జ్ఞాపకాల తరంగిణి-12

0
3

[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డా॥ కాళిదాసు పురుషోత్తం. [/box]

ఆర్.యస్.యస్

[dropcap]1[/dropcap]950-56 ప్రాంతాల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శాఖ సమావేశాలు మా కస్తూరిదేవి నగర్లో, మాకు దక్షిణం వీధిలో ఖాళీ స్థలంలో జరిగేవి. వై.సి. రంగారెడ్డి, వేణుగోపాలరెడ్డి, పరంధామరెడ్డి శాఖను నిర్వహించేవారు. ఇళ్లకు వచ్చి నావంటి చిన్నపిల్లల్నలందరినీ శాఖకు వెంటపెట్టుకొని వెళ్లి, శిశు వరసలో నిలబెట్టేవారు. అక్కడే దేశభక్తుల కథలు విన్నాము. కరమున ఖడ్గము, ఉరమున కవచము ధరించి దాస్యము బాపుమురా ధర్మస్థాపన చేయుమురా వంటి పాటలు నేర్పించారు. ఆ రోజుల్లో ఒక మహారాష్ట్ర వ్యక్తి దేశపాండే శాఖకు వచ్చి తరచూ ఉపన్యాసాలు ఇచ్చేవారు. సోమయ్యగారు బాగా తెలుసు. 1951 ప్రాంతంలో గురూజీ గోల్వాల్కర్ నెల్లూరు వచ్చారు. ఆర్.ఎస్.ఆర్ హైస్కూల్ మైదానంలో సభ. మమ్మల్నందరిని సభకు తీసుకొని వెళ్లారు. కొందరు పిల్లలు లైన్‌లో కూర్చొనే నిద్రపోయారు. వారి భాషణం చిన్నపిల్లలకు మాకేమి బోధపడుతుంది? కాషాయ వస్త్రాలతోనో, శ్వేతవస్త్రాలలోనో గెడ్డం పెంచిన ఆయన రూపం కొంచం గుర్తుంది. నెల్లూరు శాఖలో పాల్గొన్న పరంథామరెడ్డి భక్త జయదేవ్ సినిమా తీశారు.

నేను కాలేజీకి వచ్చేసరికి ఎస్.ఎఫ్.ఐ వైపు ఆకర్షితుణ్ణయ్యాను. నా భావాలేవైనా ఆ తొలితరం ఆర్.యస్.యస్. వారు జీవితాంతం స్నేహపూర్వకంగా మెలిగారు. వై.సి రంగారెడ్డి గారు ఎప్పుడు కనపడినా ప్రేమగా పలకరించేవారు. తర్వాత తరాలవాళ్ళు మాట్లాడేవారు కాదు. మా వీధిలో కాళహస్తి రామనాధం గారు, నెల్లూరు వర్తక ప్రముఖులు పైడా సుబ్బరామయ్య గారు హిందూమహాసభ సభ్యులని విన్నా.

మా మేనత్త కుమారులు సుబ్బరామయ్య ఇంటర్, బి.ఎ నెల్లూరులో చదివారు (1946-50). వారు అప్పటికే కమ్యూనిస్ట్ భావజాలం ప్రభావంలోకి వచ్చారు కాబోలు, మహాప్రస్థాన గీతాలు చక్కగా పాడేవారు. వారు పాడుతూంటేనే బాల్యంలో శ్రీశ్రీ కవితలు విన్నాను. ఆయన అన్నిటినీ ప్రశ్నించేవారు, మూఢనమ్మకాలను గర్హించేవారు. ఆ రోజుల్లో ఆయన మాదిరి రేడికల్‌గా ఉండేవారు అరుదు. ఆయన తరచూ ఫోటోలు తీసేవారు. ఆ ప్రభావాలన్ని నామీద, మా అక్కలమీద కూడా పరోక్షంగా ఉన్నాయి. మా పెద్దక్క పుస్తకాల పురుగు, దొరికిన తెలుగు, హిందీ, సంస్కృతం పుస్తకమల్లా చదివేసేది. చిన్నక్క తన పెద్ద కుమారుడి వివాహం ప్రమాణాల పెళ్ళి చేయించింది(1977), arranged marriage అయినా.

