[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]
[dropcap]ఈ[/dropcap] ‘మాయాబజార్’, ‘పాతళభైరవి’లో నుండి, పదమూడు పధ్నాలుగేళ్ళు వచ్చేసరికీ, మేం మరో మాయాలోకంలో పడ్డాం. అవి మార్నింగ్ షోస్‌గా వచ్చే పాత ఏక్షన్ సినిమాలు ‘మోసగాళ్ళకి మోసగాడు’, ‘జగత్‌జెట్టీలు’, ‘గూఢచారి నెం. 116’, ‘కత్తుల రత్తయ్య’ ఇలాంటి పాత సినిమాల్లో థ్రిల్ తెలిసింది. నాకు ముఖ్యంగా జ్యోతిలక్ష్మీ, హలం, విజయలలితా, సచ్చూ, జయశ్రీ లాంటి డాన్సర్స్ చేసే క్లబ్ డాన్స్ లంటే విపరీతమైన ఇష్టం వుండేది. మెయిన్‍గా డాన్స్ అంటే ఇష్టం అది. ‘సరి లేరు నీకెవ్వరూ’ అయినా, ‘తీస్కో కోకాకోలా’ అన్నా వినోలియాతో కలిసి ఆ డాన్స్‌లు చేస్తుంటే – ఒకనాడు చూసి మా అమ్మమ్మ ఇంటికి తీసుకొచ్చి, వీపు మీద గట్టిగా ప్రైవేటు చెప్పేసింది అనుకోండీ!
మేం చిక్కడపల్లి సందుల్లో తిరుగుతున్నప్పుడే, సుదర్శన్ 70 ఎం.ఎం., తర్వాత సుదర్శన్ 35 ఎం.ఎం., ఆ వెనుక దేవీ, ఎదురుగా ఓడియన్, శ్రీ మయూరి పక్కన గోల్కొండ క్రాస్ రోడ్స్ వెళ్ళే దారిలో ‘సప్తగిరి’ అన్ని వెలిసాయి. నారాయణగుడాలో వెంకటేశా, శ్రీనివాసా నా ఫేవరెట్స్! శోభన్ బాబు సినిమాలన్నీ అక్కడే చూశాను. ముఖ్యంగా డాక్టర్ బాబు, మైనర్ బాబు, పొగరుబోతు, పిచ్చి మారాజు, రాజు వెడలే, కార్తీక దీపం… అన్నీ! శ్రీనివాసలో కూడా పాత మార్నింగ్ షోలు చాలా చూసాం. వెలుగు నీడలు, డాక్టర్ చక్రవర్తి, చదువుకున్న అమ్మాయిలు లాంటివి.
పాత సినిమాలు మార్నింగ్ షోలూ, కొత్తవి రెగ్యులర్ షోస్‍గా వేసేవారు. రోడ్డు దాటి, ఇటు కాచీగుడా వైపు కాకుండా నేరుగా వెళ్తే దీపక్ టాకీస్, అది దాటితే శాంతి టాకీస్. ఇందులో ఎక్వేరియంలో రంగు రంగుల చేపలు చూడ్డానికే వెళ్ళేవాళ్ళం! అక్కడ మేనేజర్ గారు నాకు చాలా జ్ఞాపకం. పెద్ద వెంకటేశ్వర స్వామీ, అలివేలు మంగతాయారూల విగ్రహాలు కూడా వుండేవి. డబ్బులు కూడా వేసి దణ్ణం పెట్టుకునేవాళ్ళం. ఇంక బడీచౌడీ వైపు వెళ్తుంటే, కుడి వైపు తిరిగితే రాం కోటీ, అక్కడ తిరగగానే, మేం చూస్తుండగానే సుబ్బిరామిరెడ్డి గారు మహేశ్వరీ, పరమేశ్వరీ థియేటర్లు కట్టించారు. అందులోనే మొదటగా మూవింగ్ స్టెయిర్స్ అంటే ఎస్కలేటర్ పెట్టారు అని విచిత్రంగా చెప్పుకున్నారు. ఆ పక్కన నవజీవన్ అమృత్ కపాడియా కాలేజ్, మా పెద్దమ్మ కూతురు శాంతి చదివేది. నవలా రచయిత్రి సి. ఆనందారామం గారు తమ తెలుగు మేడం అని చెప్పేది. ‘శాంతి లేకపోతే అసలు రీడింగ్ క్లాస్ వద్దు అనేది ఆవిడ’ అని చెప్పేది గర్వంగా. ఆ తర్వాత ఆవిడ సెంట్రల్ యూనివర్సిటీలో మా ఉమక్కకి కొలీగ్ అయ్యారు. మా ఉమక్క – కంప్యూటర్స్ సైన్స్ పి.