మై హాజీ బోల్‌నా హై క్యా తుమ్‌కో?” అన్నాడు. అతను ఎత్తుగా లావుగా, ఎర్రని కళ్లతో దో ఆంఖే బారా హాత్‌లో దొంగల్లో ఒకడిలా వున్నాడు. కరీం అని అతను అక్కడ వర్కర్స్ లీడర్‍ట. ఇంతకీ ఆ ఫ్యాక్టరీలో తయారయ్యేవి ఛాఫ్ కట్టర్స్.  అంటే గడ్ది కట్ చేసే యంత్రాలు. వాటిని ఎక్కువగా, మెహసానా, సూరత్ లాంటి గుజరాత్‍ స్టేట్ లోని ఊర్లకి ఎగుమతి చేసేవాళ్ళు! గుజరాత్‍లో ‘కురియన్’ వైట్ రివల్యూష్యన్ తీసుకొచ్చి పాల సహకార కేంద్రాలు వూరూరా పెట్టించిన కొత్త అది. పాలు ఎక్కువగా వచ్చే ప్రాంతాలలో, వాటిని పాలపొడిగా మార్చేవారు. ఆ యంత్రాలు గడ్డిని భలే ఈక్వల్‍గా, పశువుల నోట్లో పట్టేట్లు వీలుగా కట్ చేసేవి. అతను అక్కడ బాగా పని తెలిసిన వాడనీ, అతనికి అందరూ ఫ్యాక్టరీలో భయపడ్తారు అనీ నాకు తెలిసింది. అతని పేరు పిలవకుండానే, అటెండెన్స్ మార్క్ చేయడం మొదలుపెట్టాను.

సన్నగా చీర కడ్తే తాటాకు బొమ్మలా వుండేదాన్ని. నన్ను భయపెట్టడం, అక్కడ ఎం.డి. గారితో సహా అందరికీ వినోదంగా వుండేది. పని మాత్రం చాలా త్వరగా నేర్చుకున్నాను అని ఎం.డి.గారు ఒకరోజు ప్రశంసించారు. మొదట్లో వన్ ప్లస్ టూ అన్నా, వన్ ప్లస్ ఫోర్ అన్నా, తెల్ల పేపర్‍ వెనకాల కార్బన్ పెట్టి, మళ్ళీ కార్బన్ పెట్టి, ఇలా కాపీస్ తీయడం కోసం కష్టపడేదాన్ని. రిబ్బన్ మార్చడం, ఇంక్ అయిపోతే, దామోదర్ సార్ నేర్పించారు. ఒక్కోసారి ఎం.డి.గారు బీపీ వచ్చి అరుస్తుంటే, దామోదర్ గారు గబగబా నన్ను జరిపి, ఒకే వేలితో, నాకన్నా ఫాస్ట్‌గా టైప్ చేసేవారు!

