ఆ గుండెల సవ్వడి

0
4

[dropcap]తె[/dropcap]లుగు ప్రముఖ టివి చానల్ అమెరికాలోని ప్రతిభావంతులైన “యువ” – ఔత్సాహిక గాయనీ గాయకులకు పోటీ; “అమెరికాలో రాగవల్లరి- సుస్వరలహరి” నిర్వహించదలచి అభ్యర్థుల నుండి ప్రవేశ పత్రాలను అహ్వానించింది. హైదరాబాద్ లోని తమ కార్యాలయానికి వారికి నచ్చిన, (ఒక మాధుర్య ప్రదమైన పాట, ఒక లయ ప్రదమైన పాటని); పాటలని పాడి వీడియో రికార్దింగ్ చేసి ఈ-మైల్ ద్వారా పంపించమని ప్రకటించేరు.

ప్రథమ బహుమతి 10,000 డాలర్లు; ద్వితీయ బహుమతి 5000 డాల్లర్లు; తృతీయ బహుమతి 3000 డాల్లర్లు. ప్రాథమికంగా సుమారు పదహారుమందిని సెలక్ట్ చేస్తారు. అమెరికాలోని తెలుగు వారు ఎక్కువగా నివసించే ప్రముఖ నగరాలలో పోటీలు నిర్వహింపబడతాయి. పాల్గొనే అభ్యర్ధుల ప్రయాణ ఖర్చులు, వసతి భోజన ఏర్పాటులు నిర్వాహకులే భరిస్తారు అని హామీ ప్రకటించేరు. పోటీలో పాల్గొనే వారు షూటింగ్ వేళల్లో గైర్హాజరు కాకుండా నియమాలకి కట్టుబడి ఉంటామని హామీ పత్రం ఇవ్వలసి ఉంటుందని సూచించేరు.

ఆ వార్త ఇంటెర్నెట్‌లో చూసి శ్రీవిద్య తన రూం-మేట్ జూలియాకి చెప్పింది.

శ్రీవిద్య జూలియా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రములో ఆస్టిన్ నగరంలోని ఉన్న ‘కాక్రెల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్’ లో ఎంఎస్ చేస్తున్నారు.

“జూలి, నీవు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నావుకదా! నీకు సినెమా పాటలంటే చాలా ఇష్టం కదా. గెలిస్తే పేరుతో పాటు డాలర్లు సంపాయించుకోవచ్చు. నీ అప్పు కొంచెమైనా తీరుతుంది” అని శ్రీవిద్య నచ్చచెప్పింది.

జూలియాకి గుండె నిండా ఒక ప్రక్క లత మంగేష్కర్ పాటలు, మరొక ప్రక్క యేసుదాస్ పాటలు కంఠతా నిండి ఉన్నాయి.

“ఐడియా బాగానే ఉంది కాని. నేను తెలుగు పాటలు పాడగలనా?” అని ఇంగ్లీష్‌లో అంది.

సంభాషణ అంతా ఇంగ్లీష్ లోనే జరిగింది.

“జూలీ, తెలుగు సినెమాలలో మీ లీల, యేసుదాస్, చిత్ర చాలా పాటలు పాడి మంచి పేరు, డబ్బు సంపాదించుకున్నారు. కృషికి, పట్టుదలకి, ఆత్మాభిమానానికి నిన్ను మించిన అమ్మాయిని నేను చూడలేదు. నీవంతు ప్రయత్నం నీవు చేయి” అని శ్రీవిద్య ప్రోత్సహించింది.

శ్రీవిద్య జూలియా ఇద్దరు మధ్యతరగతి కుటుంబాలకి చెందిన వారు అయినప్పటికి; శ్రీవిద్య నాన్నగారు ఒక ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నత అధికారి. తాతగారు, తండ్రి సంపాయించిన ఆస్తి పుష్కలంగా ఉంది. టీచింగ్ అసిస్టన్స్ వచ్చింది. అందుచేత శ్రీవిద్యకి ఆర్థికంగా ఇబ్బంది అంతగా లేదు. జూలియా కేరళలో త్రిసూర్‌కి చెందిన సాంప్రదాయ రోమన్ కాథలిక్ క్రిస్టియన్ పరివార సభ్యురాలు. ఆమె తల్లి తండ్రులు ఒక ప్రైవేట్ మిషనరీ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు. ముగ్గురు అమ్మాయిలలో జూలియా పెద్దది. వారికి ప్రతీ ఆదివారం చర్చ్‌కి వెళ్లడం సంప్రదాయం. ఒకసారి జూలియా మొదటి బెంచ్‌లో కూర్చొని ఉండగా ఒక అమ్మాయి అక్కడనుంది లేవమంది.

“ఎందుకు లేవాలి” అని ప్రశ్నించింది జూలియా.

“నేను ఎవరి కూతురినో తెలుసా!” అని, “ఈ చర్చ్‌ని పోషించే వ్యక్తి మా నాన్న గారు” అని ఆ అమ్మాయి బెదిరించింది.

“అయితే ఏమిటి గొప్ప” అని ఎదురు ప్రశ్న వేసింది జూలియా. ఆమె జూలియాని రెక్క పట్టుకుని బయిటకు ఈడ్చింది.

ఇదంతా చుస్తున్న జూలియా తల్లి అందరిముందు జూలియాని మందలించింది. ఈ సంఘటన జరిగిన తరువాత ఆదివారం చర్చ్‌కి రానని జూలియా మొండికేసింది. తల్లి వెరోనికా జూలియా చెంప చెళ్లుమనిపించింది.

చర్చ్‌కి వెళ్లి బాత్ రూం వస్తొందని చెప్పి ప్రార్థనా కార్యక్రమాలు పూర్తి అయ్యేవరకు చర్చ్ బయటే ఉండి పోయింది.

చిన్నప్పుడే తన క్రింద తరగతుల వాళ్లకి స్కూల్ తరువాత ట్యూషన్ చెప్పి తన స్కూల్ ఫీస్ తనే సంపాయించుకుంది. ప్రతీ ఆదివారం స్టేషన్‌కి వెళ్లి ‘కొరియర్ గర్ల్ గా పని చేసి డబ్బులు సంపాయించుకొనేది. నగదు బహుమతులు ఉండే ప్రతీ పోటీలలో పాల్గొని విజయం సాధించి తను ఏమిటో తల్లిదండ్రులకి నిరూపించింది.