జి. చేసి, ఎం.సి.ఎ. వాళ్లకి ప్రొఫెసర్‌గా వుండేది డా. ఉమా గరిమెళ్ళ. ఆ తర్వాత నేను రచయిత్రి నయ్యాకా, ఆనందరామం గారు నాకు క్లోజ్ అయ్యారు. ఇద్దరం ఫోన్స్‌లో మాట్లాడుకునేవాళ్ళం!
ఆ మహేశ్వరీ పరమేశ్వరీ ముందు నుండీ వెళ్ళే రాం కోటీ సందుతో నాకు అనుబంధం ఎక్కువ! మా పెద్దమ్మ కూతురు విజయలక్ష్మి, మేం విజ్జక్కా అనేవాళ్ళం, అది రామమందిరం ఎదురుగుగా వున్న గేట్ లోపలికి వెళ్తే, అక్కడ అద్దెకి వుండేది. మా చిన్నతనంలో ఈ అక్క దగ్గర కూడా వుండేవాళ్ళం. ఆర్.టి.సి.లో వుద్యోగం చేసే సాగర్ బావకి పిల్లలంటే ఇష్టం. ఆ తర్వాత విజ్జక్కకి కూడా అమ్మ ఆర్.టి.సి.లో వుద్యోగం వేయించింది బుకింగ్ క్లర్క్‌గా. మిగతా అక్కలంతా పాటలు పాడేవారు. విజ్జక్కా నాలాగే పాడేది కాదు. అసలు నోట్లో నాలుక లేనట్లు, ఎక్కువ మాట్లాడేది కాదు. చాలా చిన్న వయసులో నలభైలలో మొదట మా బావా, తర్వాత అక్కా ఈ లోకం విడిచి, ముగ్గురు మగపిల్లలని రెక్కలు రాక ముందే విడిచి వెళ్ళిపోయారు.
అలా ఆ రామమందిరం సందులో నుండి వెళ్తే ‘హనుమాన్ వ్యాయామశాల’ వచ్చేది! సెవెన్త్ క్లాస్‍లో అది నాకు పబ్లిక్ ఎగ్జాంకి సెంటర్ పడింది. అమ్మ నన్ను పరీక్షకి దింపి, తను ప్రభాత్ టాకీస్‍లో రోజూ ఏదో ఒక సినిమాకి వెళ్ళేది. మూడు రోజులు సినిమా మారక, ‘మా బాబే’ చూసింది పాపం! ఆ ప్రభాత్ టాకీస్ పక్కన నృపతుంగా జూనియర్ కాలేజ్ వుండేది. ఆ టాకీస్ పక్కన రేకుల షెడ్డులో చాలా రోజులు దుర్భరమైన దరిద్రంలో గడిపి, పాతాళభైరవి సినిమాలో రాజకుమార్తె వేషం వేసిన మాలతి, వానకి నాని, పడిపోయిన ఇంట్లో చిక్కుకుని మరణించిన వార్త విని మేం చాలా బాధపడ్డాం! ఆ చిన్న వయసులో, ‘మనకి ముందే తెలిస్తే ఇలా జరగనిచ్చేవాళ్ళం కాదు… పాతాళభైరవిలో రాజకుమార్తెగా ఎంత బావుండేదో అనుకునేవాళ్ళం! ఆ తర్వాత నైన్త్ క్లాస్‌లో రాం కోటీతో ఇంకా అనుబంధం పెరిగింది, అక్కడ మ్యూజిక్ కాలేజీలో డాన్స్ నేర్చుకోడానికి చేరాకా. 1 కానీ 2 నెంబర్ కానీ బస్ ఎక్కి రాం కోటీ దిగి, మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ కాలేజీకి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం అమ్మా, నేనూ. అమ్మా నేను చేతులు పట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ, స్నేహితుల్లా వుండేవాళ్ళం.
