రెండు ఆకాశాల మధ్య-31

0
4

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]మా[/dropcap]న్‌సింగ్ సాలోచనగా తలపంకిస్తూ “గ్రామస్థులు అమాయకులు. వాళ్ళకు మోసగించబడటం తప్ప మోసం చేయడం తెలియదు. ఇతను నిజమే చెప్తున్నాడని నా నమ్మకం” అని సైనికుడితో అని, లిప్తపాటు ఆలోచిస్తూ రాళ్ళగుట్ట వైపు చూశాడు. అతని మెదడులో తళుక్కున ఓ ఆలోచన మెదిలింది. సిపాయి వైపు తిరిగి “రాళ్ళ గుట్టలోని రాళ్ళన్నిటినీ తొలగించు” అన్నాడు.

సిపాయికి తన మేజర్ ఉద్దేశమేమిటో అర్థంకాక శూన్యదృక్కులతో చూశాడు.

“మొదట చెప్పింది చేయి. క్విక్” అసహనంగా అన్నాడు మాన్‌సింగ్.

సిపాయి రాళ్ళని ఒక్కటొక్కటిగా తొలగించసాగాడు. మెల్లమెల్లగా గుహ ముఖద్వారం కన్పించసాగింది. రాళ్ళన్నీ తొలగించాక ఇద్దరు మనుషులు పట్టేంత సన్నటి మార్గం కన్పించింది.

తన అనుమానం నిజమైనందుకు మెల్లగా నవ్వుతూ “అందుకే మన సైనికులు ఇక్కడో గుహ ఉందన్న విషయం గుర్తించలేకపోయారు. గ్రామస్థుల తెలివిని మెచ్చుకోవాల్సిందే” అన్నాడు మాన్‌సింగ్.

మొదట గ్రామస్థుడ్ని లోపలికి వెళ్ళమని చెప్పాడు. అతను లోపలికెళ్ళి తన గురించి హాజీ మస్తాన్ ఖాన్ చెప్పిన విషయాలన్నీ గ్రామస్థులకు చెప్పాక తనూ తన సైనికుడు వెళ్ళడం మంచిదన్నది అతని వ్యూహం. అందువల్ల గ్రామస్థుల్లో తన మీద నమ్మకం ఏర్పడి, ఆందోళనకు గురికాకుండా ఉంటారని అతని ఆలోచన…

ఐదు నిమిషాల విరామం తర్వాత మాన్‌సింగ్ గుహలోపలికి దారితీశాడు. అతని వెనకే సిపాయి కూడా నడిచాడు.

లోపల లాంతర్ల వెలుగులో గ్రామస్థులందరూ కూర్చుని కన్పించారు. మాన్‌సింగ్‌ని చూడగానే వాళ్ళంతా లేచి నిలబడ్డారు. “సలామలేకుం. సత్ శ్రీ అకాల్.. నేను మేజర్ మాన్‌సింగ్‌ని. భారతీయ సైన్యం మీ గ్రామాన్ని స్వాధీనం చేసుకుంది. మీ గ్రామంతో పాటు త్యాక్షీ గ్రామాన్ని, మరికొన్ని బార్డర్లో ఉండే గ్రామాల్ని మేము యుద్ధంలో గెల్చుకున్నాం. ఈ రోజు నుంచి మీ హుందర్మో గ్రామం భారతదేశంలో ఓ భాగం. మీరంతా భారతీయులు” అని కొన్ని క్షణాలాగి “నాకో విషయం అర్థం కావడం లేదు. మీరెందుకు పారిపోయి వచ్చి ఈ గుహలో దాక్కున్నారు? మేము సైనికులం.. రాక్షసులం కాదు.. మేమూ మీలాంటి మనుషులమే. మాలోనూ దయా, జాలి, కరుణ లాంటి భావోద్వేగాలుంటాయి. యుద్ధంలో శత్రు సైనికులతో పోరాడతాం. అంతేగాని మీలాంటి అమాయక గ్రామీణ ప్రజలకు హాని కలుగచేస్తామని ఎందుకనుకున్నారు?” అని అడిగాడు.

