[box type=’note’ fontsize=’16’] శ్రీ సన్నిహిత్ వ్రాసిన ‘కలగంటినే చెలీ’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[dropcap]సా[/dropcap]యంకాలమైంది… ఇంటికి చేరుకున్నాడు సూర్య.
ట్రాఫిక్‌లో పడి రావడంతో కొంచెం చిరాగ్గా ఉన్నాడు. రాగానే చింటూ తగులుకున్నాడు. “డాడీ.. ఈ రోజు మా స్కూల్లో…” అంటూ ఏదో చెబుతున్నాడు.
“ఏయ్.. పోరా.. పో” అని విసుక్కున్నాడు సూర్య. వాడు మొహం చిన్నబుచ్చుకుని దూరంగా వెళ్ళిపోయాడు. ఇదంతా వంట గదిలో నుండి గమనిస్తోంది సీత!
కాఫీ కప్పుతో హాల్లోకి వచ్చి భర్త ముందు నిలబడింది. “కాఫీ తాగండి” అని కప్పు అందించింది. సీతను చూడగానే అతని ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కి చేరుకుంది. చెదిరిన జుట్టు , జిడ్డోడుతున్న మొహంతో అదోలా ఉంది సీత.
“సరే అక్కడ పెట్టు.. తాగుతాను” అని సోఫాలో వెనక్కు వాలాడు. చిన్నగా నిట్టూర్చి వంటగది లోకి వెళ్ళిపోయింది సీత.
అలా ఎంత సేపు ఉన్నాడో కానీ… నెమ్మదిగా కళ్ళు తెరిచి చల్లారిన కాఫీని ఒక్క గుక్కలో తాగి ఫ్రెషప్ అవడానికి లేచాడు.
హాల్లో ఉన్న టీవీలో వార్తలు వస్తున్నాయి.. చింటూ హోం వర్క్ చేసుకుంటున్నాడు.. సీత వంట చాలా సీరియస్‌గా చేసుకుంటోంది. గాలి కూడా అదో రకమైన సందిగ్ధతతో ఆ ఇంట్లో కదలాడుతోంది. ఫ్రెష్ అయి లుంగీ కట్టుకుని బాల్కనీ లొకొచ్చాడు. వాళ్ళుండేది థర్డ్ ఫ్లోర్…. కిందికి చూస్తే దూరంగా ఆడుకుంటున్న పిల్లలు కనిపించారు.
చేతిలో ఉన్న బాల్‌ని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. భగవంతుడు కూడా అంతే! తన జీవితాన్ని బంతాటలా ఆడుకున్నాడు.
అయినా… ఎన్ని కలలు కన్నాడు తను! ఎంత ఊహించుకున్నాడు తను! జీవీతమంటే సంతోషమయం అనుకున్నాడు. ప్రతీ రోజూ పండగే అనుకున్నాడు.. కానీ… కానీ.. ఇలా తగలడింది. పూర్తిగా తన కల కల్ల అయింది.
ఇదేనా జీవితం? అయినా ప్రతీ మనిషికి వాళ్ళ జీవితం తమ చెప్పు చేతల్లో ఉంటుంది… మరి తనకి? .. ఎవరి చేతుల్లోనో.. ఇంకా చెప్పాలంటే పరిస్థితుల చేతుల్లోకి వెళ్ళిపోయింది.
చిన్నగా నిట్టూర్చాడు… చీకటి బాగా అలముకుంటోంది. అతడి మనసులో కూడా చీకటే!
ఎంతసేపయిందో తెలీదు… “రండి భోంచేద్దురుగాని” సీత పిలవడంతో తేరుకుని డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. అన్నీ ఆమెకు నచ్చిన వంటకాలే. నిశ్శబ్దంగా భోజనం ముగించాడు.
తర్వాత ఏదో బుక్ తీసుకుని బెడ్ మీద వాలిపోయాడు. చింటూ అప్పటికే గాఢ నిద్రలో ఉన్నాడు.