జాతీయ ఇంజినీరింగ్ విద్యా సంస్థలలో ఇంజినీరింగ్ సంపాయించుకొనే ప్రతిభ ఉన్నప్పటికి ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకొని స్థానిక ఇంజినీరింగ్ కళాశాలలోనే ‘కంపూటర్ ఇంజినీరింగ్’లో ఉత్తీర్ణురాలై శాస్త్రీయ సంగీతంలో కూడా ఉత్తీర్ణురాలయింది. మహిళల ఆరోగ్య సేవ కేంద్రంలో వాలంటీర్‌గా పని చేసింది.

బ్యాంక్‌లో అప్పు తీసుకొని అమెరికాలో ఎంఎస్ చేయడానికి తన స్వయం కృషి, స్వశక్తితో వచ్చింది జూలియా.

***

ఆరోజు శనివారం. కాలేజికి సెలవు. జూలియా చాలా కూరగాయలు వేసి ‘అవియళ్’ చేసింది. శ్రీవిద్య ‘హాట్ పాట్’లో అన్నం వండింది.

శ్రీవిద్య భోజనం చేస్తూ “జూలీయా నీ వంటలకి మీ ఆయన పొంగిపోతాడు”అని అంది.

“నా అప్పులు తీర్చలేక నన్ను వదిలి పారిపోతాడు” అని జూలియా నవ్వింది.

జూలియా నవ్వితే చక్కని పలువరుసతో బుగ్గలు చిన్న సొట్ట పడి అందంగా ఉంటుంది.

భోజనం అయిన తరువాత శ్రీవిద్య జూలియాకి యూట్యూబ్‌లో లీల, చిత్ర, యేసుదాస్ పాడిన కొన్ని తెలుగు పాటల చిత్ర సన్నివేశాలు; అంతకుముందు వివిధ పోటీలలో అమ్మాయిలు పాడిన ఆ పాటలను చూపించింది. ఆ పోటీలలో ఆ అమ్మాయిలు చేసిన తప్పులను కూడా శ్రీవిద్య వివరించింది.

జూలియా ఆ వివరాలన్నీ శ్రధ్ధగా గమనించింది.

మాధుర్యప్రదమైన పాటకి ‘శాంతినివాసం” చిత్రంలో ఘంటసాల సంగీత దర్శకత్వంలో శ్రీమతి లీల పాడిన – ‘కలనైనా నీ వలపే’; లయప్రదమైన పాటకి -‘తప్పుచేసి పప్పుకూడు చిత్రంలో, కీరవాణి సంగీత దర్శకత్వంలో చిత్ర యేసుదాసు పాడిన “బృందావనమాలి” పాటని ఎన్నుకుంది.

“ఈ రెండు నాకిష్టమైనస్టమైన ‘హిందోళం రాగములో ఉన్నాయి” అని అంది జూలియా.

జూలియా సంగీ త పరిజ్ఞానానికి శ్రీవిద్య అశ్చర్యపోయింది. ఇద్దరూ ఆ రెండు ఒరిజినల్ పాటలను డౌన్ లోడ్ చేసి ‘అడాసిటీ సాఫ్ట్‌వేర్ సహాయంతో ‘కెహ్ రీ ఓ కీ’ వెర్సన్ తయారు చేసారు.

శ్రీవిద్య సహాయంతో ఆ రెండు పాటలను ‘దేవనగరి లిపిలో జూలియా వ్రాసుకుని ప్రాక్టీస్ చేసింది జూలియా. సోమవారం కాలేజీ రికార్డింగ్ థియేటర్లో ; ‘నిబధ్ధత, అంకిత భావముతో’ పాడి ఎంపి 4 ఫార్మట్ లో రికార్డ్ చేసి ఆ టి వి చానల్ కి ఈమైల్ లో పంపించేరు.

ఇద్దరు చదువు, పరీక్షలు హడవుడిలో పాటల పోటీ సంగతి మర్చిపొయేరు. కొన్ని నెలల తరువాత ; ప్రోజెక్ట్ గురించి ప్రొఫెసర్ తో చర్చిండానికి జూలియా ఎదురు చూస్తు నిరీక్షిస్తూ ఉంటే ఈమైల్ చూసుకుంది. అమె సెలెక్ట్ అయింది. మిగతా వివరాలు త్వరలోనే తెలియచేస్తామని ఉంది. ఫోన్ చేసి ఆ విషయం శ్రీవిద్యకి చెప్పింది జూలియా. శ్రీవిద్య పొంగిపోయింది.

***

అమెరికాలోని వాషింగ్టన్ రాష్త్రం లో ప్రధాన నగరం సియాటల్. ఆ నగరంలో ఒక ప్రముఖ స్కూల్ ఆడిటోరియంలో ‘పాటల పోటీ’ ప్రారభోత్సవం జరిగింది.

అహ్వానితులు, విరాళాలు ఇచ్చిన ప్రముఖులు, పోటీలో పాల్గొంటున్న కళాకారులు, వారి కుటుంబసభ్యులు సంగీత రసికులు, రసజ్ఞులతో హాలు అంతా నిండి పోయింది. పోటీకి ఎన్నిక అయిన 18 యువతీ యువకులు అందరూ, (జూలియా తప్పిస్తే) తమ భర్తలతో, భార్యలతో, తల్లి తండ్రులతో కుటుంబసభ్యులతో వచ్చారు. జూలియా మాత్రం ఒంటరి పోరాటం సాగించింది.

ప్రముఖ గాయకుడు, పద్మశ్రీ గ్రహీత ఆ పోటీకి సూత్రధారి, న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. మరొక ప్రముఖ గాయని సుజాత ఆనాటి తొలి సంచికకి ముఖ్య అతిధిగా వచ్చింది. పోటీలో పాల్గొంటున్న 18మంది యువతి యువకులు స్టేజ్ మీద వరసగ నిల్చుని ; సాంప్రదాయ దుస్తులలో చూడ ముచ్చటగా ఉన్నారు. తమని తాము పరిచయం చేసుకున్నారు.

