జ్ఞాపకాల పందిరి-76

23
4

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

అంకితం..! కథ -కమామీషు..!!

[dropcap]ని[/dropcap]త్యజీవితంలో కొందరి అలవాట్లు క్రమశిక్షణతో కట్టుదిట్టంగా ఉంటాయి. క్రమశిక్షణ అనేది ప్రతి వారి జీవితానికీ అత్యవసరమే! కానీ చూసేవారికి కొందరికి ఇది చాలా చాదస్తంగా అనిపిస్తుంది. క్రమశిక్షణలోని జీవన విలువలు అర్థం కానివారు క్రమశిక్షణను చాదస్తంగానే పరిగణిస్తారు. క్రమశిక్షణ లోపం వల్ల ఎదురయ్యే కష్టనష్టాలను సైతం భరించడానికి సిద్ధంగావుంటారు గాని, క్రమశిక్షణలోని ఉన్నత విలువలను గుర్తించే సాహసం మాత్రం చేయరు. క్రమశిక్షణలోని పుష్టికరమైన జీవన విధానాన్ని గుర్తించలేని అవివేకులుగా మిగిలిపోతారు. క్రమశిక్షణ లేని జీవితాలతో అతలాకుతలం అయ్యే కుటుంబాలు, తమ లక్షణాలను, అలవాట్లను, జీవన విధానాలను, తమ పిల్లలకు కూడా భవిష్యత్తులో తమ పిల్లలకు కూడా బదిలీ చేస్తున్నామని అసలే ఆలోచించరు. ఇది దురదృష్టకరమైన విషయం.

క్రమశిక్షణ అనేది వినడానికి ఎంతో బాగా వున్నా పాటించడం అంత సులభమైన విషయమేమీ కాదు. అందుచేతనే క్రమశిక్షణకు సంబంధించిన విషయాలను తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పడం మొదలుపెడితే, అది ఒక పట్టాన వాళ్ళ మెదళ్లకు ఎక్కదు సరికదా, వారి మధ్య దూరం పెరిగిపోతుంది. ప్రాథమిక దశలో క్రమశిక్షణకు సంబందించిన కొన్ని విషయాలు కఠినంగా ఉండడమే దేనికి కారణం కావచ్చు. కాస్త వయసు పెరిగి, మానసిక వికాస పరంగా మనసు విచ్చుకున్నప్పుడు, క్రమశిక్షణ లేక తాము కోల్పోయినదేమిటో తెలుసుకుని విచారిస్తారు. అప్పుడు అనవసరంగా తల్లిదండ్రులను తిట్టుకున్నాము కదా! అని ఒకటే వ్యథ చెందుతారు. సమయం మించిన తర్వాత కలిగే పశ్చాత్తాపం ఇది!

దీనికి భిన్నంగా ఎంతటి క్రమశిక్షణ గలవారికైనా కాలం కలిసిరాకపోతే, పరిస్థితులు అనుకూలించకపోతే, ఏ పని తలపెట్టినా అది ఒకపట్ఠాన ముందుకు కదలదు, అది ఎప్పటికి ప్రాప్తం అవుతుందో తెలియదు. మనిషిలో నిరాశ నిస్పృహలకు మార్గం ఏర్పడుతుంది. క్రమశిక్షణ మీద నమ్మకం పోతుంది. సకాలానికి అనుకున్నది జరగక పోవడం అది అనుకోని మానసిక వ్యథలకు కారణం అవుతుంది. ఇలాంటివి చాలామంది జీవితాలలో వెలుగు చూసే అంశాలే. అయితే మనిషిలోని మానసిక పరిస్థితిని బట్టి స్పందన బయటికి వస్తుంది. ఏమి జరిగినా కొందరిలో స్పందనలే వుండవు, అది వేరే విషయం!

ఒక క్రమశిక్షణ గల వ్యక్తిగా నాకూ కొన్ని నిరాశలు ఎదురయ్యాయి. అందులో కొన్ని అందరికీ చెప్పుకోదగ్గవి, కొన్ని చెప్పుకోలేనివీను. నాకు ఇష్టమైన ఒక పని నేను ఎంత జాగ్రత్తలు తీసుకున్నా అది అనుకోకుండా కొన్నినెలలు వాయిదా పడడం ఈ మద్య నాకు ఎదురైన ఒక సమస్య. ఆలస్యం అయినా మంచి ముగింపు రావడం ఆనందించదగ్గ విషయమే! అదేమిటో మీకు వివరిస్తాను.

