ఆచార్యదేవోభవ-38

0
3

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన గురువరేణ్యులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

వాచస్పతి రామబ్రహ్మం (1948):

[dropcap]రా[/dropcap]ష్ట్రపతి ప్రతిభాపురస్కార గ్రహీత బేతవోలు రామబ్రహ్మం సంస్కృతాంధ్ర భాషా నిష్ణాతులు. కొవ్వూరు గౌతమీ విద్యాపీఠంలో 1969లో భాషా ప్రవీణ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. తొలి అడుగులు ఏలూరు ప్రాచ్య కళాశాల (1970), గుంటూరు కె.వి.కె. సంస్కృత కళాశాల (1970-79) లలో అధ్యాపకులుగా ఒక దశాబ్ది పాటు గడిచాయి. నాగార్జున విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా 1979 అక్టోబరులో కాలూనడం జీవితానికి మలుపు. అక్కడే రీడరు (1984-88) గా బోధనలు చేశారు. పరిణామశీలమైన జీవన గమనంలో తెలుగు విశ్వవిద్యాలయ ఆచార్యకత్వంతో బొమ్మూరు (రాజమండ్రి) తెలుగు శాఖలో పదిహేడేళ్ళు (1988-2005) కుదుటపడ్డారు. మరో మెట్టు పైకెక్కి హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవినందుకొని 2005-13 మధ్య అధ్యయన అధ్యాపనాలు కొనసాగించి 2013లో 65వ ఏట (జననం 10 జూన్ 1948) పదవీ విరమణ చేశారు.

ప్రతిభా పాండిత్యాలకు నిధియైన రామబ్రహ్మం మూడేళ్ళ పాటు హైదరాబాదు విశ్వవిద్యాలయంలో సి.సి.యల్.టి.లో ఆచార్యులుగా తిరిగి నియమింపబడి వర్ణన రత్నాకరం వంటి గ్రంథాలకు వ్యాఖ్యానం వెలయించారు (2013-16). వీరి పర్యవేక్షణలో 35 ఎం.ఫిల్, 25 పి.హెచ్.డిలు నడిచాయి.

విద్యాధ్యయనం:

1969లో భాషా ప్రవీణ, 1976లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎం.ఏ. (తెలుగు), 1979 సంస్కృత ఎం.ఏ, 1981లో నాగార్జునలో పిహెచ్‌డి వారి విద్యార్జనా క్రమం. చదువులలో మేటియై స్వర్ణపతకం పొందారు. ప్రతిభా వైజయంతిక అవార్డు 1995, కేంద్రీయ సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం 2003 (దేవీ భాగవతం), గుప్తా ఫౌండేషన్ అవార్డు 2012, రాష్ట్రపతి అవార్దు 2018,  వాచస్పతి అవార్డు 2019, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం – కొన్ని ప్రశంసా ప్రతిభా పురస్కారాలు.

విద్యా వినయ సంపన్నత:

రామబ్రహ్మం పూర్వాశ్వమంలో అష్టావధాని. వారు గుంటూరు కళాశాలలో ఉండగా వారి చేత ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నేను ప్రసార మాధ్యమంలో తొలి అవధానం చేయించాను. గ్రంథ రచనలో ఆయన అద్వితీయుడు. ప్రామాణిక గ్రంథాలు ప్రచురించారు. ప్రముఖ గ్రంథాలు – శ్రీ ద్వారకా తిరుమల క్షేత్ర మహత్యము, 1997; శ్రీ మద్రామాయణము (తెలుగు వచనము), 1993; శ్రీదేవీ భాగవతము, 1999;  శ్రీ దత్తాత్రేయ చరిత్ర, 2000; శ్రీమద్రామయణం – సుందరకాండ. పద్యకవిగా, విమర్శకులుగా లబ్ధప్రతిష్ఠులు. స్వభావరీత్యా సౌజన్యమూర్తి. విద్యార్థులకు గురుపరంపరలో జీవితాంతం నిలిచిపోయే వ్యక్తి. ప్రాచీన సంస్కృతాంధ్ర కావ్యాలను గూర్చి విశ్లేషించగల ‘వాకింగ్ ఎన్‌సైక్లోపీడియా’గా పండితులు భావిస్తారు. భాషా ప్రవీణ ఛాందసం ఎక్కడా కన్పించదు. ఆధునిక విశ్వవిద్యాలయ ఆచార్య పదవిలోని దర్పం కనబడనీయరు. పదవికే విశ్రాంతి. పరిశోధనలో అవిశ్రాంత భాషా చక్రవర్తి. సౌజన్యతామూర్తి రామబ్రహ్మం. ఆయన పరిశోధనా బ్రహ్మ.

హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయ తెలుగు శాఖ:

2021 నాటికి ఈ విభాగంలో పని చేస్తున్న ఆచార్యవర్యులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు (శాఖాధ్యక్షులు), ఆచర్య జి. అరుణకుమారి, ఆచార్య యం. గోనానాయక్, ఆచార్య ఎండ్లూరి సుధాకర్, ఆచార్య పమ్మి పవన్ కుమార్, డా. డి. విజయకుమారి, ఆచార్య పిల్లలమర్రి రాములు. తుమ్మలపల్లి రామకృష్ణ లీన్‌పై ద్రవిడ విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ప్రతిభాసంపన్నులైన విద్యార్థులను తీర్చిదిద్దడంలో నిరంతర కృషి సాగిస్తున్నారు. బి. భుజంగ రెడ్ది, డి. విజయకుమారి ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్లు.

ఎం.ఏ. తెలుగులో 16 కోర్సులు, ఎం.ఫిల్, పిహెచ్‌డిలు నడుపుతున్నారు.

అప్పటి మంత్రి శ్రీ పి. బ్రహ్మయ్యతో రచయిత రాజంపేటలో 1982లో

సాహిత్యాకాశంలో శరత్ జ్యోత్స్న:

సుప్రసిద్ధ కవి సురగాలి తిమోతి జ్ఞానానంద కవి తనయ శరత్ జ్యోత్స్నారాణి. 1956 ఏప్రిల్ 28న జన్మించారు. ఉస్మానియా నుండి ఎం.ఏ, ఎం.ఫిల్, పిహెచ్‌డి సంపాదించారు. బరంపురం విశ్వవిద్యాలయ డి.లిట్ అందుకున్నారు. 1982-87 మధ్య ఇందిరా బాలికల జూనియర్ కళాశాలలో అధ్యాపకత్వం, ప్రిన్సిపాల్ పదవులు; 1987-91 మధ్య తెలుగు విశ్వవిద్యాలయ ప్రాజెక్టు అసిస్టెంటు – వీరి ఉద్యోగ ప్రస్థానంలో తొలి దశ. 1991 నుండి 30 ఏళ్ళు హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వివిధ హోదాలలో పని చేసి 2021 ఏప్రిల్ లో రిటైరయ్యారు. 2012-15 మధ్య శాఖాధ్యక్షత.

అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో పాల్గొన్నారు. జ్యోత్స్న కళాపీఠం స్థాపించి ఏటా పలు అవార్డులు ప్రదానం చేస్తున్నారు. వీరి పర్యవేక్షణలో 50 మంది ఎంఫిల్, 40మంది పిహెచ్.డి. అందుకున్నారు. 1992 నుండి 30 ఏళ్ళుగా 30 కి పైగా గ్రంథాలు ప్రచురించారు. వివిధ పురస్కారాలు అందుకొన్నారు.

2002లో మద్రాసు తెలుగు అకాడమీ వారి సత్కారం

ఆధునిక సాహితీ సుధాకరుడు:

హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయ తెలుగు విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్న ఆచార్య ఎండ్లూరి సుధాకర్ దాదాపు మూడు దశాబ్దుల అనుభవం ఆచార్యులుగా కలిగినవారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ రాజమండ్రి సాహిత్య విభాగం డీన్‌గా ఒక దశాబ్ది అనుభవం. ఆ కాలంలో 86 మంది ఎంఫిల్, 34 మంది పి.హెచ్.డి.లు ఆ విభాగంలో పొందారు. తెలుగు విశ్వవిద్యాలయ త్రైమాసిక పత్రిక  ‘వాఙ్మయి’ సంపాదకులు. విహంగ అంతర్జాతీయ మాగజైన్ సంపాదక వర్గ సభ్యులు.

ప్రచురణా సాహిత్యం:

స్వయంగా భావకవితాఝరి గల ఎండ్లూరి ఆధునిక కవితాకాశంలో సుధాకరుడు. ప్రతిభాసంపన్నులైన 15 గ్రంథాలు ప్రచురించారు. 60 దాకా పరిశోధనా పత్రాలు సమర్పించారు.