రాయల్ టాకీసులో శంకరాభరణం సినిమాకి మార్నింగ్ షోకి వెళ్ళి, టికెట్స్ దొరకక, అలాగే క్యూలో కంటిన్యూ అయి మేటినీ చూడడం, ఎన్నటికీ మర్చిపోలేని సంఘటన… అదే డాన్స్ నేర్చుకోడానికి ప్రేరణ నిచ్చింది ఆ రోజుల్లో… రాయల్ టాకీస్‌లో, జమురుద్ టాకీసుల్లో ఎక్కువగా హిందీ సినిమాలు వచ్చేవి. అలాగే ఆబిడ్స్ వైపుకి వెళ్తే రెండు సింహాల్లా ‘అన్నగారి’ రామకృష్ణ 35 ఎం.ఎం., 70 ఎం.ఎం., రెండు థియేటర్లు. హాల్లో రెండు వైపులా అన్నగారు భీష్ముడూ, కర్ణుడూ, దుర్యోధనుడూ, భీముడూ, కృష్ణుడూ, అర్జునుడూ వేషాలు వేసినప్పటి తైలవర్ణ చిత్రాలు, ఎంత గొప్పగా వుండేవో చూస్తుంటే! స్టెర్లింగ్‍లో ఎక్కువగా ఇంగ్లీష్ చిత్రాలు ఆడేవి. అలాగే సికింద్రాబాద్ నుండి క్లాక్ టవర్ వైపు వస్తుంటే, మనోహర్, మోండా మార్కెట్ నుంచి జనరల్ బజార్‌కి వెళ్తే వెండీ, బంగారం షాపుల దారిలో రాజేశ్వరీ టాకీస్, క్లాక్ టవర్ దగ్గర ప్రశాంత్ టాకీస్, నటరాజ్ టాకీస్‍లకి వెళ్ళేవాళ్ళం.
ప్రతి సందుతో ఓ అనుబంధం… ప్రతి థియేటర్‍తో కొన్ని మధుర జ్ఞాపకాలు… ప్రతి సినిమాతో కొన్ని ఆలోచనలు… ప్రతి సంఘటన వల్లా కొన్ని అనుభవాలు… ఆ రోజుల్లోనే నాలో రచయిత్రిగా బీజం వేసాయి అనుకుంటా. దానికి తోడు నవలా, పుస్తక పఠనం. సిటీ సెంట్రల్ లైబ్రరీ నిండా అద్భుతమైన పుస్తకాలు. చిన్నప్పుడు అక్కల ఇళ్ళల్లో, పెద్దమ్మల ఇళ్ళల్లో వుండడం వల్ల రకరకాల కల్చర్స్, అలవాట్లు, పద్ధతులు గమనించడం, నేర్చుకోవడం. ఇప్పటి తరం వీటిని మిస్ అవుతున్నారు. ఇంక మళ్ళీ ఉద్యోగ పర్వానికి వస్తే,
స్వస్తిక్ మాన్యుఫాక్చరర్స్‌లో నాకు ఒక అనూహ్యమైన సంఘటన ఎం.డి. గారి చిన్న అబ్బాయి రవి ద్వారా ఎదురైంది!
(సశేషం)