కిచెన్ పనులు అన్నీ ముగించుకుని సీత వచ్చి అతని పక్కన పడుకుంది. నెమ్మదిగా ఆమె మీద చేతులు వేసాడు. “అబ్బ.. నిద్రొస్తోందండీ.. పడుకోనివ్వండి” అంటూ చేతిని పక్కకు తోసేసింది. ఇటు తిరిగి, గోడ మీదున్న గడియారం వైపు చూసాడు. ఎవరినీ పట్టించుకోకుండా అది తన పని తాను చేసుకుపోతోంది. నెమ్మదిగా.. అసంతృప్తిగా కలత నిద్రలోకి జారుకున్నాడు సూర్య!
***
పొద్దున్నయింది… సీత వంటగదిలో బిజీగా ఉంది.
నెమ్మదిగా బెడ్ మీద నుండి లేచి వాష్ రూంకి వెళ్ళాడు సూర్య. బయటకొచ్చాక చింటూని లేపాడు. వాడికి బ్రష్ చెయ్యించి పాలు త్రాగించాడు. తర్వాత వాడ్ని స్కూల్‌కి రడీ చేసాడు. సీత మొత్తం బాక్సులన్నీ అప్పటికే సర్ది పెట్టింది. సూర్య కూడా రడీ అయి బ్రేక్ఫాస్ట్ చేసి బైక్ బయటకు తీసాడు. చింటూ అతని వెనక కూర్చుని “మమ్మీ బై” అని చేతిని ఊపి తండ్రిని గట్టిగా పట్టుకున్నాడు. హెల్మెట్ పెట్టుకుని బండిని రయ్‌మని దూకించాడు సూర్య. ఆఫీసుకి వెళ్తూ చింటూని స్కూల్‌లో దింపుతాడు అతను.
‘మైక్రో సోల్యూషన్స్’ సాఫ్ట్‌వేర్ కంపెనీ హైదరాబాద్‌లో హైటెక్ టవర్స్‌లో ఉంది. లిఫ్ట్‌లో పైకెళ్ళి తన క్యూబికల్‌లో సెటిల్ అయ్యాడు సూర్య.
సిస్టం ఓపెన్ చేసి మెయిల్స్ చెక్ చేసాడు. అప్పటికే టాస్క్‌లు ఎసైన్ చేసాడు ప్రోజెక్ట్ లీడర్. నెమ్మదిగా పనిలో మునిగిపోయాడు సూర్య. మధ్య మధ్య లో రాత్రి వచ్చిన పీడ (!) కలలు గుర్తుకు రాసాగాయి. వాటిని పక్కకు నెట్టి పని మీద దృష్టి పెట్టసాగాడు.
“ఏంటి… మహా సీరియస్‌గా ఉన్నారు ఈ రోజు” నవ్వుతూ వచ్చింది రోహిణి.
“అదేం లేదు… నార్మల్ గానే ఉన్నాను” నవ్వేసాడు సూర్య
“సరే.. మళ్ళీ వస్తా” అని వెళ్ళిపోయింది రోహిణి. నిశ్శబ్దంగా పని చేసుకోసాగాడు…
“ఏయ్… సూర్యా…రా.. కాఫీకి వెళ్దాం” పిలిచాడు కొలీగ్ శేఖర్.
“సరే.. పద.. రోహిణిని కూడా పిలుద్దామా..” అన్నాడు సూర్య.
“వద్దు గురూ… నీకు కొన్ని విషయాలు చెప్పాలి” అన్నాడు శేఖర్. ఇద్దరూ కదిలారు.
శేఖర్, సూర్యకి కొంచెం జూనియర్. కానీ ఇద్దరూ మంచి ఫ్రెండ్లీగా ఉంటారు.
కాఫీ తీసుకుని కూర్చున్నాక “చెప్పు… ఏదో చెబుతానన్నావు” అన్నాడు సూర్య.