నెల్లూరు ట్రంకురోడ్డులో ఇప్పుడు గాంధీజీ విగ్రహం ఉన్న ప్రదేశాన్ని పూర్వం లాఠీచౌక్ అనేది. అక్కడే తిప్పరాజు వారి సత్రంవద్ద ‘నగరజ్యోతి’ కుడ్యపత్రికను ప్రజలు గుంపుగా నిలబడే చదివేవారు. 1952లో ఒకరోజు ఉదయమే ఏదో పనిమీద అటువైపు వెళ్లి ఆ గోడపత్రిక వద్ద నిలబడ్డాను. ఒక పెద్దాయన గోడ అంతా కడిగి, గుడ్డతో శుభ్రంచేసి పత్రికలో లాగ కాలమ్స్ గా చాక్ పీస్ తో గోడను విభజించి, నగరజ్యోతి అని పెద్ద అక్షరాలు శీర్షిక పెట్టి, నా వంక చూసి దినం తిథి, వారం చెప్పమన్నారు. కొత్తగా వడుగు అయినవాణ్ణి కనక ధాటీగా చెప్పాను. ఆయన నన్ను మెచ్చుకొంటూ శీర్షిక కింద ఆనాటి తిథి వారం, తారీకు వేసి వార్తలు రాయడానికి ఉపక్రమించగానే జనం అక్కడ చేరారు. పెద్దవాణ్ణయ్యాక తెలిసింది, ఆయనే ఆ గోడపత్రిక సంపాదకులు ఇంద్రగంటి సుబ్రమణ్యం గారని. ఆరోజుల్లో నెల్లూరుకు రాత్రి ఏ ఒంటిగంటకో మెయిలు బండి వచ్చేది. మదరాసు నుంచి పత్రికలు రావాలి. సుబ్రమణ్యంగారు స్టేషనుకు వెళ్లి పేపర్లు కొని అక్కడే చదువుతూ ముఖ్యమైన వార్తలు పెన్‌తో గుర్తుపెట్టుకుని, ఉదయమే గోడపత్రికలో వార్తలు రాసేది. చాక్ పీస్‌ల కోసం కూడా డబ్బులకు ఇబ్బంది పడేవారట. ఎప్పడూ ఖద్దరు బట్టలు ధరించి, నోటినిండా తాంబూలంతో కనిపించేవారు. వీరి కుమారుడు కర్నూల్‌లో mbbs చదువుతూ ప్రమాదవశాత్తు, కాలువలో పడి చనిపోయాడు. ఈ పత్రిక ఖ్యాతి దేశమంతా తెలిసి టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా దీనిమీద వ్యాసం రాసింది. తూములూరు పద్మనాభయ్య సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి జాతీయోద్యమంలో చేరారు. పద్మనాభయ్యే నగరజ్యోతి స్థాపకులు(1932). గండవరం హనుమరెడ్డి గారనే దేశభక్తులు కూడా ఈ గోడ పత్రికలో రాసేవారు. వారిని కూడా నేను చూసాను. ‘గంహ’ అనేపేరుతో ప్రసిద్ధులు. జాతీయోద్యమంలో ఈ త్యాగధనుల సేవ మరువరానిది.

నా బాల్యంలో మా వీధిలో రెండు ఇళ్లల్లోనే రేడియోలు ఉండేవి. కరెంట్ కూడా అన్ని ఇళ్లకు లేదు. వీధి మొదట్లో ఒకే వీధిదీపం మందంగా వెలుగుతూ వుండేది. రేడియో ఉన్నవారి ఇంట్లో ఆదివారం పిల్లల ప్రోగ్రాం వినేందుకు బాలలందరూ గుమికూడేది. మావీధిలో అందరికంటే ఆఖరున కరెంటు పెట్టించుకొన్నది మేమేను. బిఎ వరకు బెడ్ లైటు ముందు కూర్చొని చదువుతూ కునికితే జుట్టు కమిలి కమురు వాసన వచ్చేది. బియ్యేలో చేరాక అమ్మ లాంతరులు కొనిపెట్టింది.

మా ఇంట్లో అమ్మ కానీ, మరెవరు కానీ ఉండేవారు కాదు, నేను సొంతంగా వండుకొని తిని స్కూలుకు పోవడం, వంటరిగా జీవించడం అలవాటయింది. యేవో కారణాలవల్ల పదిమందిలో కలిసేవాణ్ని కాదు. ఆత్మన్యూనతాభావం కూడా నాలో ఉండి ఉంటుంది. ఒకటి రెండు సార్లు భగవద్గీత శ్లోకాలు వప్పజెప్పడం పోటీకివెళ్లి కూడా, సభాకంపం, పిరికితనంతో పాల్గొనకుండా వెనక్కి వచ్చాను.

