[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షికలో రచయితలు తమ రచనల వివరాలు, తామెందుకు రచనలు చేస్తున్నారు, తమ లక్ష్యం ఏమిటి వంటి విషయాలను వివరిస్తూ తమని తాము పరిచయం చేసుకుంటారు. [/box]
రవి మంత్రి
[dropcap]న[/dropcap]మస్కారం..
నా పేరు రవి మంత్రి.
2019 నుండి కథలు రాయడం మొదలు పెట్టిన నేను, రచయితగా కన్నా కథకుడిగా చెప్పుకోడానికే ఇష్టపడతాను. నేను రాసిన ఒక కథ ‘వెల లేని బహుమతి..’ ఆదివారం ఈనాడు లోను, మరొక కథ ‘ఇట్లు నీ ఎంకటలచ్చిమి’ ఆదివారం ఆంధ్రజ్యోతిలోనూ వచ్చాయి.
వంగూరి ఫౌండేషన్ వారి ఉగాది కథ, కవిత పోటీల్లో ప్రథమ బహుమతి కూడా గెలుచుకున్నాను. ఇప్పటి వరకు పది కథలు, ఒక నవల, కొన్ని కవితలు రాసాను. ప్రతిలిపి వెబ్సైటులో నా మొదటి నవల ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు..’ దాదాపు లక్ష మంది చదివారు. ఇది ఎప్పటికైనా పుస్తక రూపంలో తీసుకురావాలని నా ఆశ.
సాహిత్యం ఇలాగే ఉండాలి అని కొలమానం ఏమీ లేదని నా అభిప్రాయం. కథ మొదలు పెట్టిన వారు ఆపకుండా చదవగలిగితే, వారికి వారు ఒక ఊహా ప్రపంచంలో మనం రాసిన కథ, పాత్రల్ని చూడగలిగితే రచయితగా మనం విజయం సాధించినట్టే. ఎవరినీ అనుకరించకుండా రాసిన సాహిత్యం ఎప్పటికీ అందరికీ గుర్తుంటుంది.
కథలు రాయడం మొదలు పెట్టినప్పుడు నాకు తెలియదు, తెలుగు సాహిత్యం అనే మహా సముద్రంలో ఈదడం ఎంత కష్టమో. రాస్తున్న ఈ క్రమంలో నాకర్థమైంది, మన తెలుగు ఇళ్లలో తెలుగు చదవడం కూడా రానివారు ఇంటికొకరు ఉన్నారని. పొరుగు రాష్ట్రం అయిన తమిళనాడు వారికి వారి భాష అంటే ఎంత మక్కువంటే వారి పిల్లలకి తమిళ్, తమిళరశి అని భాష పేర్లు పెట్టుకునేంత. ఒంటిమీద ‘నేను తమిళుడిని’ అని పచ్చ పొడిపించుకునేంత. మన తెలుగు వారికి కూడా భాష పట్ల ఇంత అభిమానం ఉండాలని పెద్ద పెద్ద కోరికలు, లక్ష్యాలు ఏమీ నాకు లేవు గానీ, తెలుగు భాష మాట్లాడగలిగిన ప్రతీ తెలుగు వాడూ తెలుగుని చదవడం, రాయడం కూడా నేర్చుకుంటే చాలు. ఒక పేరున్న ఇంగ్లీషు రచయిత రాసిన పుస్తకం విడులైన తొలిరోజు లక్ష కాపీలు అమ్ముడుపోతే, నా తెలుగు రచయిత పుస్తకం కనీసం పదివేల కాపీలు అమ్ముడుపోయిన రోజున, భాష తిరిగి బ్రతుకుతోంది అని నమ్మకం కలుగుతుంది నాకు!!!
kiranaug1@gmail.com