కథా రచయితగా మూడు కథా సంపుటాలు ఇప్పటికే ప్రచురించి వున్నాను. కొద్దీ కథలు మిగిలి ఉండడంతో నాలుగో కథల సంపుటి తీసుకు రావాలనే ఆలోచన సహజంగానే వచ్చింది. ఖర్చు తప్ప ఏ మాత్రం లాభం లేని పుస్తక ముద్రణ ఏ రచయితకైనా ఈ రోజుల్లో కొంచెం కష్టమైన పనే! కాస్త ఆలోచించి చేయవలసిందే. ఖర్చులు, లాభ నష్టాలు పక్కన పెట్టి తమ రచన పుస్తక రూపంలో పాఠకుల మధ్యకు తీసుకురావడం ధ్యేయంగా పెట్టుకున్నవారు మాత్రం ముద్రణ విషయంలో దైర్యంగా ముందుకు సాగిపోతున్నారు. బహుశః నేను ఈ కేటగిరి లోకి వస్తానేమో! అందుకే నాలుగో కథల సంపుటి ముద్రణకు నిర్ణయం తీసుకున్నాను.

కొత్త కథల సంపుటి

అయితే గతంలో ఒక కవితా సంపుటి వేసి మా అత్తగారు శ్రీమతి (వయసు 83 సంవత్సరాలు) పద్మావతి గారికి అంకితం ఇవ్వాలని అనుకునేవాడిని, కానీ అది సాధ్యపడలేదు. అయితే కొత్త కథల పుస్తకం అత్తగారికి (అక్క కూడా) అంకితం ఇవ్వాలని ధృడంగా నిశ్చయించుకున్నాను. గతంలో మాదిరిగా కాకుండా కథల పుస్తకం సరాసరి ముద్రణకు ఇవ్వకుండా, ముందు పుస్తకం ప్రొఫెషనల్ చేత డిజైన్ చేయించాలనుకున్నాను. మొలక (పిల్లల పత్రిక) సంపాదకుడు శ్రీ వేదాంత సూరి (ప్రస్తుతం న్యూజిలాండ్) గారి సూచన మేరకు, ఆయనే పరిచయం చేసిన స్వప్న (హైదరాబాద్) గారికి పంపడం జరిగింది. ఆదిలోనే హంసపాదు… అన్నట్టు ముందుమాటలు సకాలంలో రాక పోవడం వల్లనైతేనేమి, ఇతర తప్పించుకోలేని సాంకేతిక కారణాల వల్ల నైతేనేమి పుస్తకం డిజైనింగ్ ఆలస్యం అయింది. మా అత్తగారి పుటిన రోజు మే-1, కాబట్టి అప్పటికి పుస్తకం తేవాలన్నది నా ఉద్దేశం. మొత్తం మీద డిజైన్ పూర్తి చేసుకుని పి.డి.ఎఫ్ రూపంలో పుస్తకం ముస్తాబై నా దగ్గరకు వచ్చింది. ఇక్కడ మళ్ళీ దురదృష్టం నాకు ఎదురు వచ్చింది. నేను ఇష్టపడే ‘శ్రీ దీప్తి ప్రింటర్స్’ కరోనా సమస్య వల్ల తాత్కాలికంగా మూతపడింది. శ్రీ దీప్తి ప్రింటర్స్ (హన్మకొండ) అధినేత కృష్ణ గారు, పుస్తకం మే నెలకు అందించలేమని తేల్చి చెప్పారు. ఇది నాలో చెప్పలేని నిరుత్సాహాన్ని తీసుకు వచ్చింది.

ఎప్పుడూ నేను తలపెట్టిన కార్యం ఇంతగా నిరుత్సాహాన్ని కలిగించలేదు, ఇంత దారుణంగా, కార్యక్రమం వాయిదా పడలేదు. కాలం (పరిస్థితులు కూడా) కలసిరాకపోవడం అంటే ఇదేనేమో!

ఈలోగా ఊహించని సంఘటన ఒకటి జరిగింది. అనారోగ్య రీత్యా మా అత్తగారిని విజయవాడ నుండి మా ఇంటికి తీసుకు రావలసి వచ్చింది. ఆవిడ రెండు మూడు నెలలు మా దగ్గర వుండే అవకాశాలు మెండుగా కనిపించాయి. అంతమాత్రమే కాదు, సెప్టెంబరు నెల పన్నెండవ తేదీ నా శ్రీమతి అరుణ పుట్టిన రోజు వుంది. పైగా అది మామూలు పుట్టిన రోజు కాదు, ఆమెకు అరవై సంవత్సరాలు నిండిన షష్టిపూర్తి, దానికి తోడు, ఆమె సర్వీసులో ఉంటే పదవీ విరమణ (నాలుగేళ్ల ముందే స్వచ్చంద పదవీ విరమణ చేసింది) ఈ సెప్టెంబరు నెలలోనే జరగవలసి వుంది. అందుచేత అన్ని కలిసి వచ్చినందువల్ల సెప్టెంబరు 12న నా శ్రీమతి పుట్టిన రోజున పుస్తకం ఆవిష్కరించాలనే నిర్ణయానికి వచ్చాను. ఇక శ్రీ దీప్తి ప్రింటింగ్ ప్రెస్ అధిపతి కృష్ణ గారికి ఈ విషయం చెప్పి పుస్తకం త్వరిత గతిన ముద్రించి ఇమ్మని చెప్పాను. ఈసారి ఆయన చెప్పిన సమయానికే పుస్తకాలు చేతిలో పెట్టారు.