1959 కాబోలు పొణకా కనకమ్మగారు బాలరాజు మహర్షి అనే మూలికా వైద్యుణ్ణి నెల్లూరు పిలిపించి కస్తూరిదేవి విద్యాలయంలో క్యాంపు పెట్టారు. వేలంవెర్రిగా జనం వెళ్లారు. మా ఇంట్లో బాడుగకు ఉన్న హిందీ పండితులు వారి శ్రీమతికి జ్ఞాపకశక్తి వృద్ధి అయేందుకు మందుకోసం ఆమెను తీసుకొని వెళ్ళారు. బాలరాజు ఆమెకు రాంబాణం ఆకు అనే ఒక ఆకును ఇచ్చి నిత్యం ఆ ఆకును నీటిలో తెర్లబెట్టి ఆనీరు త్రాగమన్నారు. ఆమెకు జ్ఞాపకశక్తి బాగానే వుంది, హిందీ పరీక్షలకు సరిగా చదవక తప్పేది. వేసవి రోజుల్లో మా యింటివెనక ఒక సర్కస్ టెంట్ వేశారు. ఇంకా హైస్కూల్లో చేరలేదు. అప్పుడపుడు గుడారం క్రిందనుంచి దూరి కొందరు పిల్లలం లోపలికివెళ్ళి సర్కస్ చూసాము. నాకు ఊహ తెలియకముందు మా ఇంటివెనుక ఖాళీ స్థలంలో సర్కస్ గుడారం వేశారట. ఒకరోజు ఉదయం మా వీధిలో ఒక యింటి సందు బాదంచెట్టునీడలో, బావిచప్టా మీద పులి పడుకొని ఉంది. సర్కస్ వాళ్లకు తెలిపితే వచ్చి పట్టుకొని పోయారట. మరొక సర్కస్ ప్రదర్శనలో రోజూ సింహం నోట్లో ఒకడు తలపెట్టేవాడట. అతని సాహసాన్ని చూడడానికి జనం సర్కస్‌కు వెళ్లేవారట. తిరుపతిలో కాబోలు సాహసం చేయబోతే అతని తలను ఆ మృగం కొరికివేసిందట. ఈ సంగతులు అమ్మ చెప్పగా విన్నాను. నాకు హిందీ రావటం మూలాన సర్కస్‌లో బఫూన్ వేషం వేసేవాడు పరిచయమయ్యాడు. తను రెండు సార్లు సర్కస్ చూపించాడు. అతనితో పరిచయం కావడం చాలా గొప్పగా తలచి నా స్నేహితులకు చెప్పాను.

ఇప్పడు సుబ్రమణ్యేశ్వరస్వామి గుడి ఉన్న స్థలంలో మేము చాలా చిన్నవాళ్ళంగా ఉన్నపుడు లక్కీ బోర్డు అనే ఒక జూదశాల వెలిసింది. అందులో పనిచేసే అమ్మాయిలు ఆంగ్లో ఇండియన్లు లేదా నేపాలీలు కాబోలు. టికెట్ ఇచ్చే అమ్మాయి సిగరెట్ కాలుస్తూ టికెట్ ఇచ్చేది. లోపల వినోదాలకన్నా జూదాలు ఎక్కువ. జనం వేలంవెర్రిగా వెళ్లారు. తర్వాత ఆ ప్రదేశంలోనే గుడి కట్టారు. 1966 ప్రాంతాలలో కూడా బాలాజీ నగర్లో పెద్దఎత్తున లక్కీ బోర్డు వంటి పేరుతో ఒక జూదశాల వెలిసింది. పబ్లిక్ ఆందోళనతో తీసివేసినట్లున్నారు. 1972లో మా ఇంటికి సమీపంలో రైలు కట్టకు ఆవల జూదశాల కొంతకాలం నడిచింది. చివరి ఐటమ్ దం మారో దం అనేపాటకు స్త్రీ కళాకారులందరూ కలిసి నృత్యం చేసేవారు. రోజూ నిద్రకు ఉపక్రమించగానే ఆపాట వినిపిస్తూవుండేది.