నేను మొదటి రోజు లంచ్ టైమ్‍లో ఇంటికెళ్ళి అన్నం పెడుతున్న అమ్మమ్మతో, గర్వంగా ఫ్యాక్టరీ గురించీ, ఎం.డి. గారి గురించీ చెప్పాను. సాయంత్రం ఎం.డి.గారు తిట్టేసరికి, ఏడుపు ముఖంతో ఇంటికెళ్ళి, శరత్ నవల ‘తీరని కోరికలు’ చదువుకుంటూ శాడ్ మూడ్‍లో పడుకున్నాను. అమ్మ “రేపు వెళ్ళవా?” అని ఆట పట్టించింది. నా వుద్యోగం అమ్మకి పిల్లల ఆటల తప్ప సీరియస్‍గా అనిపించలేదు! మొత్తానికి కొంచెం సర్దుకుని, రోజూ అమ్మ చీర ఒకటి సింగారించి, తలలో డిసెంబరాలు పెట్టుకుని, కొద్దిగా గర్వంగా తల ఎత్తి కాలనీలో నడిచి ఆఫీసుకు వెళ్ళేదాన్ని. నా వయసువాళ్ళు ఇంకా ఆ టైంలో గచ్చకాయలు ఆడ్తూనో, మా కాలనీలో వున్న వెల్ఫేర్ సెంటర్‍లో కుట్టు నేర్చుకుంటూనో కనిపించేవారు. ఆ కుట్టు టీచర్ ఇంటి పేరు బొమ్మిరెడ్డిపల్లి వారు. ఆవిడ పేరు గుర్తు లేదు! అమ్మమ్మ అలా ఇంటి పేర్ల తోనే అనేది “బొమ్మిరెడ్డిపల్లి ఆవిడ వచ్చారు” అని. ఆవిడ పొడుగ్గా, తెల్లగా, నెరిసిన వెంట్రుకలు నడినెత్తి మీద కొప్పులా వేసుకుని, విధిగా ఆ కొప్పు చుట్టూ ఏదో ఒక పూల మాల పెట్టుకుని వచ్చేవారు. మా భవానీ వాళ్ళమ్మకి బాగా ఫ్రెండ్ ఆవిడ. సో… నేనూ ఆ టీచర్ గారిలా కాటన్ చీరలు, గంజి పెట్టి కట్టుకోవాలని వుబలాట పడేదాన్ని! చాలా చిన్న ప్రపంచం. మా కాలనీ, రేషన్ షాప్, బజార్ వెళ్ళాలంటే, రహమానియా మెషినరీస్ మీదుగా, చుప్ చాప్ గల్లీ దాటుకుని, మెయిన్ రోడ్ మీదకి వస్తే, రెండు ఆర్.టి.సి మెయిన్ ఆఫీసులు, మధ్యలో సందులోకి వచ్చేవాళ్ళం. అలా కుడి వైపుకి తిరిగి నడిస్తే RTC x Roads… అలా కాకుండా ఎడమవైపుకి తిరిగి నడిస్తే శంకర్‌మఠ్‍కి వెళ్ళే మెయిన్ రోడ్‌కి కలిసేవాళ్ళం. ఎదురుగా రోడ్ క్రాస్ చేసి నడిస్తే, వెల్ఫేర్ సెంటర్ వుండేది. కాలనీలో మగపిల్లలు టేబుల్ టెన్నిస్ ఆడేవారు, మా ఆయనతో సహా. ఇప్పుడా వెల్ఫేర్ సెంటర్ స్థానంలో ఆర్.టి.సి. కళ్యాణమండపం వెలిసింది. సో… అలా క్రాస్ రోడ్స్‌కి వెళ్తుంటే మా కళ్ళముందే రైట్ సైడ్ సంధ్యా టాకీస్ కట్టారు. ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్‌లో మా ఇంటి వైపు ఒక రోడ్, అది నేను చెప్పినట్లు శంకర్‌మఠ్ వెళ్ళేది. కుడి వైపుకి వెళ్తే గోల్కొండ చౌరస్తా, రహత్ మహల్,  బోయి గుడా, ముషీరాబాద్, సికింద్రాబాద్ వెళ్ళేది.

ఎడమ వైపు తిరిగితే రోడ్ దాటి, చిక్కడపల్లి, నారాయణగుడా, కాచీగుడా అవన్నీ కోటీ వైపు దారి తీసేవి.

కుడి, ఎడమలు కాకుండా నేరుగా రోడ్డు దాటి వెళ్తే దేవీ థియేటర్, గాంధీనగర్, లోయర్ ట్యాంక్‌బండ్ రోడ్ వచ్చేవి. సో.. అక్కడ నుండి ట్యాంక్‌బండ్ రోడ్, దోమలగుడా, లిబర్టీ వైపు వెళ్ళిపోవచ్చు!

చాలా దూరాలు నారాయణగుడా వెళ్ళాలన్నా, ఇటు రహత్‌మహల్ వెళ్ళాలన్నా, గాంధీనగర్ వెళ్ళాలన్నా నడిచే వెళ్ళేవాళ్ళం. ఇంక థియేటర్స్ విషయానికొస్తే రహత్ మహల్ సుభాష్ టాకీస్ అయి తర్వాత రాజా డీలక్స్ అయింది. ఆ తర్వాత ‘ప్రశాంత్’ కూడా అయినట్టుంది. పక్కనే ప్రశాంత్ టవర్స్ అని అపార్ట్‌మెంట్ కడితే, ప్రభాకర్ పెద్ద అక్కయ్య (లలితక్క) అందులో అపార్ట్‌మెంట్ కొన్నారు 4 బెడ్ రూమ్స్‌ది. అసలు మేము అపార్ట్‌మెంట్ కల్చర్ కొత్త కావడం వలన థ్రిల్ అయిపోయాము. అప్పట్లో యద్దనపూడి సులోచనా రాణి గారు ‘జాహ్నవి’ నవలలో ఈ అపార్ట్‌మెంట్ కల్చర్‌ని పరిచయం చేసారు. అందులో జాహ్నవి ‘కోణార్క్ టవర్స్’ అనే అపార్ట్‌మెంట్స్‌లో వుంటుంది. అందులోనే నా పదిహేడేళ్ళ వయసులో ఆవిడ రాసిన హోమోసెక్సువాలిటీ గురించి కూడా చదివి, అయోమయ స్థితిలో పడిపోయి భవానితో డిస్కషన్ పెట్టా. అది ఆరిందలా “అందుకే పెద్ద వాళ్ళ నావెల్స్ మనం చదవకూడదు” అని తీర్మానించడం నాకింకా గుర్తుంది. ఈ రోజుల్లో పదిహేడేళ్ళ పిల్లల్లో ఆ అజ్ఞానం వుంటుందని నేను అనుకోను!