ఎవ్వరూ సమాధానం చెప్పడానికి నోరు విప్పలేదు. జావేద్ ముందుకొచ్చి చేతులు కట్టుకుని “జీ హుజూర్. ఆరేళ్ళ క్రితం జరిగిన యుద్ధంలో బార్డర్లో ఉన్న హిందూస్తాన్‌కి చెందిన జోరాఫాం అనే గ్రామాన్ని పాకిస్తాన్ సైనికులు నామరూపాల్లేకుండా కాల్చి బూడిద చేసినట్టు పాకిస్తాన్ రేడియోలో విన్నాం. ఇప్పుడు హిందుస్తాన్ సైనికులు మా గ్రామం మీదికి దండెత్తి వస్తున్నారన్న కబురు వినగానే ఆ కసి మనసులో పెట్టుకుని మా గ్రామాన్ని కూడా అలా ధ్వంసం చేస్తారనీ, కన్పించిన వాళ్ళందర్ని కాల్చి చంపేస్తారని భయపడ్డాం హుజూర్” అన్నాడు.

మాన్‌సింగ్ మృదువుగా నవ్వాడు. “భారతదేశంలో గాంధీ మహాత్ముడు పుట్టాడు. గౌతమ బుద్ధుడూ పుట్టాడు. ప్రపంచ ప్రజలకు అహింసనూ, ప్రేమనూ, కరుణనూ పరిచయం చేసిన మహోన్నత దేశం మనది. మన దేశం కక్షలకు కాదు క్షమకు ప్రతిరూపం. ఈ యుద్ధం కూడా మేము మొదలెట్టింది కాదు. పాకిస్తాన్ సైనికులే మొదట బాంబులదాడి జరిపి రెచ్చగొట్టారు. బంగ్లాదేశ్‌ని విముక్తి చేయడంలో సహకారం అందించాలని మన ప్రధానమంత్రి ఇందిరా గాంధీగారు సంకల్పించడంతో మేం పాకిస్తాన్‌తో యుద్ధానికి దిగాం. భారతదేశం శాంతికాముక దేశం” అన్నాడు.

కొద్ది విరామం తర్వాత “మీరందరూ తిరిగి గ్రామానికి వచ్చేయండి. మీకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారలందించడానికి మా సైనికులు తయారుగా ఉన్నారు” అన్నాడు మాన్‌సింగ్.

జావేద్ మెదడులో ఓ ప్రశ్న చెదపురుగులా తొలుస్తోంది. అడగాలా వద్దా అనే సంశయం.. అడిగితే అంత పెద్ద అధికారికి కోపం వస్తుందేమోనన్న భయం. కానీ మామూలుగా సైనికాధికార్ల మొహాల్లో కన్పించే కాఠిన్యం కానీ, కరకుదనం గానీ మాన్‌సింగ్‌లో కన్పించకపోవడంతో ధైర్యం చేసి అడగడమే మంచిదనుకున్నాడు. “హుజూర్.. మాఫ్ కరనా.. నాదో చిన్న అనుమానం. మీరు అనుమతిస్తే అడుగుతాను” అన్నాడు.

“పర్లేదు. ఎవరికే అనుమానాలున్నా నిర్భయంగా అడగొచ్చు. అడగండి” అన్నాడు మాన్‌సింగ్.

“నా కొడుకు స్కర్దూలో పూలవ్యాపారం చేస్తాడు. రాత్రి తొమ్మిది దాటాకే యింటికి తిరిగొస్తాడు. వాడొచ్చేటప్పుడు మీ సైనికులెవరూ అడ్డుకోరుగా” జావేద్ గొంతులో దుఃఖపు జీర..

మాన్‌సింగ్ అతని వైపు జాలిగా చూశాడు. తను చెప్పబోయే సమాధానం గుండెల్లోంచి దూసుకెళ్ళిన ఫిరంగి గుండులా అతన్ని ఛిద్రం చేస్తుందని తెలుసు. కానీ చెప్పక తప్పదు. కొన్ని నిజాలు చేదుగా ఉన్నా వాళ్ళకు తెలియచేయాల్సిన బాధ్యత తన మీద ఉంది. అతను గొంతు సవరించుకుని చాలా మృదువుగా అన్నాడు. “స్కర్దూ పాకిస్తాన్‌లో కదా ఉంది. మనం భారతదేశంలో ఉన్నాం.”

“అంటే ఏంటి హుజూర్ మీ ఉద్దేశం? నా కొడుకు రావడానికి వీల్లేదా?”

“పాకిస్తాన్ నుంచి మనదేశానికి రావడానికి అవసరమైన అన్ని అనుమతులు తీసుకుని రావొచ్చు.”