అవార్డుల పంట:

ప్రతిభావ్యుత్పన్నత గల ఎండ్లూరికి జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుండి 25కి పైగా అవార్డులు లభించాయి. ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు 1992; ఉదయభారతి జాతీయ అవార్డు (భువనేశ్వర్), 1993; తెలుగు విశ్వవిద్యాలయ ధర్మనిధి పురస్కారం; డెట్రాయిత్ తెలుగు అసోసియేషన్ రజతోత్సవ పురస్కారం, 2012; యన్.టి.ఆర్. ప్రతిభా పురస్కారం 2014 – కేవలం మచ్చుకు కొన్ని.

కథలు, కవితలు, వ్యాసాలు, సదస్సు పత్రాలు అసంఖ్యాకంగా వెలువరించారు. హిందీ, ఉర్దూ భాషల కవితలు తెలుగులోకి అనువదించారు. కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా సంఘ సభ్యులు (2013-17). స్నేహశీలి, సౌజన్యమూర్తి అయిన సుధాకర్ రాజమండ్రి వదిలి హైదరాబాదులో స్థిరపడ్డారు. వీరి సతీమణి పుట్టా హేమలత.

శ్రీ పద్మనాభరావు గారి పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వెదురుపాక పీఠాధిపతి

కొత్త దారి చూపిన దార్ల:

తెలుగు శాఖాధ్యక్షులైన దార్ల వెంకటేశ్వరరావు కేంద్రీయ విశ్వవిద్యాలయ తెలుగు శాఖ రూపురేఖలను తీర్చిదిద్దే బాధ్యతలను శాఖాధిపతిగా 2021లో చేపట్టారు. ఆధునిక సామాజిక భావజాలంలో ప్రేరణగల దార్ల కోనసీమ కుర్రాడు. కష్టపడి, ఇష్టపడి చదువుకొని అమలాపురం శ్రీ బానోజీ రామర్స్ కళాశాలలో స్పెషల్ తెలుగులో 1995లో 22వ ఏట (1973 జననం) పూర్తి చేశారు.

జీవితంలో మలుపు:

కోనసీమ విద్యార్థి యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాదులో ఎం.ఏ. సీటు సంపాదించి తెలుగు ఎం.ఏ. (1997) సాధించారు. ఎంఫిల్ (1998), పిహెచ్‌డి (2003) పరిశోధనలు. ఆచార్య శరత్ జ్యోత్స్నారాణి పర్యవేక్షణలో జ్ఞాననంద కవి ఆమ్రపాలి పరిశీలనకు ఎం.ఫిల్ లభించింది. ఆచార్య కె.కె. రంగనాథాచార్యుల పర్యవేక్షణలో – పరిశోధకుడిగా ఆరుద్ర – సిద్ధాంత గ్రంథానికి పి.హెచ్.డి. పొందారు. ఎం.ఏ. సోషియాలజీ (ఓపెన్ యూనివర్శిటీ).

అధ్యాపక ప్రస్థానం:

పరిశోధన చేస్తున్న సమయంలోనే డిగ్రీ కళాశాలలో పోటీ పరీక్షలలో ఎంపికై 2001లో అధ్యాపకులయ్యారు. తాను చదివిన విశ్వవిద్యాలయంలో అతి చిన్న వయసులో 2004లో అసిస్టెంట్ ప్రొఫెసర్. తెలుగు శాఖ ఆచార్య పదవి 2016లో వరించింది. ఆకాశవాణి యువవాణి క్యాజువల్ కంపీర్ ఎనౌన్సర్‌గా ప్రసార మాధ్యమ నాడి పట్టుకోగలిగారు. ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర సంపుటుల అవలోకనంతో సమస్త సాహితీ ప్రక్రియలపై పట్టు సాధించారు.