చిన్నగా నవ్వాడు శేఖర్. “రాత్రి మంచి ఫిగర్‌ని తెచ్చుకున్నాం గురూ. పదివేలు ఒక నైట్‌కి. మస్తుంది… ఫుల్ ఎంజాయ్ చేసాం” అన్నాడు.
అసూయగా చూసాడు సూర్య. శేఖర్ అన్నాడు “నువ్వు కూడా అప్పుడప్పుడు రావచ్చు కదా… ఎంజాయ్ చెయ్యొచ్చు” అని.
చిన్నగా నిట్టూర్చాడు సూర్య. “నా బ్రతుక్కి అంత సీన్ లేదులే.. నువ్వు పండగ చెయ్” అని చిన్నగా నవ్వాడు.
“సరే.. నీ ఇష్టం బాస్.. కానీ ఎప్పుడు కావాలన్నా చెప్పు… ఎరేంజ్ చేస్తాను” హామీ ఇచ్చాడు శేఖర్.
కాఫీ త్రాగడం పూర్తయ్యాక సీటుకొచ్చేసారు ఇద్దరూ. వాళ్ళనే గమనించ సాగింది రోహిణి.
***
సీత, భర్తా పిల్లాడు వెళ్ళగానే కప్పు కాఫీ తాగి, టీవీ ముందు కూర్చుంది. ఇంతలో పనమ్మాయి చిట్టెమ్మ వచ్చింది.
“అమ్మగోరూ… టీవీలో ‘ఆడే నా మొగుడు’ సీరియల్ వత్తాంది… పెట్టండీ” అని అడిగింది.
“ఇప్పుడేగా వచ్చావు… రాగానే నీకు సీరియలా” అని విసుక్కుంటూనే పెట్టింది సీత. తర్వాత ఒక కప్పులో కాఫీ పొసి చిట్టెమ్మకు ఇచ్చింది. పరమానందంగా టీవీ చూస్తూ కాఫీ తాగింది చిట్టెమ్మ. తర్వాత నిదానంగా డ్యూటీ ఎక్కింది.
చిట్టెమ్మ అంట్లు తోముతూ “అమ్మగోరూ.. ఆ రాణెమ్మ మొగుడు దేన్నో తగులుకున్నాడట” అని మొదలెట్టింది. రాగానే చుట్టూ ఇళ్ళల్లో జరుగుతున్న విషయాలని సీత చెవిలో ఊదేస్తుంది చిట్టెమ్మ. సీతకు కూడా ఆ కబుర్లు అంటే ఇష్టమే… అడిగి మరీ చెప్పించుకుంటుంది. ఇల్లు దాటే అవకాశం తక్కువగా ఉన్న ఆమెకి ఇలాంటి లోకాభిరామాయణం చాలా ఇష్టం. పైగా ఇవన్నీ వింటేనే తనకు లోకజ్ఞానం పెరుగుతుందని ఆమె గట్టి నమ్మకం.
“అవునా… మరి రాణి ఏమీ అనడం లేదా?” ఆరా తీసింది సీత
“ఎందుకనదమ్మా… మొగుడ్ని నాలుగు తన్ని బయటకు తగిలేసింది.. ఆ సారు ఇప్పుడు దాని దగ్గరే ఉంతన్నాడట!” హుషారుగా చెప్పింది చిట్టెమ్మ
“మంచి పని చేసింది… అలాగే చెయ్యాలి… లేకపోతే పెళ్ళాం ఉండగా ఇంకో దాన్ని కన్నెత్తి చూస్తాడా” అని కసిగా చెప్పింది సీత.
కొన్ని క్షణాల తరువాత “సరేలే.. మనకెందుకు అవన్నీ …పని చూసుకో” అంది.
చిట్టెమ్మ పనంతా పూర్తి చేసుకుని ఇంకో ఇంటికి వెళ్ళిపోయింది. సీత ప్లేట్లో తిఫిన్ పెట్టుకుని తినసాగింది. ఇంతలో ఆమె సెల్ రింగ్ అయింది.
లిఫ్ట్ చేసి “అమ్మా.. చెప్పు” అంది.