“అదేమిటి హుజూర్.. వాడు నా కొడుకు.. ఈ వూళ్లో పుట్టి పెరిగిన వాడు. ఉదయమేగా వెళ్ళాడు. వాడు తిరిగి వాడి వూరికి రావడానికి అనుమతులెందుకు? ఇదేం అన్యాయం? మీరేగా అధికారి.. వాడు వస్తుంటే అడ్డుకోవద్దని మీ సైనికులకు చెప్పొచ్చుగా” ఉబికుబికి వస్తున్న ఏడుపుని బలవంతంగా ఆపుకుంటూ అన్నాడు.

“ఆ అధికారం నాకు లేదు. సరిహద్దు రేఖ దాటి రావాలంటే రెండు ప్రభుత్వాల అనుమతులు తప్పని సరి. ఈ విషయంలో నేనేమీ చేయలేను.”

జావేద్ పెద్దగా ఏడ్వసాగాడు.

ఒక్క పూటలోనే తనూ తన భర్త వేర్వేరు దేశస్థులైపోయిన విషయం అనీస్‌కి మింగుడు పడటం లేదు. ఇలా ఎలా జరిగింది? ఇలా కూడా జరుగుతుందా? ఎవరో మాంత్రికుడు తన మంత్ర దండం తిప్పి భార్యాభర్తల్ని వేర్వేరు ద్వీపాల్లోకి విసిరేసినట్టు.. ఒక్కసారిగా తనకూ తన భర్తకు మధ్య ఎత్తయిన రాతి గోడలేవో మొలిచినట్టు.. గుండెల్లో ఎవరో ఖంజర్ దింపినట్టు ఆమె కుప్పకూలిపోయి, “యా అల్లా.. నేనేం పాపం చేశానని నాకీ శిక్ష? నా షొహర్ నాక్కావాలి.. నా షొహర్ని తెచ్చివ్వండి.. నా షొహర్ని తెచ్చివ్వండి” అంటూ హిస్టీరిక్‌గా ఏడ్వసాగింది.

తమ వూరినుంచి పక్క వూళ్ళకు పనిమీద వెళ్ళిన వ్యక్తుల కుటుంబ సభ్యుల గుండెల్లో శతఘ్నులు పేలుతున్న విధ్వంసకర దృశ్యం.. అంటే తన భర్త తిరిగిరావడానికి వీల్లేదా అని కొందరు.. బంధువుల్ని చూడటానికి వెళ్ళిన తన భార్య పరిస్థితి ఏమిటని కొందరు.. పెళ్ళికో, పేరంటానికో వెళ్ళిన అమ్మానాన్న పరాయిదేశస్థులుగా మారిపోయినందుకు కొందరు.. చుట్టుపక్కల వూళ్ళలో ఉన్న కొడుకులూ కోడళ్ళు అన్నలూ అక్కలు, మామయ్యలూ బాబాయిలు, అత్తలూ పిన్నులూ.. ఎవరెవరో గుర్తొచ్చి అక్కడ గుమికూడి ఉన్న అందరూ విషణ్ణ వదనాలతో నిలబడ్డారు. ఆడవాళ్ళయితే కన్నీళ్ళ పర్యంతమౌతున్నారు. వాళ్ళలో హసీనా, ఆస్‌మా కూడా ఉన్నారు.

హసీనాలో దుఃఖం లావాలా పొంగుతోంది. తన భర్త షరీఫ్ తిరిగిరాలేడా? తను తన భర్తను మళ్ళా ఎప్పుడు చూడగలుగుతుంది? ఇదేం వైపరీత్యం? పక్క వూరికెళ్ళిన వ్యక్తి ఇలా ఒక్కసారిగా పరాయి దేశస్థుడెలా అయిపోతాడు? ఇప్పటివరకూ పాకిస్తానీయులుగా ఉన్న ఈ గ్రామస్థులందరూ కనురెప్పపాటు కాలంలో భారతీయులెలా అయిపోయారు? ఇదంతా నిర్ణయించేదెవరు? తమ జీవితాలతో ఇంత భయంకరమైన ఆట ఆడుతున్నదెవరు? ఎవరిచ్చారు వాళ్ళకా అధికారం? ఆమెకు ఏడుపుతో పాటు విపరీతమైన కోపం కూడా వస్తోంది.

ఆమె విసురుగా వచ్చి మేజర్ మాన్‌సింగ్ ఎదురుగా నిలబడింది. ఏడ్వటం వల్ల ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. “నా భర్త ఉదయమే పక్కూరు కెళ్ళాడు. బ్రోల్మో.. మా ఆడపడుచుతో పాటు చాలా మంది బంధువులున్న వూరు. ఇప్పుడు నా భర్త తిరిగిరావడానికి వీల్లేదా?” కోపంగా అడిగింది.