సూత్రధారి- న్యాయనిర్ణేత, గాయని సుజాత గణేష్ స్తుతి పాడి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించేరు. అందరూ పోటీ కోసం ఎదురు చూస్తున్నారు.

సూత్రధారి ప్రసంగిస్తూ, “ఈ సభలో ఇద్దరు వ్యక్తులను మీకు పరిచయం చేయడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. వారిని పొగడాలని నా ఉద్దేశం కాదు. వారి వ్యక్తిత్వం, వారి ప్రత్యేకత, మీ అందరికి తెలియజేసి; వారిద్దరిని మనసార అభినందిస్తూ, వారు ఇంకెందరికో స్ఫూర్తి కావాలని ఆకాంక్షిస్తూ మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.

ఆ పోటీని స్పొన్సర్ చేసిన్ ‘పీపుల్ సాఫ్ట్’ సాఫ్ట్‌వేర్ కంపెనీ అధినేత కృష్ణ మోహన్‌ని స్వాగతంగా స్టేజ్ మీదకి అహ్వానించేరు. అతనిని పరిచయం చేస్తూ: “మద్రాస్ ఐఐటిలో ఎలక్త్రానిక్స్ మరియు కమూనికేషన్స్‌లో బిటెక్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, ఐఐఎం, అహమ్మదాబాద్‌లో ఎం బి ఏ; అమెరికాలో ఎంఐటిలో ఆర్థిక శాస్త్రములో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫి సంపాయించి; ఆస్టిన్ నగరంలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ నెలకొల్పి ఎందరో ప్రతిభావంతులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన వ్యక్తి; భారతదేశంలో ఎన్నో సంగీత, సాంఘిక కార్యక్రమాలకు గుప్తదాత’ అని చిరు పరిచయం చేసేరు.

“ఎందరో సంగీతప్రియులు చెవులు కోసుకుంటారని విన్నా కాని కృష్ణమోహన్ తన రెండు హృదయ ద్వారాలను సుమధుర సంగీతం కోసం తెరచె వుంచుతాడు. అతని సంగీతం కలెక్షన్ ఒక గ్రంధాలయం. అతనికి మా అందరి తరఫున; మనందరి తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు.’ అని అతనిని ప్రసంగించవలసిందిగా కోరాడు.

కృష్ణమోహన్ స్పందిస్తూ ; “నాకు ఈ పోటీని నిర్వహించడానికి అవకాశం ఇచ్చినందుకు ఆ టివి చానల్ వారికి కృతజ్ఞతలు. ఈ పోటీలో పాల్గొంటున్న యువతీ యువకులకు నా హృదయపూర్వక్ శుభాకాంక్షలు” అని క్లుప్తంగా ప్రసంగించి యువతి యువకులు 18మందికి సరి కొత్త ఐ ఫోన్లు బహుమానంగా ఇచ్చేడు. సూత్రధారి మరల మాట్లాడుతు; “మీకు నేను పరిచయమ చేయదలచుకున్న మరొక వ్యక్తి మిస్ జూలియా”.

జూలియా ఒక్కసారి తృళ్లిపడింది.

“పోటీలో మిగత అందరూ కేవలం పాటలు పాడి అసమగ్రంగా రికార్డ్ చేసి పంపిస్తే ఈ అమ్మాయి మాత్రం ఒరిజినల్ పాటలో నేపథ్య సంగీతాన్ని అలాగే ఉంచి, ఒరిజినల్ గాయనీ గాయకుల గొంతును తప్పించి ; తన ప్రతిభతో తన గొంతుకని జత పరచి తన నిబద్ధత, అంకిత భావం ప్రొఫెషనల్ గాయనిలాగ అసమాన ప్రతిభని కనపరచింది. ఆమె మాతృభాష తెలుగు కూడా కాదు. ఆమె మాతృభాష మలయాళం. ‘గివ్ హెర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్ప్లాజ్. “అని కొనియాడేరు. హాల్ అంత కరతాళధ్వనులతో మారుమ్రోగింది. జూలియా కళ్లలో ఆనందభాష్పాలు రాలాయి.

సూత్రధారుడు మరల ప్రసంగిస్తూ ‘ఇవాళ కార్యక్రమంలో ఈ 18 మంది యువతీ యువకులు తమని పరిచయం చేసుకుని, తమకి నచ్చిన పాటలు పాడుతారు. రేపటి కార్యక్రమంలో రెండు రౌండ్స్ ఉంటాయి. ఒకటి ‘ఆ పాత మధురం’ రెండవది ‘నేటితరం-గతులు-సంగతులూ. ఈ రెండు రౌండ్స్ లో తక్కువ మార్కులు వచ్చిన ఇద్దరు పోటీనుండి నిష్క్రమిస్తారు”;.అని వివరించారు.

జూలియా అందరికి నమస్కరించి; తనని పరిచయం చేసుకుని-” 1960లో విడుదలైన చిత్రం ‘రాజమకుటం’ లో దేవులపల్లి వారి రచన,”సడిసేయకొ గాలి” లీల పాడిన పాట మాస్టర్ వేణు స్వరపరచేరు” అని వివరించి పాడింది.

జూలియా ‘ఆ పాత మధురం’రౌండ్ లో 1956లో విడుదలైన ‘చిరంజీవులు” చిత్రంలో శ్రీమతి లీల పాడిన ‘తెల్లవరవచ్చె తెలియక” ; రచన -మల్లాది సంగీతం- ఘంటసాల అని వివరించి పాడింది.

‘నేటి తరం గతులు సంగతులు” రౌండ్ లో 2011లో విడుదలైన ‘మిస్టర్ పెర్ఫెక్ట్” చిత్రములో శ్రియ ఘోషల్ పాడిన ‘చలి చలిగా అల్లింది” రచన అనంత శ్రీరాం, సంగీతం దేవిశ్రీప్రసాద్ అని వివరించి పాడింది.

