ఒక దిలీప్ కుమార్ – 64 సినిమాలు – 54 – ఇజ్జత్‌దార్

1
3

[box type=’note’ fontsize=’16’] సంచిక పాఠకుల కోసం దిలీప్ కుమార్ నటించిన ‘ఇజ్జత్‌దార్’ సినిమాని పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

కె. బాపయ్య గారి దర్శకత్వంలో వచ్చిన దిలీప్ కుమార్ సినిమా ‘ఇజ్జత్‌దార్’

[dropcap]‘ఇ[/dropcap]జ్జత్‌దార్’ 1990లో వచ్చిన సినిమా. ఇందులో ఎక్కువగా దక్షిణాది నటులు కనిపిస్తారు. అప్పట్లో దక్షిణ భారతదేశపు దర్శకులు ఉత్తరాది నటులలో తమ సినిమాలకు దిలీప్ కుమార్‌నే కోరుకునేవారు. అలాగే తన కెరియర్ మొదటి నుండి ఉత్తరాది దర్శకులతో పాటు దక్షిణాది దర్శకులతో కూడా ఒకేసారి సినిమాలు చేసారు దిలీప్ కుమార్. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది కె. బాపయ్య. బాపయ్య గారు తెలుగులో “ద్రోహి” సినిమాతో సినీ రంగంలో ప్రవేశించి, “సోగ్గాడు” సినిమాతో పేరు సంపాదించుకున్నారు. “సోగ్గాడు” సినిమాను హిందీలో రీమేక్ చేసారు “దిల్దార్” పేరుతో. అది బాలీవుడ్‌లో బాపయ్య దర్శకులుగా చేపట్టిన మొదటి సినిమా. ఎక్కువ సినిమాలు మిథున్ చక్రవర్తి, జితేంద్రలతో హిందీలో తీసిన వీరు దిలీప్ కుమార్‌ని ఈ ఒక్క సినిమాలోనే డైరెక్ట్ చేసారు.

‘ఇజ్జత్‌దార్’ సినీ నటుడు రఘువరన్‌కి బాలీవుడ్‌లో మొదటి సినిమా. మొదటి సినిమాలోనే దిలీప్ కుమార్‌తో చాలా ఈజ్‌తో నటించారీయన. ఈ సినిమాలో దిలీప్ కుమార్ భార్యగా కన్నడ నటి భారతి నటించారు. భారతి కొన్ని మంచి తెలుగు సినిమాలలో కూడా నటించి పేరు తెచ్చుకున్నారు. దిలీప్ కుమార్ కూతురుగా నటించిన స్వప్న కూడా అప్పట్లో దక్షిణాదిన పాపులర్ నటి. ‘ఇజ్జత్‌దార్’ బాలీవుడ్‌లో అప్పట్లో నడుస్తున్న ట్రెండ్‌కి అనుగుణంగా పగ ప్రతీకారం ఇతివృత్తంగా తీసిన సినిమా. బ్రహ్మదత్, ప్రేంచంద్, ముష్తాక్ అలీ ముగ్గురు బాల్య స్నేహితులు. ఒకే ప్రాణంగా కలిసి పెరిగారు. ముష్తాక్ అలీ జైలర్‌గా పని చేస్తుంటాడు. బ్రహ్మదత్, ప్రేంచంద్ ఇద్దరూ వ్యాపారంలో భాగస్వామ్యులు. బ్రహ్మదత్‌కి సోను ఒక్కతే కూతురు. ఆమె ఇంద్రజిత్ అనే యువకుడిని ప్రేమించానని తల్లి తండ్రులకు పరిచయం చేసుంది. కాని ఇంద్రజిత్‌లో ధనవంతుడిని కావాలనే బలమైన కోరిక, విలువలు ఆదర్శాలను లెక్కచేయని తనం చూసి అతను సోనుకు భర్త కాదగినవాడు కాదని అ సంబంధాన్ని తిరస్కరిస్తాడు బ్రహ్మదత్. తండ్రి తిరస్కారంతో కలత చెందిన సోను నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది. ఆమెను అతి కష్టం మీద బ్రతికిస్తారు డాక్టర్లు. కూతురు పట్టుదల చూసి స్నేహితుల ప్రోద్బలంతో, రాజీ పడి ఇంద్రజిత్, సోనుల వివాహం జరిపిస్తాడు బ్రహ్మదత్.