“బ్రోల్మో పాకిస్తాన్‌లో ఉంది. హుందర్మో ఇప్పుడు భారతదేశంలో ఉంది” అన్నాడు మాన్‌సింగ్.

“ఇక్కడినుంచి బోల్మో రెండు మైళ్ళ దూరం కూడా లేదు హుజూర్. మెల్లగా నడిచినా అరగంట కూడా పట్టనంత దగ్గర. ఈ రోజేగా మా వూరు మీ దేశంలో కలిసిందంటున్నారు. మా రెండూళ్ళ మధ్య గోడలేమీ కట్టలేదుగా. నా భర్త తిరిగి రావడానికి అడ్డేమిటి?” ఆమె అడిగిన ప్రశ్నే అక్కడున్న చాలా మంది మనసుల్లో ముల్లులా గుచ్చుకుంటో ఉంది. అందరి తరఫున ఆమె వకాల్తా పుచ్చుకుని అడగడంతో అందరూ అతని జవాబు కోసం ఒళ్ళంతా చెవులు చేసుకుని ఎదురుచూశారు.

“పాకిస్తాన్ దేశానికి చెందిన వూరు మైలు దూరంలో ఉన్నా వందడుగుల దూరంలో ఉన్నా అట్నుంచిటూ ఇట్నుంచటూ మనుషులు తిరగడం నిషిద్ధం. సరిహద్దు రేఖని సూచిస్తూ గోడ కట్టలేదు నిజమే. తొందర్లోనే ముళ్ళ కంచె వేయడం జరుగుతుంది. కానీ హుందర్మో మా దేశభూభాగమైన క్షణం నుంచి అక్కడ మా సైనికులు గస్తీ తిరగడం మొదలైంది. కొండ పైనున్న శిబిరంలోని సైనికులు డేగ కళ్ళతో సరిహద్దు రేఖని గమనిస్తూ ఉంటారు. ఎవరైనా పొరపాటున రేఖ దాటుతున్నట్టు అనుమానమొచ్చినా చాలు కాల్చిపడేస్తారు. మీకు నేనిచ్చే సలహా ఒక్కటే. ఎట్టి పరిస్థితుల్లో కూడా బార్డర్ దాటి బ్రోల్మో కాని స్కర్దూ కాని వెళ్ళడానికి ప్రయత్నించకండి. అది మీ ప్రాణాలకే ప్రమాదం” హెచ్చరిస్తున్నట్టు అన్నాడు మాన్‌సింగ్.

“నిన్నటివరకూ మేము పాకిస్తానీయులం. ఇప్పుడు అకస్మాత్తుగా మా వూరిమీద దాడి చేసి మీరందరూ భారతీయులు అనగానే మేమెందుకు ఒప్పుకోవాలి హుజూర్? మీకు మా ఇష్టాఇష్టాలతో పనిలేదా? మా జాతీయతని మార్చే అధికారం మీకెవరిచ్చారు? నాకు నా భర్త కావాలి. భర్తని దూరం చేసుకుని నేను హిందూస్తాన్‌లో ఉండాలనుకోవడం లేదు. నన్నయినా బ్రోల్మో వెళ్ళనీయండి. లేదా నా షొహర్‌ని ఈ వూరికి రానివ్వండి” అంది హసీనా.

ఆమె గొంతులో ధ్వనించిన తెగింపుకి మాన్‌సింగ్ కంగారుపడ్డాడు. అక్కడున్న అందరి అభిప్రాయం కూడా అదే అన్పించింది. రక్త సంబంధీకులు దూరమైపోతారన్న బాధలో అందరూ ఎదురుతిరుగుతారేమోనన్న ఆశంక మొదలైంది.

సైనికుడు ముందుకొచ్చి ఆమెను జబ్బ పట్టి వెనక్కి ఈడ్చుకెళ్ళే ప్రయత్నం చేయబోతుంటే మాన్‌సింగ్ వారించాడు. వాళ్ళమీద బలప్రయోగం చేసి లొంగదీసుకునే ఉద్దేశం లేదతనికి. అనునయించి, బుజ్జగించి, వాళ్ళ జీవితాల్లో అనూహ్యంగా, అకస్మాత్తుగా జరిగిన ఈ మార్పుని అర్థం చేసుకుని, అంగీకరించేలా చేయాలని నిర్ణయించుకున్నాడు.