నా శ్రీమతి పుట్టినరోజు సెప్టెంబర్ 12, అరవై సంవత్సరాల వయసు నిండిన సందర్భం, అంత మాత్రమే కాదు, స్వచ్ఛంద పదవీ విరమణ చేయకుంటే, ఇది పదవీ విరమణ చేయవలసిన సమయం. ఇన్ని ప్రత్యేకతల్లో నా కథల పుస్తకం ఆవిష్కరించడం మంచి సందర్భంగా నేను భావించాను. నేటి పరిస్థితుల కనుగుణంగా ఎక్కువ మందిని పిలవకుండా నా శ్రీమతికి సంబందించిన తమ్ముళ్లు, చెల్లెలు, వారి కుటుంబాలతో పిలిచాము. అతి దగ్గరి బంధువు, చిన్నాన్న వరుస శ్రీ కుసుమ వెంకటరత్నం గారిని పిలిచాము. కార్యక్రమం నిర్వహించడానికి, చర్చికి సమందించిన ఇద్దరు సీనియర్ సువార్తీకులను పిలిచాము.

శ్రీమతి అరుణ పుట్టినరోజు సంబరం
పాస్టర్ డా.నిరంజన్ బాబు(కుడి), పాస్టర్ మైఖేల్ (ఎడమ) గార్ల ఆశీస్సులు.

కార్యక్రమ రూపకల్పన పూర్తిగా నా కూతురు, తన అన్న సూచనలతో చక్కగా చేసింది. ఇదొక కొత్త ప్రయోగం. రాత్రి ఏడున్నర గంటలకు నా శ్రీమతి అరుణ పుట్టినరోజు కార్యక్రమం, పాటలతో, ప్రసంగాలతో, ప్రార్ధనతో రక్త సంబంధీకుల గ్రీటింగ్స్ తో, నా ఉపన్యాసంతో, నా శ్రీమతి స్పందనతో, చిరు సన్మానాలతో ముగిసింది. తరువాత పుస్తకావిష్కరణ కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రారంభం అయింది.

నా తోడల్లుడు హైదరాబాద్ నుండి వచ్చిన విశ్రాంత చీఫ్ మేనేజర్ (బ్యాంక్ ఆఫ్ ఇండియా) శ్రీ జాన్ గాబ్రియల్ గారు పుస్తకావిష్కరణ చేశారు.

పుస్తకావిష్కరణ చేస్తున్న తోడల్లుడు ఎమ్.జాన్ గాబ్రియేల్ (హైదరాబాద్)

 

కుటుంబ సభ్యుల మధ్య పుస్తకావిష్కరణ
కథల సంపుటి-అంకితం గురించి వివరిస్తూ రచయిత.
అత్త (అక్క) గారికి అంకితం చేసి శాలువాతో సత్కరిస్తున్న డా.కె ఎల్ వి ప్రసాద్ దంపతులు

పుస్తకం గురించి, ఈ పుస్తకం అత్తగారికి అంకితం ఇవ్వడంలో గల ప్రాముఖ్యత గురించి సూక్ష్మంగా వివరించిన తర్వాత, అంకిత కార్యక్రమం నేనూ నా శ్రీమతీ నిర్వహించి శాలువా కప్పి సన్మానం చేసాం. తరువాత తన సంతోషాన్ని తన స్పందనలో అత్తగారు వివరించారు.

శ్రీమతి అరుణ పదవీవిరమణ & పుస్తకావిష్కరణ (60వ పుట్టిన రోజు) సమయం.

ఇలా కాల పరిస్థితులను బట్టి కొత్తపద్ధతిలో పుస్తకావిష్కరణ చేయడం, నా కోరిక నెరవేరడం జరిగింది. జీవితంలో గుర్తుపెట్టుకోవలసిన సుదినంగా నిలిచింది. ఇలా నా నాలుగో కథల సంపుటి పాఠకుల మధ్యకి వచ్చింది. ఈ సందర్భంలో ఈ పుస్తకం కథల సంపుటిగా రూపుదిద్దుకోవడానికి వెనుక వున్న పెద్దలందరికీ కృతజ్ఞతలు చెప్పడం నా బాధ్యతగా భావిస్తూ ముగిస్తున్నాను.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here