ఇంద్రజిత్‌కు అంతకు ముందే ఒకమ్మాయితో పెళ్ళి అవుతుంది. ఆమెతో విజయ్ అనే ఒక కొడుకు కూడా ఉంటాడు. కాని ఈ పెళ్ళి తరువాత ఆమెతో అన్ని సంబంధాలు తెంచుకుంటాడు ఇంద్రజిత్. తండ్రిని వెతుకుతూ తల్లిని కాదని వెళ్ళిపోతాడు ఆవేశపరుడైన విజయ్. ఆకలి బాధ తాళలేక ఒక హోటల్‌లో భోజనం చేస్తున్న కుబ్బా అనే డాన్‌ని ఒక రొట్టె కావాలను అడుగుతాడు విజయ్. తాగిన మత్తుతో కోపంతో కుబ్బా విజయ్‌ని పిస్టల్‌తో కాలుస్తాడు. ఈ సంఘటన విజయ్‌పై చాలా ప్రభావం చూపుతుంది. ప్రపంచంలో తుపాకిదే రాజ్యం అని నమ్మి రౌడీలతో చేరి విజయ్ ఒక పెద్ద కిరాయి గుండాగా మారతాడు. అతని తల్లికి విజయ్ వెళ్తున్న దారి నచ్చదు. విజయ్‌కి దూరంగా జీవిస్తూ ఉంటుంది ఆమె. విజయ్ ఎంత బ్రతిమాలినా అతని నీతి లేని సంపాదన తనకొద్దని అతన్ని తన వద్దకు రానివ్వదు.

వివాహం తరువాత ఇంద్రజిత్ మామ బ్రహ్మదత్ కంపెనీకి మానేజర్ అవుతాడు. అయితే ఆ కంపెనీని పూర్తిగా స్వంతం చేసుకోవాలని ముందు ప్రేంచంద్, బ్రహ్మదత్‌ల మధ్య స్పర్ధలు సృష్టిస్తాడు. అదే కంపెనీలో పని చేస్తున్న జీతా ఇంద్రజిత్ అక్రమాలలో సహాయం చేస్తూ ఉంటాడు. ప్రేంచంద్ ఇంద్రజిత్ పన్నిన కుట్రలో భాగంగా ఒక కేసులో అరెస్ట్ అవుతాడు. అతనికి బ్రహ్మదత్‌పై అనుమానం వచ్చేలా చేస్తాడు ఇంద్రజిత్. చివరకు ఇద్దరు స్నేహితులు విడిపోతారు. ముష్తాక్ అలీ ప్రోద్బలంతో మళ్ళీ ఆ ఇద్దరి స్నేహితులు కలుసుకుని మాట్లాడేలా చేస్తాడు ఇంద్రజిత్. ఆ గదిలో కలిసి మాట్లాడుకుంటున్న ఆ ఇద్దరికి తెలియకుండా తెర వెనుక ఒక కిరాయి హంతకుడిని దాచి పెట్టి అతని చేత ప్రేంచంద్‌ని హత్య చేయిస్తాడు. ఆ హత్య చేసింది బ్రహ్మదత్ అని అందరితో నమ్మిస్తాడు. బ్రహ్మదత్‌కు పన్నేండేళ్ళ శిక్ష పడుతుంది. జైలులో అతను రాసిన పుస్తకాన్ని భార్య సుజాత పబ్లిష్ చేయిస్తుంది. దానికి మంచి పేరు వచ్చి బ్రహ్మదత్‌కు అవార్డు వస్తుంది.