హిందూస్తాన్ మిలట్రీకి చెందిన మేజర్‌తో హసీనా అంత దురుసుగా మాట్లాడినా, మేము హిందుస్తాన్‌లో ఉండాలనుకోవడం లేదని చెప్పినా మాన్‌సింగ్‌కి కోపం రానందుకు జావేద్ ఆశ్చర్యపోయాడు. మరొకరైతే తల నరికేసి ఉండేవారేమో అనుకున్నాడు. యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయి తమ గ్రామంతో పాటు మరి కొన్ని గ్రామాల్ని హిందూస్తాన్ గెల్చుకున్న తరుణంలో సైనికులతో అలా ఎదురుతిరిగి మాట్లాడటం తప్పనిపించింది. ఐనా వాళ్ళనుభవిస్తున్న గుండె కోత ముందు ఇవన్నీ గుర్తొస్తాయా ఎవరికైనా? హసీనా ప్రాణాలకు తెగించే ప్రశ్నించి ఉంటుందనుకున్నాడు. తప్పయినా సరే ఈ సమయంలో ఆమెను సమర్థించడం అవసర మనిపించింది.

“హుజూర్.. హసీనా బేటీ మాటల్లో మీకు ఆవేశమే కన్పిస్తుందేమో.. మా అందరికీ ఆమె ఆవేదన విన్పిస్తోంది. బాధతో చేస్తున్న ఆక్రోశం సర్కార్ అది. నా గుండె కూడా కొడుక్కోసం రోదిస్తోంది. ఇదిగో ఇక్కడ కుప్పకూలిపోయి ఏడుస్తుందే నా కోడలు.. పెళ్ళయి కొన్ని నెలలు కూడా కాలేదు హుజూర్. భర్త తిరిగి రావడం కుదర్దని మీరు చెప్తుంటే తనకెంత వేదనగా ఉంటుందో వూహించగలరా? మేమున్నది పాకిస్తాన్‌లోనా లేక హిందూస్తాన్‌లోనా అనే విషయంలో మాకేమీ అభ్యంతరాలు లేవు. నిన్నటివరకూ పాకిస్తాన్ జిందాబాద్ అన్న వాళ్ళం ఇప్పుడు హిందూస్తాన్ జిందాబాద్ అనమంటే మనస్ఫూర్తిగా అంటాం. మాకు ఏ దేశమై నా ఒక్కటే. మాక్కావల్సింది ప్రశాంతత. మాకు మా బంధువులూ ఆత్మీయులూ అందరూ కావాలి. మమ్మల్ని మా వాళ్ళతో కలపండి. చాలు” అన్నాడు జావేద్.

మాన్‌సింగ్‌కి వాళ్ళ బాధ అర్థమౌతోంది. కానీ ఆ విషయంలో తన అశక్తతే వాళ్ళకు అర్థం కావడం లేదు. తాను తల్చుకుంటే ఏమైనా చేయగలననుకుంటున్నారు గ్రామస్థులంతా. తాను విశాలమైన భారతదేశంలోని బలీయమైన సైనిక శక్తిలో ఓ చిన్న మేజర్‌ని మాత్రమేనని వాళ్ళకెలా నచ్చచెప్పాలో అతనికి అర్థం కావడం లేదు. “సారీ..మాఫ్ కరనా.. ఈ విషయంలో నేనేమీ చేయలేను. ఇరుదేశాలు నిర్దేశించిన ప్రామాణిక పత్రాలు, అనుమతులు, వీసాలు తీసుకుని మాత్రమే వాళ్ళు ఈ వూరికి రాగలరు.”

జావెదకు పాస్‌పోర్టులు, వీసాల గురించి అవగాహన ఉంది. ఆ వూళ్లోని కొంతమంది పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి పాస్‌పోర్ట్ తీసుకుని, వీసా సాయంతో హజ్ యాత్ర చేసి వచ్చిన వాళ్ళున్నారు. ఇప్పుడు స్కర్దూలో ఉన్న తన కొడుకు ఇరుదేశాల అనుమతి పత్రాల్ని తీసుకుంటే కొన్ని గంటల్లో ఈ వూరికి చేరుకోవచ్చు. కొంత ఖర్చవుతుంది. కొన్ని రోజుల సమయం పడుతుంది. అప్పటివరకు ఓపికపడ్తే చాలు. తన కొడుకు తన దగ్గరకు వచ్చేస్తాడు. ఈ విషయం నిర్ధారించుకుందామని “పాస్‌పోర్ట్ వీసా తీసుకుంటే చాలా హుజూర్? స్కర్దూ నుంచి కొన్ని గంటల్లో నా కొడుకు వచ్చేస్తాడా?” అని అడిగాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here