1953 ప్రాంతాలలో నెల్లూరులో కాటన్ మార్కెట్ అనే ఒక జూదం లేదా వ్యాపారం జోరుగా సాగేది. పనిపాటలు చేసుకునే పాటకజనం మాత్రమే కాక చదువుకున్నవారు, సమాజంలో గౌరవప్రదంగా జీవించేవారు కూడా ఈ వ్యసనానికి దాసులయ్యారు. బీడీలు, సిగరెట్లు అమ్మే బంకుల్లో బుకింగ్ చేసేవారు. సాయంత్రం ఎనిమిది గంటలలోపల న్యూయార్క్ లోనో మరోచోటో ప్రత్తివేలం మొదలయ్యేదట. అక్కడ సాయంత్రం వేలం ప్రక్రియ ముగిసేది. ఆ వేలంపాటలో మొదట ఆరంభమైనపుడు ఒక సంఖ్యను ఓపెనింగ్ అని, పాట ముగిసినపుడు ఒక సంఖ్యను క్లోసింగ్ నంబరు అని అనేది. అన్ని దినపత్రికలలో ఈ వివరాలు వేసేది. హెడ్ పోస్టొఫీసులో కూడా ఫలితాలు చెప్పేసేవారు, టెలిగ్రాం ద్వారా తెలుస్తుంది కాబోలు! ఒకరోజు సాయంత్రం మా వీధిలో ఒక పెద్దమనిషి తన హంబర్ సైకిల్ ఇచ్చి పోస్టాఫీసుకు వెళ్ళి ఓపెనింగ్ కనుక్కొని రమ్మన్నారు! మావీధిలో పేరున్న వకీళ్ళకు, సంపన్నులకు ర్యాలి, హంబర్ డైనమో సైకిళ్ళుండేవి.

మాయింటి దగ్గర్లోనే రైలుకట్ట. అక్కడే రైలు సిగ్నల్ ఉండేది. చెక్క వంగితేనే రైలు వెళుతుంది. సిగ్నల్ లేక రోజూ రైళ్లు అక్కడ ఆగి పెద్దగా కూతవేస్తూ రొదచేస్తూ ఉండేవి. మాకు అలవాటయింది కనుక యెంత కూత వేసినా రాత్రివేళ నిద్రాభంగమయ్యేది కాదు. కొత్తవాళ్లు మాటిమాటికి ఉలిక్కిపడి లేచేది. చిన్న పిల్లలం ఇంజన్ డ్రైవర్లను గ్రీస్ అడిగేవాళ్ళం. కొందరు ఇచ్చేవాళ్ళు. గ్రీస్ ఒక బట్టర్ పేపర్లో చుట్టి ఉంటుంది. దాంతో తేలుబొమ్మలు, గడియారం బొమ్మలు చెసేవాళ్లము. ఆట అయిపోయాక గ్రీస్‌ను నీళ్ళలో వేస్తే అసహ్యంగా తయారయేది. అదంతా ఒక ఆట. మిలిటరీ రైళ్లు వెళుతూంటే సైనికులు ఒక్కోసారి బిస్కట్ పొట్లాలు ఇచ్చేవారు. తర్వాత రోజులలో చెక్క వంగడం పోయి పైకి లేస్తేనే సిగ్నల్ ఇచ్చినట్లు. ఒక చరిత్ర సభలో ప్రొఫెసర్ ఓరుగంటి రామచంద్రయ్య గారు “ఏదైనా నవలలో చెక్కవంగింది, లేక చెక్క లేచింది అనే వాక్యం ఉంటే దాన్ని బట్టి రచనా కాలాన్ని చెప్పవచ్చు” అని అంటూ ‘ఏదైనా చరిత్రకు ఆధారమే’ అని సరదాగా వ్యాఖ్యానించారు. 1957 ప్రాంతాల్లో రెండో లైన్‌కు పనులు మొదలుపెట్టారు. మేము చూస్తూండగానే ఐదారు రైలు పట్టాలను కలిపి ఒకపట్టాగా చేశారు, కుదుపులు పోయాయి. మా ఇంటివద్ద సిగ్నల్ పోస్ట్ పోయింది. ఇప్పుడు మూడో లైన్ వేస్తున్నారు. రైల్ వచ్చేదీ పోయేదీ కూడా తెలియదు. మా బాల్యంలో కాదంబి అనే వైష్ణవ ఫోటోగ్రాఫర్ మా ఇంటి వద్ద రైలుకట్ట ఎదురుగా ఇల్లుకట్టుకొని ఉండేవారు. వారి పెద్దబ్బాయి గార్డ్. అతను రైల్లో వెళుతూంటే వాళ్ళ నాయనగారు కాదంబి ఒక బుట్టలో కేరియర్ పెట్టి దోటీకి తగిలించి పట్టుకుని పట్టాల పక్కన నిలబడేవారు. వేగంగా వెళుతున్న గూడ్సు రైలులోంచే కుమారుడు వడుపుగా ఆ బుట్టను అందుకొనేది. ఇదంతా మాకు నిత్యం చూచేదే అయినా చోద్యంగా అనిపించేది. వందలమంది గ్యాంగ్ మెన్ రైలు పట్టాలమీద పనిచేస్తూ హుషారుగా పాటలుపాడుతూ కనిపించేవారు. యాంత్రికీకరణ జరిగి ఆ దృశ్యాలు కనుమరుగయ్యాయి.