ప్రేంచంద్ కూతురు మోహిని తండ్రి చనిపోయినప్పుడు చిన్న పిల్ల. సోను ఆమెను తన దగ్గర ఉంచుకుని పెంచుతుంది. బ్రహ్మదత్ ఆస్తులన్నిటిపై ఆధిపత్యం సాధిస్తాడు ఇంద్రజిత్. అతని మోసాన్ని తెలుసుకుని సుజాత అతనికి దూరంగా వెళ్ళిపోతుంది. సోనుకి కూడా భర్త సంగతి అర్థం అవుతుంది కాని ఏమీ చేయలేని పరిస్థితి. పన్నెండేళ్ళు ముగిసే లోపల ప్రేంచంద్ కూతురు మోహినిని లోబర్చుకుని ఆమెను వివాహం చేసుకుని ఆమె పేరు మీదున్న ఆస్తులను కూడా తన పరం చేసుకోవాలని అనుకుంటాడు ఇంద్రజిత్. మోహిని విజయ్‌ని ప్రేమిస్తుంది. పెళ్ళికి మోహిని అంగీకరించదని తెలుసుకుని ఇంద్రజిత్ ఆమెపై అత్యాచార యత్నం చేస్తాడు. అడ్డగించిన సోనుని హత్య చేస్తాడు. జైలు నుండి విడుదలయిన బ్రహ్మదత్ తన కూతురు చావుకు, తన వినాశనానికి కారణమయిన ఇంద్రజిత్‌పై పగ తీర్చుకోవాలనుకుంటాడు. దారి తప్పిన విజయ్ తల్లి ప్రేమతో, మోహినీ స్నేహంతో, బ్రహ్మదత్ కలయికతో తన పంథా మార్చుకుంటాడు. తన తండ్రి అయిన ఇంద్రజిత్ ఇంత మంది జీవితాలను నాశనం చేయడం చూసిన తరువాత బ్రహ్మదత్‌తో కలిసి తన తండ్రి ఆట కట్టించడానికి పూనుకుంటాడు. చివరకు బ్రహ్మదత్ ఎదురుగా ఇంద్రజిత్ మరణించడం సినిమా ముగింపు.

సినిమాలో చాలా సీన్లు అనవసరం అనిపిస్తాయి. ఒక్క బ్రహ్మదత్ పాత్ర తప్ప మిగతా పాత్రలన్నీ సినిమా మూల కథకు అనవసరం అనిపిస్తాయ్. విజయ్ పాత్రను మలచిన తీరు నాటకీయంగా ఉంటుంది. విజయ్‌గా గోవిందా, మోహినీగా మాధురీ దీక్షీత్ నటించిన ఆ పాత్రలను పక్కా కమర్షియల్ పద్ధతిలో మలచారు. ఈ రెండు పాత్రలు కూడా ప్రేక్షకులకు చికాకునే కలిగిస్తాయి. దిలీప్ కుమార్ తన స్థాయిలో నటించినా చివర్లో అందరూ నడిచిన నాటకీయత వైపే అతని పాత్ర కూడా నెట్టివేయబడింది. కాని ప్రథమ భాగంలో స్నేహితుడైన ప్రేంచంద్‌తో తాను నిర్దోషినని ఆయన చెప్పుకునే సీన్‌లో వారి నటన గుర్తుండి పోతుంది. ఈ సినిమాకు కూడా దిలీప్ కుమార్ కోసం శ్రద్ధ తీసుకుని రాసిన కొన్ని సంభాషణలలో, ఆయన శైలిలో ఉర్దూ పదాలతో పలికిన సంభాషణలు ఉన్నాయి. ఈ సినిమాకు షఫీక్ అంసారి కథ మాటలు రాసారు. సుమారు నలభై సినిమాలకు, ముప్పై టీ.వీ. సీరియల్స్‌కు పైగా మాటలు రాసిన రచయిత ఆయన. ఈ సినిమాలో వీరి సంభాషణలు మాత్రమే కథకు కాస్త గాంభీర్యాన్ని తీసుకు వస్తాయి. దిలీప్ కుమార్ కథను సజావుగా నడిపించడానికి తన వంతు కృషి చేసారు. అతని భార్యగా భారతి నటన కూడా బావుంటుంది. గుడిలో జైలు నుండి విడుదలయి దిలీప్ కుమార్ వచ్చినప్పుడు వారిద్దరూ కలుసుకున్నప్పటి సీన్‌లో వీరిద్దరి నటన బావుంటుంది. కాని చివర్లో భారతి చనిపోయే సీన్ అనవసరంగా కల్పించారనిపించింది. సినిమా ద్వితీయ భాగం ఇలాంటి గందరగోళంతోనే ముగుస్తుంది. సినిమాలో వచ్చే పాటలు కూడా సినిమా స్థాయి పెంచడానికి ఏ మాత్రం దోహదపడవు. దిలీప్ కుమార్ నటించిన సినిమాలలో అంతగా గుర్తుంచుకోనవసరం లేని సినిమాగానే ఇజ్జత్‌దార్‌ని ఎంచవచ్చు.