ప్రేక్షకుల మన్ననలు, సూత్రధారుని గౌరవ స్పందన పొందడమే కాకుండా అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుని తరువాత రౌండ్‌కి సెలెక్ట్ అయింది. సంతోషంతో ఆస్టిన్‍కి తిరుగు ప్రయాణం అయింది. తరువాత రౌండ్ కాలిఫోర్నియ రాష్ట్రంలో బే ఏరియలో అని తెలియచేసేరు. ఎప్పటినుంచో చుడాలనుకున్న శాన్ ఫ్రాన్సిస్కోలోని ‘గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ” చూడవచ్చని సంతోషించింది.

మిగతా వాళ్లు రిహార్సల్స్ చేస్తున్నప్పుడు, జూలియా శాన్ ఫ్రాన్సిస్కొ వెళ్లి; “గోల్డెన్ గేట్ బ్రిడ్జ్” చూసి అక్కడ దగ్గరలో ఉన్న ‘ఘిరాడిలి చాక్లేట్ షాప్ కి వెళ్లి; ఓషన్ బీచ్ సండియ ఐస్క్రీం సంతృప్తిగా తిని రిహార్సల్ కి వచ్చింది.

బే ఏరియా ప్రోగ్రాం కి సియాటల్ కంటే ఎక్కువమంది ప్రేక్షకులు వచ్చేరు.

సూత్రధారుడు ప్రసంగిస్తూ “ఈ రౌండ్‌లో రెండు శీర్షికలలో అందరూ పాడుతారు. మొదటి శీర్షిక ‘రావు మళ్ళీ ఆ రోజులు’; ఇందులో ఆనాటి సంగీత దర్శకులు శ్రీ ఆదినారాయణారావు, సాలూరి రాజేశ్వరరావు, పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత దర్శకత్వములో వివిధ గాయనీ గాయకులు పాడిన పాటలు పాడుతారు. రెండవ శీర్షిక: ‘నవరాగం’లో 2000 తరువాత విడుదలైన తెలుగు చిత్రాలలో లయప్రదానమైన పాటలు పాడుతారు. ఈ రెండు శీర్షికలలో పాడిన తరువాత తక్కువ మార్కులు వచ్చిన మరొక ఇద్దరు నిష్క్రమిస్తారు.

జూలియా మొదటి శీర్షికలో 1958 లో విడుదలైన “చెంచులక్ష్మి” చిత్రంలో శ్రీమతి సుశీల పాడిన, సదాశివబ్రహ్మంగారి రచన; “పాలకడలిపై శేషతల్పమున”, సంగీతం సాలూరి రాజేశ్వరరావుగారు” అని వివరించి పాడింది. ఆమె పాడిన తరువాత సూత్రధారుడు “జూలియా ఈ పాట అర్థం నీకు తెలుసా!” అని అడిగేరు.

బిడియ పడుతూ; “కొంచెం కొంచెం” అని ఇంగ్లీష్‌లో శ్రీవిద్య తనకి ఆ పాట గురించి వివరించిన వివరాలు క్లుప్తంగా వివరించింది.

సూత్రధారుడు ఆ పాట తనకి ఎంత ఇష్టమో అని చెప్పి; ఆ పాట స్కూల్ పోటీలలో పాడినప్పుడు తనికి కూడా బహుమతి వచ్చింది అని వివరించారు.

ప్రేక్షకులందరూ హర్షధ్వానాలు తెలియజేసేరు.

***

రెండవ శీర్షిక లో 2001 లో విడుదలైన “మనసంతా నువ్వే” చిత్రంలో ఉష సంజీవని పాడిన “తూనీగ తూనీగా” ; రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి; సంగీతం అర్ పి పట్నాయిక్, అని వివరించి పాడింది.

అందరూ చప్పట్లు కొట్టారు.

సూత్రధారుడు కలుగచేసుకుంటూ, “ఈ ట్యూన్ ఒరిజినల్ గా మన ఉపద్రష్ణ విద్యాసాగర్ ఒక మలయాళం చిత్రం కోసం స్వరపరచినది. జూలియా నీకు ఒరిజినల్ పాట తెలుసా?” అని అడిగేరు.

జూలియా తెలుసు అన్నట్లు తల ఊపి “నాకు చాల ఇష్టమైన పాట. 1998లో విడుదలైన చిత్రం “ప్రణయవర్ణంగళ్” చిత్రంలో యేసుదాస్, చిత్రగారు పాడిన పాట; అని చిత్ర పాడిన పల్లవి: “కన్నాడి కూడి కూట్టి కన్నెరుతి పొట్టుం కుత్తి కావళం పైందలి వాయూ” అని మాధుర్యంగా పాడి వినిపించింది.

సూత్రధారుడు కలుగజేసుకుంటూ, “ఇదండి మన తెలుగువారి సంగీత ప్రతిభ. అన్య రాష్ట్రాలలో, అన్య భాషలలో మన తెలుగు సంగీత కళాకారులకు లభించే సత్కారం, గౌరవం మన రాష్ట్రములో దక్కటం లేదు” అని ఆవేదన వ్యక్తం చేసేరు.

ఈ రౌండ్‌లో కూడా జూలియాకి అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చి తరువాత రౌండ్‌కి ఎన్నిక అయింది.

***

అమెరికాలోని ప్రముఖ నగరాలు; అట్లాంట, కొలంబస్, ప్రిన్స్టన్, షికాగో నగరాలలో జరిగిన రౌండ్స్‌లో జూలియా

– సంగీతదర్శకుడు ఇళయరాజ పాటలలో ఘర్షణ చిత్రంలో రాజశ్రీ రచన; చిత్ర పాడిన “నిన్ను కోరి వర్ణం”

– సంగీతదర్శకుడు ఏ ఆర్ రహ్మాన్ పాటలలో హృదయాంజలి చిత్రంలో చిత్ర పాడిన సీతారామశాస్త్రి రచన “మానసవీణ మౌన స్వరాన”

-జానపదగీతాలు శీర్షికన అదృష్టవంతులు చిత్రంలో కె వి మహాదేవన్ స్వరపరచి సుశీల పాడిన కొనకళ్ల వెంకటరత్నం రచన్ ; “మొక్కజొన్నతోటలో”

– కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాల పాటలు శీర్షిక లో; స్వరాభిషేఖం చిత్రంలో సామవేదం షణ్ముఖశర్మ రచన, చిత్ర మధు బాలకృష్ణ, పార్థసారధి పాడిన “రమ వినోద వల్లభ”