1952లో పొట్టి శ్రీరాములు గారు అమరులైన సందర్భంలో ప్రజలు రైళ్ళమీద దాడిచేశారు. పోలీసు కాల్పుల్లో నెల్లూరులో నలుగురు యువకులు అమరులైనారు. అందరూ పేదవారే. మా వీధిలో బాడుగకు ఉన్న మేజిస్ట్రేట్ గారి ప్యూన్ రైలుస్టేషన్ వద్ద జరుగుతున్న విద్యార్థుల నిరసనలు చూస్తూ నిలబడ్డాడు. పోలీసు కాల్పుల్లో తూటా తగిలి పోయాడు. ఆరోజు సాయంత్రం ఏడుగంటలకు మృతవీరుల దేహాలను ఊరంతా ఊరేగింపుగా తిప్పారు. కమ్యూనిస్టు నాయకులు వేములపాటి అనంతరామయ్య, పరచూరు రామకోటయ్య టౌన్లో శాంతిపరిరక్షణకు చాలా పాటుపడ్డారు. ఆనాటి ఘటనలను అనంతరామయ్య స్వీయచరిత్రలో వివరంగా రాశారు. దాదాపు 15రోజులు రైలుకూత వినిపించలేదు. చాలా చిన్నవాళ్ళమైనా ఆనాటి హింసాత్మక సంఘటనల జ్ఞాపకాలు మా పసిమనసుల్లో అలాగే ఉండిపోయాయి.

పొట్టి శ్రీరాములు 1946-47లో కాబోలు నెల్లూరు మూలపేట శివాలయంలో, వేణుగోపాలస్వామి ఆలయంలో ‘హరిజన ప్రవేశం’ చేయించారు. శివరాత్రో మరో పర్వదినమో, శివాలయంలో బ్రాహ్మణ సంతర్పణ గూడా జరిగింది. సరిగ్గా భోజనాలు చేస్తున్న సమయంలో పొట్టి శ్రీరాములు బృదం ఆలయంలోకి తోసుకుని వచ్చింది. భోజనం చేసేవారు లేచి, పరుగులుతీసి ఆలయంలోంచి వెలుపలికి వచ్చేశారు. ఆరోజు మా అమ్మవెంట శివాలయానికి వెళ్ళాను. ఈ సంఘటన లీలగా గుర్తుండిపోయింది. చివరగా ఒక ముచ్చట. గోలి శంకరయ్య అని శ్రీరాముల అనుచరులు ఒకరు శ్రీరాములు గారి మాదిరే పంచ కట్టుకొని రూపాయికి శేరు బియ్యం అని కాబోలు రాసి ఉన్న అట్టలు వీపుకు, ముందు భాగంలో కట్టుకొని ట్రంకురోడ్డులో తిరిగేది. విశాఖ ఉక్కు సమస్యమీద కూడా అయన నిరసన వ్రతం చేసినట్లు గమనం. ఒక ముచ్చట చెప్పి ఈ రైలుకథలు ఆపుతాను.

1946 జనవరి 21న మహాత్మా గాంధీజీ నెల్లూరు వచ్చారు. దర్గామిట్టలోని వేమాలసెట్టి బావి వద్ద, రైలు కట్టకు సమీపంలో పెద్ద స్టేజి కట్టారు. మధ్యాహ్నం అక్కడ రైలు ఆగింది. వేలసంఖ్యలో జనం వారి దర్శనానికి గుమిగూడారు.

గాంధీజీ వెళుతున్న రైలును చూడడానికి మావీధి చివర రైలుకట్ట సమీపంలో ఆడవాళ్లు చిన్న గుంపుచేరారు. మా అమ్మవెంట నేను కూడా ఆ గుంపులో ఉన్నాను. రైలింజనుకు పెద్ద పెద్ద అరటి పిలకలు, టెంకాయ మట్టలతో, మామిడి తోరణాలతో అలంకరించారు. గాంధీజీ కనిపించలేదు కానీ ఆ ప్రత్యేక రైలును చూచామన్న తృప్తి. శైశవం తాలూకు జ్ఞాపకాలలో ఇప్పటికీ నిలబడిపోయిన మధురానుభూతి.