‘ఇజ్జత్‌దార్‌’ సినిమా తొంభైలలో మారుతున్న సినిమా ట్రెండ్‌కు ఒక ఉదాహరణ. గ్లామర్ అతి ముఖ్యం అయి కథ కన్నా హీరోయిన్ల ఒంపు సొంపులు, అర్థం పర్థం లేని పాటలు డాన్సులు రాజ్యం ఏలుతున్న సమయం అది. ఎనభైవ దశకంలో మొదలయిన ఈ ధోరణి తొంభైలలో ఊపందుకుంది. హీరోయిన్ పాత్రకు విలువ కమర్షియల్ సినిమాలో తగ్గిపోతున్న రోజులలో వచ్చిన ఈ సినిమాలో మాధురి పాత్రను, ఆ పాత్ర చేసే నృత్యాలను చూస్తే జాలి వేస్తుంది. ముఖ్యంగా దిలీప్ కుమార్ నటించిన అలనాటి చిత్రాలలోని స్త్రీ పాత్రలను చూస్తూ ఇక్కడి దాకా వచ్చాక, అసలు పాత రోజుల్లో స్త్రీ పరిస్థితి కన్నా ఇప్పటి స్త్రీ పరిస్థితి మరీ దిగజారినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా స్త్రీని పూర్తిగా మార్కెట్‌లో వస్తువు చేసేసింది కమర్షియల్ సినిమా. వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా ఆమెను చూపించడమే కమర్షియల్ సినిమాకు సరిపోదు అనే ట్రెండ్ వేళ్ళూనుతున్న రోజుల్లో వచ్చిన ఇజ్జత్‌దార్‌ సినిమా దిగజారిన సినిమా విలువలకు నిదర్శనం. ఇందులో మాధురి పాత్రను పూర్తిగా మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా తీర్చిదిద్దారు. మిగతా స్త్రీ పాత్రలలో కథ పరంగా తీసుకురాలేని ఆ ఆకర్షణను మాధురి పాత్ర ద్వారా పూర్తి చేసే ప్రయత్నం చేసి విఫలమయ్యారు దర్శకులు. విజయ్‌ను మార్చాలని ప్రయత్నించే క్రమంలో రొట్టెతో దిలీప్ కుమార్ ఎంట్రీ చాలా హాస్యాస్పదంగా కనిపిస్తుంది. ఆ సీన్ వారు చేయకపోతే బావుండేది అనిపించక మానదు. సినిమా ముగింపు కూడా దిలీప్ కుమార్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో వచ్చిన మిగతా సినిమాలలో లాగా కన్విన్సింగ్‌గా లేకపోవడం కూడా సినిమా పట్ల ఉదాసీనతనే కలిగిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here