– మహానటి సావిత్రి చిత్రాలలో పాటల శీర్షికలో భలేరాముడు చిత్రంలో లీల పాడిన సదాశివబ్రహ్మం రచన “ఓహో మేఘమాల”;సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

– తెలుగు చిత్రాలలో “రాగమాలికలు” శీర్షికలో భలే అమ్మాయిలు చిత్రంలో సదాశివబ్రహ్మం రచన రాజేశ్వరరావుగారు సంగీతం శ్రీమతి లీల ఎం ఎల్ వసంతకుమారి పాడిన “గోపాల జాగేలరా”

– పౌరాణిక చిత్రాలలో పాటలు శీర్షిక లో శ్రీకృష్ణవిజయం చిత్రంలో నారాయణరెడ్డీగారి రచన, పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం , సుశీల పాడిన “జోహారు శిఖిపించ మౌళి”; పాడి అందరి మన్నలు పొందడమే కాకుండా అందరి కంటే ఎక్కువ మార్కులతో; ప్రధమముగా ఫైనల్ కి ఎన్నిక అయింది.

జూలియాతో పాటు మరొక ముగ్గురు ఫైనల్ కి ఎన్నిక అయ్యారు.

ఫైనల్ ఆస్టిన్ నగరంలో జరుగుతుందని సూత్రధారుడు ప్రకటించేరు.

***

ఆస్టిన్ నగరంలో ఒక ప్రముఖ ఆడిటోరియంలో గ్రాండ్ ఫైనల్స్ అందంగా ఏర్పాటు చేసారు. చూడడానికి కన్నుల పండుగగా అనిపించింది. సౌండ్ ఇంజినీర్ చాలా శ్రావ్యంగా వినబడేటట్లు ఏర్పాట్లు చేసాడు. చుట్టు ప్రక్కల ఊళ్లనుండి కూడా సూత్రధారుని అభిమానులు, చిత్ర సంగీత ప్రియులు అందరూ వచ్చేరు.

శ్రీవిద్య రెండవ వరసలో కూర్చుని ఉంది. తన స్నేహితురాలు జూలియా పోటీలో ఫైనల్‌కి ఎన్నిక అయినందుకు చాలా సంతోషంగా ఉంది. తప్పక గెలుస్తుంది అని నమ్మకం కంటే గెలిస్తే బాగుంటుంది అన్న ఆలోచనలలో ములిగి తేలుతోంది.

సూత్రధారి సభని ప్రారంభిస్తూ మరల అందరికి డాక్టర్ కృష్ణమోహన్‌ని పరిచయం చేసారు. కృష్ణమోహన్ ఆ నలుగురు అభ్యర్ధులకి ఏపిల్ మాక్ బుక్, బోస్ వైర్లెస్ హెడ్ ఫోన్స్ కానుకగా అందచేసాడు. సూత్రధారి మరల ప్రసంగిస్తూ, ” ఈ గ్రాండ్ ఫైనల్‌లో మూడు శీర్షికల క్రింద అభ్యర్ధులు పాటలు పాడుతారు. మొదటి శీర్షిక: లలితగీతాలు. రెండవ శీర్షిక: వారి మాతృభాష కాని భాషలో పాటలు పాడతారు. మూడవ శీర్షికలో చలనచిత్రరంగంలో వచ్చిన ప్రముఖ వాగ్గేయకారుల స్వరరచనలను పాడుతారు. ఈ మూడు శీర్షికలలో వచ్చిన మార్కులను సగటు చేసి విజేతలను నిర్ణయించడం జరుగుతుంది” అని వివరించారు.

జూలియా లలితసంగీతం శీర్షికలో ఒక మలయాళం గీతం పాడడానికి అనుమతి కోరింది. అందుకు సూత్రధారుడు ప్రతిస్పందిస్తూ “సంగీతానికి భాషలు అడ్డు కావమ్మ. నీవు తప్పక పాడవచ్చును.” అని ప్రొత్సాహకరమైన పలుకులు పలికేరు.

జూలియా ఆనందానికి అవధులు లేవు.

జూలియా ఎం జి రాధాకృష్ణన్ సంగీతదర్శకత్వంలో సుజాత పాడిన; శ్రీ కావళం నారాయణ పానికర్ రచన పాడింది. హిందోళం రాగంలో సాగిన ఆ పాట ప్రేక్షకులందరినీ అలరించింది. అందరూ హర్షధ్వానాలు ప్రకటించేరు.

ఇతర భాషల చిత్రగీతాల శీర్షికలో; జూలియా 1970లో విడుదలైన హిందీ చిత్రం “దస్తక్”లో మదన్ మోహన్ సంగీతదర్శకత్వంలో, మజ్రూహ్ సుల్తాన్‌పూరి రచన, లత మంగేష్కర్, మదన్ మోహన్ పాడిన; “మాయి రి” పాడింది. మదన్ మోహన్ పాడిన ఒక చరణం ఒక శృతిలో; లత మంగేష్కర్ పాడిన రెండు చరణాలు ఇంకొక శృతిలో పాడి సంగీతంలో తనకున్న ప్రజ్ఞని చాటింది. కుర్చీనుంచి లేచి జూలియా తలమీద ఆశీర్వదిస్తూ ;” ఈ పాటని ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసావు?” అని అడిగేరు.

“నా చిన్నప్పటినుంచి ప్రాక్టీస్ చేసాను. నాకు ఈ పాట చాల ఇష్టం” అంది జూలియా,

సూత్రధారుడు మరల మాట్లాడుతూ, “మదన్ మోహన్ లత అనే గాయని అతని కోసమే పుడుతుందని; లత కోసమే మదన్ మోహన్ సంగీత దర్శకుడు అయ్యాడని చిత్రసీమలో అనుకునేవారు. అంత అన్నా చెల్లెలి అనుబంధం వారిద్దిరిది. వారి కాంబినేషన్లో లత పాడిన మంచి పాటలు మరింకెవరి సంగీతదర్శకత్వంలో రాలేదంటే అతిశయోక్తికాదు. జూలియా, నీ గొంతుకలో ఎంత బాగా పలికేయమ్మ ఆ సంగతులు, గమకాలు. నీవు చిన్నదానివి అయిపోయావు. లేకపోతే నీకు సాష్టాంగ ప్రమాణం చేసేవాడిని.” అని సూత్రధారుడు అభినందనలు తెలిపేరు.