మా కళ్ళ ముందే సంగం టాకీస్ కాస్తా శ్రీ మయూరిగా మారింది. బ్లాక్ అండ్ వైట్ మార్నింగ్ షోస్‍కి వెళ్తే, తెర తీస్తుంటే “నమో వెంకటేశా… నమో తిరుమలేశా… నమస్తే నమః…” అనే పాటతో తెర పైకి లేపేవారు. ఎంత అద్భుతంగా ఉండేదో, ఒకసారి నేను సినిమా వెళ్ళాల్సిందే అని అమ్మతో గొడవ చేస్తే నన్ను థియేటర్‍లో టికెట్ కొని వదిలి, నా పన్నెండేళ్ళప్పుడు తను వేరే పని మీద వెళ్ళడం నాకు గుర్తుంది! ఆ సినిమా ‘మహాకవి క్షేత్రయ్య’. అందులో ‘జాబిల్లి చూసేను… నిన్నూ నన్నూ’ అనే ప్రభా, ఎ.ఎన్.ఆర్. పాట నేను తెగ పాడేదాన్ని. ఆదివారాలు సాధారణంగా నెలలో ఒకరోజు అమ్మ మార్నింగ్ షోకి తీసుకెళ్ళేది. ఇదీ అదీ అని కాదు, ఏదో ఒకటి అని వెళ్ళేవాళ్ళం. గోల్కొండ చౌరస్తా లోని ‘బాలాజీ టాకీస్’లో ‘కీలుగుర్రం’, ‘గులేబకావళి కథ’, ‘పాతాళభైరవి’ లాంటివి వచ్చేవి. ఆ అద్భుత లోకాల్లోంచి ఒకంతట బయటకు రాబుద్ధి అయ్యేది కాదు. మా ఆకాశంలో ఎగిరే తివాచీలు, కోరినవన్నీ ఇచ్చే మంత్రదండాలూ, అక్షయ పాత్రలూ, మంత్రపు పాదరక్షలూ, ఓహో! హృదయం పట్టలేనంత ఆనందంగా వుండేది – ఆ హీరోయిన్‍లనీ, హీరోలనీ, మంత్రాలనీ, మాయలని చూస్తుంటే. ఎల్. విజయలక్ష్మి, బి.సరోజ, రాజశ్రీ, కాంచన, జయలలితలకి నేను పెద్ద ఫ్యాన్‌ని ఆ రోజుల్లో. మేం చూసి వచ్చిన ప్రతి సినిమా పిల్లలం అంతా మంచం అడ్దుపెట్టి సెట్స్‌లా, ఇంట్లో ప్రదర్శించేవాళ్ళం. ముఖ్యంగా బాణాలు పుల్లలతో మంత్రించి వేసుకోవడం, చీపుళ్ళు వెనకాల చొక్కాలో పెట్టుకుని. గదా యుద్ధం గరిటెలతో. పిల్లలం ఇలా వుండగా, అక్కలు ప్రతి సినిమా ‘క్యూ’లో అమ్మే పాటల పుస్తకాలు కొనుక్కుని అద్భుతంగా పి. సుశీలా, ఎస్. జానకీ, లీలా, జిక్కీల్లా పాడ్తుండేవారు. వాళ్ళు హిందీ సినిమా పాటలు కూడా ఎంతో మధురంగా పాడేవారు. అప్పట్లో వాళ్ళు ధర్మేంద్ర ఫాన్స్. తెలుగులో ‘కృష్ణ’ ఫాన్స్.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here