రచనా ప్రస్థానం:

43 ఏళ్ళకే ప్రొఫెసర్ కావడం ఒక ఎత్తు. సృజనాత్మకతకు పీట వేసి 20 దాకా గ్రంథాలు ప్రచురించారు. ‘నెమలి కన్నులు’ కవిత్వ సంపుటి పేరు తెచ్చింది. వీరి పర్యవేక్షణలో 20 ఎం.ఫిల్, 12 పిహెచ్.డిలు వెలువడ్దాయి. వివిధ సంస్థల పురస్కారాలు లభించాయి. విహంగ అంతర్జాల పత్రిక పురస్కారం పొందారు. బహుజన సంక్షేమం ధ్యేయంగా పయనిస్తున్నారు. విశ్వవిద్యాలయ పాఠ్యప్రణాళికలో ‘డయాస్పోరా సాహిత్య’ పఠణానికి ప్రాధాన్యం కల్పించారు. పెద్దలు చూపిన బాటలో నడుస్తూ తన దారిలో కొత్తదనాన్ని సృష్టించే పరిశోధకులు దార్ల.

ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారితో రచయిత

తెలుగు శాఖ వెలుగు దివ్వెలు:

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పదిమంది అధ్యాపకులు బోధన చేస్తున్నారు. 450 మంది దాకా విద్యార్థులున్నారు. అధ్యాపకులు:

  1. ఆచార్య తుమ్మల రామకృష్ణ: ద్రవిడ విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు (2021)
  2. ఆచార్య జి. అరుణకుమారి: తెలుగు, సంస్కృతం, ఫిలాసఫీలలో ఎం.ఏ. ఆధునిక సాహిత్యం, ప్రాచీన సాహిత్యం, సంస్కృతం బోధిస్తారు. పి.హెచ్.డి – 1982లో ఆధునిక కవిత్వంలో మానవతావాదంపై వీరభద్రరావు పర్యవేక్షణలో పొందారు. తెలుగు కవిత్వం-భవిష్యద్దర్శనం – వీరి డి.లిట్ సిద్ధాంత వ్యాసం (బరంపురం 2008).
  3. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు: శాఖాధ్యక్షులు.
  4. ఆచార్య పిల్లలమర్రి రాములు: అదే విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి – తెలుగు సాహిత్య విమర్శలో మార్క్సిస్ట్ ధోరణులు (1998). ప్రాచీన ఆధునిక సాహిత్యాలు, సాహిత్య విమర్శ, జానపద సాహిత్యం బోధిస్తారు.
  5. ఆచార్య యం. గోనానాయక్: ఎం.ఏ. చేసి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌డి పొందారు. గోనానాయక్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పని చేసి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవ నధిష్టించారు. హెచ్.ఎస్. బ్రహ్మానంద పర్యవేక్షణలో 1993లో సుగాలి సంస్కృతి భాషా సాహిత్యాలపై పిహెచ్‌డి పొందారు. గిరిజన సంప్రదాయాలు-భాషా సంస్కృతులపై వీరి వద్ద ఎనిమిది పిహెచ్‌డిలు వచ్చాయి. బి. చిట్టెమ్మ – ప్రసుత్తం అనంతపద్మనాభరావు సృజనాత్మక సాహిత్యంపై వీరి వద్ద పరిశోధన చేస్తోంది.
  6. ఆచార్య ఎండ్లూరి సుధాకర్ – సీనియర్ ప్రొఫెసర్.
  7. ఆచార్య పమ్మి పవన్ కుమార్: అదే విశ్వవిద్యాలయం తెలుగు ఎం.ఏ. చేసి అన్నామలైలో లింగ్విస్టిక్స్ ఎం.ఏ. చేశారు. పిహెచ్‌డి – కట్టా వరదరాజు ద్విపదరామాయణం – భాషా పరిశీలన (పర్యవేక్షణ యస్. యస్. రాజా 2004). ఆధునిక, ప్రాచీన సాహిత్యాలు, వ్యాకరణము, పాఠ్యగ్రంథాల తయారీ, ప్రచార మాధ్యమాల గూర్చి బోధిస్తారు.
  8. ఆచార్య డి. విజయలక్ష్మి: ఎం.ఏ. తెలుగు, లింగ్విస్టిక్స్ చేశారు. పద్మావతీ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌డి. బోధన: లింగ్విస్టిక్స్, భాషా శాస్త్రము, అనువాదాలు, నిఘంటు నిర్మాణం, తులనాత్మక అధ్యయనాలు.
  9. డా. బి. భుజంగ రెడ్డి: ఉపన్యాసకులు. లింగ్విస్టిక్స్‌లో పి.హెచ్.డి.
  10. డా. దాసరి విజయలక్ష్మి: అదే విశ్వవిద్యాలయం పి.హెచ్.డి. చేశారు. దేశి వాఙ్మయం ప్రత్యేకత.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here