[box type=’note’ fontsize=’16’] తెలుగులో అక్షర దోషాలు, ఇతర తప్పులు లేకుండా ఎలా వ్రాయవచ్చో ఈ శీర్షిక ద్వారా తెలియజేస్తున్నారు శ్రీమతి నండూరి సుందరీ నాగమణి. [/box]
~
[dropcap]మ[/dropcap]ళ్ళీ కథారచన వైపు వద్దాము. కథను సాధ్యమైనంత తేలికభాషలో వ్రాయాలి. తప్పులు, వ్యాకరణ దోషాలు లేకుండా వ్రాయటం తప్పనిసరి.
ఏ కథ చెప్పబోతున్నామో దానిని ప్రధాన పాత్రగా చేసి కథను అల్లుకోవాలి. ఉదాహరణకు ఒక చిన్నపిల్లవాడి కథను మీరు వ్రాద్దామనుకుంటే, కథ యొక్క సెంట్రల్ ఐడియా అంతా ఆ పిల్లవాడి చుట్టూనే తిరగాలి. అలాగే ఒక ఉద్యోగిని గురించి లేదా ఒక స్కూల్ మాష్టారు గురించి వ్రాస్తే కథంతా ఆయా పాత్రల చుట్టూనే తిరగాలి.
మనం వ్రాసేవన్నీ చిన్న కథలన్న విషయం మరచిపోకూడదు. పేజీల లేదా పదాల పరిమితి ఉంటుంది. అందుచేత కథ కోసం ఏదైనా సంఘటనను ఎన్నుకొని వ్రాస్తే చాలా సహజంగా, హృదయానికి హత్తుకొనేలా వ్రాసే వీలు కలుగుతుందని మరువకండి.
కథాప్రారంభం రకరకాలుగా చేయవచ్చు. సాధారణంగా డైలాగ్స్‌తో మొదలుపెట్టి, కథనంలోకి వెళ్ళిపోవచ్చు.
చిన్నకథలకు పెద్ద వర్ణనలు పనికిరావు. ఒకటి రెండు లైన్లలో వర్ణనలు ముగించాలి.
అలాగే పాత్రలను నేటి కాలానికి అనుగుణంగా మలచాలి. స్మార్ట్ ఫోన్‌ల కాలం 2021లో ట్రంకాల్స్ గురించి, టెలిగ్రామ్‌ల గురించి వ్రాయకూడదు, పాత్రలు ఓ ముప్పై నలభయ్యేళ్ళ గతంలోకి వెళితే తప్ప.
పేర్ల విషయంలో కూడా జాగ్రత్త పడాలి. నేటి కథలో తండ్రులకు రామయ్య, పరంధామయ్య అనే పేర్లు సరిపడవని గమనించండి. అలాగే ఉద్యోగాల విషయం, ఆహార్యం అనగా వస్త్రధారణ విషయం కూడా.
కథలలో చర్చించే సామాజిక అంశాలు లేదా సమస్యలు కూడా వర్తమానానికి సంబంధించినవే అయుండాలి. అప్పుడే కథ నేటి పాఠకులను (యువతను) ఆకట్టుకుంటుంది.
చిన్న కథ ఎప్పుడూ తాజాగా నవనవలాడుతూ, అందరూ ఆస్వాదించేలాగా వండాలి. అప్పుడే కదా రుచి!
కథాగమనము, కథనము కూడా వేగంగానే ఉండాలి. కథాంశం మాత్రం ఆలోచింపజేసేదిగా ఉండాలి. కథ ముగింపు ఎప్పటికీ గుర్తుండిపోయేలా, పాఠకుడికి సంతృప్తి కలిగేలా ఉండాలి. అలాగే కథాశీర్షిక కూడా చాలా ఆకర్షణీయంగా ఉండాలి.
ఇన్ని విషయాలు ఒకేసారి చెప్పేస్తే మీకు ఎంత గందరగోళంగా ఉంటుందో నాకు తెలుసు. ఈ విషయాలన్నీ రాబోయే పాఠాలలో మరింత వివరంగా నేర్చుకుందాము.
మంచి కథకులవాలంటే మంచి పాఠకులై ఉండాలి కదా. అంచేత విరివిగా చదవండి. నేటి సాహిత్యాన్నే కాక, పాత కథలను, పాత నవలలను చదవటం వలన అప్పటి వాతావరణం, మరుగున పడిపోయిన ఎన్నో విషయాలు, మన పాత సంస్కృతి ఇవన్నీ తెలియటంతో పాటుగా, కుటుంబ బాంధవ్యాలు, మానవతా విలువలు మొదలైన ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి. అంతే కాక ఎన్నో తెలుగు పదాలు మనకు దొరుకుతాయి. ఈ అధ్యయనం మనకు అలవోకగా రచనలు చేయటానికి ఉపకరిస్తుంది.
మరి చదవటం మొదలుపెట్టండి, ఇప్పటికే చదివే అలవాటు ఉంటే కొనసాగించండి. కలమనే హలాన్ని… అదే కీబోర్డ్ ను కదపండి, మంచి మంచి సాహితీ సస్యాలను పండించండి.
విజయోస్తు!
*