“ఎలా ఉన్నావు… నేను చెప్పింది ఎంతవరకు వచ్చింది” అటు నుండి అంది సీత అమ్మ అనసూయమ్మ.
“అదే పనిలో ఉన్నానమ్మా… పూర్తవగానే చెబుతాను..”
“సరే.. సరే… ఇంకేంటి విషయాలు..”
“అన్నీ బాగానే ఉన్నాయమ్మా.. ఒక సారి ఇంటికి రా… తీరిగ్గా మాట్లాడుకుందాం” అని చెప్పి కట్ చేసింది సీత. అటువైపు అనసూయమ్మ కూడ ఫోన్ పక్కన పెట్టి, నాగుపాము బుస కొట్టినట్టు చిన్నగా నవ్వుకుంది.
***
అద్దాలోంచి కనిపిస్తున్న ఫ్లై ఓవర్‌ని చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు సూర్య.
“సార్.. పెద్ద సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు” అని ఆఫీసు బోయ్ వచ్చి చెప్పడంతో సీట్లోంచి కదిలాడు.
నెమ్మదిగా గ్లాస్ డోర్ తోసి “హాయ్ బాస్… పిలిచారంట” అన్నాడు
రాజీవ్ చిన్నగా తలూపి “అవును.. కూర్చో” అన్నాడు. విషయం ఏదో సీరియస్ అని సూర్యకు చూచాయగా అర్థం అయింది.
రాజీవ్ “చూడు సూర్యా.. నువ్వు చాలా సిన్సియర్ అని నాకు తెలుసు… కానీ ఈ మధ్య నీ కాన్సన్ట్రేషన్ తగ్గిందని నాకనిపిస్తోంది… డెడ్ లైన్స్ దగ్గర పడుతున్నాయి… తొందరగా టాస్క్ కంప్లీట్ చెయ్యాలి.. ” అని చెప్పాడు. ఏదో ముల్లు గుచ్చినట్టుగా అనిపించింది సూర్యకు. ఆ బాధ పైకి కనపడనీయకుండా
“అలాగే బాస్… తప్పకుండా కంప్లీట్ చేస్తాను.. ష్యూర్ ” అని చెప్పి వచ్చేసాడు. సీటుకొచ్చేటప్పటికి అతని సెల్ రింగ్ అయింది.
స్క్రీన్ మీద పేరు చూసి చిన్నపాటి విసుగు కలిగింది అతనికి. అప్పటికే మనసంతా కలత చెంది ఉన్నాడు మరి. తప్పదన్నట్టు కాల్ లిఫ్ట్ చేసాడు.
“బాబూ… బాగున్నావా… చింటూ బాగున్నాడా” అని అవతలి నుండి అతని తల్లి కుశల ప్రశ్నలు వేస్తోంది.
క్షణకాలం తనని తాను కంట్రోల్ చేసుకుని “ఆ…బాగున్నాడమ్మా..” అన్నాడు
“కోడలు ఎలా ఉంది.. బాగుందా”
“ఆ.. బాగుందమ్మా … కొంచెం బిజీగా ఉన్నాను.. మళ్ళీ మాట్లాడతాను”
“సరే.. అయితే ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది.
సీట్లో వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు సూర్య. ఆలోచనల స్రవంతి…
“అన్ని జన్మల లోకి మానవ జన్మ ఉత్కృష్టమైనదని అంటారు. ఆ విధంగా తను అదృష్టవంతుడు. అందులో సందేహం లేదు. కానీ ఒక పల్లెటూర్లో దిగువ మధ్య తరగతి కుటుంబంలో ఎందుకు పుట్టాడు? పుట్టాడు సరే… ఇంత బాగా చదువుకొని హైదరాబాద్‌లో ఉద్యోగం ఎందుకు తెచ్చుకున్నాడు… ఇన్ని కష్టాలని ఎందుకు కోరి తెచ్చుకున్నాడు.. అదే ఆ పల్లెటూర్లోనే ఉంటే జీవితం ఏ సమస్యలు, కాన్ఫ్లిక్ట్స్ లేకుండా గడిచిపోయేది కదా” ఈ ప్రశ్నలు అతడు ఎన్నో సార్లు వేసుకున్నాడు. సమాధానం కోసం అన్వేషిస్తున్నాడు. కానీ ఇప్పటి దాకా సంతృప్తికర సమాధానం దొరకలేదు… దొరకదు కూడా!!
