[dropcap]ని[/dropcap]జాయితీ తీగలా
అల్లుకున్నదా నీ నరనరాలలో
పిడికెడు అక్షరాలుగా కొన్ని మాటలై
వాక్యమంటే విలువల పచ్చిక
అందమైన కూర్పులో
వాక్యం మహోజ్జ్వల కావ్యం
మానవత్వం మోసుకొచ్చిన
ఆత్మీయ రాగాల వెన్నెల పుప్పొడి
బహుశా కవుల కల్పనలో దాగిన
సుందర సత్య స్వప్నాల కలయికేమో
మంజుల వాక్యం సుమధుర అక్షరంలో
స్వర ఝరీ నాదం గీతోధ్భవ నివేద వేదం
మట్టి వాక్యం నిర్మల వృక్ష కాంతి రేకులు
కలలు తాత్కాలికం
తరుణ భావనా సౌందర్యసీమలో
నేలను తడిపిన అందాల తుషారం
జలకాలాడిన జలకన్య హర్షమే వరం
వాక్యం అద్భుత సంగీత సాహిత్యమే
చిరుగాలి వీచే అలల తేరు స్నేహం
పచ్చని పైరుకై కష్టించే ఆనంద డోల
ముచ్చటగా సిరులు పారే జలధారలై
విలువల వాక్యం నయనాల సాక్ష్యం
రెండు దరుల నడుమ సాగింది నదిగా
ఊగే కనుల సోయగం మనసు నిండా
నదిని దాటలేని మనిషికి
నయాగరా జలపాతం స్ఫూర్తి
జనం బతుకులో సమరమయ్యింది
ఎగిరే రెక్కల శ్రామిక చోదక శక్తి ధైర్యం
నిర్మించే వారధి జన వాక్యం ఊపిరిగా
మనిషి నడిచే బాటసారి నేనై
జీవన వంతెనపై సంతోషం ఆడే
కింద జలకళ చూసిన కనులదే పండుగ
ప్రవహించే నది పండించే పంటలెన్నో
ఆ ధాన్య రాసులే దేశానికి ప్రాణ గీతం
ప్రజల గొంతుకే విలువైన వాక్యం ఎప్పుడూ