యస్.యల్.యల్.సి తప్పి ఇంట్లో ఉన్న సమయం. ఆ ఏడు శివరాత్రికి కోడూరు వెళ్ళి అక్కడ శివాలయంలో లక్షదీపారాధన కార్యక్రమంలో పాల్గొందామని నా మిత్రుడు నరహరి అన్నాడు. ఆరోజుల్లో నెల్లూరుకు 15 మైళ్ళ దూరంలో సముద్రతీరంలోని కోడూరు శివాలయంలో శివరాత్రినాడు లక్షదీపాలు వెలిగించి, ఆ పర్వదినాన్ని చాలా వైభవంగా జరిపేవారు. చాలా ముందుగా భక్తులకు ఓం నమశ్శివాయ అని అచ్చువేయించిన నోటు బుక్కులు పంచేవారు. వాటిని పూర్తి చేసి శివరాత్రి నాడు భక్తులు ఆలయంలో సమర్పణ చేస్తారు. మా దగ్గర కోడూరు వెళ్ళడానికి బస్సు ఛార్జీకి సరిపడా కూడా డబ్బులు లేవు. ఐతే మా కోరికను మాకన్నా పెద్దవాడైన టైలర్ మిత్రుడు టివియఎస్‌తో ప్రస్తావించాము. తను ఎలాగైనా కోడూరు తీసుకుని వెళతానని మాట యిచ్చాడు. అన్నప్రకారమే ఒక డొక్కుసైకిల్ సంపాదించి శివరాత్రి ముందురోజు సాయంత్రం ఐదుగంటలకు సైకిల్ పైన త్రిబుల్సు వెళ్ళాము. నన్ను ముందు బార్ మీద, మిత్రుడు నరహరి వెనుకసీటులో, మా టైలర్ మిత్రుడు సైకిల్ తొక్కుతూ. ఎలాగో కోడూరు రోడ్డు పట్టాము. చీకటి పడింది, ఏడుదాటింది. దూరంగా లక్షల దీపాలు వెలిగించినట్లు ఒక దృశ్యం కనిపించింది. కోడూరు దగ్గరకు వచ్చేశామని, ఆ వెలుగు గుడిదీపాల కాంతని భావించాము. దగ్గరకు వెళ్ళేసరికి చేనుగట్టున ఒక మహావృక్షం, దానిలో లక్షల మిణుగురుల కాంతి దీపాలతో అలంకరించిన గోపురం లాగా తోచి భ్రాంతికి లోనయ్యాము. జీవితంలో మళ్ళీ అన్ని వేల లక్షల మిణుగురులు ఒకేవృక్షం మీద చేరి ఆ చెట్టును వెలిగించడం చూడనేలేదు. ముగ్గురం స్థాణువుల్లాగా నిలబడి ఆదృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాము. ఆ రాత్రి, మరురోజు కోడూరు బ్రాహ్మణ సత్రంలో భోజనం చేసి లక్షదీపారాధనలో పాల్గొన్నాము. లక్షదీపాలు వెలిగించిన తర్వాత కూడా ముందు రోజు చూసిన దీపవృక్షం ముందు ఈ ఆలయ దీపాలకాంతి వెలవెల పోయినట్లనిపించింది.

నేను వి.ఆర్. కళాశాలలో చదువుతున్నరోజుల్లో 1962లో చైనా దురాక్రమణ ముఖ్యమైన సంఘటన జరిగింది. అప్పటికే కమ్యూనిస్టు పార్టిలో అంతర్గతంగా విభజన వచ్చినా బయటపడలేదు. మా కాలేజి యస్.యఫ్.ఐ విద్యార్థులు చర్చించి చైనా దురాక్రమణను ఖండించడానికి మారుగా బలపరుస్తూ తీర్మానించి విశాలాంధ్ర పత్రికకు పంపించారు, నా వంటి కొద్ది మంది సలహా లక్ష్యపెట్టకుండా. అయితే నెల్లూరు యస్.యఫ్.ఐ విద్యార్థులు ఏకగ్రీవంగా చైనా దురాక్రమణను ఖండించినట్లు ఆ పత్రిక వార్త ప్రచురించింది. ఆ తర్వాత ఆల్ట్రా దేశభక్తులు, జి.సి. కొండయ్య వంటి నాయకుల నాయకత్వంలో కాగడాల ఊరేగిపులు, పార్టీ ఆఫీసుల మీద దాడులకు ప్రయత్నాలు చేసినపుడు పార్టీ అభిమాన విద్యార్థులం ఆఫీసులను కాపాడుకోవడం కోసం కాపలా కాయడం వంటివి గుర్తొస్తాయి. అప్నట్లో అనేక సంఘటనలు.. మా వీధిలో వి. అనంతరామయ్య గారనే అడ్వొకేటు బహిరంగ సభలో జిల్లా కలెక్టర్ రాజగోపాల్ గారికి తన భార్య మెడలోని బంగారు హారాన్ని తీసి వేదికమీదే దేశరక్షణ నిధికి సమర్పించారు కాని అత్యవసర పరిస్థితుల్లో వారివంటి వారిని కూడా ఆరెస్టు చేయకుండా ప్రభుత్వం వదలలేదు.