జూలియా శ్రీవిద్య కళ్లలో ఆనందభాష్పాలు రాలాయి.

***

లంచ్ విరామ సమయంలో కృష్ణమోహన్ జూలియా దగ్గరకు వచ్చి; తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి, “మీరు పాడిన మలయాళం లలితగీతం ఒరిజినల్ సాంగ్ లింక్ నాకు దయచేసి మెయిల్ చేయగలరా!” అని అడిగేడు. తింటున్న ప్లేట్ ప్రక్కన పెట్టి; “ష్యూర్ సర్”అని చిరునవ్వు నవ్వింది.

అతని విజిటింగ్ కార్డ్ జాగ్రత్తగా తన హాండ్ బ్యాగ్‌లో పదిలంగా దాచుకుంది.

లంచ్ లో పరాకుగా ఏదో ఆలోచిస్తూ కొంచెం కిన్వా సాలడ్ ఎకువ వేసుకుంది. పారేయడం సభ్యత సస్కారం కాదనుకొని తినేసింది. అందులో వినిగర్ ఎక్కువ ఉండడంవలన గొంతుకలో మంట, పొడి దగ్గు ప్రారంభంఅయ్యాయి. అతికష్టం మీద నిగ్రహించుకుంది. మూడవ శీర్షికలో సరిగ్గా పాడగలనో లేదో అన్న భయం మొదలైంది.

చలనచిత్రసీమలో ప్రముఖ వాగ్గేయకారుల స్వరరచనలు శీర్షికన ; జూలియా ఎంపిక చేసుకున్న పాట; 1982లో విడుదలైన చిత్రం “గానం” లో డాక్టర్ బాలమురళీకృష్ణ, సుశీల, యేసుదాస్ గానం చేసిన; స్వాతి తిరునాళ్ కల్యాణిరాగ కీర్తన: “అద్రి సుతా వర”. “జూలియా, ముగ్గురు మహానుభావులు గానం చేసిన ఈ పాటను ఎంచుకుని, మా కార్యక్రమానికి వన్నె తెచ్చి, ఈ కార్యక్రమ స్థాయిని పెంపుచేసినందుకు నిన్ను మనసార అభినందిస్తున్నాను. అల్ ది బెస్ట్. గివ్ హెర్ అ బిగ్ రౌండ్ అఫ్ అప్లాజ్” అని సూత్రధారుడు కొనియాడారు. అందరూ చప్పట్లు కొట్టారు.

జూల్లియ మాధుర్యంగా సాంప్రదాయంగా “కల్యాణి”రాగం ఆలాపన పూర్తి చేసింది. సాహిత్యం పూర్తిచేసి, “పావన అనుపమ చరిత” నెరవల్ పాడుతుంటే ఆమెకి కడుపులో పుల్ల తేనుపులు పొడిదగ్గు ప్రారంభం అయ్యాయి. వెనక్కి తిరిగి, మైక్ దూరంగా పెట్టిఎవరికి కనిపించకుండా వినపించకుండా జాగ్రత్తపడింది.

కాని గొంతుక పొడి అయిపోయి స్వరాక్షరాలు పేలవంగా, తనకే అసంతృప్తిగా పలికేయి. కళ్ళలో నీళ్లు తిరిగాయి. అయినా తొణక్కుండా పాటని పూర్తిచేసింది. జూలియా తూలిపోయి పడిపోతుందేమోనని, శ్రీవిద్య, సూత్రధారుడు భయపడ్డారు.

సూత్రధారుడు అభినందన వ్యక్తం చేస్తూ “ఫరవాలేదు జూలియా. ఇటువంటి పరిస్థితి ప్రతీ గాయని గాయకుల జీవితాలలో ఎదురవుతుంది. గానసుధాకర బాలమురళీకృష్ణగారికి తప్పలేదు. అప్పుడు ఆయన ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో సంగీత విభాగానికి నిర్మాత అయి భక్తిరంజని కార్యక్రమం రూపొందించి కీర్తి సంపాదించారు. ” అని ఓదార్చారు.

జూలియా కన్నీళ్లు మౌనంగానే దిగమ్రింగుకుంది.

గెలుపు ఓటమికి తేడా శ్రీవిద్య కళ్లారా చూసింది. గెలిచిన ముగ్గురు అమ్మాయిలు, కార్యనిర్వాహకులు సూత్రధారితో ఫొటోలు తీసుకున్నారు. జూలియాని ఎవరూ పలుకరించలేదు. శ్రీవిద్య జూలియా టాక్సీ చేయించుకుని రూం కి వచ్చేసారు. యాసిడ్ రిఫ్లక్స్ మాత్ర వేసుకుని జూలియా పడుకుంది. శ్రీవిద్య జూలియాని ప్రొత్సహించి పొరపాటు చేసానా! అని ఆలోచించింది.

***

శ్రీవిద్య ప్రొజెక్ట్ వర్క్ పూర్తి చేసుకుని అట్లాంటా నగరంలో ఉద్యోగం వచ్చి వెళ్లిపోయింది. జూలియా వర్క్ పెండింగ్ లో ఉండిపోయింది. క్రెడిట్ కార్డ్ బిల్స్, రూం రెంట్, తిండి ఖర్చులు పెరిగాయి. దిక్కు తోచక చిన్న చిన్న ఉద్యోగాలకి ఎప్లై చేసింది.

గత్యంతరంలేక మాక్దోనాల్డ్ రెస్టారెంట్లో రాత్రి గిన్నెలు తోమి, అంతా శుభ్రం చేసే ఉద్యోగంలో చేరింది. ప్రొద్దున్నంతా ప్రోజెక్ట్ వర్క్, రాత్రి రెస్టారెంట్లో చాకిరి, ఒంటరితనం, నిర్లిప్తత, నిస్పృహని పెంపుచేసాయి.