***
లంచ్ తర్వాత సిన్సియర్ గా ఆఫీసు వర్క్ చేసుకుంటున్నాడు సూర్య. అతని కొలీగ్ రవి నెమ్మదిగా వచ్చి “సూర్య కొంచెం నీతో మాట్లాడాలి” అన్నాడు.
“ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను.. టీ బ్రేక్‌లో నేనే నిన్ను పిలుస్తాను” అని చెప్పి సిస్టంలో తల దూర్చాడు.
“అలాగే” అని వెళ్ళిపోయాడు రవి.
ఈ రవిని చూస్తే సూర్యకు భయం. లాస్టియర్ రవి పెళ్ళి అయింది. కొంతకాలం భార్యతో బాగానే ఉన్నాడు. ఈ మధ్య వాళ్ళిద్దరికీ సరిగ్గా పడటం లేదని ఆఫీసులో రూమర్.
బహుశా ఆ విషయమేదో మాట్లాడదామనే వచ్చుంటాడు. ‘తనే ఈ విషయంలో డిస్టెర్బెడ్‌గా ఉన్నాడు… ఇక అతనికేం ఊరట ఇవ్వగలడు’ అనుకుని నవ్వుకున్నాడు. ‘….పైగా వీడితో ఎక్కువ ఇంటెరాక్ట్ అయితే నా బుర్రలో కూడా అలాంటి ఆలోచనలే ఉంటాయి’ అనుకున్నాడు
పనిలోపడి చూసుకోలేదు గానీ టీ టైము అయింది. రవి మళ్ళీ వచ్చాడు …
“సరే పద” అని లేచాడు సూర్య.
టీ కప్పులు తెచ్చుకుని ఎదురెదురుగా కూర్చున్నారు.
“చెప్పు” అన్నాడు సూర్య.
కొద్దిగా సందేహిస్తూ రవి “సూర్య… నేను కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్‌లో ఉన్నాను… హెల్ప్ చేస్తావా” అన్నాడు
రిలీఫ్‌గా ఫీల్ అయ్యాడు సూర్య. ” శాలరీ బానే వస్తుందిగా… ఇంకేంటి ప్రోబ్లెం” అన్నాడు.
“ఒక ఫ్లాట్ కొందామని ప్లాన్ చేస్తున్నాను… “
“అదేంటి ఆల్రడీ నీకు ఒక ఫ్లాట్ ఉందిగా.. ఇంత ఇబ్బంది పడుతూ ఇంకొకటి ఎందుకు?”
“అదీ.. అదీ… ఉన్నా ఫ్లాట్ నా పేరు మీద ఉంది… మా ఆవిడ పేరు మీద ఇంకోకటి కొందామని ప్లాన్” నసుగుతూ అన్నాడు రవి
“సరే… అయితే ఇప్పుడు నేను ఎలా హెల్ప్ చెయ్యాలి”
“ఏం లేదు… నేను ఒక చీటీ వేసాను… ఏభై లక్షలది… ఇప్పుడది పాడుదామని అనుకుంటున్నాను… నువ్వు కొంచెం గ్యారంటీ ఉండాలి” అన్నాడు
“ఓస్.. అంతేనా.. సరే కొంచెం టైమివ్వు నాకు… ఆలోచించి చెబుతాను” అని లేచాడు సూర్య. రవి కూడా అతన్ని అనుసరించాడు. రవి అంత అమాయకుడు కాదని… తానొక ప్రమాదంలో ఇరుక్కోబోతున్నానని సూర్యకు తెలీదప్పుడు.
(సశేషం)