అడ్వకేట్ వి. అనంతరామయ్య దంపతులు

విద్యాసంస్థల్లో ఎన్.సి.సి అందరికీ తప్పని సరైంది. ఆదివారాలు అమ్మాయిలు, అబ్బాయిలు అందరికీ డబుల్ పెరేడ్లు, రైఫిల్ షూటింగ్‌లో శిక్షణ కొనసాగింది. ఆదివారం అయితే వి.ఆర్.సి మైదానం నిండుగా కవాతులు చేసే యువజనంతో నిండిపోయివుండేది. నా జీవితంలో యన్.సి.సి భాగమైంది. ఏడాదిలో నా ఆరోగ్యం చాలా మెరుగై శరీరం బలంగా తయారయింది. ఏడాది తర్వాత యన్.సి.సి డే రోజు మధ్యాహ్నం రెండు గంటలకు తుపాకులతో బయలుదేరి టౌనంతా తిరిగి సాయంత్రం చీకటి పడ్డాక కాలేజికి వచ్చాము. నేను యన్.సి.సి రైఫిల్సు డివిజన్లో ఉండేవాణ్ణి. తుపాకిని బగుల్ శస్త్ర పోశ్చర్లో, అంటే ట్రిగ్గర్ గార్డు మధ్య వేలుతో పట్టుకుని కవాతు చేయాలి. ఊరేగింపు బయలుదేరిన పదిహేను నిమిషాలలోపలే కొందరు అశక్తులు నేలమీద టపటప కూలబడిపోయారు. ఆరోజు నాకొక పరీక్షయింది. నాలుగు గంటలు టౌన్లోని బజార్లగుండా కవాతు చేయగలిగాను. రైఫిల్ షూటింగ్‌కు ఎంపికపై ఏడాదంతా అందులోనూ సాధనచేశాను. బి సర్టిఫికేట్ పాసయ్యాను. ఆ ఏడు రిపబ్లిక్ డే రోజు ఇతర సాయుధ దళాలతోపాటు మా ప్లటూన్ సభ్యులం పోలీసు గ్రౌండ్ లజ మార్చు చేస్తూ జిల్లా కలెక్టర్‌కు వందన సమర్పణ చేశాము. మాకు బుద్సింగ్ అనే జూనియర్ లెఫ్టినెంట్ ఆఫీసర్ శిక్షణ ఇచ్చారు. ఉదయం టిఫిన్ బ్రేక్ సమయంలో ట్రాన్సిస్టర్లు పెట్టుకొని యుద్ధవార్తలు వినేవాళ్ళం. మా ఆఫీసర్ పనిచేసిన పోస్టు శతృవుల అధీనమైన వార్త వినగానే ఆయన కళ్ళల్లో కన్నీటి ధార చూచి మేము కూడా ఏడ్చేశాము. తర్వాత సైనికోద్యోగులందరినీ వెనక్కి పిలిపించారు. మా అండర్ ఆఫీసర్లు కొందరు యన్సిసిలో శాశ్వత ఉద్యోగులయ్యారు. కళాశాలల లెక్చరర్లు యన్సిసి కమాండింగ్ అధికారులు అయ్యారు. నేను పనిచేసిన సర్వోదయ కళాశాల ప్రిన్సిపాల్ వి.మాధవరావుగారు మేజర్ హోదాలో కేరళలో యన్సిసి బెటాలియన్ అధికారిగా పనిచేసి మా కాలేజి ప్రిన్సిపాల్ అయ్యారు. నా మిత్రుడు, మా అండర్ ఆఫీసర్ కె.ప్రసాదరావు రెండేళ్ళు యన్సిసిలో పనిచేసి, 1965లో ఎంఎ లోచేరి, IES పాసై కేంద్ర ప్రభుత్వ వ్యవసాయశాఖ కార్యదర్శిగా పదవీవిరమణ చేశారు.

స్వర్గీయ కె. ప్రసాదరావు IES ఉస్మానియాలో రచయిత హాస్టల్ మేట్.

