[dropcap]”మ[/dropcap]న ఇంట్లా మనది ఏది, మనది కానిది ఏదినా?” అంటా ఏతమెత్తే అన్నగాని అడిగితిని.
“మూల్లిల్లు మనది, నట్టిల్లు మనది, వంటిల్లు, దేవునిల్లు, దొడ్డిల్లు, జగిలి (అరుగు) మనదిరా” అట్లే అనే అన్న.
“మడి (మరి) మనవి కానివినా?” ఇట్లే అంట్ని.
“కిచెన్, బాత్రూమ్, బెడ్ రూం, గాడ్ రూం ఇట్లావి మనవి కాదురా. వాటిల్లా వుండే సరుకులు మనవి అసలు కాదురా”
“ఓ… అట్లనా! అయితే ఆ అంగడిలాని టెమాటో, ఆపిల్, ఆరేంజ్ ఇవినా?”
“ఇవి కూడా మనవి కాదురా”
“కాకుంటే పోనీ లేనా… మనవి ఏవో చెప్పనా?”
“ఎర్ర గుల్లకాయ, సేవుకాయ, తిత్తిలి కాయ మనవిరా”
“మనవి పోయి మనవి కానివి వచ్చి మన ఇండ్లల్లా టికాణి ఏసుకొని కూకొనుండాయి కదానా? ఇబుడేమి చేసేదినా?”
“ఏమి చేసేదా, మనది ఏది మనది కానిది ఏదని తెలుసుకోవాలరా. తెలిసి నడుచుకోవాలరా… నా పుట్టిన రోజు అని నాలుగు ఆంగ్ల అంకెలను చెప్పేది కాదు వ్యయ నామ సంవత్సరం, చైత్ర మాసం, కృష్ణ పక్షం, ఆరవ రోజు నా పుట్టిన రోజు అని చెప్పే సత్తా మనకుండాలి. అదే ఇబుడు మనము చేయాల్సింది” అని చెప్పి పోయ అన్న.
నేను వినిపోయే రకం కాదు.
అన్న చెప్పించి ఆచరణలాకి తేవాలని అజ్జలు వేస్తిని.
ఇంగ మీరు…
***
టికాణి=చేరిపోవడం/ఉండిపోవడం