***

కాలగమనం ఎవరికోసం ఆగదు. ఆరోజు టెక్సాస్ రాష్ట్రమంతా పెను తుఫాను. ఆస్టిన్‌లో విపరీతమైన వర్షం. జూలియా రెస్టారెంట్ నుండి రూంకి రావలసిన బస్ రద్దు అయింది.

ఒంటరిగా బస్ స్టాప్‌లో నిల్చుంది.

“ఏం చేయాలి? ఎలా రూం కి చేరాలి?” అని అలోచిస్తోంది. టాక్సీకి డబ్బులు చాలవు. క్రెడిట్ కార్డ్ లిమిట్ అప్పటికే దాటి పోయింది.

ఆమెకి డాక్టర్ కృష్ణమోహన్ గుర్తుకు వచ్చేరు. అతనికి ఇప్పటిదాక అతను అడిగిన పాటను మెయిల్ పంపించలేదు. ఫోన్ చేయాలా! వద్దా! అన్న సంశయంలో పడింది.

రాత్రి పదకొండు అయింది. బిడియ పడుతూనే జూలియా కృష్ణమోహన్‌కి ఫోన్ చేసింది.

“సర్, పడుకున్నారా! డిస్టర్బ్ చేసేనా!” అని అంది జూలియా.

‘ఫరవాలేదు. ఇంకా పడుకోలేదు. ఏమిటి సంగతి, ఈ టైం కి చేసేరు” అని మర్యాద పూర్వకంగా అడిగేడు.

జూలియా పరిస్థితి వివరించింది.

“ఫోన్ లో చార్జ్ జాగ్రత్తగా ఉంచుకోండి. నేను వచ్చేసరికి అరగంట పడుతుంది. ఎమర్జెన్సీ అనిపిస్తే 911 కి కాల్ చేయండి. ధైర్యంగా ఉండండి.” అని హెచ్చరించి; గొడుగు తీసుకుని; వాళ్లమ్మగారికి చెప్పి బయలుదేరాడు. అరగంట తరువాత కారు దగ్గరలో ఉన్న పార్కింగ్ లాట్‌లో పార్క్ చేసి, టార్చ్ లైట్ గొడుగుతో జూలియా దగ్గరకు వచ్చాడు.

కారులో ఇంటికి వస్టుంటే కృష్ణమోహన్ అడిగేడు; ” పాటల పోటీలో ఓడిపోయినందుకు బాధపడ్డావా!”.

నిస్పృహ కూడిన చిరునవ్వుతో జూలియా “నా ప్రయత్నం నేను చేసాను. గెలిచి ఉంటే మీ మంచితనాన్ని కళ్లార చూసి, అర్థం చేసుకునే అవకాశం వచ్చేది కాదేమో! అని “మీరు అడిగిన పాట పంపించడం మరచిపోయాను” అని ఫొన్ నుండి అతనికి ఆ పాట లింక్ పంపించింది.

“ఏమైనా తిన్నావా?”

“లేదు”.

అతను దగ్గరలో ఉన్న సబ్ వే లో వెజ్ బర్గర్ , హాట్ చాక్లేట్ కొని ఆమెకి ఇచ్చాడు.

ఇద్దరూ ఇంటికి వచ్చేసరికి ఒంటిగంట అయింది.

కారులో ఇద్దరూ ఎన్నో పాత పాటలు గురించి చర్చించుకున్నారు, మనసారా నవ్వుకున్నారు. ఇంటికి రాగానే గెస్ట్ రూం చూపించేడు.

“పడుకో, మిగతా విషయాలు రేపు ప్రొద్దున్న మాట్లాడుకుందాం.”అని అన్నాడు.

ఆమె తన అందమైన కళ్లసైగలతోనే కృతజ్ఞతలు తెలిపింది. మనస్ఫూర్తిగా నవ్వింది.

అలసిపోయి నిద్రపోయిన జూలియాకి కృష్ణమోహన్ తలుపు తట్టి; “గుడ్ మార్నింగ్” అని పలుకరించి, టూత్ పేస్ట్, టూత్ బ్రష్, టంగ్ క్లీక్లేర్ ఇచ్చి “నీవు వేగరంగా తయారయితే నిన్ను నీ రూం దగ్గర డ్రాప్ చేస్తాను.”అని అన్నాడు.

ఇద్దరూ మౌనంగానే బ్రేక్ ఫాస్ట్ చేసి బయల్దేరారు.

కారులో కృష్ణమోహన్ మాట్లాడుతూ, “నీలాంటి సంగీత ప్రతిభావంతులు రెస్టారెంట్లలో అంట్లు తోముకుంటూ జీవనోపాధికి కష్టపడడం నాకు సిగ్గనిపిస్తోంది. నాదొక ప్రొపోజల్, నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లోనే ఉండి మా అమ్మాయి శ్రిజకి నీవు సంగీతం నేర్పించు. భోజనం, రూం అన్ని ఉచితం. నిన్ను రోజూ ప్రొద్దున్న కాలేజ్‌కి డ్రాప్ చేస్తాను. సాయింత్రం పిక్ అప్ చేస్తాను. నీ ఎంఎస్ అయ్యాక నా కంపెనీలో ఇంటెర్న్ చేసి వీలయితే నీకు ఉద్యోగ ప్రయత్నం చేస్తాను. నీకు ఎప్పుడైనా కష్టం అనిపిస్తే మానీయచ్చు.” అని క్లుప్తంగా నా నిర్ణయం అన్నట్టు చెప్పాడు. జూలియాకి “ఇది కలా, నిజమా” అనిపించింది.

చనువు తీసుకుని కృష్ణమోహన్ జబ్బగిల్లింది. తరువాత చిరునవ్వుతూ క్షమాపణ చెప్పింది.

కృష్ణమోహన్ సహకారంతో, అతని తల్లితండ్రుల అభిమానంతో, శ్రిజ ఆప్యాయతతో జీవితం సుఖమయంగా, ఆనందంగా గడిచిపోయింది. ఎంఎస్ ప్రోజెక్ట్ పూర్తి చేసి అతని కంపెనీలోనే అతనికి ఆంతరంగిక కార్యదర్శిగా చేరింది.

అతని తల్లి ద్వారా అతని వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకుంది.