చైనా దురాక్రమణ అనగానే ఆ రోజులన్నీ గుర్తొచ్చాయి. బిఎ రెండో సంవత్సరం కాబోలు, మాకు దసరా సెలవులకు హైదరాబాదులో పదిరోజులు కేంపు ఏర్పాటు చేశారు. నాంపల్లిలో దిగేసరికి హైదరాబాదులో భయంకరమైన వర్షాలు. కేంపు రద్దయింది. స్టేషన్ మొత్తం కేడెట్లతో నిండిపోయింది. మేము మా పళ్ళాలు, మగ్గులు పట్టుకుని వరసగా నిలబడీతే మిలటరీవారు పళ్ళాలలో భోజనం, మగ్గుల్లో నీళ్ళు పోస్తూవెళ్ళారు. నేనేదో బిచ్చగాణ్ణి అయినట్లు, నా పళ్ళెంలో ఎవరో అన్నంపడేస్తున్నట్టు ఒక భావం మనసులో తలయెత్తి, ధారాపాతంగా కన్నీళ్ళు కారుస్తూ వెక్కి వెక్కి ఏడ్చాను. నా సహచరులు నన్ను ఓదార్చారు. డీ క్లాస్ కావడం అంత సులభం కాదు. జీవితమే పాఠాలు నేర్పింది.

తెలుగు స్పెషల్ బిఎలో భారతదేశ చరిత్ర, ఆధునిక యూరోప్ చరిత్ర ఇష్టంగా చదివాను. మా చరిత్ర అధ్యాపకులు వెంకటరెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు. జార్జ్ బెర్నార్డ్ షా  ఆర్మ్సు అండ్ ద మేన్ నాటకాన్ని సి. సీతాపతిరావు గారు బోధించిన తీరువల్ల ఆనాటకం ఇష్టంగా చదివాము.

ఇంగ్లీష్ లెక్చరర్ సి. సీతాపతిరావు గారు

వి.ఆర్.కాలేజీ ఇంగ్లీషు శాఖ అధిపతి దుర్భా రాంమ్మూర్తి హామ్లెట్ నాటకం పాఠం చెప్పడంలో లబ్ధప్రతిష్ఠులు. ఆయన క్లాసుకు ఇతర విద్యార్థులు కూడా వచ్చి కూర్చొనేవారు. చాలా మెల్లగా కంఠం తగ్గించి వేదికమీద అటూ ఇటూ తిరుగుతూ సంభాషణలు చదివి వివరించేవారు. చీమ చిటుక్కుమన్నా వినపడేంత నిశ్ళబ్దం క్లాసులో. ఎప్పుడూ నవ్వరు, హాస్య సంఘటనలు వివరించేప్పుడు కూడా. అప్పటికే వారి చేత సాహిత్య అకాడమీ హామ్లెట్, మేక్బెత్ అనువదింపజేసి ప్రచురించింది.అటువంటి ఆచార్యులవద్ద చదువుకోవడం మా అదృష్టం.

నెల్లూరు కాలేజి జీవితంలో ఒక హాస్యరస సంఘటన చెప్తాను. క్రిస్మస్ సెలవులకు ముందు కొన్ని ప్రేమలేఖలు బహిర్గతమై, మా ప్రిన్సిపాల్ విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేసి తీవ్రమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇంతలో ప్రిన్సిపాల్ లేడీ ప్రిన్సిపాల్‌కు రాసిన ప్రేమలేఖలో విషయాలు అందరికీ తెలిశాయి. లేడీ స్టూడెంట్సు విశ్రాంతి గదిలో క్రమశిక్షణ అమలు చేసే మహిళా ఉద్యోగి లేడీ ప్రిన్సిపాల్ అంటే. ఆ తర్వాత ఎవరికీ నిజంగా లేఖలు అందాయో ఎవరికి అందలేదో తెలియదు గానీ కాలేజీలో ఈ విషయం గగ్గోలుగా మారింది. ఉత్తరం రాకపోతే నామోషి. ప్రతివాడు తనకు ప్రేమలేఖ వచ్చిందనే అనేవాడు. మిత్రుల గోల భరించలేక ఒక విద్యార్థిని నాకూ రాసిందని చెప్పవలసి వచ్చింది. కొందరు మిత్రులు ఎం.ఎ. చదువుతున్నా నా ఊహాప్రేయసితో వ్యవహారం ఎఃతవరకూ వచ్చిందని విచారించేవారు. బిఎ తర్వాత మా సహవిద్యార్థులు ఎక్కువ మంది బిఏడ్ చదివి టీచర్లుగా స్థిరపడ్డారు. ఏ అజ్ఞాతశక్తో నాకు ఉస్మానియాకు దారి చూపించింది. వి.ఆర్. కళాశాల తెలుగు హెడ్ ప్రోత్సాహం లేకపోతే నా జీవితం ఎటు నడిచేదో!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here