అతని తల్లితండ్రులు అతనితో పాటు అమెరికాలో ఉంటారని తెలిసి, ఇష్టంలేక పుట్టింటికి హైదరాబాద్ వెళ్లి; అతని భార్య మాలతి అతని మీద అతని తల్లితండ్రులమీద కట్నం వేధింపులు చేస్తున్నారని పోలీస్ కేస్ పెట్టింది.

స్థానిక పోలీస్ కమిషనర్ అతనికి దగ్గర బంధువు అవడం వలన గుట్టు చప్పుడు కాకుండా వారిని పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చి వారి ప్రయాణానికి సహాయం చేసేరు. జూలియాకి మాలతి అంత మంచి భర్తని పిల్లని దూరం చేసుకుని ఏమిటి సాధించిందో అర్థం కాలేదు.

జూలియా కృష్ణమోహన్‌తో జీవితాన్ని పంచుకోవాలని ధృఢ నిర్ణయానికి వచ్చింది. ఇద్దరికి పది సంవత్సరాలు వయసు తేడా.

తల్లితండ్రులకు ఫోన్ చేసింది. వాళ్లు ససేమిరా ఒప్పుకోలేదు.

కృష్ణమోహన్ మరొక్కసారి ఆలోచించుకోమన్నాడు.

అతని మాట వినలేదు.

శ్రీవిద్యకి ఫోన్ చేసి ఆమె అభిప్రాయం అడిగింది.

“నీ నిర్ణయాన్ని ఎప్పుడూ నేను గౌరవిస్తాను, సమర్థిస్తాను” అని హామీ ఇచ్చింది.

“నేను ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్‌లో పెళ్లి చేసుకుంటున్నాను.. సాక్షి సంతకానికి నీవు నా తరఫున రావాలి.” అని అంది.

జూలియా జీవితంలో సుఖంగా స్థిరపడుతోందని శ్రీవిద్య చాలా సంతోషించింది. పెళ్లి చాలా నిరాడంబరంగా జరిగిపోయింది. కృష్ణమోహన్ నీలిరంగు సూట్‌లో, జూలియా సాంప్రదాయ తెల్లని క్రిస్టియన్ వెడ్డింగ్ గౌన్‌లో; ఇద్దరు కన్నుల పండుగగా, చూడముచ్చటగా ఉన్నారు.

తరువాత జరిగిన విందుభోజనానికి ఆత్మీయులు, సన్నిహితులు వచ్చేరు. ఇద్దరూ క్లుప్తంగా వచ్చినవారందరికి కృతజ్ఞతలు చెప్పేరు.

శ్రీవిద్య కళ్లలో ఆనందభాష్పాలు రాలాయి.

హానీమూన్‌కి కెనడాలో టొరాంటో నగరం లోని “నయాగరా” జలపాతానికి వెళ్లడానికి కావలసిన వీసా, హొటల్ విమాన కారుల ఏర్పాటులన్ని నిబద్దతతో కృష్ణమోహన్ చేసాడు.

ఆస్టిన్ నుండి హూస్టన్ కారులో బయల్దేరారు. శ్రీవిద్య హూస్తన్ నుండి అట్లాంటా వెళ్లిపోయింది. కృష్ణమోహన్, జూలియా, శ్రిజ, కృష్ణమోహన్ తల్లితంద్రులు హూస్టన్ నుండి టొతొటో విమానంలో బయిల్దేరారు. విమానంలో ఉన్నంతసేపు శ్రిజ జూలియా కబుర్లు, పాటలు, జోక్స్‌తో మిగతా వాళ్ల సంగతి మర్చిపోయారు.

టొరాంటో నగరంలో నయాగరా జలపాతం దగ్గరలో ఉన్న హొటల్లో బసచేసారు. జూలియాకి హొటల్ గది కిటికీనుండి రంగు రంగుల దీపాల కాంతితో నయాగరా జలపాతం అందాలు వర్ణించలేని రీతిలో కనబడింది. జూలియా పరవశించిపోయింది.

రాత్రి శ్రిజ కృష్ణమోహన్ తల్లి హేమలత దగ్గర పడుకుంది.

కిటికీనుండి నయాగరా జలపాతం అందాన్ని చూస్తున్న జూలియా నడుము చుట్టూ కృష్ణమోహన్ చేతులువేసి దగ్గరకు తీసుకున్నాడు. ఆమె పరవశంతో కనులు మూసుకుంది. అతని మదిలో 1965లో విడుదలైన చిత్రం “ఆడబ్రతుకు”లో నారాయణరెడ్డి గారి పాట లో చరణం: “అందమైన ఈ జలపాతం ఆలపించె తీయని గీతం; కనిపించని నీహృదయంలో వినిపించెను నా సంగీతం” అప్రయత్నంగానే మెదిలింది. గదిలో కింగ్ సైజ్ పరుపు, ఎడారిలో ప్రయాణం చేసి దాహంతో ఉన్న బాటసారులకు ఒయాసిస్ (శాద్వలము) లాగ అనిపించింది.

ఆ ప్రణయజీవుల “గుండెల సవ్వడి”; అనాదినుంచి కవులు, రచయితలు విశ్లేషించి, విరచించిన ప్రయత్నం చేసినప్పటికి, అప్పటికి, ఇప్పటికి భాషకి అందని భావముగానే మిగిలిపోయింది. ఆ ప్రణయజీవుల యవ్వన కెరటాలు అలలు అలలుగా సాగి ఉవెత్తున లేచి విరుచుకుపడి చేరవలసిన తీరానికి చేరుకున్నాయి.

జూలియా శ్రిజ మధ్య ఏర్పడిన తీయని బంధం కృష్ణమోహన, హేమలతకి సంతోషాన్ని కలిగించింది.ఆ తీయని బంధంతో కూడిన ఫోటోలని జూలియా శ్రీవిద్యకి ఈ మైయిల్ ద్వారా పంపించింది.

(తెలుగు చిత్రసీమలో ఎన్నో మధురభావ సుమమాలలను విరచించిన గేయరచయితలు, ఆల్పించిన గాయనీగాయకులకు; తరతరాలకు వాటిలోని విశిష్టతను తెలియపరచిన సూత్రధారి: శ్రీపండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యంగారికి ఒక నమఃసుమాంజలి-భవదీయుడు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here